Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 25 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౬౩(663) - Aditya Srirambhatla

( కృష్ణ సందర్శనంబు ) 11-30-వ. అట్లు దేవముని కృష్ణసందర్శనార్థం బరుగుదెంచి తద్గృహాభ్యంతరమున కరిగిన, వసుదేవుం డమ్మునీంద్రుని నర్ఘ్యపాద్యాదివిధులం బూజించి, కనకాసనాసీనుం గావించి, యుచిత కథావినోదంబులం బ్రొద్దుపుచ్చుచు నిట్లనియె; "యే నరుండు నారాయణచరణసరసీరుహ భజనపరాయణత్వంబు నిరంతరంబు నొందం; డట్టివానికి మృత్యువు సన్నిహితంబై యుండు; నీ దర్శనంబునం గృతార్థుండ నైతి; నచ్యుతానంత గోవింద నామస్మరణైకాగ్రచిత్తులైన మీవంటి పుణ్యపురుషుల సమాగమంబున లోకులు సుఖాశ్రయులయి యుండుదురు; దేవతాభజనంబు సేయువారిని గీర్వాణులు ననుగ్రహింతు; రట్లు సజ్జనులును దీనవత్సలులు నగు వారలు పూజనాది క్రియలచే నా దేవతలను భక్తి సేయుదురు; కావున శ్రీ మహా భాగవత కథాసమూహంబులఁ గల ధర్మంబు లడిగెద; నేయే ధర్మంబులు శ్రవణ సుఖంబులుగా వినిన దండధరకింకర తాడనంబులం బడక, ముకుందచరణారవింద వందనాభిలాషులయి పరమపదప్రాప్తు లగుదు; రా ధర్మంబు లానతిమ్ము; తొల్లి గోవిందునిం బుత్రుఁగాఁ గోరి ముక్తిమార్గం బెఱుంగలేక దేవతామాయం జేసి చిక్కి చిత్తవ్యసనాంధకారం బగు సంసారంబునం దగులువడి యున్నవాఁడ; హరికథామృతంబు వెల్లిగొల్పు; మట్లయిన సుఖంబు గలుగు" ననిన వసుదేవ కృతప్రశ్నుండైన నారదుండు వాసుదేవ కథా ప్రసంగ సల్లాపహర్ష సమేతుండై సంతసంబంద నిట్లనియె. భావము: అలా శ్రీకృష్ణ దర్శనం కోసం వచ్చిన దేవమునీంద్రుని వసుదేవుడు ఆర్ఘ్యం పాద్యం ఆదులతో యథావిథిగా పూజించి, బంగారపు ఆసనం మీద కూర్చుండపెట్టి సముచిత కథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ ఇలా అన్నాడు. "మునీంద్రా! నిరంతరం నారాయణ పాదపద్మాలను భజించని వానికి చావు సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనంవలన కృతార్ధుడనైనాను. అచ్యుత, అనంత ఆది గోవిందనామాలను నిత్యం స్మరించే ఏకాగ్ర చిత్తం గల మీవంటి సుకృతాత్ములను కలియుట వలన లోకులు సుఖాశ్రయులై ఉంటారు. దేవతలను భజించే వారిని వేల్పులు అనుగ్రహిస్తారు. అటువంటి సజ్జనులు దీనవత్సలలు పూజలు మున్నగు సత్కార్యాలతో దేవతల యందు భక్తి చూపిస్తూ ఉంటారు. కనుక, శ్రీ మహా భాగవతం అందలి కథలలో ఉన్న ధర్మాలను అడుగుతాను. వీనులవిందుగా వింటే, యమభటులచేత దెబ్బలు తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలిగి, పరమపదాన్ని పొందగల ధర్మాలను ఆనతీయండి. పూర్వము గోవిందుడిని కుమారునిగా కోరినప్పటికి మోక్షమార్గం తెలియలేక దైవమాయలో చిక్కి వ్యసనాల చీకటితో నిండిన సంసారంలో చిక్కుకుని ఉన్నాను. హరికథాసుధారసాన్ని ప్రవహింప చేయండి. అలా అయితే నాకు సుఖం కలుగుతుంది." అని వసుదేవుడు ప్రార్థించగా నారదుడు వాసుదేవుని కథల ప్రస్తావన వచ్చినందుకు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=5&Padyam=30 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Tue, 25 Oct 2022 15:28:37 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger