Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 17 December 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౦(700) - Aditya Srirambhatla

( ప్రభాసంకు బంపుట ) 11-91-వ. ఇట్లు నుతియించి "దేవా! నీవు యదుక్షయంబు గావించి చనిన నేమే విధంబున నిర్వహింతుము? నీ సహచరులమై జరిపిన మజ్జన భోజన శయ నాసనాది కృత్యంబులు మఱవవచ్చునే?" యని యుద్ధవుం డాడిన వాసుదేవుం డిట్లనియె; "బ్రహ్మాదిదేవతా ప్రార్థనంబునం జేసి ధాత్రీ భారంబు నివారించితి; నింక ద్వారకానగరంబు నేఁటికి సప్తమ దివసంబున సముద్రుండు ముంపంగలవాఁడు; యదుక్షయంబునుం గాఁగల యది; యంతటం గలియుగంబునుం బ్రాప్తంబయ్యెడి, నందు మానవులు ధర్మవిరహితులు, నాచారహీనులు, నన్యాయపరులును, నతిరోషులు, మందమతులు, నల్పతరాయువులు, బహురోగపీడితులు, నిష్ఫలారంభులు, నాస్తికులునై యొండొరుల మెచ్చక యుందురు; గావున నీవు సుహృద్బాంధవస్నేహంబు వర్జించి, యింద్రియసౌఖ్యంబులం బొరయక క్షోణితలంబునం గల పుణ్య తీర్థంబుల నవగాహనంబు సేయుచు, మానస వాగక్షి శ్రోత్ర ఘ్రాణేంద్రియ గృహ్యమాణం బగు వస్తుజాతంబెల్ల నశ్వరంబుగా నెఱుంగుము; పురుషుండు నానార్థ కామంబుల నంగీకరించి నిజగుణదోషంబుల మోహితుండై యుండుం; గావున హస్తిపకుండు గంధనాగంబుల బంధించు చందంబున నింద్రియంబులను, మనోవికారంబులను నిగ్రహించి యీషణత్రయంబును వర్జించి, మోద ఖేదంబుల సముండవుగా వర్తించుచు, నీ జగంబంతయు నాత్మాధిష్ఠితంబుగా నెఱింగి, మాయాదు లాత్మతత్త్వాధీనంబులుగాఁ దెలియుచు, జ్ఞానవిజ్ఞానయుక్తుండవై యాత్మానుభవ సంతుష్టుండవై, విశ్వంబును నన్నుఁగా భావించి, వర్తింపవలయు" నని వాసుదేవుం డానతిచ్చిన నుద్ధవుండు భక్తి భయ వినయంబులం గరంబులు మొగిడ్చి "మహాత్మా! సన్న్యస్త లక్షణంబు దుష్కరంబు; పామరులగు వార లాచరింపలేరు; నీ మాయచేత భ్రాంతులైన సాంసారికులు భవాబ్ధిం గడచి యెట్లు ముక్తి వడయుదురు? భృత్యుండనైన నా మీఁది యనుగ్రహంబునం జేసి యానతిమ్ము; బ్రహ్మాది దేవతా సముదయంబును, బాహ్యవస్తువుల భ్రాంతులై పర్యటనంబు సేయుదురు; నీ భక్తు లైన పరమభాగవతు లమ్మాయా నిరసనంబును సేయుదురు; గృహిణీ గృహస్థుల కైన, యతుల కైన నిత్యంబును నీ నామస్మరణంబు మోక్షసామ్రాజ్యపదంబు; గావునఁ బరమేశ్వరా! నీదు చరణంబుల శరణంబు నొందెద; గృపారసంబు నాపై నిగిడింపు" మని ప్రియసేవకుం డైన యుద్ధవుండు పలికిన నతనికిఁ గంసమర్దనుం డిట్లనియెఁ; "బురుషున కాత్మకు నాత్మయె గురువని యెఱుంగుము; కుపథంబులం జనక, సన్మార్గవర్తి వై పరమంబైన మన్నివాసంబునకుం జనుము; సర్వమూలశక్తిసంపన్నుండనైన నన్ను సాంఖ్యయోగపరులు నిరంతరభావంబులందుఁ బురుషభావంబు గావించి తలంచుచుందురు; మఱియు నేక ద్వి త్రి చతుష్పాద బహుపాదాపాదంబులు నై యుండు జీవజాలంబుల లోన ద్వి పాదంబులు గల మనుష్యులు మేలు; వారలలోన నిరంతరధ్యాన గరిష్ఠులైన యోగీంద్రులుత్తములు; వారలలో సందేహపరులచే నగ్రాహ్యుండగు నన్ను సత్త్వగుణగ్రాహ్యునిఁగా నెఱింగి నిజచేతఃపంకజంబు నందు జీవాత్మ పరమాత్మల నేకంబుగాఁ జేసి శంఖ చక్ర గదా ఖడ్గ శార్‌ఙ్గ కౌమోదకీ కౌస్తుభాభరణయుక్తుంగా నెఱుంగుచు నుండువారలు పరమయోగీంద్రు లనియు, బరమజ్ఞాను" లనియునుం జెప్పి మఱియు"నవధూత యదు సంవాదం" బను పురాతనేతిహాసంబు గలదుఁ సెప్పెద నాకర్ణింపుము. భావము: ఈ విధంగా స్తుతించి "ఓ దేవా! నీవు యాదవజాతిని నాశనంచేసి వెళ్ళిపోతే, మేము ఎలా మా జీవితాలు నిర్వహించగలము. నీకు సహచరులమై నీతో కలసి చేసిన స్నాన పాన భోజన శయన ఆసనాదులను ఎలా మరచిపోగలము." అని ఉద్ధవుడు అన్నాడు. దానికి వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. "బ్రహ్మదేవుడు మొదలగు దేవతల ప్రార్థన ప్రకారం భూభారాన్ని తొలగించాను. ఇక ఈనాటి నుండి ఏడవ దినమున ద్వారక సముద్రంలో మునిగిపోతుంది. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం ప్రవేశిస్తుంది. అప్పుడు మానవులు ధర్మం ఆచారం లేనివారు అవుతారు. అంతేకాక మానవులు అన్యాయపరులు, అతిరోష స్వభావులు, బహురోగ పీడితులు, సంకల్పాలు ఫలించని వారు, నాస్తికులు అయి ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోకుండ ఉంటారు. కనుక, నీవు స్నేహితులు చుట్టాలు వంటి అనుబంధాలను వర్జించు. ఇంద్రియ సౌఖ్యాలలో మునిగిపోకు. భూతలం మీద పుణ్యతీర్ధాలలో స్నానాలు చెయ్యి. పంచేంద్రియాలచే గ్రహింపదగు వస్తువులు సర్వం నశించేవిగా తెలుసుకో. పురుషుడు అనేకామైన సంపదలను సంపాదించి కామాలకు అవకాశమిచ్చి తన గుణదోషాలకు మోహితుడు అయి ఉంటాడు. కాబట్టి, మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా, ఇంద్రియాలను మనోవికారాలను నిగ్రహించి భార్యాపుత్రులపైన ధనముపైన ఆసక్తి వదలుము. సుఖమునందు కష్టమునందు సమంగా వర్తించు. ఈ విశ్వం సమస్తం పరమాత్మచే అధిష్టించబడినదిగా గ్రహించు. మాయ ఆత్మకు వశమైనదిగా గుర్తించు. జ్ఞాన విజ్ఞానములు కలవాడవు అయి, అత్మానుభవంతో సంతుష్టిపొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు." అని వాసుదేవుడు అనతిచ్చాడు. ఉద్ధవుడు భయ భక్తి వినయాలతో చేతులు జోడించి ఇలా అన్నాడు. "మహానుభావ! సన్యాస జీవితం చాల కష్టమైంది. పామరులు ఆచరించ లేరు. నీ మాయ వలన భ్రాంతులు అయినవారు ఈ సంసార సముద్రాన్ని ఎలా తరించగలరు. ఎలా మోక్షాన్ని పొందగలరు. నేను మీ సేవకుడను కదా. నాకు దయచేసి సెలవియ్యండి. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు సహితం బాహ్య వస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. నీ భక్తులైన పరమ భాగవతులు మాత్రమే ఆ మాయను తప్పించుకో గలరు. ఇల్లాండ్రకైనా, గృహస్థులకైనా, యతులకైనా ఎప్పుడూ నీ నామస్మరణమే మోక్షసామ్రాజ్యాన్ని అందిస్తుంది. కాబట్టి, పరమేశ్వరా! నీ పాదాలను శరణు వేడుతున్నాను. నా మీద నీ దయారసాన్ని ప్రసరించు." అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు అర్థించాడు. అప్పుడు అతనితో కృష్ణుడు ఇలా అన్నాడు. మానవుని ఆత్మకు ఆత్మే గురువు అని తెలుసుకో. చెడుమార్గాలలో వెళ్లకుండా సన్మార్గంలో మెలగుతూ పరమమైన నా నివాసానికి చేరుకో. సమస్తానికి మూలమైన నన్ను సాంఖ్య యోగులు ఎప్పుడు పరమపురుష భావంతో భావిస్తూ ఉంటారు. అదీకాక ఒకటి రెండు మూడు నాలుగు అనేక కాళ్ళు కలవి; అసలు కాళ్ళులేనివి అయిన జీవజాలంలో రెండు కాళ్ళు కల మనుష్యులు ఉత్తములు; వాళ్ళలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు; కాని వాళ్ళలో సంశయగ్రస్తులు నన్ను గ్రహించలేరు; నేను సత్త్వగుణగ్రాహ్యుడను. ఈ విషయం గ్రహించి తమ మనసులలో జీవాత్మ పరమాత్మలను ఒకటి చేసి. శంఖం చక్రం గద ఖడ్గం శార్గ్ఞ్యం కౌమోదకి కౌస్తుభం మున్నగు ఆభరణాలు కల నన్ను తెలుసుకున్న వారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు." అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. "అవధూత యదుసంవాదం అనే ప్రాచీన ఇతిహాసం ఒకటి ఉంది. చెప్తాను విను." అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఇలా చెప్పసాగాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=91 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Sat, 17 Dec 2022 16:28:31 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger