Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 13 October 2022

ఏకచక్రే మహాభోగే - sarma

ఏకచక్రే మహాభోగే ఏకచక్రే మహాభోగే ద్విచక్రే మహాపండితః త్రిచక్రే లోక సంచారే చతుశ్చక్రే మహాబలాః ఒక చక్రం ఉన్నవాడు మహాభోగి, రెండు చక్రాలున్నవాడు, మహా పండితుడు, త్రి చక్రే, మూడు చక్రాలున్నవాడు, లోక సంచారి, తిన్నచోట నిద్రపోడు, నిద్రపోయిన చోట తినడు, తిరుగుతూనే ఉంటాడు. నాలుగు చక్రాలున్నవాడు మహా బలవంతుడు. :) ఇదండీ సంగతి, ఏంటిటా? ఇది సాముద్రికంలో మాటంటారు. చక్రం, శంఖం,అనేవి చేతిలోనూ గద,పద్మం అనేవి కాళ్ళలోనూ ఉంటాయిట. ఇందులో కూడా సవ్య చక్రం,అపసవ్య చక్రం, దక్షణావర్త శంఖం, ఉత్తరావర్త శంఖం అని రకాలూ ఉన్నాయట. :) ఇదంతా మనకొద్దు, మనం అధునికులం కదా! మన దారిలోకి పోదాం :) ఒక చక్రం ఉన్నవాడు మహాభోగి కదా! సత్యం.రెండు కాళ్ళే ఏకచక్రం, కాలినడకన తిరిగేవాడు, సైకిల్ కొనడు,కారు అసలే కొనడు.పెట్రోల్/డిజిల్ ధరలు పెరిగాయనే గోల లేదు.  సైకిల్ కొననివాడు సైకిల్ బాగుచేయించే పనిలేదు. వీడు కాలి నడకన తిరుగుతుంటాడు కదా! రోగం రొచ్చు రాదు, డాక్టర్ దగ్గరకెళ్ళడు. మందులు కొనడు. మందు మొదలే కొనడు. సినిమా కెళ్ళడు, నడిచిపోవాలిగా!ఇంటి దగ్గర టివి చూస్తాడు, పెళ్ళాంతో కబుర్లాడుతాడు, వెచ్చగా తింటాడు, వెచ్చగా పడుకుంటాడు, హాయిగా నిద్దరోతాడు. వీని వల్ల ఎకానమీకి ఉపయోగం...లేదు. సైకిల్,కారు,మందులు, వైద్యం ఇండస్ట్రీకి శత్రువు. గోల లేదు,గొడవలేదు.మరి మహా భొగమేగా నేటిరోజుల్లో :) నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారో మహానుభావుడు. ఈ సామాన్యుడు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. ఏడు కరువులొస్తాయంటే, మొదటి కరువుకే చచ్చిపోతే మిగిలిన ఆరు కరువులూ నన్నేంచేస్తాయనగల ధీరుడు. కరంటు పోతే విసనకర్రతో సరిపెట్టేసుకుంటాడు. కుళాయి నీళ్ళు రాకపోతే టేంక్ దగ్గరకెళ్ళి తెచ్చుకుంటాడు. ఏ పార్టీ  వాళ్ళడిగినా నా వోటు మీకే అంటాడు.  అంతా దరిద్రమో అని ఏడుస్తుంటారు, దరిద్రం అన్నదో భావన అంటాడు. ఉన్నది తింటాడు, లేకపోతే పస్తుంటాడు. కట్టలు, కట్టలు డబ్బు పోగేసెయ్యాలన్న తపన లేదు. ఇ.డి వాళ్ళొస్తారో, దొంగే వస్తాడో అన్న భయం లేదు, గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్దరోగలడు, నిద్దర మాత్రల పనిలేదు. కారేరాజులు రాజ్యముల్ గల్గవే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవన్ జాలిరే? అని అడగగల ధీమంతుడు. వేయిమాటలేల? మితంగా తినడం భోగం. కంటినిండా నిద్ర భోగం. భార్య/భర్త తో ఊసులాడుకోడం,సరస సల్లాపాలు భోగం. తల్లితం డ్రు లుండటం భోగం. తల్లితండ్రులతో కలసి ఉండటం భోగం. పిల్లల్ని కని పెంచడం భోగం.  కష్టసుఖాలు కావలసినవారితో పంచుకోడం భోగం.  సన్మిత్రులను కలిగి ఉండటం భోగం. ఆరోగ్యమే మహాభాగ్యం, భోగం. చివరగా తన సంతానం,బంధుమిత్రుల మధ్య తనువు చాలించడం భోగం. ఏకచక్రే మహాభోగే! వీలును బట్టి మిగతా చక్రాలు చూద్దాం
Post Date: Thu, 13 Oct 2022 03:20:48 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger