Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 20 October 2022

త్వామనురజామి 2.0 - 4 - న బాదలోం కీ ఛావ్ మే... న చాంద్‌నీ కే గావ్ మే... - Lalitha

దీనికి ముందు కబుర్లు   చదవాలంటే , ఒకసారి ఇక్కడికి వెళ్లి రండి : త్వామనురజామి 2.0 - 3 - కహా హై మేరే ప్యార్ కీ మంజిల్ ... తూ బత్ ‌ లా తుఝ్ ‌ కో హై పతా ! లిస్టులు రాసుకుంటూ, రోజుల్లెక్కపెట్టుకుంటూ వుండగానే బెంగుళూరుకి బయల్దేరే రోజు రానే వచ్చింది. నేనూ, నాతో పాటు నన్ను దిగబెట్టడానికి అమ్మా, నాన్నా, అత్తయ్యా - నలుగురం కార్లో బెంగుళూరుకి బయల్దేరాం. నే కట్టుకోవాల్సిన చీరలూ, నాతో పాటు పట్టికెళ్తున్న సారెలు కాకుండా నేను సర్దుకున్నవి ఓ రెండున్నాయండోయ్!! అందులో ఒకటి ఇంతకు ముందు నా "త్వామనురజామి" లో ఓ చోట చెప్పానే "పెళ్ళికూతురిలా ముస్తాబయి" వచ్చిందని - అదే... నా ట్రంకు పెట్టె. ఇక రెండోది నా బొమ్మ - షిప్లీ. ఈ షిప్లీని నాతో పాటే మా అత్తగారింటికి తీసుకెళ్ళాను నేను - అనేకంటే "లల్లీ! దీన్నీ నీతో పట్టుకెళ్ళు" అని పంపించింది మా అమ్మ అన్నదే నిజ్జంగా నిజ్జం. ఇప్పుడు దాన్ని కూడా నాతో పాటు బెంగుళూరు తీసుకెళ్తున్నా. అల్లప్పుడెప్పుడో నేనే చెప్పిన ఆ ట్రంకు-పేటిక, షిప్లీ-పాంచాలిక కబుర్లు మళ్ళింకొక్కసారి ఇక్కడ గుర్తు చేసుకుంటున్నా. త్వామనురజామి - 10 - పద్మావతి చేర ... ట్రంకు సర్దాము ... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నాకు ఆ కారు ప్రయాణం అంతగా గుర్తు లేదు కానీ తిరుపతి దాటి పలమనేరు ఘాట్ రోడ్డు మీదుగా - బోల్డంత దూరం వెళ్ళీ వెళ్ళీ - మొత్తానికి ఏ రాత్రికో బెంగుళూరు చేరిన జ్ఞాపకం మాత్రం మిణుకుమిణుకుగా ఎక్కడో మెరుస్తోంది. మేమెక్కిన కారు చక్రాలు అరిగేలా తిరిగీ-తిరిగీ బెంగుళూరులో బనశంకరిలో విద్యాపీఠ్ సర్కిల్లో వున్న ఓ చిన్న కామత్ హోటల్ పక్కగా కుడివైపుకి మలుపు తిరిగి కొంచెం ముందుకెళ్ళి ఓ రెండస్తుల ఆకుపచ్చని మేడ ముందు ఆగింది. అది అలా ఆగగా మేము దిగి - ఓ చిన్న గేటు తెరుచుకుని - ఎదురుగా వున్న మెట్లెక్కి తిన్నగా పైకెళ్ళి - మెట్లకి ఎడమ పక్కగా వున్న తలుపు తీసుకుని - ఓ బుల్లింట్లో అడుగు పెట్టగానే - బద్రి నవ్వులో విరిసి నా కళ్ళలో మెరిసిన వెలుగులకి - ఆ రాత్రి నక్షత్రాలేవైనా చూసుంటే అవీ మురిసుండేవి. అలా విరిసి మెరిసి మురుస్తున్న నవ్వులని కాస్సేపలా అల్లాగే వుండమని వదిలి - ఓ రెండు మాటలు ఆ పందిరి లాంటి ఆకుపచ్చని మేడ గురించి కొన్ని విశేషాలు చెప్తా. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** విద్యాపీఠ్ సర్కిల్ దగ్గర్నుంచి బ్యాంక్ కాలనీ వైపుకి వెళ్దామని కుడివైపుగా బయల్దేరామనుకోండి. అనుకున్నారా?! సరే! అలా నడుస్తూ వుంటే ఓ నాలుగడుగులు వేసీ వెయ్యగానే రోడ్డుకి ఎడమ పక్కన "యశస్వి ఆటోమొబైల్సో & హార్డోవేర్సో" అనే ఒక అంగడి కనిపిస్తుంది. అందులో కళ్ళకి ఎండకి నల్లబడి చలవదేమో అనిపించే కళ్ళజోడొకటి పెట్టుకుని ఒకాయన కూర్చుని వుంటాడు. అతని పేరు మంజునాథ్. ఆ మంజునాథ్‌దే చిలకలు వాలే చెట్టులా వున్న ఆ ఆకుపచ్చని మేడా - ఆ మేడ మీదుగా వాలి వున్న కొబ్బరిచెట్టూనూ. ఆ మంజునాథ్ భార్య పేరు ముద్దమ్మ. వాళ్ళకో నాలుగేళ్ళ బాబు యశస్వి. వీళ్ళు ముగ్గురూ మొదటి అంతస్తులో కుడి పక్కనున్న వాటాలో వాళ్ళుండి, ఆ పక్కగా వున్న ఎడమ పక్క వాటా మాకు అద్దెకిచ్చారు. మా ఇద్దరి వాటా మధ్యగా ఇంకా పైకి - అంటే రెండో అంతస్తుకి వెళ్ళడానికి మెట్లుండేవి. ఆ మెట్లెక్కి పైకి వెళ్తే అక్కడ మేడ గోడల మీదుగా ఒక కొబ్బరిచెట్టు, దాని పక్కనే ఒక గదీ వుండేవి. ఆ ఒక్క గదిలో ఇందిరమ్మ అని ఒకావిడ వుండేవారు. ఈవిడ NIIT లో డైరెక్టర్‌గా పని చేసే సుధ అనే ఆవిడ ఇంట్లో వంట చేసేవారు. ఈ రెండంతస్తులకి కింద - మేము మొదటగా తీసుకొచ్చిన గేటుకి ఎదురుగుండా మెట్ల పక్కగా వున్న ఓ చిన్న వాటాలో మంజునాథ్ గారి తలిదండ్రులు వుండేవారు. వారు ఆ వీధిలో వున్న అందరికీ తాత-అజ్జి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఈ విశేషాలూ, వివరాలూ - మేమా ఇంట్లో అడుగు పెట్టగానే గోడల మీద రాసి పెట్టి లేవు. ఆ మరసటి రోజు పొద్దున్నే వెచ్చవెచ్చటి ఉప్పిట్టుతో పాటుగా మా ఇంటి ఓనర్లైన మంజునాథ్-ముద్దమ్మ దంపతులు చలచల్లగా పంచుకున్నవి. అంతకు ముందు రాత్రేనా మేమొచ్చింది... ?! మరుసటి రోజు పొద్దున్న కల్లా నాన్న, మంజునాథ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కన్నడ-తెలుగులో మంజునాథ్ "ఏమండీ చెప్పండి" అంటే , అచ్చ -కన్నడలో నాన్న "నంగూ కన్నడ సొల్ప సొల్ప బరత్తదే" అంటూ ఎవరికి వాళ్ళు అవతలి వారి భాష తమకొచ్చన్నట్టు బదులిచ్చుకుంటూ ఒకరినొకరు సెబాసనేసుకున్నారు. ఇక ముద్దమ్మయితే చకచకా తన ఇంట్లో పని చేసుకుంటూనే వాళ్ళింట్లోకి కొత్తగా వచ్చిన మాకు ఏం కావాలో కనిపెట్టి అమరుస్తూ  కమకమ్మటి కన్నడ వంటలు చేసి మాకు ఇస్తూ  ఎంతో ప్రీతీ, ఇష్టం చూపించింది. తెలుగు రాని ముద్దమ్మకి, కన్నడ తెలియని నాకు - మా ఇద్దరికీ ఒకరికొకరం కావలసినవారమనిపించుకోవడానికి మాటల-పలకరింపులు అక్కరలేని చిరునవ్వుల-చిలకరింపుల భాష సరిపోయింది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఆ తర్వాత వున్న పదీ-పదిహేను రోజుల్లో అమ్మా-నాన్నా వెళ్ళి ఇంట్లో వున్న గదులూ, వంటింట్లో అరలూ నింపడానికి బోల్డన్ని సామాన్లు కొనుక్కొచ్చారు. ఇలా కొన్నవన్నీ మంజునాథ్ గారి మేడ మీదకి మెట్ల మీదుగా బాగానే వచ్చేశాయి కానీ ఒక్క బట్టలు పెట్టుకోవడానికని కొన్న ఇనప బీరువా మాత్రం మా గదిలో అడ్డంగా అయితేనే పడతానంది. అందుకని బీరువాకి కింద ఉండే రెండు కోళ్ళనీ కత్తిరించి పట్టుకొచ్చి గదిలో నించోపెట్టారు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** అసలు మా కొత్తింటి గురించి చెప్పాలంటే - అటో ఇరవై అడుగుల పొడుగు, ఇటో ఇరవై ఆడుగులు వెడల్పు వుండే ఓ బుల్లి చతురస్రంలో ఓ చిన్న వంటిల్లు, ఓ రెండు గదులు, అంతలోనే ఇంకో బుల్లి హాలూ, ఆ పక్కనే ఓ చిన్న బాత్రూం - వెరసి టూ-బెడ్రూం హౌస్! అంత ఇంట్లోనూ గదులూ, గోడలూ తప్ప కొనుక్కున్న పేపర్లూ, వేసుకునే చెప్పులూ పేట్టుకోవడానికీ కూడా అలమార్లు ఏమీ లేవని చూశారు నాన్న. వెంటనే వెళ్ళి మంజునాథ్‌ని అడిగి ఒక కార్పెంటర్‌ని తీసుకొచ్చి కొలతలు అవీ తీయించి హాలులో గోడకి అరలు పెట్టించి ఒక షెల్ఫ్‌లా తయారు చేయించారు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** బద్రీ, నేను - అమ్మా, నాన్నా, అత్తయ్యలతో కలిసి - విధాన్ సౌధ, కబ్బన్ పార్క్, విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ మ్యూజియం, ఆర్ట్ మ్యూజియం, అక్వేరియం - లాంటివన్నీ చూసొచ్చాము. ఓ మంచి రోజు చూసి బద్రి తన స్నేహితులు బాలజీ, సాయి గిరిధర్‌లని భోజనానికి పిలిచారు. అంతే! అమ్మా, అత్తయ్యా కలుపుగోలుగా, కలిసికట్టుగా కలగూరపప్పూ, కరివేపాకు-సహిత-పులిహోరా, కలకండతీపుల పరమాన్నమూ కమకమ్మగా వండి - కొసరికొసరి వడ్డించగా మా ఇంట మొట్టమొదటి బంతిభోజనాల విందు విజయవంతమయింది. ఓ వారం తర్వాత - ఇంటి దగ్గర విజయ్, తులసి ఇద్దరే వున్నారని చెప్పి - అత్తయ్య గుంటూరుకి వెళ్ళి పోయారు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఆ తర్వాత - ఓ రోజు MG రోడ్‌లో ఒక ఎలక్ట్రానిక్స్ షాప్‌కి వెళ్ళాము. అక్కడ  నాన్న  ఒక బుల్లి ట్రాన్సిస్టర్ రేడియో, ఒక నల్ల టూ-ఇన్-వన్నూ కొన్నారు. అందులో పెట్టుకుని వినడానికి ఆ పక్కనే వున్న HMV వారి మ్యూజిక్ షాప్‌లోబాలకృష్ణప్రసాద్ పాడిన అన్నమాచార్య కీర్తనలూ, కిషోర్ కుమార్‌వీ, కెజె యేసుదాస్‌వీ హిందీ పాటల కేసెట్లు  కొనిపెట్టారు. ఇంకో రోజు అందరం కలిసి శివాజీనగర్‌లో వున్న నరసాయి పిన్ని ఇంటికి వెళ్ళాము. ఈవిడ మా అమ్మకి పిన్ని. కానీ నరసాయి పిన్ని అనేది ఆవిడ నామమూ, సర్వనామమూ కూడా - ఎందుకంటే మా అమ్మతో పాటు మేమందరం కూడా ఆవిణ్ణి నరసాయి పిన్ని అనే పిలుస్తాము. బెంగుళూరులో MG రోడ్డు, శివాజీనగరూ - ఇలా ఎక్కడికి వెళ్ళినా - ఓ చిన్నంచు పట్టుచీరా, బిగించి వేసిన జడకి జడగంటలూ - ఇదే నా ముస్తాబు. ఆ తళతళలాడే అంచులూ, జడకి బరువు పెంచే జడగంటలూ నాకు బోల్డంత ఇష్టంగా వుండేవి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** అత్తయ్య ముందే వెళ్ళిపోయారని చెప్పా కదా... ఆవిడ వెళ్ళిన వారం-పది రోజులకి అమ్మా-నాన్నా కూడా గుంటూరు వెళ్ళారు. ఇక ఇంట్లో బద్రీ, నేను. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నాకైతే ఎలా వుందంటే... కాలు నేల నిలపలేకుంటి నవ్వు పెదవి దాచలేకుంటి నే కలలు కన్న నాకమేదో నాకందిపోయినట్టే ఉందనుకుంటి మొయిలు మేడ మీద చలువ నీడ జాడ నా తోడు నీవు అనుకుంటూ ఒకరికొకరమై ఉంటామనుకుంటి గాలి తోడ మాటలాడి సోలు హాయి పాట పాడి నీ తోటే నేను వుంటానంటూ ఒకరితోనొకరు అంటామనుకుంటి అనుకున్నదేదో అయినట్టే... అయినదేదో అనుకుంటున్నట్టే... ఇప్పుడున్నట్టే ఇంకెప్పటికీ ఉంటే మేలనుకుంటి ఎల్లప్పటికీ ఇదే చాలనుకుంటి *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇన్ని అనుకుంటూ... "న బాదలోం కీ ఛావ్ మే... న చాంద్‌నీ కే గావ్ మే.. . మగర్ యే ఘర్ అజీబ్ హై జమీన్ కే కరీబ్ హై" అంటూ... నచ్చిన పాటేదో కూనిరాగమాడుకుంటూ ఇక్కడే నేనుంటానంటి నే పాడుకునే పాటేదో - ఎవరన్నా పట్టి - చెప్తారేమోననుకుంటానంటి... <<... మళ్ళీ 19 కి ఇంకొన్ని కబుర్లు>>
Post Date: Thu, 20 Oct 2022 04:52:33 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger