రంగమార్తాండ సినిమా. ప్రతి సినిమా చూసినట్టే " రంగమార్తాండ" సినిమా చూస్తున్నంత సేపూ "ఇది సినిమా అంతే...దీని కథింతే" అనుకుని చూశా కూడా. సినిమాలో అందరూ బాగా నటించారు కూడా. అయినా కూడా ఎందుకో ఒక మంచి సినిమా చూసినట్టనిపించలేదు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** అన్నీ బావుంటే ఇబ్బందేంటీ అంటే...నేనూ అదే ఆలోచిస్తున్నా. "రంగమార్తాండ" సినిమాకి మూలం మరాఠీ సినిమా "నటసామ్రాట్". మరాఠీ సినిమాకి మూలం మరాఠీ స్టేజ్ నాటకం "నటసామ్రాట్". దానికి స్ఫూర్తి షేక్స్పియర్ రాసిన "కింగ్ లియర్" డ్రామా - అట. ముందు షేక్స్పియర్ దగ్గర మొదలెడతా. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** షేక్స్పియర్ డ్రామాలో కింగ్ లియర్‌కి ముగ్గురు కూతుళ్ళు - వాళ్ళల్లో ఇద్దరికి తన రాజ్యం ఇచ్చేస్తాడు. మూడో కూతురు తనకెంత ప్రీయమైనదైనా ఆ పిల్ల తన మీద ఇష్టం మాటల్లో చెప్పలేదని అలిగి దూరం చేసుకుంటాడు. చివరికి ఆ చిన్నకూతురు పోయిందన్న బాధతో తనూ చనిపోతాడు. నాకస్సలు ఈ కింగ్ లియర్ డ్రామా చాలా dark tragedy అని అప్పుడెప్పుడో డిగ్రీ చదివే రోజుల్లో మొదటిసారి చదివినప్పుడే పేజీలు skip చేసుకుంటూ చదివాను. ఆ తర్వాత ఆ కథనే ఎప్పుడూ తల్చుకోలేదు. అది "నటసామ్రాట్" దాకా వచ్చేసరికి కింగ్ లియర్ కాస్తా ఒక ప్రముఖ రంగస్థల నటుడయ్యాడు. కింగ్ లియర్ పంచిన రాజ్యమేమో ఇల్లూ, ఆస్తీ, నగలూ అయ్యాయి. రాజ్యం దక్కిన ఇద్దరు కూతుళ్ళు కాస్తా ఒక కొడుకూ, ఒక కూతురూ అయారు. తండ్రి కోపానికి గురైన మూడో కూతురు నటసామ్రాట్ సర్దార్ అని పిలుచుకునే ప్రియమైన భార్య అయింది. అక్కడి రాజ్యం వదులుకున్న కింగ్ లియర్ ఇక్కడి నాటక రంగస్థలం దాటి నిజజీవిత సమరం లోకి దిగిన నటసామ్రాట్ అయాడు. అంతవరకు బాగానే వున్నట్టనిపించింది. భాష పూర్తిగా అర్థం కాకపోయినా మరాఠీ సినిమా "నటసామ్రాట్" కూడా చూశాన్నేను. ఆ సినిమాలో కథ నాటకరంగంలో జీవించిన నటుడిగా, జీవితంలో నటించలేని మనిషిగా నానాపటేకర్ సటిల్ (subtle) నటన నాకు నచ్చింది. భాష అర్థమయుంటే ఎంత నచ్చిందో ఇంకొంచెం గట్టిగా అనుకోగలనేమో అనిపించింది. పైగా ఆ సినిమాకి వాళ్ళు పెట్టుకున్న tag line - "నటసామ్రాట్ - అసా నట హోణే నాహీ" (నటసామ్రాట్టునే కానీ ఇలాంటి అసమర్థ నటుణ్ణి అయుండకూడదు అనేమో!) ఇప్పుడు రంగమార్తాండ చూస్తుంటే అటు - న డ్రామా కా, న సినిమా కా...- అయిందా అన్నట్టనిపించింది. "నటసామ్రాట్"ని దాటి "రంగమార్తాండ" దాకా వచ్చిన కథ కాస్తా - నాటకరంగం కూడా దాటి - సినిమా, తెలుగు భాష - అంటూ ఎక్కడెక్కడో తిరిగినట్టనిపించింది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** మొట్టమొదటగా... "రంగమార్తాండ" సినిమా ముందు పేర్లు పడేటప్పుడు చూపించిన రంగమార్తాండుల్లో ఫోటోలు అన్నీ కూడా చాలా వరకు సినిమా వాళ్ళవే. సినిమా వాళ్ళవి వేస్తే వేశారు కానీ ఒక్కొక్కళ్ళవి డబుల్సూ, త్రిపుల్సూ, మల్టిపుల్సూ అన్నన్ని ఫోటోలు వేసేసే బదులు - మా డీజే టిల్లు సిద్దూదీ, అల్లరి నరేషుదీ, వాళ్ళన్న ఆర్యన్రాజేషుదీ, ఆ పక్కనే ఓ చిన్న స్టాంపు సైజులోనైనా జాతిరత్నం నవీన్ పోలిశెట్టిదీ, కిరణ్ అబ్బవరానిదీ, విష్వక్సేనుడిదీ - ఇంకా ఇలాంటి పాత్రలో జీవించేవాళ్ళో, జీవించడానికి పాత్రలు వేసేవాళ్ళో బోళ్డు మంది ఫొటోలు వేస్తే వాళ్ళూ మిగిలిన నటమార్తాండులతో ఒక ఫ్రేములో కుదురుకున్నామని మురిసిపోయేవారేమో! అవునూ! పాత్రల్లో జీవించి పాత్రలకి జీవం పోసి పాత్రపాత్రకీ పుట్టి, పాత్రపాత్రకీ నలిగి, పాత్రపాత్రకీ మలిగినవాళ్ళందరూ మగవాళ్ళేనా, అందరూ రంగమార్తాండులేనా? అలనాటి-కన్నాంబాది-ఈకాలపు-రష్మికాపర్యంత-రంగమార్తాండాంబలు లేరా? *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నాక స్సలు నచ్చనిది - ఈ సినిమాకి కింద వున్న tag line - "మన అమ్మానాన్నల కథ". అదెందుకో ఇంకొంచెం ముందుకెళ్ళాక చెప్తా. సినిమా అంతా చూశాక "ఇది అమ్మానాన్నల కథ ఎందుకయిందీ? నాటకరంగానికీ, నిజజీవితానికీ అన్వయమూ, సమన్వయమూ కుదుర్చుకోలేని ఒక మామూలు మనిషి కథ అయితేనూ...?!" అనిపించింది. తడబడుతూ తీసిన కథకి తల్లిదండ్రుల సెంటిమెంటు మెరుపులంటించి అమ్ముకుందామనుకున్న ఒక తెలివైన దర్శకుడి తాపత్రయం కనిపించింది. ఈ సినిమా పేరు "రంగమార్తాండ - ఒక అసమర్థ నటుడి కథ" అయుంటే apt గా అనిపించేదేమో! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** సినిమాలో నటించిన అందరి కన్నా ముందు రాజుగారు అనిపించుకున్న మిసెస్ రాఘవరావు గురించి. రాజుగారు రమ్యకృష్ణది తల్లి పాత్రే. కానీ సినిమా మొత్తంలో నటించిన ఆడవారందరిలో కొట్టొచ్చినట్టు కనిపించిన పదహారణాల తెలుగుదనం ఆమెది. ఆమె సౌందర్యప్రభ ముందు మిగిలినవన్నీ దివిటీలే. కాకపోతే సినిమా మొదట్నుంచీ చివరి దాకా పడుక్కున్నప్పుడు కూడా పట్టుచీరలే కట్టేసుకుంది. అది మాత్రం నాకు నచ్చేసింది. నవ్వు మొహం లేకపోయినా నలిగిపోయిన పుల్లేటికుఱ్ఱు జరీచీరల్లో ఈసురోమని కాకుండా ఎంచగ్గా పట్టుచీరల్లో, మొహాన ఇంత పెద్ద కుంకం బొట్టుతో నయనానందకరంగా భాసిల్లింది. నాకనిపించిందేంటంటే ఈవిడ ఈ సినిమాలో నటిస్తున్నంతసేపూ రంగమార్తాండ-రాఘవరావు స్థానంలో "ఇలాంటి సినిమా తీస్తున్నాడేంట్రా మా ఆయనా?!" అనుకుంటూ నిజభర్తని ఊహించుకుందేమో అని. అందుకే ఆ అసహాయతా, అసహనాన్నీ అవలీలగా, అలవోకగా అభినయించేసింది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇక పోతే రంగమార్తాండ రాఘవరావు పాత్రధారి ప్రకాష్‌రాజ్‌కి ఆయన ధరించిన పాత్ర కొట్టిన పిండి, దంచిన పప్పు, పిండిన బట్ట, నమిలిన పిప్పి, వగైరా వగైరా. తనకిచ్చిన పాత్రోచితంగా తాగి తూగిపోయాడు, తూగి మోగిపోయాడు, మోగి ఊగిపోయాడు - మొత్తానికి ఆ యొక్క పాతర్లో రకరకాలుగా ఒదిగిపోయాడు, ఒరిగిపోయాడు. ఈయనకి సినిమా మొదట్లో సన్మానం జరిగినప్పుడు ఉపన్యాసం ఇస్తూ "నేను రెండు పాత్రలకి న్యాయం చేయలేకపోయాను" అంటూ దానికి కొనసాగింపుగా "మా రాజుగారు, నా వజ్రాల్లాంటి పిల్లలూ" అంటాడు కానీ తను న్యాయం చేయలేకపోయిన రెండు పాత్రలూ ఆ రాజుగారికి భర్తా, ఆ వజ్రాలకి తండ్రీ అని చెప్పడం మర్చిపోయాడేమో అనిపించింది. నాకైతే మాత్రం ఆ ఉపన్యాసం ఉప్పులేనిఉత్తపప్పులా ౘప్పగా అనిపించింది. మొట్టమొదటిసారి కథ లాజిక్కు తప్పిందనిపించడం ఇక్కడే మొదలయ్యింది నాకు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** అసలీ రంగమార్తాండ రాఘవరావు పాత్ర డిజైనే నాకు సరిగ్గా అనిపించలేదు. అన్నట్టూ... నాటకాల్లో కోట్లు సంపాదించడమేంటి? రాజుగారు రమ్యకృష్ణని పట్టుచీరల్లో అందంగా - ఒక మంచి ఇంట్లో చూపించాలంటే రాఘవరావుకి నాటకాల్లో కోట్లు రావడం సబబే! ఏదో కథకి తగ్గ లాజిక్కు అనుకుని సర్దేసుకున్నా. చిన్నప్పుడు "నా పుట్టలో వేలెడితే కుట్టనా?" అని చీమ మాట్లాడిందీ అంటే నమ్మలేదూ - ఇదీ అలాగే అనుకున్నా! నాటకం నుంచి రిటైర్ అవ్వడమేంటి? ఇదీ సరే! నాటకమే వృత్తి అనుకున్నవాడికి నాటకాలాడ్డం మానేయడం వృత్తివిరమణ. కథకి తగ్గ లాజిక్కే. బానే వుంది. ' వాళ్ళ పాటికి వాళ్ళేవో ఉద్యోగాలు చేసుకుంటున్న కొడుకూ-కోడళ్ళని పిలిచి కోడలు పేరు మీద ఆస్తి రాయడమేంటి? నాకొద్దు మొఱ్ఱో అంటున్న కూతురికి తన భార్య నగలు ఇచ్చేయడమేంటి?' అనిపించినా పోన్లే ఇస్తే ఇచ్చాడు, ఈ కథలో ఇలాగే చెయ్యాలేమో - అలా అయితే కథ లాజిక్కు ఓకే అనుకున్నా. తన పాప బాగా చదువుకోవాలని కోడలు కష్టపడి సంపాదించుకున్న ఇంటర్నేషనల్ స్కూల్లో చిందులు తొక్కి తన మనవరాలిని బళ్ళోంచి తీసుకొచ్చేయడమేంటి? పగలూ రాత్రీ లేకుండా తాగితందనాలు తొక్కడమేంటి? ఇవన్నీ కూడా ఓకే, ఓకేనే! తెలుగు సినిమా షూటింగ్ సీనులో తెలుగు డైలాగు చెప్పలేక ఆ అమెరికా-రిటర్న్డ్ తెలుగబ్బాయి తెలుగు నాటకాలన్నీ చాల "లౌడ్" గా వుంటాయీ అన్నాడే అనుకో ... దానికి బదులుగా రాఘవరావు ఏం చేశాడు? హామ్లెట్ తనలో తను మాట్లాడుకుంటున్నట్టుండే "To be or not to be" అనే స్వగతాన్ని (soliloquy ని) రాఘవరావు అరచి చెప్పాడు. "ఆయ్ - హన్నా!... నువ్వేమన్నా షేక్స్పియర్ డ్రామాలో హామ్లెట్ గట్టిగా అరవలేదని చెప్పగలవా?" అనంటాrరా? ఆ అరవడం ఈ కథకి నప్పే లాజిక్కు అనుకోమంటే సరే, సరే! ఈ సినిమాకి పెట్టిన tag line వల్ల సినిమా చూసినవాళ్ళూ, చూడనివాళ్ళూ కూడా అమ్మానాన్నల్ని పిల్లలు సరిగ్గా చూడట్లేదో అని గగ్గోలు పెట్టడమే! నిజ్జంగా అమ్మా-నాన్నలని పిల్లలు అష్టకష్టాలు పెట్టారని చూపించదలుచుకుంటే లాజిక్కు మార్చాలి కదా?! అపార్టుమెంట్లు కొనుక్కుని ఎదురెదురుగా వుందామంటే అత్తామామలు మాట వినట్లేదని, అనవసరంగా ఆస్తి తనకిచ్చి తనే వాళ్ళని వేరు చేస్తున్నాననిపించేట్లు చేస్తున్నారని కోడలు కళ్ళనీళ్ళు పెట్టుకుని బాధ పడిపోతే ఎలా? కథ లాజిక్కు అడ్డంగా తన్నేసింది - అనసూయా - ఆదర్శ్ బాలకృష్ణల అటూ-ఇటూ కాని అయోమయపు ప్రవర్తన వల్ల. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇందులో ఇంకో పెద్ద జంట... రాఘవురావు స్నేహితుడు చక్రపాణి, వాళ్ళ ఆవిడ సుభద్ర / సుబ్బు. ఈ చక్రపాణినీ, రాఘవరావునీ చూస్తే నాటకాలాడేవాళ్ళు తాగడానికి పగలూ, రాత్రీ లేకుండా తాగుతూనే వుంటారనీ, చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు పట్టించుకోకుండా గొంతెత్తి సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాటిసీను పద్యాలు పాడుతూ వుంటారని అనుకోవాలా? అయినా చక్రపాణికి నిద్రమాత్రలు గ్లాసు నీళ్ళలో కలిపి పానకం తాగించినట్టు తాగించేస్తే ఆ హాస్పిటల్లో డాక్టర్లు ఆ రెండో రోజు తాగించిన రాఘవరావుని పట్టుకుని పోలీసు కేసు పెట్టి తన్నించరా? ఆ చక్రపాణి మాత్రం.... ఆ నీళ్ళు ఎత్తిన గ్లాసు దించకుండా గటగటా తాగేసి కడుపులో మంటతో విలవిల్లాడకుండా "బ్రేవ్" మని త్రేన్చి పడుకుండి పోతాడా? మరీ...ఉండబట్టలేక ఊరికే అడుగుతున్నా! అంతే! అంతే! మూలకథ నుంచి ఎలాగూ చాలా వరకు పక్కకొచ్చిన కథ ఈనాటి వాతావరణానికి సరిపోని ఇలాంటి సంఘటనలని మార్చి వుంటే ఇంకొంచెం బావుండేదేమో! అన్నిటికీ మించి ఇందులో చక్రపాణిగా బ్రహ్మానందం బ్రహ్మాండంగా నటించాడు అనుకోమంటే ఈ ఒక్కసారికి అనుకుంటా గానీ ఇంకెప్పుడూ ఇలా చేయకపోతేనే బావుండుననుకుంటా. ఇహ పోతే చక్రపాణి భార్య సుబ్బు - జయలలిత. ఎప్పుడు ఏ సినిమాలో ఈవిణ్ణి చూసినా "గుంటూరు బ్రాడీపేట రెండో లైన్లో వీళ్ళింటి ముందు నుంచే వెళ్ళేవాళ్ళం కదా" అని ఒకసారి అనుకోవడమే గుర్తు. ఆ గుంటూరభిమానం తోనే ఇక్కడింకోసారి తలుచుకుంటున్నా - అంతకు మించి ఇంకేమీ లేదు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఈ సినిమాలో నాకు భలే బాగా చేశారు అనిపించిన ఇద్దరు - రాఘవరావు కూతురు బంగారం శివాత్మిక, మిస్టర్ బంగారం రాహుల్ షిప్లిగంజ్. వీళ్లిద్దరి నటన ఒక pleasant surprise నాకు. వాళ్ళతో పాటు అనసూయ కూడా బాగా చేసింది. ఆనందం కలిగినప్పుడు నిండుసభలో గంతులేసుకుంటూ "ఐ లవ్యూ నాన్నా!" అని అరచి చెప్పినా, ఆవేశం వచ్చినప్పుడు ముందూవెనకా చూసుకోకుండా "రాహుల్ డబ్బులెందుకు తీశావు నాన్నా, చీప్‌గా" అని చెప్పింది వినిపించుకోకుండా అరిచినా - తనున్న ప్రతి ఫ్రేంలో తన మెరుపు తెలిసేలా చమక్కుమని మెరిసిన తళుకు తార - శివాత్మిక. బోల్దంత సహజంగా, హాయిగా "నిజంగా ఈ పిల్ల ఇలాగే ఉంటుందేమో" అనిపించేంతలా భలే నటించింది. అక్కడక్కడ కొంచెం ఎక్కువ చేసిందేమో అనిపించినా అది కూడా చెప్పి చేయించినవారి చిట్టాలో వేయాల్సిందే తప్ప చేసిన శివాత్మిక ఖాతాలో కాదు. రాహుల్ షిప్లిగంజ్ కూడా అంతే. ఎప్పుడూ ఇలాగే వుంటాడేమో అనిపించేలా మహ-సులువుగా అస్సలు నటిస్తున్నట్టే అనిపించనట్టు నటించినట్టనిపించాడు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇక పాటలు. నేను ఇంతకుముందు సినిమాల్లోని ఇళయరాజా పాటలే వింటా. ఇందులోవి ఆయన ఖాతా లోంచి తీసేస్తా. ఏదో కొంచెం బావుందేమో అనిపించబోయిన "దమిడి సేమంతీ!" పాట అసలు నాటకాల్లో పద్యాలు పాడిన రాఘవరావు పాడితే కంచు మోగినట్లు ఎంత ఖంగుమనాలీ? అబ్బే! పాట అదేదో తేలిక గొంతులో తేలిపోయి మబ్బుగొంతులో ఉరమాల్సిన పాట నీటి బుడగలో పేలినట్టయ్యింది. కొంచెం గొంతు లావు చేసుకుని మనో పాడుంటే ఎంత బావుండేదో ఈ పాట! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఎంత రాస్తే ఏం గానీ... ఏ మాటకామాట చెప్పుకోవాలీ అంటే - ఈ మాత్రం సినిమాలు కూడా ఈ మధ్య రావట్లేదు. పైగా రమ్యకృష్ణ వుంది అంజెప్పి కదలకుండా ఈ సినిమా చూశాం. ఇక ముందూ ఇలాంటివే ఏవో చూస్తాం. అంతే తప్ప రాజుగారి కొత్త బట్టల్లా కథకే అతకని లాజిక్కేదో వెదుక్కుని బావుందని మాత్రం చెప్పలేను. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ~ సినీ-మా-లక్ష్మి
Post Date: Mon, 10 Apr 2023 04:51:10 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 10 Apr 2023 04:51:10 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment