Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 4 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౦(710) - Aditya Srirambhatla

( అవధూత సంభాషణ ) 11-103-వ. మఱియు నొక్క విశేషం బయిన పురాతనపుణ్యకథ వినుము; కనకావతీపురంబున నొక్క ధరామరుని కన్యకారత్నంబు గల; దవ్వ ధూతిలకంబు రత్నసమేతంబు లగు కంకణంబులు ధరియించి బంధుజనంబులకుఁ బరమాహ్లాదంబుగా నన్నంబు గావించుట కొఱకు శాలితండులంబులు దంచునప్పుడు ముసలగ్రహణభారంబునఁ గంకణంబు లతిరావంబుగా మ్రోయుచుండ నప్పరమపతివ్రత యందులకు నసహ్యపడి యన్నియు డులిచి యొక్కటి నిలిపె; నట్లుగావునఁ దత్తఱపడక భగవదాయత్తంబైన యేకచిత్తంబునం బ్రసన్నచిత్తులై నరులు ముక్తులగుదురు; గావున నవిద్యావిద్యలు నా మాయగా విచారించి, కేవల పశుమార్గులు కాక షడ్గుణైశ్వర్య సంసన్నులైన యోగీశ్వరుల పగిది సుఖంబు గోరక యుండు వారలు ముక్తులగుదురు; సర్వంబును విష్ణుమాయగాఁ దెలియు" మని యుద్ధవునికిం జెప్పిన నతండు "దేవా! నీరూపం బేలాగునం గానవచ్చు"ననిన నతం డిట్లనియె; "భక్తిభావనపరాయణుండై కృపారస తత్పరుండై మితభాషణుండై బొంకక కర్మంబులు మదర్పణంబుగాఁ జేసిన యతండు భాగవతుఁడనం బరఁగు; మత్కథలును మజ్జన్మకర్మంబులును వినుచు మత్సేవకులైన భాగవతులం జూచి తన గృహంబునకుం గొనిపోయి, మజ్జన పూజన భోజన శయనా సనాదికంబులఁ బరితుష్టులం జేసిన యతండైనను భాగవతుండనఁ బడు; నిట్లెంతకాలంబు జీవించు, నంతకాలంబును నడపునతండు మద్రూపంబున వైకుంఠనిలయంబు నొందు; నదియునుం గాక గంధ పుష్ప ధూప దీప నైవేద్యంబుల లక్ష్మీసమేతుండనై, శంఖ చక్ర గదాశార్‌ఙ్గాది యుక్తుఁడ నైన నన్ను శుక సనకాది యోగీంద్రులును, నంబరీష విభీషణ రుక్మాంగదులు మొదలు గాఁగల భాగవతులును, శాస్త్రాచారచోదితులు గాక భక్తి భావనావిశేషంబున నేమఱక నిత్యంబును జింతనాయత్తులై యెఱింగిరి; మధురాపురంబునకు హలాయుధ సమేతుండనై యే నరుగుచో, గోపిక లోపికలు లేక భక్తియోగంబునఁ జింతించి ముక్తలై; రిది భక్తియోగప్రకారం" బని యుద్ధవునికిం జెప్పిన. భావము: ఇంకొక విశేషమైన పురాతన పుణ్యకథ చెప్తాను, విను. కనకావతీనగరంలో ఒక ఉత్తమమైన బ్రాహ్మణ కన్యక ఉంది. ఆ కాంతారత్నం తన చేతులకు రత్నాలు పొదిగిన కంకణాలు ధరించేది. ఒకనాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. వారికి వండిపెట్టాలి అని బియ్యం కోసం వడ్లు ఇంట్లో రోకలితో వడ్లు దంచుతూ ఉంటే, ఆమె కంకణాలు గల్లుగల్లు మని చప్పుడు చేయసాగాయి. ఆ చప్పుడుకు చీకాకు పడింది. అందుకని, ఆ పరమపతివ్రత చేతికి ఒక్క గాజు మాత్రమే ఉంచి మిగతావన్నీ తీసేసి అవతల పెట్టి, చప్పుడు కాకుండా తన పని పూర్తిచేసుకుంది. అలాగే తత్తరపడక భగవంతుడికి అర్పించిన ఏకాగ్రమైన చిత్తంతో ప్రసన్న మనస్కులై మానవులు ముక్తులవుతారు. కనుక అవిద్య విద్య రెండు నా మాయగా తెలుసుకుని కేవలం పశుమార్గులు కాకుండా ఐశ్వర్యం వీర్యం యశస్సు జ్ఞానం సిరి వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరుల లాగా, సుఖాన్ని కోరకుండా ఉండే వాళ్ళు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయ అని గ్రహించు." అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. అప్పుడు అతను. "దేవా! నీ రూపాన్ని ఎలా చూడగలము." అని అడిగాడు అందుకు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. "ఉద్ధవా! భక్తిభావన యందు ఆసక్తి, దయారసము కలిగి; మితభాషణుడై, అబద్ధమాడక, సమస్త కర్మలు మదర్పణంగా చేసేవాడు భాగవతుడు అనబడతాడు. నా కథలు, నా జననం, నా లీలావిలాసాలు వింటూ నా సేవకులైన భాగవతులను తిలకించి. తమ ఇంటికి తీసుకుని వెళ్ళి, పూజించి స్నాన భోజన శయనాసనాదులతో వారిని సంతృప్తిపరచిన వాడు కూడ భాగవతుడు అనబడతాడు. చివరికి, జీవితాంత కాలం ఇదే విధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో నివసిస్తాడు. అదీకాక శంఖచక్రగదాధరుడను, లక్ష్మీ సమేతుడను అయిన నన్ను; శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండా ఎప్పుడూ విశేషించిన భక్తితో ఏమరుపాటు రాకుండా గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ధ్యానిస్తూ శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులు; అంబరీషుడు, విభీషుణుడు, రుక్మాంగదుడు మున్నగు భాగవతులు తెలుసుకున్నారు. మధురాపురానికి బలరాముడితో కలసి నేను వెళ్ళగా నా విరహాన్ని భరించలేని గోపికలు భక్తియోగంతో నన్నే చింతించి ముక్తిపొందారు. ఇది భక్తి యోగ వివరం." అని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=103 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Wed, 04 Jan 2023 16:15:44 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger