Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 15 May 2023

చోప్టా నుండి ఊఖీమఠ్ - స్వాతి పంతుల

తుం గనాథ్ ట్రెక్కింగ్ పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకల్లా కిందకు చేరుకున్నాం. ఇలా రాయడం అయితే ఒక్క వాక్యంలో అయిపోయింది గాని దిగడానికి కూడా ఓ రెండున్నర గంటల కాలం పట్టింది సుమారుగా. పడిపోవడం వల్లనేమో ఒళ్ళు కాస్త పట్టేసినట్టు అయిపోయింది. ఉదయం నుండి జరిగినవన్నీ తలుచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ మెల్లగా దిగాం. నుదుటి మీద తగిలిన గాయం నుండి రక్తం కారుతూనే ఉంది. దారిలో కనిపించిన వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఏమైందని. చాలా మంచు ఉందా అని అడిగేరు. చెప్పాలంటే లేదు. అయినా పడిపోయాను. మరి ఎలా అయింది అంటే ఏం చెప్పను? ఆ క్షణం అలా జరిగింది. అంతే. ఇదంతా మార్చ్ 13న జరిగింది ఇప్పుడు నేను రాస్తున్నది ఒక నెల పోయాక. ఇప్పుడు కూడా నా నుదుటిని తడుముకుంటున్నాను. ఆ గాయం మచ్చ చిన్నగా ఇంకా ఉంది. కొన్ని అనుభవాలు ఏవో అనుభూతుల్ని ఇస్తాయి. ఆ అనుభూతులు ఆ క్షణానికి లేదా మరికొద్ది సేపటికి మాత్రం మనతో ఉంటాయి. కానీ వాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో ఉండిపోతాయి. ఆ క్షణాలు, ఆ భయాలు, ఆ సంతోషం, బాధ, ఆ తృప్తి అవన్నీ అచ్చంగా మన సొంతం. అదే క్షణంలో అక్కడే మనతోపాటు ఉన్నవారికి అవి కలగకపోవచ్చు కదా! దారిలో బుగ్యల్ (గడ్డి మైదానం) లోకి వెళ్లి ఫోటోలు తీసుకున్నాం. వీలైనంత త్వరగా వెళ్లి జీప్ దొరికితే తిరిగి ఊఖీమఠ్ చేరుకోవాలి అనుకున్నాం. కానీ ఇద్దరికీ ఒకటే ఆలోచన. ఊఖీమఠ్ నుండి కనక్ చౌన్రి వెళ్లి అక్కడి నుండి కార్తీక్ స్వామి ట్రెక్ చేయాలని అనుకుంటున్నాం కదా! అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో అని. చాలా అలసిపోయినట్టుగా ఉంది ఇద్దరికీ. రేపటి రోజున పూర్తిగా రెస్ట్ తీసుకుని ఎల్లుండి కార్తీక్ స్వామి ఆలయం కి వెళ్లడం మంచిది అనుకున్నాం. ఆఖరికి మధ్యాహ్నం రెండు గంటల కల్లా కిందకు దిగాం. ఇక రూమ్ కి కూడా వెళ్లకుండా తిన్నగా ఎదురుగా ఉన్న ఒక చిన్న ఫుడ్ స్టాల్ లో మేగీ తిన్నాం. జీపులు  ఏమైనా ఉన్నాయేమో అని అక్కడి వాళ్ళని అడిగాం. ఒక్క జీపు మాత్రం ఉందని తెలిసింది. మా కోసం వెయిట్ చేస్తాం త్వరగా రమ్మని చెప్పేరు. వెంటనే ఒకరం రూమ్ కి డబ్బులు పే చేస్తుంటే మరొకరం లగేజ్ సర్దుకున్నాం .   ఎప్పటి నుండో ఎదురు చూసిన తుంగనాథ్ దర్శనం అయిపోయింది. ఊహించినవి, ఊహించనివి అనుభూతులు మూట కట్టుకొని బయలుదేరాం ఊఖీమఠ్ వైపుగా. ఊఖీమఠ్ కు సాయంత్రం ఐదు గంటలకల్లా చేరిపోయాం. ఓంకారేశ్వర మందిరానికి దగ్గరగా చిన్న హోటల్ ఏదైనా ఉంటే చెప్పమని మేం ముందే అడగడంతో డ్రైవర్ తిన్నగా ఒక హోటల్ దగ్గర ఆపేరు. దిగేసరికి వాతావరణం అంతా మబ్బులతో మూసి ఉంది. ఇక కాసేపట్లో వర్షం అన్నట్టు పెద్ద గాలులు, ధూళి. రూమ్ లో బేగ్స్ పడేసి వేడిగా టీ తాగాం. వేడి నీళ్ల సదుపాయం ఉంది. హాయిగా ఫ్రెష్ అయ్యాం. బడలిక అంతా పోయింది. ఎంత తేడా! అసలు అప్పటివరకు ఓపిక లేనట్టుంది మాకేనా అనిపించింది. గొప్ప ఉత్సాహంగా ఉంది. రాత్రికి భోజనం ఏం చేయమంటారు అని హోటల్ మేనేజర్ అడిగేరు. అక్కడ మరెవ్వరూ లేరు మేము ఇద్దరమే. రోటి కూర చెప్పుకున్నాం. రేపు ఉదయాన్నే కనక్ చౌంన్రీ వెళ్లాలంటే ఎలా అని అడిగేం. హోటల్ నుండి రెండు నిమిషాలు నడిస్తే అటు వెళ్లే షేర్డ్ జీప్స్ దొరుకుతాయని చెప్పేరు. ఉదయం 6:30 కి మొదలవుతాయట. కార్తీక్ స్వామి వెళ్లి రావడం సులువే, మీరు హాయిగా వెళ్లి రావచ్చు అన్నారు. దాంతో మరీ ఉత్సాహంగా అనిపించింది. ఓంకారేశ్వర మందిరంలో సాయంత్రం హారతి బావుంటుందని చూసి రమ్మని చెప్పేరు. అక్కడికి కోవెల దగ్గరే. వాతావరణం బావు లేకపోవడం వల్ల చుట్టూ పర్వతాలు, లోయలు, కింద పారుతున్న మందాకినీ నది ఏవీ కనిపించడం లేదు. ఉదయం హోటల్ బయట నుండి చూస్తే చౌకంభా, కేదార్ డోమ్ స్పష్టంగా కనిపిస్తాయన్నారు. చూస్తే వర్షం వచ్చేట్టుగా ఉంది. రైన్ కోట్స్ వేసుకొని బయలుదేరాం. ఓంకారేశ్వర ఆలయం చాలా పురాతనమైనది. చుట్టూ ప్రాకారం అదీ కొత్తగా కట్టి రంగులతో ఉంది గాని లోపలికి వెళ్లి చూస్తే పురాతన ఆలయం కనిపించింది. జ్యోతిర్లింగ క్షేత్రాలైన కేదార్నాథ్, మద్ మహేశ్వర్ లు చలికాలంలో మంచు కారణంగా మూసివేయబడినప్పుడు ఆయా ఉత్సవ విగ్రహాలు ఇక్కడే పూజలు అందుకుంటాయి. మాంధాత చక్రవర్తి ఇక్కడే 12 ఏళ్ల పాటు ఒంటి కాలు మీద తపస్సు చేస్తే శివుడు ఓంకార నాద రూపంలో దర్శనం ఇచ్చాడుట. అందుకే ఓంకారేశ్వర ఆలయం అంటారు. అలాగే ఉష, అనిరుద్ధుల (శ్రీకృష్ణుని మనుమడు) వివాహం ఇక్కడే జరిగిందని, ఉష అనే పేరే ఊఖీ అని మారి ఇప్పుడు ఊఖీమఠ్ గా పిలవబడుతున్నది అంటారు .ఆలయంలోపల ఒక ప్రక్కగా మాంధాత చక్రవర్తి విగ్రహం, కేదార్, మద్ మహేశ్వర ఉత్సవ మూర్తులు ఉన్నాయి. మరో ప్రక్క తుంగనాథ్, రుద్రనాధ్, కల్పనాధుల యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఆ ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే మరోపక్కగా ద్వాదశ జ్యోతిర్లింగ ప్రతిరూపాలను ప్రతిష్టించారు. కేదార్ నాథ్ లో పూజలు నిర్వహించే ప్రధాన పూజారే( కర్ణాటక లోని వీరశైవ మతానికి చెందినవారు) ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తారట. మొత్తం మీద ఆలయం చాలా బావుంది. ఒక అరగంట పాటు అక్కడే హాయిగా కూర్చుని హారతి చూశాం. ఆ తరువాత 7:30 ప్రాంతంలో తిరిగి గుడి నుండి బయలుదేరాం. బైట చల్లటి గాలి, కొద్దిగా వర్షం, ఆకాశంలో పెద్దపెద్ద మెరుపులు కొరడాలు ఝుళిపించినట్టు. మందాకినికి ఆవలి వైపున ఉన్న గుప్త కాశి ఊరు లైట్లతో మిలమిలా మెరిసిపోతూ కనిపించింది. జల్లు జల్లుగా వర్షం పడుతూనే ఉంది. రూమ్ కి చేరుకుని రాత్రి భోజనం కానిచ్చి, ఉదయానికి కావలసినవి అన్నీ ముందే సిద్ధం చేసుకున్నాం. మిగిలినవన్నీ బ్యాగ్స్ లో ప్యాక్ చేసి రెడీగా ఉంచుకున్నాం. రేపటి వాతావరణం ఎలా ఉంటుంది? కనక్ చౌంన్రీ ఎప్పటికీ చేరుతాం? చేరేక వెంటనే  ట్రెక్కింగ్ కి వెళ్ళగలమా? లేదా?? ఇలా ఆలోచనలతో నిద్రపోయాం. *
Post Date: Mon, 15 May 2023 07:10:04 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger