Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 17 January 2023

తథా భవేత్ - లలితమనోగత చింతనమతి తరళం... - Lalitha

ఒక్కో  పొద్దు  ఒక్కోలా... నిలకడ లేని నీరులా ఆగమాపలేని గాలిలా సాగుతూ...  సోలుతూ... కంటికానినవి - వీనుకందినవి అన్నీ నావేనని అనుకుంటుంటుండగా... ఒక్కో సద్దు ఒక్కోలా... పాటనంటివున్న నవ్వులా మోగకుండలేని మువ్వలా తుళ్ళుతూ... మోగుతూ... మోవి మీరినవి - మది మీటినవి అన్నీ నావేనని అనుకుంటుంటుండగా... ఆవరించిన వేకువ వెలుగు - మాపటి గుబులు చలువనిచ్చిన ౘందమామ - చల్లగాలి నాకే ... నావే... అనుకుంటుంటుండగా... కంటికందిన దూది మబ్బు - వెండి వెన్నెల కన్ను చూసిన చిమ్మ చీకటి - చుక్క మిణుకు నాకే ... నావే... అనుకుంటుంటుండగా... తాకకుండని మండుటెండ - వేడి గాడుపు తాకిపోయిన రంగుటాకు - రాలినాకు నాకే ... నావే... అనుకుంటుంటుండగా... కమ్ముకొచ్చిన కారుమబ్బు - వానగాలి కంపమిచ్చిన మంచు జల్లు - మించు జిల్లు నాకే ... నావే... అనుకుంటుంటుండగా... తొలకరి మొలకల తొగరు - పులకల మొగ్గ చిగురు మెలకువల ఎద ఎలుగు - మరపుకలల మది సోలుపు నాకే ... నావే... అనుకుంటుంటుండగా... ఎదురు చూడని గెలుపు - ఏడిపించిన తోలుపు మది మెచ్చిన చేఱుపు - ఎద వగచిన ఎడవు నాకే ... నావే... అన్నీ నావేనని అనుకుంటుంటుండగా... అదాటుగా... అనిపించిందోనాడు... అనుకున్నవన్నీ - అనుకోవటానికే - నావనీ అనుకున్నట్టుగా - అవేవీ - నావి కావేమోనని అనుకోనివేవో కూడా - నాకౌననీ నేనౌనన్నది అవబోదనీ నే కాదన్నది కాకుండదనీ ఔనూ-కాదుల కథ ఒకటి నాదన్నది ఆది నుంచి ఎప్పుడో నే పుట్టక మునుపే అనాది ఐన వారెవరో రాసినది ఒకటున్నదనీ ఉనికందింది నేననుకున్న ఔను రాసున్న ఔను ఒకటే అయితే అదే...  అదే - నవ్వు అయింది నేననుకోని కాదు - రాసున్న ఔనైతే - అదే అదే నొవ్వు అనిపించింది నేననుకున్న ఔను -  రాసున్న కాదైతే... అదే... అదే - నొవ్వు అనిపించింది ఔననుకున్న నవ్వూ నాదేనన్నా అదిక్కడే వుండిపోలేదు ఆ క్షణమూ తెరలి పోయింది కాదనుకున్న నొవ్వూ నాదే ఐనా అదక్కడే ఆగిపోలేదు ఆ సమయం తరలి పోయింది తెరలిన నవ్వు చిలికించె ఓ నీటిబొట్టు తరలిన నొవ్వు చిందించె ఓ ఊట తొట్టు నేనన్న ఉనికి నవ్వు-నొవ్వుల జంటకి ఆనవాలైనది నాదన్న మనికి నవ్వు-నొవ్వులంటక తామరాకైనది *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** చిన్నప్పట్నుంచి పుస్తకాల్లో చదివినప్పుడో, ఎవరి దగ్గరో విన్నపుడో  - తామరాకు మీద నీటిబొట్టులా వుండడమనేది - అదేదో గొప్ప విషయమనిపించేది. కానీ - ఇన్ని రోజులకి - రోజులంటే రోజులు కాదు కానీ... ఇన్నేళ్లకి నాకు అర్థమైంది ఏంటంటే - తామరాకు మీది నీటిబొట్టులా వుండడం అంత గొప్పేమీ కాదని. ఉంటే గింటే తామరాకు లాగే వుండాలని. అసలు తామరాకు గొప్పేంటో చెప్పెయ్యాలి నేను. తామరాకుకున్న ఒక మంచి లక్షణం ఏమిటీ అంటే - ఆ ఆకు superhydrophobic. అంటే రోజుకి ఇరవై నాలుగ్గంటలూ, ఏడాదికి మూడొందలరవయ్యైదు రోజులూ నీళ్ళలోనే తేలుతూ, ఊగుతూ, తూలుతూ వున్నా కూడా ఏ మాత్రం ఆ నీటి మీద అమాంతం ఆసాంతం ఆపేక్ష పెంచుకోదన్నమాట. పైగా తన మీద ఏ నీటిచుక్కో అదాటుగా పడితే దాన్నీ ఊరికే విదిలించదు. తన మేను మీద దుమ్మేదన్నా వుంటే ఆ నీటిచుక్కకి బొట్టుగా పెట్టి మరీ దులపరించుకుంటుంది. తామరాకు ఇంత తెలివిగా తన మీద పడ్డ నీటినీ, దుమ్మునీ వదిలించుకుని నిమ్మకు నీరెత్తినట్టు నిబ్బరంగా వుంటుందనే బహు ముచ్చటపడి ఆదిశంకరాచార్యులు తన భజగోవింద శ్లోకంలో తామారాకుని గురించి "నళినీ దళ గత జలమతి తరళం" అని ముచ్చటించారు. బావుంది కదా ... విలక్షణ నళినీ దళ లక్షణమ్! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇప్పటికి ఏడాది క్రితం -  నిరుడు (అంటే 2022) జనవరి చివర్లో నేను చాలా చిరాగ్గా వున్నాను. అసలే ... మా అమ్మ చెప్పినట్టు విసుగు ముందు పుట్టి తర్వాత నేను పుట్టానేమో - దాదాపు గత ఆరేళ్లుగా - నేను చేస్తున్న పనులు నా మీద నాకే తెగ విసుగు, చిరాకు తెప్పిస్తున్నాయి. మౌనముత్తమ భాషణమ్  - అన్న ఉత్తమమైన సూక్తిని ఉత్త-ఉక్తిగా కొట్టి పారేసి కావల్సినవీ-అక్కర్లేనివీ మాట్లాడడం చేస్తూ "అహం-రైట్" అనేసుకుంటూ, అవతలి వాళ్ళని స్టెప్పిన్గాన్దటోస్ చేసేస్తూ - మహా ఇబ్బంది పెట్టేస్తున్న అహం-కారపు రోజుల నుంచి ఎప్పుడెప్పుడు బయట పడదామా అని మహా-ఆతృతగా ఎదురు చూస్తున్న రోజులవి. సరిగ్గా అప్పుడే - వాట్సాప్‌లో అపర్ణ నాకెవరో రాసిన మాటలు కొన్ని పంపించింది. ఇదిగో - ఈ కిందున్నాయే .... ఇంగిలీషు భాషలో ... అవే ! I am beginning to learn to love the  sound of my feet walking away from  things not meant for me. ఏ బంగారుతల్లో-తండ్రో - ఎవర్రాశారో కానీ  ఆ పై మాటలు - "లలితా! చూడు ఇవేవో నువ్వు కావాలనుకున్న మాటల్లా ఉన్నాయి" అంటూ అపర్ణ నాకు పంపగానే -  నా వరకు రాగానే ఇవి నావేననిపించాయి. అనుకున్నకొద్దీ - "ఇవి నాకోసం రాసినవే - ఈ రోజు నుంచి నావే" అనుకుని own చేసుకుని - రోజూ  చదువుకుని నా తల మీద నేనే మొట్టుకుని గుర్తుపెట్టుకుని - నిత్యపారాయణ చేసుకోవలసిన అనునిత్యసత్యాలనిపించాయి. ఆ మంచి మాటలతో పాటే నాకొక తామరాకు బొమ్మ కూడా పంపించింది అపర్ణ. దాంతో పాటే తామరాకు మీద  నీళ్ళు జల్లుతూ అవి జారిపోతుండగా తీసిన ఒక బుల్లి వీడియో కూడా పంపించింది. అంతే... అస్తవ్యస్తంగా వున్న నా మస్తకానికో తిన్ననైన తెన్ను దొరికినట్టయింది. ఇది కదా -  ఇన్నాళ్ళూ నాకు తెలియకుండా వున్న విశేషమైన విషయం అనిపించింది. అప్పుడనుకున్నా... నేనిక తామరాకు నేర్పిన పాఠాన్ని నేర్చుకోవాలని. అలా అనుకున్న దగ్గర్నుంచి కొంచెం కొంచెంగా మాటకి అదుపూ, మనసుకి మరపూ నేర్పుకుంటున్నా. నెమ్మదిగానే అయినా అవి రెండూ నేననుకున్న దార్లోకి వస్తున్నాయి. అందుకే - అలా నేను నేర్చుకోవడం, నాకు నేర్పుకోవడం మొదలుపెట్టిన ఏడాదికి - ఈ నాటికి ధైర్యంగా లలితోవాచ రాసుకుంటున్నా... యథా - నళినీ దళ గత జలమతి తరళం తథా భవేత్ - లలితమనోగత చింతనమతి తరళం! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నా మాటకి పాట తోడు తెచ్చుకోకపోతే నా బ్లాగ్రాత పూర్తయినట్టనిపించదు నాకు. నా మాటకి దగ్గరగా అనిపిస్తూ - అలా అని మరీ పాఠం చెప్తున్నట్టు కాకుండా - చెవులకి హుషారిచ్చే పాటలా అనిపిస్తూ - కళ్ళకి చలాకీగా కనిపించే పాటొహటి - నాకిష్టమైనదొహటి - యూట్యూబు నుంచి పట్టుకొచ్చుకున్నా. దేవానంద్ (నట) - రఫీ (గాయక) - సాహిర్ లూధియాన్వి (రచన) జయదేవ్ (సంగీత) - విశిష్టచతుష్టయభరితమైన ఈ పాటని రాసి పెట్టుకున్నా. పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=ivBhqDtJeiw దేవానంద్ సిగరొత్తులు వూదేస్తూ - హర్ ఫిక్‌ర్ కో ధుయే మే ఉడా... - అంటూ చివర్లో భలేగా "ఉడా"యిస్తూ - చిత్తంలో వున్న చింతలన్నిటినీ పొగలో ఉడాయించేలా చెయ్యడం చూడ్డానికి భలేగా వుంది. అక్కడక్కడా నీటి అద్దంలో మెరిసిన సాధనా మురిపించింది. "హమ్ దోనో" సినిమాలోదట ఈ పాట. ఈ వారం తప్పకుండా ఈ సినిమా చూడాలి అనుకుంటున్నా. యూట్యూబ్‌లో వెతుక్కోవాలి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** మై జిందగీ కా సాథ్ - నిభాతా చలా గయా హర్ ఫిక్‌ర్ కో ధుయే మే - ఉడాతా చలా గయా హర్ ఫిక్‌ర్ కో ధుయే మే ఉడా... బర్‌బాదియోం కా సోగ్  - మనానా ఫుజూల్ థా బర్‌బాదియోం కా సోగ్ - మనానా ఫుజూల్ థా మనానా ఫుజూల్ థా మనానా ఫుజూల్ థా బర్‌బాదియోం కా జష్‌న్ - మనాతా చలా గయా బర్‌బాదియోం కా జష్‌న్ - మనాతా చలా గయా హర్ ఫిక్‌ర్ కో ధుయే మే ఉడా... జో మిల్ గయా - ఉసీ కో - ముకద్దర్ సమఝ్ లియా జో మిల్ గయా - ఉసీ కో - ముకద్దర్ సమఝ్ లియా ముకద్దర్ సమఝ్ లియా ముకద్దర్ సమఝ్ లియా జో ఖో గయా - మై ఉస్‌కో - భులాతా చలా గయా జో ఖో గయా - మై ఉస్‌కో - భులాతా చలా గయా హర్ ఫిక్‌ర్ కో ధుయే మే ఉడా... ఘమ్ ఔర్ ఖుషీ మే ఫర్క్ - న మెహ్‌సూస్ హో జహా ఘమ్ ఔర్ ఖుషీ మే ఫర్క్ - న మెహ్‌సూస్ హో జహా న మెహ్‌సూస్ హో జహా న మెహ్‌సూస్ హో జహా మై దిల్  కో - ఉస్ మకామ్ పే - లాతా చలా గయా మై దిల్  కో - ఉస్ మకామ్ పే - లాతా చలా గయా మై జిందగీ కా సాథ్ - నిభాతా చలా గయా హర్ ఫిక్‌ర్ కో ధుయే మే - ఉడాతా చలా గయా *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** "భవేత్ - లలితమనోగత చింతనమతి తరళం... " అన్న నా మాట పదికాలాలపాటు పదిలంగా నిలబెట్టుకోవాలని నాకు నేనే చెప్పుకుంటూ... ~పాటల భైరవి
Post Date: Tue, 17 Jan 2023 07:36:16 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger