Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 3 July 2023

కవుల దారి ఎటు వైపు?! - అరణ్య కృష్ణ

తె లుగు కవిత్వ వాతావరణం, దశ, దిశ, భవిష్యత్తు గురించి ఇప్పుడు మాట్లాదుకోవాలసినంత అవసరం మునుపెన్నడూ లేదని అనుకుంటున్నా. ప్రత్యామ్నాయ విలువలు, చర్యలు, వేదికలు గురించి ఖచ్చితంగా ప్రజాస్వామిక స్పృహతో చర్చించుకోవాల్సిన సందర్భమిది. ఓ ముప్ఫై ఏళ్ల క్రితం తెలుగు సాహిత్యంలో, మరీ ముఖ్యంగా కవిత్వంలో ఫలాన కవి రాసి పబ్లిష్ ఐన ఒక కవిత లేదా ఓ కవయిత్రి వెలువరించిన కవిత్వ సంపుటమో ఒక సాహిత్య వార్తగా వుండేది.  కవి మిత్రులు నలుగురు చేరిన చోట ఆ కవిత మీద చర్చ ఉండేది.  ఆ పుస్తకం మీద విశ్లేషణ జరిగేది.  కానీ ఈ రోజున ఒక పురస్కారమో లేదా సత్కారమో లేదా కవిత్వ పోటీ ఫలితమో సాహిత్య వార్తగా వుంది.  విప్లవ కవిత్వమైనా, విప్లవేతరమైనా, అరాజకీయ (అరాచక కాదు) అనుభూతి కవిత్వమైనా, అస్తిత్వ వాదపు పాయలైన దళిత, మైనారిటీ, స్త్రీ వాద కవిత్వమైనా కవులలో అది ఒక నిర్దిష్ట దృక్పథానికి ప్రాముఖ్యమిచ్చేదిగా వుండేది.  అనేక చర్చలు జరిగేవి.  మంచి కవిత్వానికి అండగా మార్క్సిస్ట్, మార్క్సిస్టేతర, అస్తిత్వవాద విమర్శకులుండేవారు.  పత్రికలు కూడా కవిత్వానికి తగినంత ప్రాధాన్యత ఇచ్చేవి.  ఇదంతా గతం కావడమో విషాదం. అంతర్జాతీయంగా వచ్చిన, వస్తున్న ప్రపంచీకరణ ప్రక్రియలో కవి కూడా ఓ వినిమయదారుడై పోతున్నప్పటికీ మనం చర్చించుకోదగ్గ, మార్చుకోదగ్గ అంశాలున్నాయనే నా భావన.  అందుకే ఈ చర్చ. ఇవాళ కవిలోని రాజకీయ స్పృహ సామాజికమైనది కాకుండా అవార్డులు, పురస్కారాలు, సత్కారాలకు సంబంధించిన రాజకీయ స్పృహ ప్రధానమై పోతున్నది.  కవిత్వం కంటే కవి ప్రముఖమై పోతున్న దుస్థితి!  కవిలో పేషన్ స్థానాన్ని ఫేషన్, వస్తు శిల్ప అధ్యయనం స్థానాన్ని గుర్తింపు సంక్షోభం, సామాజిక ప్రాపంచిక జ్ఞానం స్థానాన్ని లౌక్యం, పెద్దల అండ, ఆదరణ, ప్రచారం కోరుకునేతనం ఆక్రమిస్తున్నాయి. నిజానికి గతంలో కంటే ఇప్పుడే విరివిగా కవిత్వం వస్తున్నది.  కవులు ధారాళంగా రాసేస్తున్నారు.   రాసిన కవిత్వాన్ని వెంటనే వెలుగులోకి తెచ్చుకోగలుగుతున్నారు.  (సామాజిక మాధ్యమాలకి ధన్యవాదాలు!)  ఎక్కువ రాయడం తప్పని కాదు కానీ వస్తు శిల్ప ప్రమాణా రీత్యా తామెక్కడున్నామనే స్పృహ ఈ తరం కవులకు ఇంకా ఎక్కువ వుండాలని భావిస్తున్నా.  ఎవరో కొందరు కవుల్ని మినహాయిస్తే ఇప్పటి కవిత్వం దూదిలా గాల్లో సుతారంగా ఎగురుతున్నదే కానీ భూమి నుండి విత్తనమై మొలకెత్తడం లేదు.  ఎంతటి సామాజికాంశాల మీద రాస్తున్నామనుకున్నా ప్రజల్ని చేరాలనే లక్ష్యం కనిపించడం లేదు.  కవులు సాటి కవుల కోసమే కవిత్వం రాస్తున్నట్లుగా అనిపిస్తున్నది.  ఇతర కవుల  మెచ్చుకోళ్లని ఆశించడం, ప్రశంసల్ని ఇచ్చి పుచ్చుకునే ధోరణి పెరుగుతున్నది.  కవిత్వానికి పాఠకుల కంటే కవుల సంఖ్యే ఎక్కువనేది ఒక నిష్టుర సత్యం.  పుస్తకాలు ముద్రించుకొని పంచుకోవడమే జరుగుతున్నది.  ఐదొందల కాపీలు వేసుకున్నా పంచుకోడానికి కూడా ఎక్కువవుతున్న దుస్థితి వుందిప్పుడు.  ఓ రెండొందల కాపీలు ముద్రించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వచ్చిందా లేదా చూసుకుంటున్నారు చాలామంది కవులు.   వర్తమాన కథా సాహిత్యంలో కథకులు చూపించే అంతర్బాహ్య సంఘర్షణ కవిత్వంలో కొరవడుతున్నది.  కవిత్వం దీని మీద రాయొచ్చు, దాని మీద రాయకూడదనే ఆంక్షలుండకూడదు కానీ ఏది రాసినా మెజారిటీ కవుల్లో గాఢత, లోతు లేనితనం స్పష్టంగా కనబడుతున్నది.  వున్న దానిలో చెప్పుకోదగ్గ కవిత్వం అనుకుంటే అది భూమి, ఊరు, చెరువు, బాల్యం, అమ్మ, నాన్న, స్నేహం, ప్రేమ, విరహం వంటి అంశాల్ని సెంటిమెంటల్ గా వ్యక్తీకరించడమో లేదా వేరెవ్వరికీ అర్ధం కాని అస్తిత్వ దుఃఖాన్ని వ్యక్తీకరించడమే కవిత్వం అవుతున్నది.  దేశ పునాదుల్లోకి వెళ్లి హింస, వివక్ష, అన్యాయానికి వ్యతిరేకంగా కవిత్వం రాసేవారు అతి కొద్దిమందే వున్నారు. కరోన సమయంలో కుప్పలు తెప్పలుగా వచ్చిన కవిత్వం చాలావరకు ఒట్టి ఊకగానే అనిపించింది.  నాకైతే పాఠకుల్ని జెన్యూన్ గా కదిలించగల మంచి కవులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే కనబడుతున్నారు.   ఈ పరిస్థితికి అనేక కారణాలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కవుల్ని, సామాజిక వ్యాఖ్యాతల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.  ఒక్కో ప్రభుత్వ శాలువా కవిత్వానికి ఒక కత్తిపోటు వంటిదని కవులు గ్రహించడం లేదు.  కవిత్వం యూనివర్శిటీలు, సెక్రటేరియట్ ప్రాంగణాల్లో బొక్కబోర్లా పడుతున్నది.  ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల సత్కారాల, ఆ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం ఎదురు చూసే కవులు ప్రజల పక్షాన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం గళం విప్పగలరు?  రాజ్య హింసని, ప్రభుత్వ వైఫల్యాల్ని ఏ రకంగా ఎండగట్టగలరు?  కవిత్వం ఖచ్చితంగా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా, రాజకీయ స్పృహతో  వుండాలా అని ప్రశ్నించే వారికి నా సమాధానం ఏమిటంటే ఒకవేళ తన ప్రాపంచిక దృక్పథం వల్ల అంతరంగంలో వున్న ప్రభుత్వ వ్యతిరేకత, రాజకీయ స్పృహ వున్న వారు వాటిని ఖచ్చితంగా త్యాగం చేయాల్సే వస్తుంది.  కవి ఎల్లవేళలా ప్రతిపక్షమే అనే కొటేషన్ ఆంతర్జాతీయ స్థాయిలో ఒక విలువగా అంగీకరీంచబడిందనేది సత్యం. ప్రైవేటు పురస్కారాలు, అవార్డులు కూడా కవిత్వానికి తక్కువ చేటు చేయడం లేదు.  ఈ సంవత్సరం ఏ ఏ కవులు తమ సంపుటాలు తీసుకొచ్చి ఫలాన పురస్కారం కోసం పంపుతున్నారో అని లెక్కలేసుకొని మరీ తమ పుస్తకాల్ని వెలువరించే కృత్రిమ కవిత్వ వాతావరణం నెలకొని వుంది.  ఈ ధోరణి కవి సెన్సిబిలిటీస్ ని దారుణంగా దెబ్బతీసేదే. ఒకప్పటి మంచి విమర్శకుల స్థానంలో ఇప్పుడు కవుల ప్రమోటర్స్ ఎక్కువగా వున్నారు.  భుజం తట్టి సెభాష్ అనడమే తప్ప నిర్మొహమాటంగా నిర్మాణాత్మక సూచనలు చేసే వాళ్లు లేరు.  నిజమైన కవిత్వం అంతరంగం నుండి ఒక విస్ఫోటనంలా వచ్చేదే.  దానిలోని తప్పొప్పులను గుర్తించి, వాటిని వెల్లడించి, కవి తనని తాను పుఠం పెట్టుకొని తనలోని కళని, నైపుణ్యాన్ని మరింత ఉపయోగించుకునేలా చేయడం కన్నా కవి రాసిన కవిత్వం ఎలా వున్నా, ఏ స్థాయిలో వున్నా ఉత్సాహపరిచి, ప్రోత్సహించే రకంగా కవిత్వ పెద్దలున్నారు.  యువ కవులు కూడా విమర్శల్ని, సూచనల్ని స్వీకరించే పరిస్థితిలో లేరు.  మరోలా ఎలా వుండగలరు వాళ్లకి మార్గదర్శకులుగా వుండాల్సిన ఒకప్పటి గుర్తింపు వున్న కవులు (సీనియర్లు అనాలేమో!) ప్రభుత్వానిదో, ప్రైవేటుదో ఏదో ఒక పీఠం కోసం అర్రులు చాస్తున్నప్పుడు?  ఎవరి యావ వారిది.  ఎవరి ప్రయత్నాలు వారివి.   పోనీ ఈ "అనుభవజ్ఞులు" ఏ అకాడెమీలోనో పదవులు స్వీకరించిన అనంతరం వాటిని సంస్కరించి, ప్రజాస్వామీకరిస్తారా అంటే అదీ జరగదు.  తమని శరణుజొచ్చిన వారికి న్యాయం చేసే నెపొటిజంకి పాల్పడుతుంటారు.  పాత తరం వారు ఏ అకాడెమీలోనో చోటు సంపాదించగానే లేదా వారు తామే ఓ కొత్త అవార్డు నెలకొల్పగానే కవులు వారి ప్రాపకం కోసం, మన్నన కోసం భజనలు మొదలెడతారు.  ఇదంతా అవాంఛనీయం కాదూ? ఐతే ప్రత్యామ్నాయంగా ఏం జరగాలన్నదే అసలు ప్రశ్న.  నిజానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నా అది విలువల ఆధారితమైనదే.  కవుల వైపు నుండి చూస్తే వారు తాము అసలు ఏ ఆవేశంతో, ఆశయంతో కవిత్వం పట్ల ఆకర్షితులమయ్యామనేది గుర్తు చేసుకోవాలి.  మొదలు పెట్టినప్పుడు లేని లౌల్యాలు, జాడ్యాలు తమనెందుకు ఇప్పుడు పట్టుకున్నాయో ఆలోచించుకోవాలి.  తనని సాహిత్య చరిత్రలో నిలిపేది పురస్కారాలు, పెద్దల భుజం చరుపులు కాదని, కళాత్మక ప్రమాణాలతో కూడిన లోతైన, చిక్కనైన తన కవిత్వ నాణ్యతే తనని నిలబెడుతుందని, ఓ వంద కవితలు హడావిడిగా రాస్తే అందులో ఓ పదైనా తనకో గుర్తింపు తెచ్చి పెట్టక పోతాయా అనే సమీకరణాలు పనికిమాలినవని గుర్తించాలి.  (రచయితలు, కవుల సంఘాల్ని మినహాయిస్తే) కవులు గ్రూపిజం కట్టడం తమ కవిత్వానికే నష్టమని వారు గ్రహించాలి.  ఒకరినొకరు పొగుడుకోవడం సహకార సంఘమే అవుతుంది తప్ప సామూహిక స్వరం కాదనే సత్యాన్ని గుర్తించాలి. కవిత్వం నిక్కమైన, స్వచ్ఛమైన మానసిక అలజడి నుండి, హృదయం మోయలేని సంఘర్షణా భారం నుండి, భావోద్వేగాల నుండి వస్తుందని వారు తెలుసుకోవాలి. వామపక్ష పార్టీల అనుబంధ సాహిత్య సంస్థలు ఎవరైనా తమ దగ్గరకు రావాలనుకోవడం కాకుండా తామే కవుల్ని, రచయితల్ని చేరాలి.   ఈ దిశగా గత రెండు మూడేళ్లుగా విరసంలో వస్తున్న మార్పుని అంగీకరించాలి.  ప్రోగ్రెసీవ్ గా వున్న కవుల పుస్తకాలను తమ సభలలో ఆవిష్కరించడం, తమ పత్రికల కోసం రచనలు ఆహ్వానించడం, ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపుని నిర్వహించడం జరుగుతున్నది.  ఇది నిజంగా ఆహ్వానించాల్సిన పరిణామం. కవులు, విమర్శకులు, సాహితీ పెద్దలు అందరూ కలిసి సామూహికంగా ధ్వంసం చేసిన కవిత్వ వాతావరణాన్ని మళ్లీ తిరిగి తామే సామూహికంగా పునర్నిర్మించుకోవాలి. * చిత్రం: రాజశేఖర్ చంద్రం
Post Date: Sun, 02 Jul 2023 22:59:35 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger