శ్రీ శ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ లేత వయసులో- అంటే టీనేజీ అని నా ఉద్దేశం- శ్రీశ్రీని ప్రత్యక్షంగా కలిసి వున్న అనుభవం దానికి కారణమయి వుంటుంది! అయితే, ఆంధ్రజ్యోతి లో చేరిన కొత్తలో మంచి వచనం రాయడం ఎలాగా అని తెగ మథనపడే రోజుల్లో శ్రీశ్రీ వచనం, మరీ ముఖ్యంగా శ్రీశ్రీ వ్యాసాలు, నాకు పెద్ద ఆకర్షణ. అలా శ్రీశ్రీని వొక కవిగా కంటే గొప్ప వచన రచయితగా సొంతంగా డిస్కవర్ చేస్తున్న కాలం అది. 'నువ్వు నీలాగే రాయ్" అని నండూరి అనే వారు. అయినా, ఏదో తాపత్రయం! అలాంటి 1986 కాలంలో ఒక తెల్లారుజామున బెజవాడ బందర్ రోడ్డులో వేంకటేశ్వర స్వామి వీధిలో వున్నమా వొంటరి గది – ఈ ఇరుకు గదిలో నేనూ, రుద్రాభట్ల కిషన్ చాలా ఏళ్ళు ఒకే మంచం ఒకే కంచంగా బతికాం. ఆ గది తలుపు తట్టారెవరో! తలుపు తీస్తే ఎదురుగా వొక అపరిచిత వ్యక్తి. అతను నన్ను పరిచయం చేసుకొని, "సార్, ఆరుద్ర గారు కబురు చేశారు. ఇవాళ మీకు వీలు కుదిరితే రమ్మన్నారు." అన్నాడు. ఆరుద్రగారు వూళ్ళో వున్న సంగతి నాకు తెలుసు కానీ, నా పొగరు వల్ల (పొగరు అనే కంటే శ్రీ శ్రీ పట్ల వున్న ప్రేమలోని "విగరు" వల్ల అనుకోవచ్చు) ఆ విషయం నేను అంతగా పట్టించుకోలేదు. "సరే, వస్తాను" "ఇప్పుడు వెంటబెట్టుకొని రమ్మన్నారండి" అన్నాడతను కదలకుండా. నేను అంత తేలికగా కదిలే ఘటం కాదని అతనికి తెలీదల్లే వుంది. అప్పట్లో నాదయిన ఒక చచ్చు/నచ్చు క్రమశిక్షణ నాకుండేది. పొద్దున లేవగానే బందరు రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్ళి గాంధీనగర్ పక్కన ఎప్పుడూ వొకే టిఫిన్ సెంటరులో ఎప్పుడూ అదే ఇడ్లీ వడ సాంబారు లాగించి, ఎప్పుడూ అదే దారిలో వున్న ప్రబోధ బుక్ సెంటరులో మధ్యాన్నం దాకా పుస్తకాలు చదువుతూ కూర్చోడం అప్పటి అలవాటు. (అప్పుడంతా మధ్యాన్నమో, రాత్రి డ్యూటీలో వుండేవి కనుక, పుస్తకం కొనడం అంటే నెల జీతంలో సగమో, మూడు వంతులో "ధార" పోయడమే కనుక, ఆ క్రైస్తవ దుకాణం నాకు మంచి ఆశ్రమం అయ్యింది). మూడు నాలుగు గంటల చదువు తరవాత, విశ్వేశ్వర రావు గారి మెస్ (అవును, ఇప్పటి 'శ్రీశ్రీ' విశ్వేశ్వర రావే!) లో మధ్యాన్న భోజనం! బ్రహ్మాదులు వచ్చినా ఆ రొటీన్ మారేది కాదు. 'నేనొస్తాను, మీరు పదండి" అని అతన్ని అప్పటికప్పుడు పంపించేసి, తరవాత నిదానంగా నేను నా డొక్కు ర్యాలే సైకిలెక్కి ఆరుద్ర దిగిన హోటల్ చేరుకున్నా. వెళ్ళేసరికి ఆరుద్ర అప్పటికే రెడీగా వున్నారు, "రండి…మీరొస్తే కలిసి టిఫిన్ చెయ్యొచ్చని కూర్చున్నా" అంటూ కింద రెస్టారంట్ కి దారి తీశారు. ఆరుద్ర గారు నాకంటే తాపీ మేస్త్రీ! చాలా తాపీగా పనులు చేసే మనిషిలా కనిపించారు మొదటి పరిచయంలోనే. ఆయన కదలికలూ, మాట తీరు చూసి, "మీరు కూడా తాపీ ధర్మారావు గారేనా?" అన్నాను సరదాగా. అసలు అంత నెమ్మదిగా వొక్కో వాక్యం తూచినట్టుగా మాట్లాడ్డం సాధ్యమా అని ప్రతిసారీ అనిపిస్తుంది ఆయన మాటలు వింటూ వుంటే! దానికి ఆయన పెద్దగా నవ్వేసి, "అవును అందరం ఆ తాపీ తానులో గుడ్డలమే కదా!" అన్నారు, అదీ తాపీగానే! "నేనెక్కాల్సిన రైలు ఎప్పుడూ జీవిత కాలం లేటు" అని ఆయన ఎందుకు అంత అథారిటీగా అనగలిగారో అప్పుడే అర్ధమవడం మొదలయ్యింది. "మీ గడ్డం ఇన్స్పిరేషను కూడా ఆయనేనా?" "లేదు, లేదు. కేవలం నా బద్దకం వల్ల, తీరిక లేక, వదిలేశాను గడ్డం!" అన్నారాయన. టిఫినీ కార్యక్రమాలు అయ్యాక, ఆయన నెమ్మదిగా విషయంలోకి వచ్చారు. 'నేను ఒక సంకలనం పని మీద మీ కోసం కబురు చేశాను. ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు నాకు అప్పజెప్పిన పని. వాళ్లకేమీ కాలం పట్టింపు లేదు. కానీ, నాకు వుంది. ఈ సంకలనంలో 1975 తరవాత కవిత్వం ఎక్కువ వుండాలి అనుకుంటున్నా." "అవును, 75 తరవాతే బాగుంటుంది. కనీసం అంతకు ముందు వచ్చిన కవిత్వం అంతా ఏదో వొక విధంగా సంకలనాలకి ఎక్కింది. పైగా, 75 తరవాత చాలా కొత్త తరం వచ్చింది." అన్నాను నేను. "ఇంకో మాట ఏమిటంటే, ఈ సంకలనం వచ్చేనాటికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. కనీసం 75 ని ఒక కొండగుర్తుగా గుర్తిస్తే మనం సాహిత్యాన్ని చూసే దృష్టి మారుతుంది. కానీ, ఇటీవలి రాస్తున్న వాళ్ళ గురించి నాకు ఆట్టే తెలియదు. అక్కడ మీ సాయం కావాలి. మనం ఇద్దరం కూర్చొని వొక జాబితా తయారు చేసి, వాళ్లందరినీ కలిసి సంప్రదిద్దాం." అన్నారాయన. 'నండూరి గారు, శ్రీకాంత శర్మగారు ఇంతకు ముందు "మహా సంకల్పం" చేశారు. వారిని అడిగితే బాగుంటుందేమో?!' అన్నాను నేను. "వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళే మీ పేరు చెప్పారు." అన్నారు ఆరుద్ర. ఆ తరవాత చాలా సేపు మా చర్చ అప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళూ, వాళ్ళ కవిత్వాల చుట్టూ తిరిగింది. కానీ, చాలా సేపటి కబుర్ల తరవాత నాకు అర్ధం అయ్యిందేమిటంటే, సమకాలీన కవిత్వాన్ని ఆయన చాలా శ్రద్ధగా చదువుతున్నారని! నన్ను అడగడం కేవలం క్రాస్ చెక్ చేసుకోవడం కోసం మాత్రమేనని! మేము అలా చర్చిస్తూ వుండగానే, అక్కడికి నండూరి, పురాణం గార్లు కూడా వచ్చారు. ఇక నేను నిష్క్రమించడం మంచిదని అనుకుంటూ, లేవడానికి ప్రయత్నిస్తూ, "నేను మళ్ళీ కలుస్తాను" అనబోతుండగా, నండూరి గారు "ఏం పర్లేదు, వుండవోయ్, కాసేపు!" అన్నారు. కానీ, ఆ కాసేపటి తరవాత ఆరుద్ర గారు "అఫ్సర్ గారూ, నేను వొక రెండు రోజులు ఈ చుట్టు పక్కల గుంటూరు, తెనాలి, బందరూ అన్నీ తిరిగి, కొత్త రచయితల్నీ, కవుల్ని కలుద్దామని అనుకుంటున్నా. మీరొస్తే బాగుంటుంది." అన్నారు. నేను నండూరి గారి వైపు తిరిగాను, ప్రశ్నార్థకంగా. "పరవా లేదు, వెళ్ళు. ఈ వారం సాహిత్య పేజీ ఇచ్చి వెళ్ళు, సరిపోతుంది" అన్నారాయన. ఆంధ్రజ్యోతి సాహిత్య వేదికని నిండు సాహిత్య పేజీగా మార్చిన కాలం అది. చాలా కొత్త శీర్షికల వల్ల సాహిత్య వేదిక అందరినీ ఆకట్టుకుంటున్న కాలం కూడా – రచనలు, లే ఔట్ విషయంలో ఇద్దరం చాలా శ్రద్ధ పెట్టేవాళ్లం. ప్రతి అక్షరం పట్టి పట్టి చదివే వాళ్ళం. కానీ, రచనల ఎంపిక విషయంలో నాకు పూర్తి స్వేచ్చ వుండేది. నేను వెంటనే ఆఫీస్ కి వెళ్ళి, ఆ సాయంత్రానికల్లా పేజీ ముస్తాబు చేసి, ఇచ్చి, హోటల్ కి వచ్చి, మళ్ళీ ఆరుద్రగారిని కలిశాను. 2 సాయంత్రం అయిదు గంటలకి మేము బెజవాడ నించి కారులో బయలు దేరాం. ఆ రెండు రోజుల ప్రయాణాలు నేను మరచిపోలేనివి. పూటకి ఒక ఊళ్ళో దిగడం, అక్కడి కవులూ, రచయితలతో మాట్లాడ్డం…! వెళ్ళిన వూళ్లలో కొద్ది సెపే వున్నాం కానీ, వొక వూరి నించి ఇంకో వూరికి ప్రయాణం మా ఇద్దరి మధ్య చాలా కబుర్లకూ, కథలకీ అవకాశం ఇచ్చింది. ఆరుద్రని నేను నా చిరకాల స్థిర నిశ్చిత పూర్వ అభిప్రాయాల నించి కాకుండా, ప్రత్యక్షంగా చూడడం మంచిదే అయ్యింది. ఆరుద్రగారికి వున్న అనేక ఆసక్తుల్లో స్థల పురాణం వొకటి. దారిన కనిపించే ప్రతి వూరి కథా పురాణం ఆయనకి తెలిసినట్టే అనిపించింది, ఆయన చెబుతూ వుంటే! అలాగే, దాదాపు ప్రతి వూరు సాహిత్య చరిత్ర ఆయన కి కొట్టిన పిండి. అక్కడి రచయితలూ, వారి జీవన విశేషాలూ చెప్తూ వుంటే, ఇంత చరిత్ర దృష్టి వుండడం సాధ్యమా అని ఆశ్చర్యపోవడం మినహా నేను చేయగలిగిందేమీ లేదు. ప్రాంతీయ, స్థానిక చరిత్రల గురించి ఇప్పుడు ఇంత కంఠ శోష పెట్టినా, అసలు ఆ చరిత్రల్ని తవ్వి తీయగల శక్తి మనకి వుందా అనిపిస్తోంది నాకు! అసలు మన జాతి (అది "ఆంధ్రా" అయినా, "తెలంగాణ" అయినా, "రాయలసీమ' అయినా) సాంస్కృతిక చరిత్ర గురించి అంత దీక్షగా పనిచెయ్యగలిగే అంకిత భావం మనకుందా అని! అవన్నీ పక్కన పెట్టి, మా మధ్య జరిగిన కొన్ని సాహిత్య కబుర్లు మాత్రమే ఇప్పుడు చెప్తాను. శ్రీశ్రీ గురించి మొదలయిన కబుర్లు ఆరుద్ర తొలినాళ్ళ దాకా వెళ్ళాయి. నాలో చాలా కాలంగా నలుగుతున్న ప్రశ్నల్ని బయటికి రువ్వే అదను దొరికింది. "ఇదే అదను…" అనుకుంటూ వొక్కోకటీ నెమ్మదిగా సంధించడం మొదలెట్టాను. ఆయన తాపీగా సమాధానాలివ్వడం మొదలెట్టారు. 'మొదట్లో మీరు డిటెక్టివ్ నవలలు రాశారు, అవి ఎందుకూ?" "డిటెక్టివ్ నవలలే కాదు, ఇంకా చాలా రకాలు రాసి, ఒక విధంగా చెప్పాలంటే, పారేశాం. మీ శ్రీశ్రీ కూడా డిటెక్టివ్ నవలలూ, కథలూ రాశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మేం చేసిన పని ఏమిటో మీకు అర్థమవుతుంది. మేము అసలు పాఠకులు అంటూ కొత్తగా ఒక వర్గం తయారవుతున్న కాలంలో చేసిన రచనలు అవి. ఆధునికత వచ్చింది. పత్రికలు వస్తున్నాయి. అప్పుడప్పుడే కొత్త పాఠకులు తయారవుతున్నారు. ఎవరీ పాఠకులు? కాస్తో కూస్తో ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళే కాదు, తెలుగులో పత్రికలకు, రాత సాహిత్యానికీ అలవాటు పడుతున్న వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళు. ఇంకా కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించని కాలం అది. పాఠకుడికి వామపక్ష స్వభావమో, ఇంకోటో అంటూ ఏర్పడని కాలం అది. వాళ్ళకి చదివే ఆసక్తి పెంచడం వొక్కటే అప్పట్లో మా పని. దాని కోసం కొన్ని పనులు పని కట్టుకుని చేశాం. ఇంగ్లీషులో డిటెక్టివ్ కథలు వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి వుండి తీరాలి. ఇంగ్లీషులో స్కేచెస్ వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి మనం రాసి తీరాలి. ఇలా అన్న మాట! అందులో సాహిత్యం వుందా లేదా అన్నది అప్పట్లో ముఖ్యం కాదు. అవి కొత్త పాఠకుల చేత చదివిస్తున్నామా లేదా అన్నది మా తాపత్రయం. ఇవన్నీ దాదాపూ అనుకోని చేశాం మేం!" నిజమే, అచ్చు సంస్కృతి అప్పుడప్పుడే విస్తరిస్తున్న కాలంలో వాళ్ళు పడ్డ కష్టాలేమిటో నిజంగానే ఇంకా మనకి తెలియదు, శ్రీ శ్రీ "అనంతం"లో, శ్రీపాద "అనుభవాలూ జ్నాపకాల"లో కొన్ని ఉదాహరణలు తప్ప – కానీ, ఆరుద్ర ఆ డిటెక్టివ్ తరహా వచనంలోంచి సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం దాకా తెలుగు వచనాన్ని తీసుకువెళ్లడం చాలా పెద్ద మలుపు. అది కేవలం సాహిత్య చరిత్ర కాదనీ, మొత్తంగా సాంస్కృతిక చరిత్ర నిర్మాణమే అనీ నా అభిప్రాయం. అనేక రకాల పనులు చేస్తూ కూడా సమగ్రాంధ్ర సాహిత్యం మీద పని చెయ్యడం ఎలా సాధ్యపడిందని అడిగాను. "ఏమీ లేదు. కొంచెం బండగా అంత కంటే మొండిగా కూర్చొని తెల్లారే లేచి రాయడం మొదలుపెట్టాను. లేకపోతే, ఎక్కడ అవుతుంది, ఆ సినిమాల గోలలో, నానా రకాల వ్యాపకాలలో? కానీ, అలాంటి పనుల్లో రాయడం కంటే కూడా పరిశోధనకి ఎక్కువ సమయం కావాలి. సరే, ఆ పుస్తకం నా జీవితకాలం రచన అనుకున్నాను కాబట్టి అదే కాస్తో కూస్తో మిగిలే రచన అనుకున్నాను కాబట్టి దీక్షగా రాశాను." అన్నారు ఆరుద్ర. ఆ రచన పరిశోధనకి ఆయన పడిన కష్టాలు, అన్నిటికీ మించి కొన్ని నిర్ధారణలకు రావడానికి ఆయన పడిన సంఘర్షణని చక్కగా పూసగుచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు "పూసగుచ్చినట్టు" అంటే గుర్తొచ్చింది, ఆ మాట ఆరుద్ర మాట్లాడే శైలికి చక్కగా సరిపోతుంది నిజానికి. సాంస్కృతిక చరిత్ర నాకు మొదటి నించీ చాలా ఆసక్తికరమయిన రంగం. ఆ విషయం మీద ఆయన ఆలోచనలూ, పరిశోధనా పద్ధతి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కొన్ని సంభాషణలు అటు తీసుకువెళ్లాను. అప్పుడు ఆయన అన్న వొక మాట మా చర్చనీ వేరే దారి పట్టించింది . "మన చరిత్రలో విదేశీ చరిత్రల్లో మాదిరిగా సాంస్కృతిక చరిత్రని గాని, సాహిత్య కళా చరిత్రల్ని కానీ సామాజిక రాజకీయ చరిత్రల నుంచి విడిగా చూడడం సాధ్యం కాదు. ఉదాహరణకి ఇంగ్లీషులో రొమాంటిక్ ఉద్యమం వుందనుకోండి, అక్కడ మీరు వర్డ్స్ వర్తు, కీట్సు, షెల్లీని విడదీసి వాళ్ళ సాంస్కృతికతని చూడవచ్చు" అన్నారు. ఠక్కున కౌంటర్లు ఇవ్వడం నాకు పుట్టుకతో అబ్బిన విద్య కాబట్టి, వెంటనే నేను దానికి కౌంటరు కొట్టేశాను. "అది నిజం కాదేమో! ఏ సాంస్కృతిక చరిత్ర అయినా సమాజంతోనో, రాజకీయాలతోనో ముడిపడి వుంటుంది. వర్డ్స్ వర్తుని, కీట్సుని కూడా వాటికి విడిగా అధ్యయనం చేయలేం అనుకుంటా. వర్డ్స్ వర్తు చాలా స్పష్టంగానే తన రాజకీయాలు చెప్తాడు. కీట్సు చెప్పకపోవచ్చు, కానీ అలా చెప్పకపోవడం కూడా రాజకీయమే. కీట్సులోని నైరాశ్యానికి కేవలం అతని వ్యక్తిత్వమే కారణం కాదు, అతని చుట్టూ వున్న రాజకీయాలు, సమాజం సమానంగా కారణం" అన్నాను. "ఆ…కావచ్చు. కానీ స్పష్టంగా చెప్పే రాజకీయాలకూ, చెప్పని రాజకీయాలకూ తేడా వుంటుంది" అన్నారాయన అంత తేలికగా నన్ను కాదనలేక, అవునని కూడా అనలేక. "తెలుగు వాళ్ళం మనం షెల్లీని, కీట్సుని కొన్ని చరణాలుగా (stanzas) మాత్రమే చదువుతాం. ఆ మేరకే అర్ధం చేసుకుంటాం, అందుకే మనం మన కృష్ణ శాస్త్రి గారిని ఆంధ్రా షెల్లీ అని అమాయకంగా పేరు పెట్టుకున్నాం. నిజానికి కృష్ణ శాస్త్రి గారికీ, షెల్లీకి ఏ విషయంలోనూ పోలిక లేదు. షెల్లీకి వున్న స్పష్టత కృష్ణ శాస్త్రి గారికి లేదు, ఎందుకంటే, కృష్ణశాస్త్రి గారికి విషాదం అంటే అదేదో వేరే లోకం నుంచి ఉత్పత్తి అయిన వస్తువు." అన్నాను నేను. "ఇదేదో నాకు కొత్త సంగతి. కాస్త ఆలోచించనివ్వండి నన్ను- కృష్ణ శాస్త్రి గారి గురించి మీరు చెప్పింది నిజమే!" అన్నారాయన నేను వొక పట్టాన ఆ విషయం వదిలేట్టు లేదని అర్థమయినట్టుగా- "మీరు ఇంగ్లీషు కవిత్వమూ తెలుగు కవిత్వం మధ్య పోలికలు చూపిస్తూ మంచి వ్యాసాలు రాయాలి" అని ఆ పూట ఆయన మంచి సలహా ఇచ్చారు కానీ, అది మంచి సలహా కాబట్టి నేను వినలేదు! ఆ ప్రయాణాల సందర్భంగా ఆరుద్ర గారు తన రాత క్రమశిక్షణ గురించి చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చాయి. అంత క్రమశిక్షణ శ్రీశ్రీ కి వుంటే ఎంత బాగుండేది అనుకున్నా. ఆ విషయమే ఆయన్ని అడిగా. "శ్రీ శ్రీ యవ్వనంలో వున్నప్పుడు బాగా క్రమశిక్షణగానే వున్నాడు. అందుకే చూడండి, ఎన్ని అనువాదాలు చేశాడో! అతని వచనం చాలా గొప్పది. కానీ, వొక్క సారిగా 'మహాకవి' అన్న ముద్ర పడ్డాక అతను ఆ వచనం జోలికి వెళ్ళలేదు. ఎంతో శక్తి వుండి కూడా ఏమీ చేయకుండా వుండి పోయాడు. రాజకీయ పర్యటనలు అతని సమయాన్ని బాగా తిన్నాయనుకోండి. నాకు రాజకీయాల మీద అంత ఆసక్తి లేదని అనను గాని, అలా తిరగడం మీద ఆసక్తి లేదు. నేను ఏమన్నా తిరిగితే ఇదిగో ఇలా సాహిత్యం పనులు పెట్టుకొనే తిరుగుతాను" నిజమే! కానీ, శ్రీశ్రీకి అలాంటి తిరుగుళ్ళు వుండబట్టే, కొత్త తరంలోనూ అతని కవిత్వం బతికింది. అది కాదనలేని సత్యం. శ్రీశ్రీ గురించి ఆయన ఇంకా చాలా వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడారు కానీ, వాటిలో సగం విషయాల మీద నాకు ఆసక్తి లేదు, అవి నిజమని కూడా నాకు నమ్మకం లేదు! కాబట్టి, ఇక్కడ చెప్పడమూ లేదు. మొత్తం మీద ఈ ప్రయాణం తరవాత ఆరుద్ర వ్యక్తిత్వంలోని కొత్త కోణాలు నాకు చాలా దగ్గిరగా అర్థమయ్యాయి. ఆయన మీద అంత అయిష్టం వుండక్కరలేదు అని కూడా అర్థమయింది. అప్పటి నించి ఆరుద్ర రచనల్ని తిరిగి ఇంకో సారి చదవడం మొదలెట్టాను, ఈ సారి నాకు తెలిసిన వ్యక్తిత్వపు వెలుగులో! చాలా ఆశ్చర్యంగా వుంటుంది. జీవితం ఎప్పుడూ వొక ప్లాట్ ఫారం లాగానో, రైలు ప్రయాణమో అనుకుంటే, కొన్ని సార్లు మనం ఎక్కాల్సిన రైళ్లు మనం చూస్తూండగానే వెళ్లిపోతాయి. వొక్కో సారి అదృష్టం బాగుంటే, మనం ఎక్కిన కోచ్ లోనే మనకి బాగా ఇష్టమయి ఎన్నాళ్లుగానో కలవాలని ఎదురుచూస్తున్న వ్యక్తిని కలవవచ్చు. కాస్త మాట్లాడుకునే అవకాశమూ దక్కవచ్చు. ఆ రెండు రోజుల ప్రయాణాల తరవాత ఆరుద్ర అనే రైలు నేను కాస్త లేటుగా ఎక్కానని అనిపించింది. కానీ, అది జీవిత కాలం లేటు కానందుకు ఇప్పటికీ సంతోషంగా వుంటుంది. *
Post Date: Sun, 04 Jun 2023 15:04:38 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sun, 04 Jun 2023 15:04:38 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment