Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 1 September 2022

ధృతరాష్ట్రుడు, ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు) - sarma

ధృతరాష్ట్రుడు,  ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు?(జవాబు) భయపడి వరాలిచ్చాడు. ఎవరికి భయపడ్డాడు? ముగ్గురు, ఆ ఇంటికోడళ్ళకి. ఎవరువారు? 1.గాంధారి.2.ద్రౌపది.3.కుంతి. ఎందుకు భయపడ్డాడు ? గాంధారి:- ఈమె ఒక ఉడుకుతున్న అగ్నిపర్వతం. తన ఎదురుగా, కొడుకు వదినగారిని కొప్పు పట్టి లాక్కుపోతుంటే మాటాడలేక అసహాయంగా ఉండిపోయినది.ఆమె మనసు కుతకుతలాడింది, జరుగుతున్న అన్యాయానికి.జూదం మాటెలావున్నా ఇంటికోడలికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయింది. అందుకే తనకొడుకులు నీచప్రవర్తన మరెంతకు దిగజారిపోతుందో, కర్ణుని సావాసంలోనని, బయలుదేరి విదురునితో కలిసి ధృతరాష్ట్రునికి సభలో జరుగుతున్నది చెప్పింది. ఆమెకు పుత్ర ప్రేమలేకపోలేదు కాని ధర్మం మీద కూడా ప్రేమ ఉంది. తార్కాణం:- యుద్ధానికి వెళుతూ తల్లిదగ్గరకొచ్చి నమస్కారం చేశాడు దుర్యోధనుడు, అపుడామె 'జయోస్తు' ని దీవించలేదు, 'యతో ధర్మస్తతో జయః' ఎటు ధర్మం ఉంటే అటు జయం కలుగుతుందని దీవించింది. అంటే దుర్యోధనుని పక్క ధర్మం లేదనేగా! తన కొడుకు పక్క ధర్మం ఉండి ఉంటే జయోస్తు అనే దీవించేది. మరో మాట కూడా. యుద్ధం అయిపోయింది యుద్ధరంగంలో చనిపోయిన వారిని చూస్తూ, దుర్యోధనుని శవాన్ని చూసి మళ్ళీ తన దీవెన గుర్తుచేసుకుని, నాడు సభలో చేసిన అకృత్యానికి ఫలితం అనుభవిచావా కొడకా అని ఏడ్చింది. ఈ అగ్నిపర్వతాన్ని చలార్చకపోతే మొదలుకే మోసం రావచ్చని భయపడ్డాడు. గాంధారి సభలో జరిగినది చెప్పిన తరవాత ప్రమాదాన్ని పసికట్టిన ధృతరాష్ట్రుడు కి జ్ఞాననాడి కదిలి నష్ట నివారణ చర్యలు మొదలెట్టేడు. ద్రౌపది:- ఈమె ప్రత్యక్షంగా అవమానానికి గురైనది, బద్దలైన అగ్నిపర్వతం, ఏ క్షణాన ఐనా లావా వెదజల్లచ్చు, అప్పుడు బాధపడి లాభం లేదు. ఆమె పట్ల కొడుకులు తప్పుజేసేరు. సభలో నేను దాసినా? అని అరిచింది తప్ప మరోమాట మాటాడలేదు.భార్య మానాన్ని కాపాడలేని నువ్వు మగాడివా? అని ఒక్క ప్రశ్న భీముని కనక వేసి ఉంటే!.... ఆమెగనక భీముని రెచ్చగొట్టి ఉంటే, ఆనాడు ఆ సభలో పీనుగులే ఉండేవి. ఈ అగ్ని పర్వతాన్ని ముందుగా చల్లబరచాలి, అనుకున్నాడు,  భయపడ్డాడు . కుంతి:- ఈమె నివురుగప్పిన నిప్పు. గాలి ఊదితే చాలు మండిపోతుంది. ఈమె ఒక్క మాట కనక అంటే, ధర్మరాజుకు కబురంపితే, కోడలికి అన్యాయం జరుగుతుంటే చోద్యం చూస్తున్నారా? అని ఒక్క మాటంటే, అక్కడే కురుక్షేత్రం జరిగిపోయేది, అందుకు భయపడ్డాడు. ఇంతేగాక ఆ రోజు సభలో కూడా ఎక్కువమంది జూదంలో జరిగినదానికంటే ద్రౌపది పరాభవానికే మండిపోయారు, అందుకు వెనక్కి జంకి నష్టనివారణ చర్యగా ద్రౌపదిని పిలిచి నువ్వు నాకోడళ్ళందరిలో ఎన్నదగినదానివని పొగిడేడు. ఆ తరవాత వరం కోరమన్నాడు, ఆమె ధర్మరాజు దాస్య విముక్తి అడిగింది, మరోవరమిస్తానన్నాడు, అప్పుడు మిగిలిన భర్తల దాస్య విముక్తి అడిగింది. ధృతరాష్ట్రుడు నిరాశపొందాడు, ఆమె రాజ్యం అడుగుతుందనుకున్నాడు,ఆమె అడగలేదు, అందుకు పాండవులందరిని పిలిచి రాజ్యం ఇచ్చి,అప్పటికి ఆ ఆపద నుంచి గట్టెక్కేడు. ఆ తరవాత జరిగిన అనుద్యూతానికి ఒప్పుకున్నాడు, కొడుకు చెప్పిన కారణాలకి.అసలు పాండవులను అడవులపాలుజేసి రాజ్యం కొడుక్కి కట్టబెట్టాలన్న ఆలోచన ధృతరాష్ట్రునిదే, దానికి తోడు దుర్యోధనుని అత్యాశ తోడయిందంతే! స్వస్తి.
Post Date: Thu, 01 Sep 2022 03:19:16 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger