Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 11 February 2021

నమస్తేలోనే ఉంది సమస్తం   -కర్లపాలెం హనుమంతరావు 10 -02 -2021   నమస్తే'లోనే ఉంది సమస్తమంతా. న ‘మస్తే’ అంటే తల లేని వ్యవహారంగా కొద్దిమందికి వెటకారం. జోడించే వడుపు కుదరక  చేతులను  ఆడిపోసుకోవడమే అదంతా!  తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవ్వంత కార్యలాభం కలిగింది కాదు.   ఆలస్యంగా వచ్చినా  నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన పాండవ మధ్యముడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహ లాభం. నిండు సభామధ్యంలో ఇట్లాంటివే ఏవో  దండకాలు.. స్తోత్రాలు చదివినందు వల్లనే   ఆ గాండీవుడి అర్థాంగికీ  రుక్మిణీవల్లభుడి సహోదరత్వం అండలా లభించింది. అందుకే,  ‘ఆఁ! దండాలూ దస్కాలా!’ అంటూ వెక్కిరింపుకలొద్దు! ఆ మస్కా జాతి  ట్రిక్కే ఎంత కోన్ కిస్కా గొట్టాన్నైనా ఇట్టే గుప్పెట్లో పట్టేసుకునే పట్టు! రామాయణమే ప్రణయాంజలి ప్రభావాలకు పరమ  ప్రమాణం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అట్లా నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకు మించిన అపూర్వ గౌరవం ఆంజనీ పుత్రుడు కొట్టేసింది. ఉన్న ఒక్క తొండంతోనే  చేతనైనంత వరకూ సాగిలపడబట్టే కదా  ఆపదల మడుగు నుంచి గట్టెక్కగలిగింది  ఆ  కరిరాజు గజేంద్రమోక్షంలో! అదే చాయలో పోబట్టే అప్పట్లో మన పక్క రాష్ట్రం పన్నీరు సెల్వంసారూ.. అమ్మవారి అనుగ్రహం అమాంతం కొట్టేసారు. జయామ్మాళ్ ఆ రోజుల్లో  సర్కారువారి సత్కార గృహ(జైలు) యాత్రకెళ్ళినప్పుడల్లా  పన్నీరువారు ముఖ్యమంత్రి పీఠానికి ముఖ్యమైన  కాపలాదారు! ఆ తరహా ఎక్స్ట్రా లాభాలకు ఎల్ల వేళలా నమస్కార బాణాలే బ్యాగ్రౌండు నుంచి బాగా వర్కవుటయ్యేది కూడా.. బయటికి కనిపించవు కానీ! స్వామివారు కంట బడ్డప్పుడు స్వాభిమానలవీ  పెట్టుకోడం కూడదు. 'నమో నమః' అంటూ సాష్టాంగ ప్రమాణాలు  ఆచరించకుంటే ఆ తరువాత జరిగే చేదు అనుభవాలకు ఎవరికి వారే బాధ్యులు.. యడ్యూరప్పే అందుకు గొప్ప  ఎగ్జాంపుల్! పది తలలున్నాయి.. ఏం లాభం? ఉన్న రెండు చేతుల్నీ వేళకి సద్వినియోగం చేసుకునే  విద్య అలవడకే  అంత లావు రావణుడూ   రాముడి ముందు పిట్టలా రాలిపోయింది. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళ జాతి పతనానికి  ముఖ్య కారణం  ఈ దాసోహ  దాసోహం రాజకీయాలకు దాసోహం అనకపోవడమే!  రాక్షసులకు  తెలియని చమత్కారం మన రాజకీయ పక్షులకు మా  బాగా తెలుసు.  లేకుంటే మన ప్రజాస్వామ్యం  మరీ ఆర్ట్ మూవీకి మల్లే బోర్ కొట్టదూ! కడుపులో ఎంత కంటయినా ఉండుగాక.. ఓ యాత్ర కంటూ బైలుదేరాక   దేవుడిచ్చిన రెండు చేతులూ  గోజుతో కరిపించినట్లు గాలిలో అట్లా ఊపుతూనే ఉండాలి.  జైలుకు వెళుతూ వస్తూ కూడా మన నేతాశ్రీలు పళ్ళికిస్తూ గాల్లోకి అలా వణక్కాలు గట్రా  వదలడం చూస్తున్నా .. ఇంకా వందనాల విలువను గూర్చి సందేహాలేనా! మీ కో నమస్కారం! ప్రణామాలకు, వాగ్దానాల మాదిరి  కాలపరిమితి బెడద లేదు! నగదు బదిలీ.. రుణమాఫీలకు మల్లే   ఈ ప్రజాకర్షక పథకానికి పైసల్తోనూ బొత్తిగా నిమిత్తం లేదు.  ఏ ఎన్నికల సంఘం  అదుపూ.. అజమాయిషీ లేకుండానే రెక్కల్లో ఓపిక ఉన్నంత కాలం వాడుకుని ఆనక వదిలేసే  సౌకర్యం ఒక్క చేతుల జోడింపులోనే కద్దు. చెప్పిందేదీ చెయ్యకుండా  చెయ్యిచ్చే నేతలు సైతం ఈ  చేవిప్పులు(నమస్కారాలు) కెప్పుడూ చెయ్యివ్వని కారణం ‘చేవిప్పు’ మీద ‘విప్’ జారీ చేసే అధికారం ఏ పార్టీ ‘వివ్’  లకూ  లేకపోవడం! ఎన్నికలు ఎప్పుడొచ్చినా  నరేంద్ర మోదీకి కలిసొచ్చే  అంశాల్లో  ప్రధానమైనది కుదించి పలికే ఆయనగారి పొట్టి పేరు ‘నమో’ ! ఓ వంక దెప్పుతూనే మరోవంక 'నమో.. నమో' అనక తప్పని  తలనొప్పులే  ప్రతిపక్షాల కెప్పుడూ.. పాపం పిటీ!  పబ్లిగ్గా ఎంత పడతిట్టిపోసుకున్నా శాల్తీ కంటబడ్డప్పుడు ఏ సంకోచం లేకుండా కల్తీ లేని ‘నమస్తే’ ముద్రొకటి అభినయిస్తే చాలు.. సగం అభిప్రాయభేదాలు సాల్వ్ డ్! ప్రధాని మోదీ ఓం ప్రథమంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిప్పుడు సార్క్ దేశాధిపతులంతా మూకుమ్మడిగా  కలసి సాధించిందీ అదే!  ఎవరి బాణీలో వాళ్ళు  నమస్కార బాణాలు సంధించుకుంటూ సరికొత్త విదేశీ సంబంధాలకు బోణీ కొట్టడం! జపాను పోనీ.. చైనా పోనీ.. అమెరికాతో సహా ఏ గడ్డ మీద  కాలు పడ్డా.. మన ప్రధాని మోదీని ఆదుకున్నవీ మొదట్నుంచీ చేతులే! తంపులమారి ట్రంపయినా   తప్పించుకోలేని అట్రాక్షన్ ప్రణామంలో ఉంది.  'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అంటూ ఆ త్యాగరాజయ్యరువారంతటి వైతాళికులు ఊగిపోయారు. ఆరోగ్యాన్నిచ్చి, బంధుకృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడు అనే గదా ఆ పై నెక్కడో ఉండే  సూర్యుణ్ణి కూడా భగవానుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో రెండు పూటలా అలా పడీ పడీ సూర్యనమస్కారాలు చేసుకోడం!  అర్హతలతో నిమిత్తం లేకుండా అందలం ఎక్కించి పదిమందిలో గుర్తింపు తెచ్చిపెట్టే  లోకబాంధవి నమస్కారం.  నిజానికి పడమటి ‘హాయ్.. హలో’ లకు మించి  ఇవ్వాలి ఈ నమస్కారానికి మనం గౌరవం. అందుకు విరుద్ధంగా లోకువ కట్టేస్తున్నాం.. అదీ విడ్డూరం!  ఏ అరబ్బుల దేశంలోనో  పుట్టుంటే తెలిసుండేది మన  వందనాల విలువ.  ఖర్మ కాలి ఏ ఒసామానో  కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకు చావాల్సొచ్చేదక్కడ.  రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా.. ఎన్నేసి రకాల నామధేయాలండీ నమస్కారాలకు  మన పుణ్యభూమిలో!  'నమస్తే' అంటే 'వంగటం' అన్న ఒక్క  పిచ్చర్థం  మాత్రమే తీసుకుని పెడమొహం పెట్టేస్తే ఎట్లా?  పూరా నష్టపోతాం కదరా ఉన్న ఒక్క  ప్రపంచ స్థాయి గుర్తింపు  పిచ్చిగా వద్దనుకుంటే  సోదరా!  అమెరికా అధ్యక్షులు ఎవరు ఇండియా వచ్చినా,  వెళ్ళిన  ప్రతి చోటా అదే పనిగా 'నమస్తే'లు కుమ్మేస్తారు. బిలియన్ డాలర్లు విలువ చేసే  బిజినెస్సులతో దేశీయ మార్కెట్లను  కమ్మేస్తారు.  మనలను ఏలి పోయిన తెల్లవాడిదే తెలివంటే. మన నమస్కారమే మన పైన గడుసుగా సంధించేసి మన రాజుల్ని, నవాబుల్ని బుట్టలో వేసేశాడు! ఇంగ్లీషు వాడి  నమస్తేకి  పదిహేను వందలేళ్ల  గ్రంథం ఉంది. అదంతా మొదలు పెడితే ముందు మీరు నాకు నమస్కారం పెట్టేస్తారు!తూర్పు పడమర్లు, ఉత్తర దక్షిణాలనే తేడా ఏముందిలే కాని,  నమస్కారాన్ని కనిపెట్టిన మహానుభావుడికో నమస్కారమైతే.. దాన్నో ఆయుధంలా వడుపుగా వాడేసుకునే తాజా రాజకీయాలకు  వందలొందల నమస్కారాలు! నమస్కారాన్ని నమ్ముకున్న వాడెన్నటికీ చెడే ఆస్కారం లేదు. 'దండమయా విశ్వంభర.. దండమయా పుండరీక దళనేత్ర హరీ..  దండమయా ఎపుడు నీకు.. దండము కృష్ణా!' అంటో దండక శతం ఆపకుండా గడగడ చదవ గలిగే గడుసు పిండానికి ఏ గండాలు రావు.  వచ్చినా రామచంద్రుడి ముందు   సముద్రుడంతటి వాడొచ్చి సంధించిన  బాణంలా అవి తీరం దాటి ప్రళయం సృష్టించబోవు.గూగుల్ నుంచి ట్వట్టర్ దాకా  ‘నమస్కారం'   సృష్టిస్తోన్న  ప్రభంజనం  ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా ప్రణామ మాహాత్మ్యాల మీద సవాలక్ష సందేహాలంటే.. బాబూ .. తమకో నమస్కారం! -కర్లపాలెం హనుమంతరావు బోథెల్, యూఎస్ఎ - Unknown

నమస్తేలోనే ఉంది సమస్తం -కర్లపాలెం హనుమంతరావు 10 -02 -2021 నమస్తే'లోనే ఉంది సమస్తమంతా. న 'మస్తే' అంటే తల లేని వ్యవహారంగా కొద్దిమందికి వెటకారం. జోడించే వడుపు కుదరక  చేతులను ... [శోధిని తెలుగు బ్లాగుల సంకలిని నుండి]
Post Date: Wed, 10 Feb 2021 13:26:21 PST
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: http://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger