Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 1 June 2023

కింకరుల సామ్రాజ్యం - కృష్ణుడు

రా తి గోడలు  మౌనంగా తలవాల్చి ఎదురు చూస్తున్నాయి అతడి రాకకోసం. నీలి ఆకాశం నేలకు వంగి మోకరిల్లుతుంటే రెక్కలు ఆగిన పక్షులు నేల రాలాయి. అతడింకా రాలేదు రహదారులు నిన్నటి మరణాలను ఇముడ్చుకున్న శవపేటికల్లా రోదిస్తున్నాయి. అతడింకా ప్రవేశించనే లేదు. ఎత్తైనా గోడపై కూర్చున్న మూడు సింహాల కోరలనుంచి నెత్తుటి చుక్కలు రాలుతూ వాతావరణాన్ని శోభాయమానం చేస్తున్నాయి. అతడి కాలి అడుగుల సవ్వడి కోసం అవి చెవులు రిక్కించి ఎదురు చూస్తున్నాయి. రా త్రి వానకు చల్లారిన ఎండ మళ్లీ ఆకలిగొన్నట్లు అగ్ని కీలల్ని ప్రవహింపచేస్తోంది రాలిపోయిన చెట్ల ఆకులు తమను కోల్పోయిన కొమ్మల వైపు దిగాలుగా చూస్తున్నాయి. ఎక్కడా చడీ చప్పుడూ లేదు ఎక్కడి నుంచో వినిపిస్తున్న చల్లారిన చితిమంటల ధ్వనులు తప్ప! ఆలయాల్లో కళ తప్పిన విగ్రహాలను చూసి మెట్లు దిగుతున్న మరమనుషులు మెట్లముందు భిక్షా పాత్రలతో చేతులు చాచిన దరిద్రంలో ప్రతిఫలిస్తోంది  భారతీయ ఆత్మనిర్భరత్వం! ఎ వరూ ఎవర్ని నిందించడం లేదు, ప్రతి ఒక్కడూ కత్తులతో తలపై రాతల్ని గీకేసుకుంటున్నాడు రక్తం చిందినా పట్టించుకోకుండా. ఉదయాన్నే టీవీ చూసి స్వామీజీ సలహాతో సాయంత్రం శనీశ్వరుడి ముందు దీపాలు వెలిగిస్తున్నాడు పొద్దున్నే లేచి ఎవడి ప్రవచనానికో అబ్బురపడేవాడు మధ్యాహ్నం నాయకుడి మనసులో మాటకు పరవశిస్తున్నాడు మార్కెట్లో పెరుగుతున్న ధరలకు మండిపడుతూ, పిల్లలకు ఫీజులు కట్టలేక ఏడుస్తూ, క్యాన్సర్ తో క్షీణిస్తున్న తల్లికి చికిత్స చేయించలేక రోదిస్తూ  కూడా వాట్సాప్ లో  ద్వేష భక్తి సందేశాల్ని ఫార్వర్డ్ చేస్తూ నిజమైన భారతీయుడినని మురిసిపోతున్నాడు గంగానది వద్ద హారతి తిప్పుతున్న మహానేతను చూసి అతడే దేశ సంరక్షకుడని ప్రచారం చేస్తున్నాడు రై లు నడుస్తుంటే అడవి వెనక్కి వెళుతున్నట్లు గడియారం భయం భయంగా వెనక్కు వెళ్లుతోంది. సంవత్సరాలు వెనక్కు నడుస్తున్నాయి. క్రీస్తు శకం నుంచి క్రీస్తు పూర్వానికి పయనిస్తోందా కాదు,  కలియుగం నుంచి ఆదిమయుగం లోకి సాగుతుందా తెలీక కాలమే తన్ను తాను మరిచిపోయింది చెట్లకు వ్రేళ్లాడుతున్న, సూట్ కేసుల్లో, ఫ్రిజ్ లలో ముక్కలై నిద్రిస్తున్న అనామికల ఛిద్రమైన నేత్రాల్లో కాలం స్తంభించిపోయింది, జంతర్ మంతర్ దాటి అడుగు ముందుకు వేస్తే జలియన్ వాలాబాగ్ ప్రవేశిస్తోంది. ఉన్నట్లుండి  వెనక్కు నడుస్తూ కరతాళ ధ్వనులు చేస్తున్న మనుషులను చూసి. పాదాలు వెనక్కు తిరిగిన దయ్యాలూ భయభ్రాంతులవుతున్నాయి భక్తి పారవశ్యంలో మూసుకున్నాయేమో శిరస్సుల  ముందు ఉన్న కళ్లకు పెద్దగా పనిలేకుండా పోతోంది అ తడు ప్రవేశించాడు గాలిని ఛాతీతో ఛేదిస్తూ నిశ్శబ్దంగా మూలన నక్కిన కింకరులంతా తలలు వాల్చారు వాలిన రెప్పలపై నడుస్తూ అతడు పరుచుకున్న పూలను పాదాలతో నలిపివేస్తూ ముందుకు సాగాడు మరో మూల నక్కిన ఒళ్లంతా విభూతి దాల్చిన మహానుభావులంతా జయజయధ్వానాలు చేశారు. అతడు యజ్ఞం చేస్తే వారి కళ్లలో జ్వాలలు వెలిగాయి అతడు మంత్రదండంతో ముందుకు సాగితే అంతా మంత్రముగ్ధులై ధన్యత్వం పొందారు అతడి నోటిలోంచి వచ్చే పవిత్ర ధ్వనితరంగాలకు సభా ప్రాంగణాలు పరవశించాయి సైనిక కవాతులూ, బూట్ల ధ్వనుల మధ్య ఆకులు కూడా తలెత్తని చోట ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. ఆధునిక భారత నిర్మాణం కింకరుల ఘీంకారాల మధ్య అమృతకాలంలో ప్రవేశించింది. *
Post Date: Thu, 01 Jun 2023 12:24:45 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger