Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 1 June 2023

ఆ రంగుల టేబుల్ మీద కుంచెను నేనే ! - కుందుర్తి కవిత

ప్ర కృతి, కళా వేర్వేరంటారు సంజీవ్ దేవ్ గారు. జీవితంలో అణువణువునీ కళాత్మకం చేసుకోవడం, మన చుట్టూ ఉండేచిన్న చిన్న వాటిల్లో కూడా అందాన్ని ఆరాధించడం వీర్రాజు గారిని చూసే నేను నేర్చుకున్నాను. వారికి కళ అనేది ఏదో తెచ్చి పెట్టుకున్న అభిరుచో, సరదానో , హాబీనో కాదు… కళ అనేది వారి జీవన శైలి. వారి వ్యసనం. సౌందర్యోపాసనలో ఆయన ఇల్లు నాకొక బెంచ్ మార్క్ ని చూపెట్టింది. అందుకే వీర్రాజు గారి గురించి చెప్పాల్సివస్తే ఆయన ఇల్లే నాకు మొదటి వాక్యం. ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, నవలాకారుడు చిత్రకారుడు. అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. సౌమ్యుడు. సహనశీలి, నిబద్ధత, క్రమశిక్షణ కూడా కలవారు. గంభీరంగా కనిపించే అతి సున్నిత మనస్కుడు. ఆయన జీవితంలో అతిపెద్ద గెలుపూ అదేనేమో.ఒక మంచి మనిషిగా గుర్తింపబడడం కంటే పెద్ద గుర్తింపు ఇంకేముంటుందని నమ్మిన మనిషి కనుకే ఆయన జీవితం అంత సరళంగా సంతృప్తికరంగా ఆశారాహిత్యంగాసాఫల్యంగా సాగిందనుకుంటా. ఆయనతో నా పరిచయం నాకు ఊహ తెలియని రోజులనుంచీ ఆయన చివరిరోజుల వరకూ కూడా కొనసాగింది. ఎంతోగర్వంగా కూడా అనిపిస్తుంది. ఆయన్ను ఆఖరి ప్రయాణం లో కూడా నేను దగ్గరుండి సాగనంపగలగడం అదృష్టమోదురదృష్టమో తేల్చుకోలేను. ఒక మనిషి పరిచయమే గర్వకారణంగా అనిపిస్తే ఇక జీవితాంతం  ఆ మనిషి సాన్నిహిత్యం, స్నేహం, ప్రేమ, మమకారం పొందడం ఇంకెంత గుండెల్ని ఉప్పొంగేలా  చేస్తుందో మాటల్లో చెప్పలేను. ఆ ఇంట్లో ప్రతి మలుపూ ఒక అబ్బురమే ప్రతి వస్తువూ ఒక ఆశ్చర్యమే ప్రతి మరకా ఒక వర్ణచిత్రమే ప్రతి మనిషీ ఒక అద్భుతమే ఆ ఇంట్లోకి ప్రవేశించగానే బాల్కనీలో  పలకరించే పొడవాటి కాక్టసు చెట్లు. ముళ్ళున్న వాటినైనా మేము ప్రేమతో మచ్చిక చేసుకుంటామని చెపుతున్నట్టు ఉండేవి. ఇక ఆ పూలు,లతలూ,చిలుకలూ చెక్కిన తలుపు…తలుపుని కూడాఅంత కళాత్మకంగా మలచాలనుకోవడం వెనుక రహస్యమేమిటో మరి. ఇంట్లోకి వచ్చినవారందరినీ తిరిగి వెళ్ళనీయకుండాకట్టిపడేయాలనేమో. సుభద్రాదేవి గారి ప్రేమ,అభిమానం వారు చేసిపెట్టే టిఫిన్లూ,టీలంత కమ్మగానూ ..వారి రచనలంత ఆర్ద్రంగానూ..మళ్ళీమళ్ళీ కావాలనిపించేలా ఉంటాయి.ఇక పల్లవి అక్కలో చిన్న వయసునుంచీ చూసిన వినయం, విధేయత, చక్కటిమాటతీరు, వీణా పరిజ్ఞానం, బొమ్మలు గీయడం , పెయింటింగ్, కుట్లు అల్లికలు, ఎంబ్రాయిడరీ.. సకలకళాకోవిదురాలంటేఅతిశయోక్తి కాదు. ఇప్పటికీ తను నాకొక ప్రేరణ. తనలాగే మరో స్ఫూర్తి  ఇప్పుడు వాళ్ళింట్లో .. ఆశ్లేష!! నాన్న చేయి పట్టుకుని నడుచుకుంటూ వాళ్ళింటికి వెళ్ళిన కాలం లో .. దారిలో మొక్కలకి మొలిచే చిన్ని కాయలనుకోసుకెళితే… దాన్ని తెరిచి అందులో కూడా అందమైన బొమ్మలను చూపిన మాంత్రికుడు వీర్రాజుగారు!! గజిబిజి గందరగోళపు రంగు కాగితంలో… ధ్యాసపెట్టి చూస్తే దేవుడు కూడా కనిపిస్తాడని నేర్పిన ఇంద్రజాలికుడు .(ఆ రోజుల్లో రంగు డిజైన్ల  పేపర్లలో చూపునికేంద్రీకరించి చూస్తే 3D బొమ్మలు కనపడేవి. అలా మొదటిసారి వాటిని మాకు చూపినది ఆయనే) పుస్తకాలని అందంగా సర్దుకోవడమే కాక, వాటి అట్టలని కూడా అందంగా బైండింగ్ చేయించి పెట్టుకునేవారు.ఇంటికిఎప్పుడెళ్ళినా ఏదో ఒక బొమ్మల పుస్తకమో, కథల పుస్తకమో ఇవ్వకుండా పంపేవారు కాదు.అలా పుస్తకాల మాయాప్రపంచంలోకి నన్ను వేలు పట్టి నడిపించినది ఆయనే. అందరికీ ఉన్న 24 గంటల్లోనే..ఎన్ని పనులు చేయచ్చో, ఎంత సున్నితంగా బతకచ్చో చేసి చూపించారాయన. సున్నితత్వాన్నిభరించడం ఎంత కష్ట సాధ్యమైన విషయం కదా ! చిన్న చిన్న విషయాల్ని కూడా గమనించి ప్రోత్సహించడం ఆయనలో విలక్షణమైన లక్షణం గా ఉండేది. చిన్నపుడు నేనేపిచ్చి బొమ్మ గీసినా, కాగితంపై ఏ లేత రంగులు పామినా..భయం భయం గానే ఆయనకి చూపించేదాన్ని. ఏదో చిన్నపిల్లవేసినదని పక్కనపడేయకుండా, చులకన చేయకుండా, శ్రద్ధగా చూసి,దేన్నైనా చక్కగా మెచ్చుకుని, ఇంకా ఎలామెరుగుపరచ వచ్చో దాన్నింకా ఎలా అందంగా తీర్చిదిద్దచ్చో చెప్పేవారు, లేదా చూపేవారు ఓపికగా…నాకు బాగా గుర్తు… నేను పాత అట్టముక్కలతో.. పనికి రాని వస్తువులతో ఓసారి ఒక నెమలి బొమ్మ తయారుచేసి.. వారింటికి వెళ్ళినపుడుతీసుకెళ్ళి చూపిస్తే… ఎంతో మెచ్చుకుని , తన దగ్గరే పెట్టుకున్నారు. కొన్నాళ్ళకి ఓ రోజు ఆయనే స్వయంగా మా ఇంటికొచ్చిఅందంగా ఫ్రేము కట్టించి తెచ్చిన నెమలి బొమ్మని నా చేతిలో పెట్టారు. నా చిన్ని మనసుకి అంతకన్నా ధైర్యం, ప్రోత్సాహంఇంకేం కావాలి!! వానకి పులకరించి పురివిప్పి నాట్యమాడే నెమలిలా గంతులేసింది నా మనసు. ఆ తరువాత ఇక ఏ అట్టముక్కనీ, ఏ పిచ్చికాగితాన్నీ పారేయనీయలేదు మా అమ్మని. అది వేరే కథ !! నాకు బాగా గుర్తు. మా నాన్నని ఎవరికైనా భయపడడం నేను చూసానంటే, అది వీర్రాజు గారికే. నాన్న ఉద్యోగంలో  పడో, వక్తిగత పరంగానో, సంసారం పిల్లల గొడవలో పడో ఫ్రీవర్స్  ఫ్రంట్ అవార్డుల పనులు మర్చిపోతూ ఉండేవారు. ఫోన్లు లేనిరోజుల్లో సరే కానీ, ఫోన్లున్న రోజుల్లో కూడా .. వచ్చి మాట్లాడేంత  దూరంలోనే ఇల్లున్నా కూడా వీర్రాజు గారు ఒక ఉత్తరమేరాసేవారు.ఆ బాధ్యతను గుర్తుచేస్తూ.అంతే ఆ  పోస్టుకార్డు వచ్చిందంటే వీర్రాజు గారికి కోపమొచ్చిందని అర్థం.ఇక ఆ పైఆదివారం నాన్న, వెనుక నేనూ పొద్దున్నే టిఫిన్లు కూడా చేయకుండా వెళ్ళి వారింట్లో వాలిపోయేవారం, సుభద్రాదేవి గారు ఏదోటి పెడతారనే నమ్మకంతో. మావరకూ ఆయన ఉత్తరం ఓ అల్టిమేటం. బహుశా మా నాన్నాకి నాన్న లేని లోటూ, ఒక బాధ్యతాయుతమైన అన్న లేని లోటూ ఆయన తీర్చారేమో. మా నాన్న నాకుహీరో అయితే… నాకు తెలిసినంతవరకూ మా తాతగారైన కుందుర్తి గారి తరువాత వీర్రాజుగారే నాన్నకి హీరో. మా తాతమీదున్నంత గౌరవం, అంత ప్రేమా, అంత గర్వం ,అంత అభిమానం నాన్నకి వీర్రాజు గారి మీదే ఉండటం చూసాను. వీర్రాజు గారు కూడా బహుశా నాన్నలో ఒక పోగొట్టుకున్న  కొడుకునో, ఒక చిన్న తమ్ముడినో  చూసుకున్నారేమో. మనఅనుకున్నవారిపైనే కదా ప్రేమైనా,కోపమైనా హక్కైనా!! ఈ విషయం వాళ్ళిద్దరూ  ఒకరికొకరు చెప్పుకునే అవకాశం ఏరోజూవచ్చి ఉండకపోవచ్చు కానీ …వీర్రాజు గారి పిలుపు రాగానే నాన్న ఏరోజైనా రెక్కలు కట్టుకు వాలిపోడమూ, నాన్నపోయినపుడు వీర్రాజు గారు చిన్నపిల్లల్లా గుక్కపెట్టి ఏడవడమూ నాకు బాగా గుర్తుంది.  ఇంత జీవనోద్వేగం  ఎక్కణ్ణుంచి వచ్చింది ? సాహిత్యం పుణ్యమే  కదూ ? ఒక్క కవిత్వం మనుషుల్ని ఇంత  దగ్గరచేయడం చిన్న విషయం కాదు. నాకుకవిత్వంలో వస్తువూ, శిల్పమూ లాంటివేమీ తెలీదు. వీర్రాజుగారిని చూశాక నాకు ఒకటే అర్థమైంది.  కవిత్వమంటే మనుషుల్ని పొందడం. పొందినవారిని వదలకుండా అపురూపంగా దాచుకోవడం. అంతే. ఆయన మీద నాకున్న గౌరవం, ప్రేమా కూడా మా నాన్న నాకిచ్చి వెళ్ళిన వారసత్వమేనని నేను నమ్ముతున్నాను. పెళ్ళయి సింగపూరుకి వచ్చాక కూడా ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా వారింటికి వెళ్ళి కలవకుండా ఉండే ప్రసక్తే లేదు. నేనెక్కడికి టూరుకి వెళ్ళినా అక్కడే కళాత్మకమైన వస్తువు కనపడినా , ఇది వీర్రాజు గారికి నచ్చుతుంది అని కొనితెచ్చేదాన్ని. వారిని కలవడానికి వెళినపుడు ఆ వస్తువుని ఇంకా అందంగా మార్చి ఎక్కడా ఒక గోడ, ఒక అర కూడా ఖాళీ లేని ఇంట్లోఎక్కడో అక్కడ దానికో స్థానం కల్పించి తనదైన ప్రత్యేక రీతిలో అమర్చిపెట్టి ,ఇదిగో నువ్విచ్చినది ఇక్కడ పెట్టానంటూచూపించేవారు. తిరిగి నాకు ఏదో ఒకటి ఇచ్చి పంపేవారు. వారి మనసులో కూడా పరిచయమున్న ప్రతి  ఒక్క మనిషికి, అలాగే నాకూ ఒక ప్రత్యేక స్థానం అమరుస్తూనే ఉన్నారు చివరిదాకా. నేను ఆఖరుసారి కలిసి మాట్లాడినపుడు కూడా అదే చెదరని ఉత్సాహం, ప్రోత్సాహం నాలో నింపారు. లేని పురుగుని నామెదడులోకి ఎక్కించి పంపారు.బహుశా ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు అవే. వెళిపోయేప్పుడు వద్దంటుంటేకూడా నడవలేని స్థితిలో కూడా లిఫ్టు దగ్గిరికి సాగనంపడానికి వచ్చి "కవితా!! బాగా రాస్తున్నావు,తప్పకుండా వచ్చేసంవత్సరం లోపు పుస్తకం ప్రచురించాలి గుర్తుంచుకో", అన్నారు. ఇప్పటికీ ఆ మాటలు ఆజ్ఞలానే చెవుల్లోప్రతిధ్వనిస్తున్నాయి. ఇక ఆయన చివరి రోజుల్లో జరిగిన రెండు విషయాలకి చాలా బాధ పడతాను ఈనాటికీ. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుల వెనుక వీర్రాజు గారి కృషి, ఆ అవార్డుకి అంత గొప్ప పేరూ, స్థాయి రావడం వెనుక గల ఆయననిబద్ధత నిజాయితీ అందరికీ తెలిసినవే. తాతగారి శతజయంతి వేడుకగా 50 వ అవార్డు సభ చేసి ముగించాలనిఅనుకున్నాం. దానికోసం చేయాల్సిన పనులూ, ఉత్తరాలు రాయడం , ఎంపిక చేయడం అన్నీ వీర్రాజుగారే చేసారుఎప్పటిలాగే. మొమెంటోలు కూడా చేయించి పెట్టారు. ఆ విషయమై ఒకటి రెండు సార్లు ఫోనులో కూడా చర్చించుకున్నాం. ఒక తేదీ అనుకుని జూం లో మీటింగు చేయాలనుకున్నాం. కానీ నా వ్యక్తిగత  కారణాల వల్ల ఆ తేదీకి చేయడం కుదరకదాన్ని వాయిదా వేయాల్సి   వచ్చింది. ఆలోపే వీర్రాజు గారు అందరినీ వదిలి వెళ్లిపోయారు. ఆ తరువాత రెండు నెలలకి ఆ మీటింగు విజయవంతంగా జరిగింది కానీ ఆయన లేని లోటుని మాత్రం మేమేవరమూ పూరించలేకపోయాము. పోస్టుపోను చేయకపోయి ఉంటే ఆయనే స్వయంగా ఆ ఆఖరి సభను జరిపించేవారు. అది నా వలనే జరగనందుకునేనీరోజుకీ కుమిలిపోతున్నాను. నేను ఆయనకి పడిన బాకీ అది!! ఆయన పెయింటింగ్ ఒకటైనా మా ఇంట్లో  పెట్టుకోవాలని నాకు ఎప్పటినుండో కోరిక. కానీ తొందరేముందిలే ఎప్పుడైనాఅడిగి తీసుకోవచ్చు అనుకుని అడగడం మానేసాను. అంతలోనే వారు తన పెయింటింగ్స్ అన్నీ రాజమండ్రి లోగ్రంధాలయానికి డొనేట్ చేసారని తెలిసింది ఒకరోజు.. వెంటనే ఫోను చేసి నాకు ఒక్క పెయింటింగైనా ఉంచండి అనిఅడిగితే అన్నీ నిన్నే పంపించేసామన్నారు. నాకు దుఃఖం  పొంగుకొచ్చింది. నేను ఇండియా వెళ్లినపుడు కలిసి నాకెందుకుఇవలేదని, ఒకటైనా కావాలని మారాం చేసాను. అంత చనువూ వారిచ్చిన వరమే. అపుడు ఆయన నాతో "ఒకపెయింటింగ్ ఉంది , దానికి మెరుగులు దిద్దాలి, అది బాగుచేసి నువ్వు మళ్లీ వచ్చినపుడు ఇస్తాను" అని చెప్పారు  ఓపికగా. ఆపాటికే ఆరోగ్యం బాగా క్షీణించి ఎక్కువసేపు కూర్చూలేకపోయేవారు. కానీ చివరి రోజుల్లో హాస్పిటల్లో కూడా కవితకిపెయింటింగ్ పూర్తి చేసి ఇవ్వాలి అని కలవరిస్తూనే ఉన్నారట. ఆ విషయం పల్లవి అక్క చెప్తుంటే మనసుఅతలాకుతలమయ్యింది. అదే వీర్రాజు గారు నాకు పడిన బాకీ!! ఈ బాకీలు తీర్చుకోడానికైనా ఎక్కడో  అక్కడ ఏదో ఒక రూపంలో మళ్ళీ మేము కలుస్తాము అనుకోవడం కొంత డ్రమాటిక్ గాఅనిపించినా.. అదే నా నమ్మకం!! కళను అమ్ముకోవడం ఇష్టం లేక, డబ్బు సంపాదన మీద ఆశలేక, పేరు సంపాదన మీద వ్యామోహం లేక, జీవితం ఎన్నిసవాళ్ళు విసిరినా, ఎన్ని సమస్యలని తెచ్చిపెట్టినా, అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన మనిషి నాకు తెలిసిన వీర్రాజుగారు. నిరాడంబరత లోనే అసలైన సంతోషం ఉంటుందని నిరూపించిన నిజాయితీపరుడు ఆయన. కళలనుఉపాసించిన కళా పిపాసి. ఆయన ఆసాంతం ఒక స్ఫూర్తి, ఒక ఉత్తేజం , ఒక నిలువెత్తు భావుకత .అన్నిటికీ మించి తమకున్న అతి కాస్త ప్రతిభకే తెగవిర్రవీగే మనుషులున్న ఈ కాలంలో ఒదిగి ఉండటం వీర్రాజు గార్ని చూసి నేను నేర్చుకున్నాను. ఏదో బతకేయడం కాదు, జీవించడం నేర్చుకున్నాను.అప్పుడే ఒక సంవత్సరమైందా ఆయన లేక? నాకింకా ఆ ఇల్లే గుర్తొస్తోంది. రంగులతో, రకరకాల సైజుల కుంచెలతో, పెన్నులు పెంసిళ్ల తో నిండిన వీర్రాజు గారి టేబుల్ జ్ఞాపకానికొస్తోంది. ఎప్పుడెళ్లినా అక్కడేదో పని చేస్తూనో , చదువుతూనో, రంగులేస్తూనో, బొమ్మ గీస్తూనో , పుస్తకాలకి కవరు పేజీలు డిజైన్ చేస్తూనో, తనఅందమైన దస్తూరీతో ఏదో రాస్తూనో ఆయన కనిపించడం గుర్తుకొస్తోంది. ఆ టేబులుకు ఎన్ని రంగులంటి ఉంటాయో ఆ  రంగులన్నీ మన మనసుకి అంటుకోక తప్పదేమో వారి పరిచయంలో !! వారింట్లో కుర్చీలు, బల్లలూ, పెన్నులు పెట్టుకునే హోల్డరు, పుస్తకాల అట్టలూ, కాఫీ కప్పులూ ఒకటేమిటి .. అన్నీ కళాత్మకంగాజీవితానుభవాల్ని ప్రశ్నిస్తున్నట్టే ఉంటాయి. కంటికి కనిపించేదేనా అందమంటే ? ఏమో ? ఆ టేబిలు మీద ఒలికిపోయినరంగుల్లో నా జ్ఞాపకాలు గడ్డకట్టిన క్షణాన్ని అనుభవిస్తున్నాను. అక్కడే నేనెక్కడో సగం వేసిన బొమ్మలా సుతిమెత్తటి వేళ్ళస్పర్శ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాను. *
Post Date: Thu, 01 Jun 2023 11:24:16 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger