Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 17 August 2022

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది? - sarma

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది? ఈ ప్రశ్న ఎక్కడో చదివాను, సమాధానం చదవలేకపోయా! నాకు తోచిన సమాధానం ఇదీ!!! ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఆస్థులు,అనుభవహక్కులు,వాటి కాల దోషం గురించి కొద్దిగా ముచ్చటిద్దాం. ప్రామిసరీనోటు కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లు వేయడంగాని,తిరగరాయడంగాని, కొంత జమకట్టడం గాని జరగాలి. మూడేళ్ళు దాటిన మరునాడు ఆ నోటు చెల్లదు. నోటు చచ్చిపోయిందంటారు, దానినే కాలదోషం పట్టిందనడం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైమ్ లాప్సు అయింది. ఇలాగే అస్థులగురించి కూడా!అనుభవహక్కులు,వాటి కాలపరిమితి వగైరాలు ఉన్నాయి. ఇవి ఏదో ఒకరోజులో వచ్చినవికావు. వేల సంవత్సరాలుగా కాలంతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవి, నేటి కాలానికి నోటు మూడేళ్ళకి కాలదోషం, ఏదేని ఆస్థిపై హక్కు నిరూపించుకునే పన్ను కట్టడం, అద్దెతీసుకోవడం, ఇటువంటివి పన్నెండు సంవత్సరాలు కనక యజమాని చేయక ఆస్థిని వదిలేస్తే, ఆ అస్థి అనుభవిస్తున్నవారి సొత్తవుతుంది. ఇప్పటికిన్నీ స్వాధీన తణఖా సమయం పన్నెండేళ్ళని నా ఎరుక. అదేగనక ప్రభుత్వ ఆస్థిని ఇరవై సంవత్సరాలు నిరాటంగా ఆక్రమించుకుని ఉంటే అది అనుభవదారుని స్వంతం ఔతుంది. ఇలా చాలా ఉన్నాయి, నేటి కాలానికి. ఇక ఇప్పుడు ప్రశ్నలోకి వెళదాం. కైక రెండు వరాలు దశరథుని అడిగింది. అందులో ఒకటి రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. పదునాలుగేళ్ళే ఎందుకడిగింది? ఎక్కువో తక్కువో అడగచ్చుకదా? రామాయణం ఎప్పుడు జరిందంటే నిర్దిష్టమైన సమయం చెప్పడం కష్టం. ఆనాటికి నిలిచి ఉన్న ఆస్థి పై హక్కు కోల్పోడానికి సమయం పదునాలుగేళ్ళు. ఇది దృష్టిలో ఉంచుకునే రాముని వనవాసకాలం పదునాలుగేళ్ళుగా కైక అడిగింది. అంటే పద్నాలుగేళ్ళు వనవాసం తరవాత రాముడు మరల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేడు, కాల దోషం పట్టింది కనక. దశరథుడు మరణించాడు, రాముడు వనవాసంకి వెళ్ళిన తదుపరి. భరతునికి కబురంపేరు, మేనమామ ఇంట ఉంటే. వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అన్నదగ్గరకు పోయి రాజ్యం నీదే ఏలుకోమని కోరాడు. రాముడు ఒప్పుకోలేదు,పదునాలుగేళ్ళ తరవాత తిరిగివస్తానన్నాడు, ఎంత చెప్పినా. చివరికి రాముని పాదుకలు పుచ్చుకుని వచ్చి, వాటికి పట్టాభిషేకం జరిపించాడు, భరతుడు. పదునాలుగేళ్ళ వనవాసం తరవాత వస్తాను, రాజ్యం ఏలుకుంటానని చెప్పినా. భరతుడు ఇలా ఎందుకు చేశాడు? రాముని దగ్గరకు తిరిగి రమ్మని చెప్పడానికి కొంతమందే వెళ్ళేరు, ఇక్కడ ఏమి జరిగినదీ ప్రజలకి తెలియదు. పాదుకలు తెచ్చి వాటికి పట్టం కట్టకపోతే, పదునాలుగేళ్ళ తరవాత రాముడు కనక రాజ్యం తీసుకుంటే, రాముడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని ప్రజలనుకోవచ్చు. అందుకే పాదుకా పట్టాభిషేకం, ప్రజలకి రాజ్యం రామునిదే అని చెప్పడానికి భరతుడు చేసినది. అలా అనుకోకుండడానికే భరతుడు పాదుకలు తెచ్చి పట్టం కట్టడమే కాక అయోధ్యలో కాక నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. భరతుడు రామునితో నీవు గనక పదునాలుగేళ్ళు దాటిన మరునాటికి అయోధ్యకి రాకపోతే నేను సన్యసిస్తానని చెబుతాడు. అందుకే రాముడు సమయానికి రాలేక హనుమతో వస్తున్న కబురు ముందుగాపంపినది. మరొక సంగతి కూడా చర్చకు రావచ్చు అది భారతంలో పదమూడేళ్ళ వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం.ఎలాగైనా ఉండచ్చు. కాని ఇందులో కూడా పదమూడేళ్ళు అన్నది ఆ కాలంనాటి కాలదోష సమయం అనుకుంటున్నా.ఇవి వేల సంవత్సరాలలో ఆస్థి, అనుభవ హక్కుల్లో వచ్చిన తేడాలు.రామయణ కాలానికి కాలదోష సమయం పదునాలుగేళ్ళు, భారత కాలం నాటికి అది పదమూడేళ్ళయింది. నేటికి కాలదోష సమయం పన్నెండేళ్ళని చెప్పుకున్నాంగా. కాలదోష సమయం ఇలా తగ్గుతూ వచ్చింది.
Post Date: Wed, 17 Aug 2022 01:16:29 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger