Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 15 June 2023

అక్షరం తడిసిపోయింది - కృష్ణుడు

అ క్షరం తడిసిపోయింది. ఏ పని చేస్తున్నా ఆలోచనలు అమ్మచుట్టే తిరుగుతున్నాయి. నాకూ హైదరాబాద్ కూ బంధం తెగిపోయిందా? అమ్మలేని నగరం ఎందుకో శూన్యంగా అనిపిస్తోంది ఎక్కడకు వెళ్లాలి.. ఎవర్నికలుసుకోవాలి? ముందు అమ్మను చూసిన తర్వాతే ఎవరి దగ్గరికైనా వెళ్లేవాడిని ఇన్నాళ్లూ. కాని అమ్మేలేనప్పుడు కాలంతో పాటు శరీరమూ స్తంభించిపోయినట్లనిపిస్తోంది. రాత్రి కనురెప్పలు విశాలంగా తెరుచుకుని  నావైపు దీనంగా చూస్తోంది ఉదయం వెలుతురు చాలా పేలవంగా నెత్తురు కోల్పోయినట్లుంది. మొబైల్ లో అమ్మతో  ఫోన్ లో మాట్లాడక ఎన్ని రోజులైంది. ఆమె అస్వస్థతకు గురయ్యాక ఫోన్లో నంబర్లన్నీ అస్తిత్వం కోల్పోయాయి. రెండు రోజులకోసారి సోదరులతో మాట్లాడితే అమ్మే ధ్వనిమయమయ్యేది. మెడికల్ బిల్లులు, ఖర్చులకోసం ఒక గ్రూపే నడిచేది. అసలు అమ్మకు అస్వస్థత ఎప్పుడుండేదని? 13వ ఏట పారాణితో అత్తింట అడుగుపెట్టినప్పటి నుంచీ ఆమెకు కష్టాలే. అత్తామామలు,మరదులు, మరదళ్లకు చాకిరీ.వారందరూ తిన్నాక, పిల్లలకు పెట్టాక కాని ఏ మధ్యాహ్నం 3 గంటలకో ఆమెకు మిగిలేవి మెతుకులు. అందరూ చాయ తాగి మిగిలేసిన చాయపత్తాలో నీరు కలిపి వేడి చేసుకుని తాగడమే ఆమెకు ఆనందం. అత్తామామల తిట్ల దండకాల మధ్య పటాలకు మొక్కడమే ఆమెకు ఒక అనుభూతి. ఆకలి, చాకిరీల మధ్య ఆమె అక్షయపాత్రలా అందరి ఆకలిని తీర్చేది. ఇంటిల్లిపాది బట్టలు ఉతికేది. రైలు పట్టాలు దాటి నీళ్లు మోసుకొచ్చేది. వెలిసిపోయిన చీరల్ని కట్టుకుని పిల్లల బట్టలకు చిరుగుపాతల్నికుట్టేది.ఏ బంధువింట్లో పెళ్లి జరిగినా, ఎవరింటికి వెళ్లినా, చివరకు పుట్టింటికి వెళ్లినా  ఆమె అతిథిగా కాదు, పనిమనిషిగా కనిపించేది. నాన్న ఉద్యమాలంటూ తిరిగితే అమ్మ ఊపిరి సలపని పనుల్లో జీవితమే ఒక ఉద్యమంగా గడిపేది. పిల్లల పస్తులు చూడలేక ఆమె ఒంటిపై ఒక్కో నగా మాయమయ్యాయి. ఒక రోజు ముక్కుకు కోడి ఆకారంలో ఉన్న పుడకను పటకారుతో తీస్తూ కనపడింది. ముక్కంతా రక్తమయమయిన బాధ కన్నా ఆ పుడకతో మా ఆకలి తీరుతుందనే ఆశ ఆమెది. నాన్న ఉద్యమాలు వదిలి ఉద్యోగంలోచేరినతర్వాత చాలీచాలని జీతంతో అయిదుగురు పిల్లల్ని సాకడం అమ్మఒక యజ్ఞంలా చేసేది.  ఎడతెరిపి లేకుండా వచ్చే నాన్న దోస్తులు,బంధువుల కడుపు నింపేందుకు ఆమె వంటిల్లులోనే జీవితం గడిపేది. ఉదయాస్తమయాలు,రాత్రింబగళ్లు ఆమెకు వంటిల్లులోనే. నాన్న మంచాన పడ్డాక ఆయనకు నిరంతరం సేవలు చేయడం,ఆయన మల మూత్రాలు ఎత్తిపోయడం అమ్మకు అలవాటైపోయింది. పిల్లలు, పిల్లల పిల్లలకు సేవలు చేయడం ఆమెకు ఆనందం.ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా వండిపెట్టాలంటే ఆమె కళ్లలో వెలుగు రేఖలుకనపడేవి. కనపడితే చాలు ఆమె నోటి నుంచి వినపడే మొదటి స్వరం తిన్నావా అని. బిళ్లలంటుపులుసు, చిట్లపొడి, పోపన్నం ఆమె లాగా రుచికరంగా దేవతలు కూడా వండిపెట్టలేరు. పిల్లల పేర్లే సహస్రనామాలు,వేడి వేడిపొగల్లో గీతారహస్యం. నేలతల్లిని హత్తుకుని నిద్రించే మనసులో ప్రతి రోజూ రేపటి తాపత్రయాలు. గాలికోసం తపించే దేహానికి జీవితం ఉక్కబోయదు నాలుగు గోడల మధ్య ప్రాణానికి అడ్డుగోడలు తెలియవు. కళ్ల బావులతో కాలం దప్పిక తీర్చే యత్నం మరిచిపోయిన వాస్తవికతను మళ్లీ మళ్లీ తెలిపే మాతృత్వం. నాన్న పోయాక ఆమెకు స్వేచ్చ లభించిందేమో కాని సుఖపడిందేమీ లేదు.   అందరూ ఉన్నా ఆమె అనాథలా బతికింది. అక్షరం ఆమెను అక్కున చేర్చుకుంది. ఆమె కళ్లు ఎప్పుడూ అక్షరాల్ని వేటాడేవి. దినపత్రికలూ, పుస్తకాలు ఆమె కళ్ల వేగానికి తట్టుకునేవికావు. ఆమె విమర్శలూ,ప్రశ్నలూ సమాజంపై శరసంధానంలా ఉండేవి. ఏమిరా వాడి దుర్మార్గాల్ని ప్రశ్నించేవాడే లేడా అనేది. నాకు ఆమె పోతన పద్యాలతో పాటు  ప్రతిఘటన నేర్పేది. సిద్దాంతం నేర్పిన నాన్నకు,ఆచరణ నేర్పిన అమ్మకు అని నా మొదటి కవితాసంకలనాన్ని అంకితం ఇచ్చాను. రాజులు పోయారు,రాజ్యాలు పోయాయి. నియంతలు పోలేదెందుకురా అని అడిగేది. గుజరాత్ అల్లర్లనుంచి నిర్భయ పై అత్యాచారం వరకూ ఆమె కు తెలియని పరిణామం లేదు. చైనా వస్తువులను నిషేధిస్తే యుద్దం ఆగిపోతుందా అనేది. నా ఇండియాగేట్ చదవడం కోసం ప్రతి బుధవారం గుమ్మం ముందు పేపర్ కోసంకాపు కాసేది. నేను రాసిన ప్రతిపుస్తకాన్ని గుండెకు హత్తుకునేది. నిజాం రోజుల్ని తలుచుకునేది. హుజూర్ నిజాం అని పిలిచేది. ఒక్కో సారి ఆ రోజులే బాగుండేవనేది. రజాకార్లు రాకపోతే బాగుండేదని చెప్పేది. పోలీస్ యాక్షన్ లో జరిగిన దారుణాల్ని వివరించేది. ఇళ్ల కప్పుల మీదుగా నగరం దాటి పోలీసులను తప్పించుకుని ఖమ్మం పారిపోయిన నాన్న కథ చెప్పేది.  ఇంటింటికీ తిరిగి పాలు అమ్మిన మఖ్ధూం గురించీ,రహీంసాహెబ్,అహ్మద్ అలీల గురించి మాట్లాడేది. నాన్నతో పాటు జాసూసీ దునియా చదివేది. చిన్నతనంలో తనకు తెర వెనుక నుంచి హిందీ ప్రవీణ పాఠాలు  చెప్పిన మాస్టారు గురించి తలుచుకునేది. నిత్యం చిరునవ్వుతో పలకరించే ఆమె ముఖంలో కాన్సర్ ప్రవేశించింది. కుంచించుకుపోయిన కన్ను, వాచిన ముఖం చూపించి నాకేమైందిరా అనిఅడిగేది. ఎర్రపడ్డ కన్నుల నుంచి రాలిపడే కన్నీటి చుక్కల్ని తడిమేది. చీకటి కుహరాల్లాంటి ఎంఆర్ ఐ,సీటీస్కాన్ లమధ్య కూరుకుపోయినప్పుడు ఆమె ఏమి ఆలోచించేదో? శరీరంలో ప్రతి రక్తనాళంలో ప్రవేశించిన కెమో థెరపీ కుంచింప చేస్తుంటే ఆమె తుఫానుకు తట్టుకోలేని ఆకులా కంపించిపోయేది. చేతులపై,ముక్కులోంచి,కడుపులోంచి వ్రేళ్లాడే పైపుల మధ్య తెరిచీ తెరవక కనురెప్పల్ని తెరుస్తూ ఆమె మాట్లాడేందుకు ప్రయత్నించేది. ఢిల్లీలో మంజులను ఒక్కదాన్నే వదిలిపెట్టి వచ్చావా అనేది. ఆమె సైగల భాషను ఎన్ని పుస్తకాల్లో రాయగలను? శ్వాస ఆడక పైకీ క్రిందకు లేస్తున్న ఆమె ఛాతీ ఎన్ని సంవత్సరాల హృదయ వేదనను భరించిందో? మా అమ్మ వేన వేల స్త్రీల వేదనకు ప్రతీక. ఎందరి ఇళ్లలో అమ్మలకు సర్వనామం ప్రతి ఇంటి కంటతడిలో తరతరాల ఆర్తగీతి నిద్రలోకి కూరుకుపోతూ, జారుకుపోతూ శాశ్వత నిద్రకూ మెలకువకూ మధ్య సంఘర్షిస్తూ, బాధకూ, నిర్లిప్తతకూ మధ్య కొట్టుమిట్టాడుతూ ఒకే ఒక్కసారి .. ఒకే ఒక్కసారి అంటూ అమ్మ కళ్లు విశాలంగా తెరిచింది. అందర్నీ కళ్లారా చూసుకుంది కారుతున్న కళ్ల నీళ్లతో ఆశీర్వదించింది ఆమె ఆలోచనలు అనంతంలో కలిసిపోయాయి. నేను శూన్యంలో మిగిలిపోయాను..ఆమె లేదు,కృష్ణా, ఢిల్లీ వాసా అనే పిలుపు ఇంకా గుండెల్లో  ప్రతిధ్వనిస్తోంది. ఆమె జీవితాన్ని ప్రేమించింది. చివరకు జీవితం ఆమెకు విముక్తిని ప్రసాదించింది. మరణమే జీవితమైనప్పుడు జీవితానికి అర్థం ఏముంది? పక్షుల రెపరెపల్లోనూ, నీటి ప్రవాహాల్లోను, పిల్లల నవ్వుల్లోనూ, చల్లగా తాకే గాలిలోనూ, పాదాలను పలకరించే పచ్చగడ్డిలోనూ, ఆకాశంలో పరుచుకున్న వెన్నెలలోనూ, విశాలంగా విస్తరించిన నీలి ఆకాశంలోనూ,ఎగిసిపడే కెరటాల్లోనూ ఆమె కలిసిపోయింది. *
Post Date: Wed, 14 Jun 2023 21:23:11 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger