Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 3 January 2023

భజన. - sarma

భజన. రామన్నరాముడోయ్! రాంభజన! రాముడొస్తున్నాడు రాంభజన! భజన అంటే రామభజన అనే అర్ధం చిరకాలంగా! కాని కాలంలో మార్పులొచ్చాయనుకోండీ! ఒకప్పుడు పల్లెలలో కాలక్షేపం అంటే భజనే, అది కూడా సంవత్సరంలో ఆశ్వయుజం నుంచి జ్యేష్ఠం చివరదాకానే.భజనకి మొదటి మెట్టు హరేరామ హరేరామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే దీన్ని ఎలాపలికినా తొందరగాపలకడమే, నామసంకీర్తన చేయడమే లక్ష్యం. భజనచేసేవారంతా ఆరోజుల్లో నిరక్షరాస్యులే! భజనబృందం అంటే పదినుంచి ఇరవై మంది ఉండేవారు, వీరిలో కొందరు ఆడవారుండేవారు, శ్రావ్యంగా పాడగలవారుంటే ఆ బృందానికి అదనపు ఆకర్షణ. ఆ కాలంలో కొన్ని, సానుల భజనబృందాలూ ఉండేవి, వీరి భజనపాళీ అంటే జనానికి మరీ మక్కువ. ప్రతి  బృందానికో గురువు, ఒక పేరు.బాలభక్త భజనబృందం, భక్తాంజనేయ భజన బృందం, ఇలా. వీళ్ళు ప్రతి పదేనురోజులకి ఒక సారి, ఏకాదశి అనుకోండి! ఉదయమే స్నానం ముగించుకుని రామాలయంలో చేరేవారు భజనకి, ఉపవాసం కూడా. భజనకి కావలసినవి తాళాలు. తాళాలు కంచువి ఎవరివి వారు కొనుక్కునేవారు, కొంతకాలం, ఆ తరవాత ధర్మాత్ములు తాళాలు కొనిపెట్టేవారు భజన బృందానికి భజన ఇలామొదలెట్టేవారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రప్రభువుకీ జై తో ప్రారంభించి, అందరు దేవుళ్ళు దేవతలకి జై చెప్పి గ్రామదేవతకి జై చెప్పి, చివరగా తమ గురువుకి జై చెప్పి భక్తబృందం పేరు చెప్పుకుని జైకొట్టేవారు ఆ తరవాత భజన మొదలయ్యేది. ఈ భజన మరుసటి రోజు ఉదయం దాకా కొనసాగేది, ద్వాదశి ఘడియలదాకా.  ఇలా నిష్ఠగా భజన చేసేవారికి ఫలహారాలు,   మిరియాల పానకం, మిరియాలపాలు , రాత్రికి టీ కొంతమంది పెద్దలు అందించేవారు. వీరి  పేరూ చెప్పుకుని జై కొట్టేవారు. భజన అంటే నామ సంకీర్తన. హరేరామ హరేరామ అని ఒకరనేవారు(లీడ్)తాళం వేస్తూ, ఆ వెనక అందరూ అదే అనేవారు, తాళం వేస్తూ, లేదా రామరామ హరేహరే అనేవారు. ఇలా ఈమాటలు పదేపదే అంటూ తారస్థాయికి చేరేది, ఒక్క సారిగా మెల్లని స్థాయికి చేరేది, ఆ తరవాత మళ్ళీ ఉధృతంగా కొనసాగేది. ఇలా మార్చి,మార్చి నామ సంకీర్తన జరుగుతుండేది.చెప్పడం కష్టం,  భజన వినాలి అంతే!   ఆ తరవాత కాలంలో తరంగాలు,కీర్తనలు కూడా చోటు చేసుకున్నాయి. వీటికి కొన్ని ఇబ్బందులూ ఉండేవి. ఒక మాట చెబుతా!వ్యత్యస్త పాదారవింద,విశ్వవందిత ముకుంద , పలకడం తొందరగా కష్టం. భజనకి మరీ కష్టం, అందుకు గాను ఎవరో గురువులు దానిని సరళం చేసి రెండవపాదం మార్చేశారు, విశ్వవందిత ముకుంద బదులు, ఇందిరా హృదాయానందగా, ఇలా చాలాచాలా మార్పులూ ఉండేవి. లక్ష్యం మాత్రం నామ సంకీర్తన. కాలం గడిచింది.మైక్ లు  రంగప్రవేశం చేశాయి.దీంతో భజనకి మోజు పెరిగింది, ప్రజలలో.కొన్ని బృందాలు చాలా బాగ భజన చేయగలవనే పేరూ పడిపోయాయి. కాఫీ హొటల్, రైస్ మిల్లు, ఇలా ప్రారంభాలకి భజనపాళీ పెట్టడం అలవాటయింది. ఇది సమాజంలో ఎంతగా చొచ్చుకు పోయిందంటే, గండం గడిస్తే భజన చేయిస్తానని మొక్కుకునేదాకా! ఆ రోజుల్లోనే  అంటే అరవై ఏళ్ళ కితం,  ఇలా పిలుపు (పైడ్) భజనలకి, బృందానికి రోజుకి, 20 మంది బృందానికి ఖర్చులు పెట్టుకుని  200 దాకా ఇచ్చేవారంటే..... ఈ భజన ఒకరోజు, ఆ తరవాత కాలంలో సప్తాహం, ఎడతెరపిలేక రాత్రీపగలూ, విడతలమీద భజన చేసేవారు. ఇక సప్త సప్తాహం అంటే నలభైతొమ్మిది రోజులు రాత్రీ పగలూ తేడా లేక భజన కొనసాగించేవారు. ఈ రోజుల్లో భజన చేసేవారి అన్నపాన ఖర్చులు, వేతనాలూ కొందరు భరించేవారు. ఇలా భజన సమాజంలో ఊడలు దిగిపోయింది. ఈ  భజన అలవాటు నెమ్మదిగా  కాంగ్రెస్  రాజకీయులకి చేరింది, నాటి కాలంలో ఎక్కువమంది రాజకీయులు పల్లెటూరివాళ్ళుగనక. కొంతమంది నాటి కాలంలో రాజకీయ ప్రచారానికి కూడా భజన బృందాలని నియమించుకునేవారు.  రాజకీయులనుంచి   భజన  విలేఖరులకీ చేరింది, పత్రికలకి చేరింది,రూపు మార్చుకుంది.   పత్రికలకి పండగే వచ్చింది ఆ తరవాత కాలంలో ఆల్ ఇండియా రేడియోవారికీ చేరింది. ఒకప్పుడు ఆలిండియా రేడియో వారిని ఆలిందిరా రేడియో అని సరదగా అనుకునేవారు. నెహ్రూ కాలం నుంచి భజన రాజకీయాల్లో ఉన్నా, ఇందిరకాలంలోనే అది పరాకాష్టకి చేరిందంటారు, కిట్టనివాళ్ళు.భజనచేసే విధము తెలియండీ! జనులార మీరు    చేరి /కోరి మొక్కితె బతుకనేర్చేరు!అన్నది నాటికీ నేటికీ సత్యం అంటున్నారు. నేటికీ కుహనా గాంధీ కుటుంబానికి భజన చేసే జనం ఉన్నారంటారు,వారే పదవిలోనూ లేకపోయినా. భజన అనేది మేధావుల దగ్గరకి ఎప్పుడు చేరిందో దానికి తిరుగులేకపోయింది. అంతేకాదు రకరకాల పోకడలూ పోయింది.వేల్పుల నామ సంకీర్తన బదులు రాజకీయ వేల్పుల నామ సంకీర్తన మొదలయింది.ఆ తరవాత ఇది సినీ రంగాన్నీ వదలిపెట్టలేదు. రాజకీయ వేల్పుల/తెరవేల్పుల సంకీర్తన చెప్పతరంకాని స్థాయికీ చేరిపోయి, నేటికీ కొనసాగుతూనే ఉంది.  ఇది రాజకీయ పార్టీల/ తెరవేల్పుల  అంతేవాస మేధావుల గొప్ప.వీరినే ఒపీనియన్ మేకర్స్ అని ముద్దుగా పిలుస్తారు. భజన ఊరికే చెయ్యరు, చిన్నమ్మ పలికితేనే భజన జరుగుతుంది, లేకపోతే......అందుకే ఒపీనియన్ మేకర్స్ కి అంత క్రేజ్. ఈ రాజకీయ భజన, కుటుంబ స్థాయి నుంచి  వ్యక్తి సంకీర్తన  స్థాయికి దిగజారిపోయింది. ఇది అన్ని రాజకీయపార్టీలకి అంటువ్యాధిలా పాకేసింది, మా పార్టీలో పోలసీలకేగాని వ్యక్తులకి ప్రాధాన్యం లేదని బోరవిరుచుకున్న పార్టీలు కూడా భజనలో చేరిపోయాయి. ఇక తెనుగునాట అమ్మభజన విరివిగా సాగేది. ఆ తరవాత అన్న భజన మొదలైనా అన్న తరవాతవారి భజన పెరిగిందంటారు, కిట్టనివాళ్ళు. నేటి కాలంలో సోషల్ మీడియా రాజ్యం నడుస్తోంది. ఇక భజన గురించి చెప్పెదే లేదు. కొన్ని కొన్ని చోట్ల ఇది జుగుప్సాకరమైన స్థాయికి చేరిపోయినా ఆ పార్టీల/తెర వేల్పుల అంతేవాస  మేధావులకి తేడా తెలియటంలేదు. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం ఇలా భజన జరిగిపోతూందిట.
Post Date: Tue, 03 Jan 2023 03:27:14 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger