ఏ పుస్తకం అనువాదం చేసినా ఆ పుస్తకంపై అపరిమితమైన ఇష్టంతో, ఆ పుస్తకాన్ని తెలుగు పాఠకులకి చేర్చాలనే తహతహతోనే చేశాను. 1989 లో చేసిన ఎగ్నెస్ స్నెడ్లీ కథల పుస్తకం మొదటిదైతే, ఇప్పుడు చేస్తున్న విద్యారావ్ రాసిన నయనాదేవి (టుమ్రీ గాయని) గీతా హరిహరన్ నవల వరకూ ప్రతిదీ నాకు చాలా నచ్చి చేసినవే. "అర్థనారి"కి ఇంగ్లిషు అనువాదం చదివినప్పుడు చాలా చలించిపోయాను. అమ్మ కావడం వెనుక ఉండే వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక కోణాలను అంత అందంగా కలనేసిన నవల మరొకటి లేదనిపించింది. నేను పెరుమాళ్ మురుగన్ ని సంప్రదించే లోపలే ప్రజాశక్తి పబ్లిషింగ్ హవుస్ వాళ్లు అనుమతి తీసుకొని నన్ను అనువదించమని అడిగారు. నేను సంతోషంగా పని మొదలుపెట్టాను. అనువాదం చేసేటపుడు నాకు సంతోషంగా అనిపించేది తెలుగు భాషా సంపన్నత చూసినపుడు. ఎన్నో పదాలు నన్ను వాడుకోమంటే నన్ను వాడుకోమని ముందుకు తోసుకుంటూ వస్తాయి. వాటిలో సరైన పదాన్ని ఎంచుకోవడం ఒక ఆటలాగానే ఉంటుంది. ఆషామాషి ఆట కాదు. బాధ్యతతో కూడిన ఆట. మూల రచయిత మనసెరిగి పదాన్ని ఎంచుకోవటం బిలియర్డ్స్ ఆటను తలపిస్తుంది. ఏకాగ్రత, వేగం, సూటితనం అన్నీ కావాలి. అవన్నీ "అర్థనారి" అనువాద సమయంలో అతి సులువుగా నాకు పట్టుబడినట్లు అనిపించింది. స్త్రీ పురుషుల, భార్యాభర్తల అంతరంగాన్ని పెరుమాళ్ మురుగన్ అత్యంత సహజంగా ఆవిష్కరించాడు. దానిని అంతే సహజంగా, వాస్తవికంగా, నేటివిటీ కోల్పోకుండా తెలుగులోకి తీసుకు వస్తున్నపుడు అందులో లీనమైపోయాను. కొద్ది సందర్భాల్లో సమస్యలు రాలేదని కాదు. సంభాషణలలో మాండలిక పదాలు వాడేటప్పుడూ, కొన్ని జాతీయాలు వాడేటప్పుడూ మాటల కోసం గంటల తరబడి ఆలోచించవలసి వచ్చింది. మూలకథ అచ్చమైన గ్రామీణ వాతావరణంలో వ్యవసాయం, పశుపోషణల నేపధ్యంలో జరుగుతుంది. నాకు ఆ నేపధ్యం అంతగా పరిచయం లేదు. కానీ క్లిష్ట సందర్భాలలో సహాయపడటానికి మట్టిలో, బురదలో పుట్టి పెరిగి, ఆడి, పాడిన కుటుంబరావు ఉన్నాడనే ధైర్యంతోనే నేనీ అనువాదానికి ఒప్పుకున్నాను. ఆ సహాయం పుష్కలంగా దొరికింది. నేను ఒక స్త్రీ వాదిగా మాతృత్వమనే మిత్ ని ఛేదించటమనే పని చేస్తూ వస్తున్నాను. అనేక కథలలో, కవితలలో, వ్యాసాలలో దానికి సంబంధించి రాశాను. కాని "అర్థనారి" అనువదిస్తున్నపుడు అది స్త్రీల రక్తమాంసాలలో, కన్నీళ్లలో, ఆనందాలలో ఎట్లా కలిసిపోయి విడదీయలేనంతగా పెనవేసుకు పోయిందో మరింత బాగా అర్థమైంది. ఆ దంపతుల బాధ, మానసిక ఉద్రిక్తతలు తెలుగు భాషలో రాస్తుంటే – భాష ఎంతగా మననుంచి విడదీయలేనిదో, ఆ భావనలు కూడా అంతగా విడదీయలేని విధంగా మనసులో హత్తుకుపోయాయి. ఊరికే చదివితే ఇంత గాఢానుభూతి కలిగేది కాదేమో! అక్షరమక్షరమూ నాది కావటంతో ఆ ఆరాటమంతా నాకు స్వంతమైనట్లు అనిపించింది. అనువాదకులకు దక్కే ఫలితం అదేనేమో! చాలాసార్లు ఆ భార్యభర్తలతో మాట్లాడాలనిపించింది. రాయడం ఆపివేసి ఆమె బాధను ఏ మాటలు ఎలా మాట్లాడి తీసేయవచ్చోనని ఆలోచిస్తూ కూర్చున్న రోజులున్నాయి. అలాగే అతని బాధను అతని స్థానంలో ఉండి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడంలో చాలా నలిగిపోయాను. అక్షరాలలోకి, పదాలలోకి, వాక్యాలలోకి రాని బాధను పట్టుకోగలిగీ, దానిని రాయకుండానే అనుభూతిలోకి తేగలిగిన మూల పద్ధతులను నేను అవగతం చేసుకోవటం ఒక్కోసారి చాలా కష్టమైంది. రాసిన పదాలలో రాయని బాధ మాతృభాషలో మూలరచయిత చేసినంత సులువు కాదు. అనువాదంలో – అసలు ఆ బాధ, అర్థాలు ఉన్నాయని గ్రహించడమే మంచి పాఠకులు చేసేది. మంచి పాఠకులయినప్పుడే మంచి అనువాదకులు కాగలరు. నేను మంచి పాఠకురాలిననే నమ్మకాన్ని పెరుమాళ్ మురుగన్ నవల మరోసారి కలిగించింది. *
Post Date: Fri, 31 Mar 2023 23:48:08 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 31 Mar 2023 23:48:08 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment