Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 22 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౩(723) - Aditya Srirambhatla

( శ్రీకృష్ణ నిర్యాణంబు) 11-118-వ. అనిన రాజునకు శుకుం డిట్లనియె "నట్లు వాసుదేవుం డన్యాయ ప్రవర్తకులగు దుష్టుల సంహరించి, న్యాయప్రవర్తకులగు శిష్టులఁ బరిపాలనంబు సేసి, బలరామ సమేతంబుగా ద్వారకానగరంబు వెడలినం గని యాదవులు దమలోఁ దాము మదిరాపానమత్తులై మత్సరంబున నుత్సాహకలహంబునకుం గమకించి, కరి తురగ రథ పదాతిబలంబులతో ననర్గళంబుగా యుద్ధసన్నద్ధులై, యుద్ధంబునకుం జొచ్చి మునిశాపకారణంబున నుత్తుంగంబు లయిన తుంగ సమూహంబుల బడలుపడంగఁ బొడుచుచు, వ్రేయుచుం దాఁకు నప్పుడు నవియును వజ్రాయుధ సమానంబులై తాఁకిన భండనంబునం బడి ఖండంబులై యొఱగు కబంధంబులును, వికలంబులైన శరీరంబులును, విభ్రష్టంబులైన రథంబులును, వికటంబులైన శకటంబులును, వ్రాలెడు నశ్వంబులును, మ్రొగ్గెడి గజంబులునై, యయ్యోధనంబున నందఱుం బొలియుటకు నగి నగధరుండును రాముండునుం జనిచని; యంత నీలాంబరుం డొక్క త్రోవంబోయి యోగమార్గంబు నననంతునిం గలసె; నప్పరమేశ్వరుండు మఱియొక మార్గంబునం జని యొక్క నికుంజపుంజంబు చాటున విశ్రమించుటంజేసి చరణంబు వేఱొక చరణంబు మీఁద సంఘటించి చంచలంబుగా వినోదంబు సలుపు సమయంబున నొక్క లుబ్ధకుండు మృగయార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షించుచుండ, వృక్షంబు చాటున నప్పరమపురుషుని చరణ కమలంబు హరిణకర్ణంబు గాఁబోలునని దానిం గని శరంబు శరాసనంబునందు సంధానంబు సేసి యేసిన నతండు హాహారవంబునం గదలుచుండ నప్పరమేశ్వరుని సన్నిధానంబునకు వచ్చి జగన్నాథుంగాఁ దెలిసి, భయంబున "మహాపరాధుండను; బాపచిత్తుం డను; గుటిలప్రచారుండ" నని యనేకవిధ దీనాలాపంబులం బలుకుచు బాష్పజలధారాసిక్తవదనుండైన, సరోజనేత్రుండు వానిం గరుణించి యిట్లనియె; "నీ వేల జాలింబడెదు? పూర్వజన్మ కర్మంబు లెంత వారికైన ననుభావ్యంబులగుం గాని యూరక పోవనేరవు; నీవు నిమిత్తమాత్రుండ; వింతియ కాని" యని వానికిం దెలిపిన వాఁడును "మహాపరాధులైన వారూరక పోవరు; దేవ గురు వైష్ణవ ద్రోహులకు నిలువ నెట్లగు" నని పవిత్రాంతఃకరణుండై ప్రాయోపవేశంబునం బ్రాణంబులు వర్జించి వైకుంఠపదప్రాప్తుండయ్యె నప్పుడు. భావము: ఇలా అడిగిన రాజుతో శుకుడు ఇలా చెప్పాడు. "అలా శ్రీకృష్ణుడు అన్యాయమార్గంలో నడిచే దుర్మార్గులను చంపి, న్యాయమార్గంలో నడిచే సజ్జనులను కాపాడి బలరాముడు తాను ద్వారకనుండి వెళ్ళిపోయారు. పిమ్మట యాదవులు తమలో తాము మద్యపానంచేసి మత్తిల్లి, ఈర్ష్యతో పరిహాసంగా పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది నిజమైన పోట్లాటగా మారింది. ఏనుగులు, గుఱ్ఱాలు, రథాలు, కాల్బలములు తోకూడి అడ్డు ఆపు లేకుండా వారిలో వారే యుద్ధాలు మొదలుపెట్టారు. మునిశాపం కారణంగా ఎత్తుగా పెరిగిన తుంగ బెత్తాలతో అలసిపోయేలా కొట్టుకుంటూ బాదుకుంటూ యుద్ధాలు చేయసాగారు. ఆ తుంగబెత్తాలు వజ్రాయుధంతో సమానమైన ఆయుధాలవలె తాక సాగాయి. అలా ఒకరినొకరు పొడుచుకుంటూ భయంకరంగా యుద్ధం చేశారు. రణరంగమంతా ముక్కలు ముక్కలై చెదరిన మొండెములతో, వికలమైన దేహాలతో, విరిగిన రథాలతో, కూలిన గుఱ్ఱాలతో, వాలిన ఏనుగులతో నిండిపోయింది. యాదవులు అందరూ ఆ సమరంలో చచ్చిపోయారు. ఇదంతా చూసి నవ్వుకుంటూ శ్రీకృష్ణుడు బలరాముడు ఎటో వెళ్ళిపోయారు. కొంతదూరం వెళ్ళిన తరువాత బలరాముడు ఒక్కడు వేరు మార్గాన పోయి యోగమార్గంతో అనంతునిలో కలిశాడు. పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్ళి ఒక గుబురు పొద చాటున విశ్రాంతిగా పడుకుని ఒక కాలు మీద మరొక కాలు పెట్టి వినోదంగా ఆడిస్తున్నాడు. ఆ సమయంలో, ఒక బోయవాడు వేటకు వచ్చి అన్ని ప్రక్కలకు నిక్కి చూస్తూ ఉంటే, ఆ చెట్టుచాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవిలాగా కనిపించింది. అది చూసి, అంబులపొది నుంచి బాణం తీసి విల్లెక్కుపెట్టి గురిచూసి కొట్టాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారం చేయసాగాడు. వాడు దగ్గరకు వచ్చి చూసి జగదీశ్వరుడైన కృష్ణుడని తెలుసుకుని భయంతో, "అపరాధం చేసాను పాపాత్ముడిని వక్రబుద్ధిని." అని రకరకాలుగా దీనంగా ఏడుస్తూ కన్నీరు కార్చసాగాడు. వానిని చూసి కృష్ణుడు దయతో ఇలా అన్నాడు. "నీవు దుఃఖిచనక్కర లేదు. పూర్వజన్మల కర్మలు అనుభవించక ఎంతటి వారికి అయినా తప్పవు. వాటి ఫలితాల ఊరకే పోవు. నీవు నిమిత్రమాత్రుడివి మాత్రమే." ఇలా వాడికి నచ్చ చెప్పినా వాడు, "ఇంత పెద్ద తప్పు చేసాక ఊరకే పోదు. దైవానికి, గురువులకు, వైష్ణవులకు, ద్రోహం చేసినవాడు ధరణిపై నిలువరాదు." అని పలికి, పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదిలి వైకుంఠానికి వెళ్ళాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=18&Padyam=118 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Sun, 22 Jan 2023 16:12:27 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger