https://youtu.be/Go-mAJpH6_w భజగోవిందం భజగోవిందం గోవిందంభజ మూఢమతే అబ్బరాన అబ్బాయి పుడితే గడ్డపారతో ముక్కుకుట్టిస్తానంది. ఇదొక నానుడి. చెవులూ ముక్కులూ కుట్టించడం తెనుగునాట ఆచారమే! ఆడపిల్లలికి చెవులూ, ఒక ముక్కుకాని, రెండు ముక్కులూ గాని కుట్టించడం, మగపిల్లలికి చెవులు కుట్టించడం ఆనవాయితీ. చెవులకి చివర్లని తమ్మెలు అంటారు. చెవులకి పెట్టుకునేవాటిని తమ్మెటలు,నాగ స్వరాలు, దుద్దులు అనే పేర్లతో పిలుస్తారు.మరి కొన్ని ఆభరణాలూ ఉండచ్చు. ఆడవారు ముక్కులికి పెట్టుకునేవాటిని బేసరి, నత్తు మొదలైన పేర్లతో పిలుస్తారు. చెవులకి ముక్కులకి పెట్టుకునే ఆభరణాలలో వజ్రాలు, ముత్యాలూ పొదిగించేవారు. మగవారు పెట్టుకునేవాటిని కుండలాలంటారు. ''కుప్పించి ఎగసిన ''కుండలంబుల'' కాంతి గగన భాగమ్మెల్లగప్పికొనగ'' ఈ ముక్కు,చెవులూ కుట్టించడంకి కూడా ఒక పద్ధతి ఉండేది.ఇంటి కంసాలికి ముక్కు, చెవులూ కుట్టాలని ఫలానా రోజు ముహుర్తమని చెబితే, ఆ రోజుకు కావలసిన సరంజామా సిద్ధం చేసుకునేవాడు. కలిగినవారు బంగారపు కాడలు చుట్టిస్తే, లేనివారు వెండి, రాగి కాడలు చుట్టించేవారు. ముహుర్తపు రోజు ధాన్యం పోసి ఆ ధాన్యం కుప్పమీద, ఒక కొత్త వస్త్రం పరచి, పసుపు రాసి, బొట్టు పెట్టిన పీట వేసి చెవులూ, ముక్కు కుట్టించుకునే వారికి తలంటి కొత్తబట్టలు కట్టి పీట మీద కూచో బెడితే, ముహూర్త సమయానికి బ్రహ్మం గారు తను చేసితెచ్చిన కాడలు కుట్టేవాడు. ఇవి బహుతేలిగా నూ ఉండేవి. చెవి,ముక్కు కుట్టే ముందు నవాసారం కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ నీరు ఒక చుక్క కుట్టవలసిన చోట వేసి సూదిగా ఉన్న కాడ ఒక్క పోటుతో కుట్టేసి, చుట్టేసేవాడు, మరో సారి నవాసారపు నీటి చుక్క కుట్టు మీద వేసేవాడు. ఆ తరవాత అతనికి మరొక పీట వేసి కూచోబెట్టి, స్వయం పాకం, కొత్తబట్టలు,దక్షణ, తాంబూలము చెవులు కుట్టించుకున్నవారి చేత ఇప్పించి సత్కరించేవారు. ఆ తరవాతతను అక్కడపోసిన ధాన్యపు కుప్పనుకూడా తీసుకువెళ్ళేవాడు. ఇలా కాలం జరుగుతున్నరోజుల్లో మాట! ఒక లేనింటి పడుచు లేనింటి కుర్రాణ్ణి కట్టుకుంది. ఈ అమ్మాయొచ్చిన వేళా విశేషమో , ఆ కుర్రాడి అదృష్టమో అతను పట్టినదల్లా బంగారమయింది. అతను, ఆమె రాక తన అభివృద్ధికి కారణమని అనుకున్నాడు. లోకం అంతా అలాగే అన్నారు. ఈ పడుచు తను పుట్టిన చోటు, స్థితి మరచింది. తను చేపట్టిన చోట, తనొచ్చినప్పటి పరిస్థితీ మరచింది, కాలంలో. గొప్పలు చెప్పుకోవడం,ధన గర్వం, ఏమైనా చేయగలమనే యౌవన గర్వం పెరిగాయి. అన్నీ వున్నాగాని, చింత ఉండిపోయింది, సంతానం లేదని. పూజలు వ్రతాలు, మొక్కులు సాగాయి. ఏదేవతో కరుణించింది, కడుపు పండింది. అబ్బరాన ఒక అబ్బాయి పుట్టేడు.లేక లేక కలిగిన సంతానం, మొగ పిల్లవాడు, దానితో ఆ పడుచుకి మన్నూ మిన్నూ కానటంలేదు. గర్వం తలకెక్కిపోయింది. అవి ధన, యౌవన గర్వాలు జమిలిగా బాధపెడుతున్నాయా పడుచుని. . పిల్లాడికి మూడో ఏడొచ్చిoది, చెవులు కుట్టించవూ అడిగిందో వరస వదిన, పడుచుని. బ్రహ్మ గారి చేత ముహుర్తం పెట్టించాలి, బ్రహ్మం గారికి కబురు పెట్టాలి, బంగారపు గడ్డపార చేయించాలి, ముక్కు కుట్టించడానికి, అంది పడుచు అతిశయంగా. ఇది విన్నామె నిర్ఘాంతపోయి, బంగారంతో గడ్డపార చేయిస్తావా? మగపిల్లాడికి ముక్కు కుట్టిస్తావా? బంగారపు గడ్డపారతో? అడిగింది, తనకేం తెలియనట్టు. దానికీ పడుచు అవును మాకా లేకలేక అబ్బరంగా పుట్టిన మగపిల్లాడు, బంగారపు గడ్డపార చేయించి, ముక్కు కుట్టిస్తానంది, మళ్ళీ. ఇది విన్నామె ఈ పడుచుతో మాటాడితే పరువు దక్కదనుకుని చాలించుకుంది.ఎందుకంటే ఆమె మాటలలో తెలియనితనమే కాక ధనగర్వం వినిపించినందుకు. ఏ కాలంలోనైనా గడ్డపారతో ఎవరూ ముక్కు కుట్టించరు. మగపిల్లవాడికి ముక్కు కుట్టించరు, దానికోసం బంగారం తో గడ్డపార చేయించరెవరూ! ఈ వార్త ఆ వాడలో పాకిపోయింది.అంతా విని నవ్వుకున్నారు, ఆమె గర్వానికీ,తెలియనితనానికీ. ఎవరూ ఆమెకు ఇలా చేయరని చెప్పలేదు. పడుచు బ్రహ్మంగారిని పిలిపించి విషయం చెప్పింది, విన్న బ్రహ్మంగారు ఒక్క సారి నిర్ఘాంతపోయి, తమాయించుకుని, అమ్మా! మగపిల్లవాడికి ముక్కు కుట్టించడం మన ఆచారం కాదు, ఇక బంగారం తో గడ్డపార చేయాలంటే మణుగు బంగారం కావాలి,మీరు బంగారం ఇస్తే నేను గడ్డపార తయారు చేస్తా! అంతేగాక ఆ గడ్డపార ముక్కు కుట్టడానికి పనికిరాదు అని చెప్పేసేడు. విన్న పడుచు విసవిసలాడిందిగాని నిజం తెలుసుకుని సిగ్గు పడింది.
Post Date: Sat, 21 Jan 2023 03:44:38 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 21 Jan 2023 03:44:38 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment