Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 20 September 2022

త్వామనురజామి 2.0 - 3 - కహా హై మేరే ప్యార్ కీ మంజిల్ ... తూ బత్‌లా తుఝ్‌కో హై పతా! - Lalitha

దీనికి ముందు కబుర్లు   చదవాలంటే , ఒకసారి ఇక్కడికి వెళ్లి రండి : త్వామనురజామి 2.0 - 2 - యాద్ కర్ ‌ కే యే ఘర్ రోయీ ఆంఖే ... మగర్ ముస్కురానా పడా ... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** గుంటూర్లో వేసవి ఎండల ఉసురుసురుల్లో ఆ మూణ్నెల్లు ఎలా గడిచాయో - గడిచాయి. అప్పడు గుర్తున్నవి మాత్రం - మొట్టమొదటగా ... ఓ మంగళవారం నాడు పొద్దున్నే నన్ను తనతో తీసుకెళ్లి ఒక ఆంజనేయస్వామి గుళ్లో మా ఆడపడుచు తులసి చేయించిన ఆకుపూజ. వాళ్ళన్నయ్యతో నా పెళ్లి జరిగితే అంజనేయస్వామికి ఆకుపూజ చేయిస్తానని మొక్కుకుందట. ఇంకోరోజు తులసి తోనే గుంటూరు జనరల్ హాస్పిటలుకి వెళ్లి తన డి-ఫార్మసీకి సంబంధించిన పనులేవో చేసుకొచ్చాము. అప్పటిదాకా పప్పి, కుట్టి, ప్రశాంతి, అపర్ణలతో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువగా మాట్లాడడం, ఎక్కడికీ వెళ్లడం అలవాటు లేని నాకు తులసితో - నడిచే నడకల్లో, చెప్పుకుంటున్న కబుర్లలో - కుదురుకుంటున్న స్నేహం కొంచెం కొత్తగా, కొంచెం గొప్పగా కూడా అనిపించింది. ఆ "గొప్పగా" అనిపించడం ఎందుకంటే - తులసి నన్ను పిలిచే "వదినా!" అన్న పిలుపు నాకేదో పదవిలా అనిపించడమే. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** తులసితో మాత్రమే కాకుండా నా మరిది విజ య్‌తో కూడా నాకు మంచి నేస్తమే కుదిరింది. నా పెళ్ళికి ముందు ఒకసారన్నా తులసిని చూశాను కానీ విజయ్‌ని సరిగ్గా చూడడం మాత్రం నా పెళ్ళిలోనే! పాలద్దిన నా చేతులని తన అరచేతుల్లో అప్పగించుకుంటున్నప్పుడు - "లక్ష్మణమూర్తి లాంటి మరిదివి, మా లల్లీని మీకప్పగిస్తున్నాను" అని మా అమ్మ అంటుంటే - కాటుక్కరుగుతున్న కళ్ళెత్తి అప్పుడు విన్నా - "మా వదిన్ని మేం జాగ్రత్తగా చూసుకుంటాం- మీరేం బెంగ పెట్టుకోకండాంటీ" అన్న నవ్వులో అద్ది పలికినట్టున్న మాటల్ని. అవి వింటున్నప్పుడే నాకు ఫ్రెండయిపోయారు విజయ్. వేసట పరిచే వేసవి   వడగాడ్పుల మధ్యాహ్నాల తోచీతోచని వేళల్లో - రెండు మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని - ఆ కుదురు మీద గడ్డమానించుకుని - గాలిలో రేపటి రోజుల ఆనమాళ్ళేవో వెతుక్కుంటూ - నాలో నేనే ఒంటరిననని అనుకుంటూ - వినీ వినిపించని వెక్కిలి తోడుగా కన్ను జారిన నీటిచుక్కనొకటి ఎవరికీ కనిపించకుండా చిటికే వేళ - ఆ చిటుక్కుమన్న సద్దు వినబడో ఏమో - మా విజయ్ "వదినా! పుల్లలాట ఆడదామా?" అంటూ గుప్పెడు పుల్లల్ని పట్టుకొచ్చి గుట్టగా నా ముందు పోస్తే - నా ఆ బెంగ "హుష్! కాకీ!" అని పుటుక్కుమనేది. అలా మాటలతో, ఆటలతో మొదలయింది - తులసి, విజ య్‌లతో నా వదిన-రికం. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఆ మూణ్ణెళ్లలోనే  - ఒక రెండుమూడ్రోజులు అమ్మ, పప్పి, కుట్టీలతో కలిసి చిలకలూరిపేట రవి-శారదల దగ్గరికి వెళ్లి వచ్చాను. అక్కడ చిలకలూరిపేట విజయభాస్కర్ థియేటర్లో మేమందరం కలిసి చూసిన సినిమా "అల్లరిప్రియుడు". చూస్తున్నప్పుడే ఇదెక్కడో చూశామే అనిపించింది. తీరా చూస్తే అది సంజయ్ దత్తుని రమ్యకృష్ణగా, సల్మాన్ ఖానుని మధుబాలగా, మాధురీ దీక్షిత్తుని రాజశేఖరుగా మార్చి ఏమార్చి - కె. రాఘవేందర్రావు తెలుగులో "అల్లరిప్రియుడు"గా ఫ్రీ-మేకు చేసిన "సాజన్" సినిమా. ఆ తర్వాత గుంటూరు తిరిగొచ్చేశాక -  అప్పుడప్పుడే అనుకుంటా... అప్పటెప్పటివో అభిలాష-శుభలేఖల నాటి - అదేదో  మేజిక్కు మిస్సయినట్టనిపించడం మొదలుపెట్టి చిరంజీవి సినిమాలంటే చూడాలనిపించపోవడం మొదలవడం. సరిగ్గా అప్పుడే "ఇప్పటికి ఇదే ఆఖరు" అనుకుంటూ చూసిందే "మెకానిక్ అల్లుడు" సినిమా - అనారా-చిరంజీవీల ఒకానొక పల్టీ-స్టారరు. దానికి అమ్మ, పప్పి, కుట్టి, నేను వెళ్ళాము. ఇది చెప్పుకునేంతగా ఎందుకు గుర్తుందీ అంటే ... అప్పటికి మా అత్తవారింట్లో వున్న నేను ఓ రోజు తులసితో చెప్పాను "నాకు కొంచెం కడుపు నొప్పిగా వుంది. మా అమ్మ దగ్గరికి వెళ్లాలని వుంద"ని. నేనింకా అప్పటికి మా అత్తగారు చెప్పే విషయాలు, ఇచ్చే సలహాలు వినడం తప్ప తులసి, విజయ్ లతో మాట్లాడుతున్నంత చనువుగా ఆవిడతో మాట్లాడట్లేదు. అందుకే తులసితో చెప్పాను. తను వెళ్లి అత్తయ్యతో చెప్పింది. అత్తయ్య వెళ్ళమన్నారు. వెంటనే రెండో లైన్లో రిక్షా ఎక్కి నాలుగో లైన్లో మా ఇంట్లో ఉన్నా. నన్ను చూసీ చూడగానే "టైముకొచ్చావే లల్లెమ్మా! పద పద మన చిరంజీవి సినిమా వచ్చింది. ఇవాళ మాట్నీకి వెళదాం" అంది కుట్టి. అది వింటూనే "అమ్మో! నేను  రానే బాబూ! నాకు బాలేదు" అన్నానో లేదో "సిన్మాకెళ్తే అన్నీ అవే బావుంటాయి - పద. గబగబ అన్నం తిను. మన పక్కింటబ్బాయిని టికెట్లు తెమ్మని పంపిస్తాను. నిన్ను సాగదీసేలోగా ఆ నాలుగు టికెట్లూ అయిపోతాయి కూడా. ముందు నువ్వు తినవే బాబూ!" అని తెగ హడావిడి చేస్తోంది కుట్టి. ఈ సందడిలో, హడావిడిలో - ఉక్కిరిబిక్కిరి అవుతూ ఓ పక్క పొట్ట పట్టుకుని మూలుగుతూనే, ఇంకో పక్క సినిమాకి తయారవుతున్నాను - అంతకు మించి ఇంకేమన్నా అదొప్పుకోదని తెలుసు కాబట్టి. అంతలోనే - "వదినగారూ! ఏం చేస్తున్నారు? మా కోడలికెలా వుందోనని ఉండబట్టలేక వచ్చాము నేనూ, మా చిన్నోడు" అంటూ వచ్చారు చిన్న-చిన్న పూల-పూల కాటన్ చీరలో ఫెళ-ఫెళలాడుతున్న కొత్త వందరూపాయిల నోటులా ఉన్న మా అత్తగారు, ఆవిడ వెనకాలే మా విజయ్. అంతే! మా కుట్టి ఒక్క నిముషం మాటలు ఆపేసింది. మళ్ళీ అదే తమాయించుకుని "రండాంటీ! కూర్చోండి" అని గబగబా అంది. ఓ పక్క సినిమాకి టైం అవుతోందని దానికి కంగారు. ఇంకో పక్క - కడుపు నొప్పని వంక పెట్టి వచ్చేసి ఇక్కడ సినిమాకి వెళ్తోందని అనుకుంటారని - నాకు బెదురు, మొహమాటం. చివరకు ఓ ఐదు నిముషాలు కాగానే మా పక్కింటబ్బాయి "కుట్టెక్కా! టికెట్లు దొరికాయి" అని రావడం, మేము సినిమాకి వెళ్తున్నామని మా అత్తగారికి అర్థమవడం, మరునిముషంలో ఆవిడ "వెళ్ళొస్తాం వదిన గారూ!" అని అమ్మతోనూ, "ఓ రెండ్రోజులుండి వచ్చేస్తావుగామ్మాయ్" అని నాతోనూ అనేసి "సినిమా చూసొచ్చి ఎలా వుందో చెప్పండ్రా, పప్పీ, కుట్టీ!" అని పప్పి, కుట్టీలతో అనేసి మా మరిదితో కలిసి వెళ్లిపోయారు. నాకు బోల్డంత ఏదోగా అనిపించింది. ఎవరికీ ఏమీ చెప్పలేని నా పరిస్థితికి ఇంకా బోల్డంత ఉక్రోషంగా అనిపించింది. నేను చేయని తప్పుకేదో నాకు నేనే సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టనిపించింది. అలా అని సినిమా చూడడం - ఎంజాయ్ చేయడం మాత్రం మామూలే! అందులోనూ బెంగుళూరు ప్యాలెస్ ముందో పాట ఉందాయె సినిమాలో! మనసైన తాను... తానున్న ఆ తావు... తానందున్న తలపుకే ఆ తావాయె బల్ ... మనసైన తావు! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** అన్నట్టు - ఆ మూణ్ణెల్లలోనే ఓ మాటు తిరుపతికి కూడా వెళ్ళొచ్చాను - నేనొక్కదాన్నే నారాయణాద్రి ఎక్కి - అచ్చం పద్మావతీ యూనివర్సిటీలో చదివే రోజుల్లోలా. ఇంతకీ అది ఎందుకూ అంటే - బద్రి ఎంబీఏ క్లాస్మేటు జీఎం సత్యనారాయణ పెళ్లి కని వెళ్లి. ఆ పెళ్ళికి బద్రి బెంగుళూరు నుంచి తిరుపతికి ఇటొస్తే, నేను ఇటు గుంటూరు నుంచి తిరుపతికి అటెళ్ళా. అప్పుడే మళ్ళీ బద్రి ఎంబీఏ ఫ్రెండ్స్ అందరినీ చూశా. ఆ పెళ్లవ్వగానే బద్రి అటు బెంగుళూరు వెళ్లగా - నేనిటు బెంగతో గుంటూరు వచ్చేశా. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** అదే మూణ్ణెల్లలో XLRI లో చదువుతున్న వేణు నన్ను చూడడానికి మా అత్తగారింటికి వచ్చాడు. వాడితో పాటు బిలబిల్లాడుతూ అమ్మ, పప్పి, కుట్టి - వాళ్ళతో పాటు మా ఇంట్లో పని చేసే రాములమ్మ కూతురు శ్రీదేవి కూడా 'పాపగార్ని చూస్తా' నంటే - దాన్ని కూడా తీసుకుని వచ్చేశారు. ఆ సాయంకాలపు పూట - మా అత్తవారింటి వాకిట్లో అరుగు మీద కూర్చుని - నా కోసం వచ్చిన వాళ్ళందర్నీ చూసిన - నా కళ్ళలో ఏ పుణ్యకోటి-తరహా-బెంగేదో కనిపెట్టిందేమో మరి...  మా కుట్టెమ్మ నా కోసం ఏం పాడిందంటే... మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడచిరా... నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగ వలె విడిచిపో.... .... ..... ..... ....  .... ..... ..... .... చేదగు కన్నీటిబొట్లు చిందిన చప్పుడులు విను వాదింపగ రాని మనసు పరివాదినిలో తుగవు మూగి పుస్తకాలలోని రాగాలను పాడుకో... గాలి కంటె తేలికైన ఆలోచన వాడుకో... గాలి కంటె తేలికైన ఆలోచన వాడుకో... మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడచిరా... నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగ వలె విడిచిపో.... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** మా అత్తవారింట్లో వీధి వైపుగా వున్న గోడకి  - ఓ చిన్న అరుగు ఉండేది. గులాబీ రంగు కాయితప్పూల చెట్టుకింద ఉండే ఆ అరుగు నాకు చాలా ఇష్టమైన స్థలం. ఆ మూణ్ణెల్లలో - అప్పుడే ఎనిమిదో క్లాసు లోకి రాబోతున్న వాసు గాడికి అప్పుడప్పుడూ Trigonometry పాఠాలు చెప్పిందీ మా అత్తవారింటి అరుగు మీదే. ఆ  మూణ్ణెల్లలో - తులసితో నేను నవ్వుకున్న కబుర్లన్నీ మా అత్తవారింటి అరుగు మీదే. ఆ మూణ్ణెల్లలో - విజయ్‌తో నేను మాట్లాడిన సినిమా కబుర్లన్నీ మా అత్తవారింటి అరుగు మీదే. ఆ మూణ్ణెల్లలో - సాయంత్రం కాగానే వేడెక్కిన బండల్ని చల్లని నీరు చల్లి చల్లబరుచుకుని - ఆరుబయట మంచాలేసుకుని టేబుల్ ఫేన్ రెక్కల దయతో చల్లగా నిద్రపోయినదీ మా అత్తవారింటి అరుగు పక్కనే. ఆ మూణ్ణెల్లూ ముగుస్తుండగా - " కహా హై మేరే ప్యార్ కీ మంజిల్ ... తూ బత్‌లా తుఝ్‌కో హై పతా!" అని పాడుకుంటూ - బెంగుళూరులో మా ఇద్దరి కోసం ఓ ఇల్లు చూశానని, తొందర్లోనే నన్ను బయల్దేరి రమ్మని బద్రి రాసిన ఉత్తరం పదేపదే చదువుకున్నదీ మా అత్తవారింటి అరుగు మీదే. జూన్ ఆరో తారీఖున బెంగుళూరు వెళ్ళడానికి ముహూర్తం పెట్టిన తర్వాత - మేము మొదలుపెట్టబోయే మా జీవితకాలపు సహజీవనానికి కావల్సిన వస్తువులు - బట్టలారేసుకునే దండెపు తాడు, క్లిప్పులు మొదలుకొని బట్టలు పెట్టుకునే బీరువా దాకా, కడుపు నింపే ఆహారవస్తువులతో మొదలు పెట్టి కళ్ళు నింపే అలంకరణసామాగ్రి దాకా అంజనేయుడి తోకంత పొడుగుండే జాబితాలు రాసుకున్నదీ మా అత్తవారింటి అరుగు మీదే. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ( కహా హై మేరే ప్యార్ కీ మంజిల్ ... తూ బత్‌లా తుఝ్‌కో హై పతా!.... ) నేనిలా - నోటికందిన పాటేదో - పల్లవో, చరణమో అందిన చోట అందిపుచ్చుకుని - పాడుకుంటూ - మా అత్తవారింటి అరుగు మీద కూర్చుని రాసుకోవాల్సిన లిస్టులేవో రాసుకుంటుంటా... మీరు కూడా వీలైతే ఆ పాటేదో పట్టుకోగలరా? <<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
Post Date: Tue, 20 Sep 2022 03:05:41 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger