1975 జూన్, జూలై సమయాలకి …అంటే అమెరికా వచ్చిపడిన ఆరునెలలకి హ్యూస్టన్ లో నా జీవితం కొంచెం గాడిన పడింది. అతి కొద్ది పాటి జీతం తో జీవితం ఆనందంగా గడవడం మొదలయింది. ఉన్న ఐదారుగురు స్నెహితులూ స్థానిక రైస్ యూనివర్శిటీ లో డాక్టరల్ విద్యార్ధులే కాబట్టి అందరిదీ బ్రహ్మచారి జీవితాలే. అనుకోకుండా శాన్ ఏన్టోనియో నగరం లో పరిచయం అయిన పుచ్చా మల్లిక్, వసంత లే బాగా పరిచయం అయిన మొట్టమొదటి యువ దంపతులు అని చెప్పుకోవాలి. అప్పటికి వాళ్ళకి ఐదారేళ్ళ కొడుకు. నేను వెలగబెట్టే యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లోనే వసంత ఫార్మకాలజీ లో డాక్టరేట్, మల్లిక్ ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ విద్యార్ధులు. వీళ్ళూ, అప్పటికే నాకు తెలిసిన దువ్వూరి సూరి & హీరా దంపతులు, అనిల్ కుమార్ & రత్నపాప దంపతులూ…సహ బ్రహ్మచారి అశోక్ కుమారూ..మేమందరం ఒకే వయసు వాళ్ళం. దురదృష్టవశాత్తూ అంతకు ముందే భార్యని పోగొట్టుక్కున్న డీ.ఏ.ఏస్.నారాయణ రావు గారు అందరికన్నా సీనియర్. ఆయనే నాకు ముందు వుద్యోగం కూడా ఇచ్చారు. వీరందరి వలనా మెడికల్ సెంటర్ లో ప్రొఫెసర్లు గా పనిచేసే డా. పోతు నరసింహా రావు & రాజేశ్వరి, డా. పట్టిసపు రామజోగి గంగాధరం, శకుంతల దంపతులు పరిచయం అయ్యారు. ఈ మూడు కుంటుంబాలూ 1970-75 ప్రాంతాలలో హ్యూస్టన్ నగరం లో..ఆ మాటకొస్తే యావత్ టెక్సస్ లోనే తెలుగు వారి ఉనికి కి పట్టుగొమ్మలు అని చెప్పుకోవాలి. (పైన ఫోటోలో చూడండి) వీరిలో పి.ఎన్. రావు దంపతులు (పోతు నరసింహా రావు గారు) 90 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఎంతో ఆసక్తితో ఇక్కడ సాంస్కృతిక కార్యకమాలకి వస్తూ…నన్ను, మా అర్ధాంగినీ ఎంతో ఆప్యాయంగా అప్పటి లాగానే ఇప్పుడు కూడా అక్కున చేర్చుకుంటూనే ఉంటారు. ఐదారేళ్ళ క్రితం ఆయన తన ఆత్మకథ నా చేత ఆవిష్కరణ చేయించి నాకు ఎంతో గౌరవం చేశారు. ఆ రోజుల్లో గుంటూరు సీతాపతి రావు అనే అతను ఒక మెక్సికన్ అమ్మాయిని పెళ్ళిచేసుకుని సంచలనం సృష్టించాడు. ఇక బ్రహ్మచారులలో నేను, అశోక్ కుమార్, తమ్మారెడ్డి చంద్ర శేఖర రావు మొదలైన ఐదారుగురం మాత్రమే. కుటుంబీకులలో తరవాత రెండు, మూడేళ్ళలో పరిచయం అయిన వారు తుమ్మల కుటుంబ రావు & కుసుమ, రవి తమిరిశ & పద్మ, జి. మోహన రావు & మణి, చావలి రామసోమయాజులు & బాల, సుసర్ల శర్మ & కుమారి, కలపటపు వేణు & లక్ష్మి, తోట సూర్యారావు & రాణి, పొలాని జానకి రామయ్య & శారద, జానీ బేగమ్ & వలీ, చంద్రకాంత & డేవిడ్ కోర్ట్నీ. సూర్యకుమారి & మహాబలి రాజా, దేవరకొండ హనుమంత రావు & లక్ష్మి, కొడాలి సూర్యం, కొడాలి సుబ్బారావు & అవనిజాత, బావికాటి నాయుడు & స్వర్ణలత, బిలకంటి గంగాధర్ & లలిత, కేశవ రావు, కోనేరు తాతయ్య & రూప గారు ఆయన మొదలైన వారు. అసలు పేరు తెలియదు కానీ బుర్ర మీసాలతో చూడ్డానికి భయం వేసే ఉండేలా ఆయన్ని ఖూనీల్ రెడ్డి అని మేము సరదాగా పిలిచినప్పుడు ఎంతో మంచి వాడు ఆయన హాయిగా నవ్వేసే వాడు. 1975 ఏడాది ఆఖరికి వీళ్ళందరినీ అప్పుడప్పుడు కలిసే అవకాశం వచ్చింది కానీ అదంతా ఎవరైనా ఏదో ఒక వారాంతం లో భోజనాలకి పిలిచి కలుసుకుని తెలుగు లో కబుర్లు చెప్పుకునే సందర్భాలే. అమెరికా లో కూడా కలర్ టీవీలు వచ్చింది ఆ రోజుల్లోనే!. వీడియో, కంప్యూటర్ లాంటి పదాలు, పరికరాలు లేనే లేవు. ఫోన్లు అంటే కేవలం బల్ల మీద పెట్టుకునేవే! జేబులో ఫోన్, కారులో ఫోన్ అనేవి ఊహల్లో కూడా లేవు. కార్ల లో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ మొదలైనవి కూడా చాలా అరుదు. ఉన్నా ఖరీదు చాలా ఎక్కువ. మాది అనాగరిక మొదటి తరం అని ఎవరైనా అనుకున్నా పరవా లేదు. 1975 ఆగస్ట్, సెప్టెంబర్ ప్రాంతాలలో రత్నపాప రాకతో స్థానికంగా కూచిపూడి నృత్యానికి ఒక పెద్ద సంచలనం వచ్చింది. వెంపటి చిన సత్యం గారి ప్రముఖ శిష్యురాలిగా అప్పటికే రత్న పాప చాలా అటు కూచిపూడి లోనూ, భరత నాట్యం లోనూ పేరున్న నర్తకీమణి. తను రాగానే ఇక్కడ ఆ నాట్య సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఒక వేదిక కావలసి వచ్చింది. నాకు అప్పటికే బొంబాయి లో నాటకాలు వెయ్యడం, సంగీత, నాట్య, సినీ గేయాలతో సాంస్కృతిక కార్యక్రమాలు బి.వై. మూర్తి, పి.ఆర్. కె. రావుల తో కలిసి నిర్వహించిన అనుభవం,ఆసక్తి ఉండనే ఉన్నాయి. అలాగే దువ్వూరి హీరా మంచి గాయని, వీణా విద్వాంసురాలు. వసంత, బాల, పొలాని జానకి రామయ్య, బిలగంటి గంగాధర్ మొదలైన వారు మంచి గాయనీగాయకులు. ఇక డా. రవి తమిరిశ, అతని తమ్ముడు కిరణ్ మృదంగ విద్వాంసులు. అప్పటికే హ్యూస్టన్ లో పట్టిసపు గంగాధరం గారి అమ్మాయి కామేశ్వరి, కోనేరు తాతయ్య గారి అమ్మాయి భరత నాట్యం నేర్చుకుంటూ ఎప్పుడైనా ఇండియా ప్రోగ్రాములు జరిగినప్పుడు వాటిల్లో పాల్గొంటూ ఉండేవారు. ఈ విధంగా అప్పటి హ్యూస్టన్ మహా నగరం లో ఉన్న 20-25 తెలుగు కుటుంబాలలో సాంస్కృతిక అవగాహన, తగినంత మందికి తగినంత స్థాయిలో నైపుణ్యం..అన్నీ ఉన్నాయి. లేనిదల్లా అందరినీ కలిపే ఒక సాంస్కృతిక వేదిక. బొంబాయి లో అటువంటి వేదికని ఏర్పాటు చేసి, ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశాన్ని అందిపుచ్చుకున్న నాకు అదే వాతావరణం హ్యూస్టన్ లో కూడా కనపడింది. ఇక్కడ నేను కేవలం నా జ్ఞాపక శక్తి లోపం వలన ఆనాటి హ్యూస్టన్ తెలుగు వారిలో ఎవరి పేరు అయినా ప్రస్తావించక పోతే అందుకు మన్నించమని కోరుతున్నాను. 1975 ఏడాది నవంబర్ రోజుల్లో అనుకుంటాను….ఒక రోజు యాదాలాపంగా అనిల్ కుమారూ, సూరీ, ఇంకా ఇతర మిత్రులు వారాంతం పార్టీలో కలుసుకున్నప్పుడు ఇక్కడ ఒక సాంస్కృతిక సమితి పెట్టుకుంటే ఎలా ఉంటుందీ అనే ఆలోచన బయట పెట్టాను. అందరికీ ఆ ఆలోచన నచ్చింది. అంత వరకూ ఉగాది, దీపావళి లాంటి పండగలు ఎవరో ఒకరి ఇంట్లోనో జరుపుకోవడం అందరికీ ఇబ్బంది గానే ఉంది. అలా కాకుండా ఏదో ఒక పబ్లిక్ ఆడిటోరియం లోనూ, క్లబ్ హౌస్ లోనో కలుసుకోడానికి ఒక సంస్థ అవసరం అనే ఆలోచనా బీజం బహుశా అంతకు ముందే పడినా నా వివరణ, స్వీయ అనుభవాలు చెప్పడం వలన ఆ నాడు అది బాగా బలపడింది. వాళ్ళ ప్రోత్సాహం తో నేను ఈ ప్రతిపాదన మిగిలిన తెలుగు వారందరికీ చెప్పడం మొదలు పెట్టాను. దానికి అనిల్, పాప ఇతరులు మాట సాయం చేశారు. ముందుగా స్పందించిన వారిలో తుమ్మల కుటుంబ రావు, పోతు నరసిం హారావు గారు, గంగాధరం గారు, నారాయణ రావు గారే కాక ఇంచుమించు అందరూ "ఆలోచన బావుంది" అన్నారు కానీ అందరికీ ఎవరి అనుమానాలు, ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. 1975 నాటికి అమెరికాలో న్యూ యార్క్ లో Telugu Literary & Cultural Association (TLCA), Telugu Association of Greater Chicago, Telugu Association of Southern California, Telugu Association of Greater Delaware Valley, Greater Washington Telugu Cultural Sangam..ఇలా అమెరికా మొత్తం మీద తెలుగు సంఘాలు వెళ్ళమీద లెక్క కట్టేటన్ని మాత్రమే ఉన్నాయి. అసలు కంప్యూటర్ అనే మాటే తెలియని ఆ రొజుల్లో ఆయా సంఘాలు, వాటి సమాచారాలు స్నేహితులు, బంధువులు ఫోన్ల ద్వారా చెప్తే వినడమే కానీ ఇప్పటి లాగా సోషల్ మీడియా అనేదే లేదు. అలా విన్నవాటిల్లో అందరినీ బాధించిన విషయం సాంస్కృతిక విషయాల మాట ఎలా ఉన్నా ఆయా సంఘాలలో చోటు చేసుకున్న కుల ప్రాతిపదిక రాజకీయాలు. అందు వలన హ్యూస్టన్ లో ఉన్న పాతిక మంది కుటుంబాలు కూడా ఒక సంస్థ పెట్టగానే ఆ లేనిపోని రాజకీయాలు వచ్చి మనల్ని విడదీస్తాయేమో…ఎందుకొచ్చిన గొడవ అని చాలా మంది గట్టిగానే అభిప్రాయ పడి తెలుగు సంస్థ వ్యవస్థాపనని వ్యతిరేకించారు. నమ్మండి, నమ్మక పొండి. హ్యూస్టన్ లో తెలుగు సంఘం పెట్టాలా, వద్దా అనే అంశం మీద సుమారు ఆరు నెలల పాటు ఆ పాతిక తెలుగు కుంటుంబాలూ ఎప్పుడు, ఎవరు కలుసుకున్నా మాట్లాడుకుని తర్జన భర్జనలు పడ్డారు. అందరిదీ ఒకటే ప్రశ్న…మిగతా చోట్ల లాగా హ్యూస్టన్ లో కుల రాజకీయాలు లేకుండా ఒక సంస్థ నడప గలమా, లేదా అనేదే!. దానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. నా విషయాని కొస్తే అటు పుట్టి పెరిగిన కాకినాడ లో కానీ. పై చదువులు చదువుకుని, సాంస్కృతిక వికాసానికి కళ్ళు తెరిచిన బొంబాయి లో కానీ ఈ కులం ప్రసక్తి రానే లేదు. అసలు అలాంటి రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎందుకుంటాయో ఏ మాత్రం అవగాహన లేని అమాయకుడిని. ఆ సంగతులు నాకు అమెరికా వచ్చాకే అనుభవం లోకి వచ్చాయి. మొత్తానికి 1975 ఆఖరి కి హ్యూస్టన్ లో తెలుగు సాంస్కృతిక సమితి ఏర్పాటు కి అందరూ అంగీకరించారు. వెంటనే నారాయణ రావు గారు, పి.ఎన్. రావు గారు, మస్తాన్ వలీ, తమ్మారెడ్డి చంద్ర శేఖర్ సభ్యులు గా సమితి రాజ్యాంగం ..అంటే constitution తయారు చెయ్యడానికీ, దాన్ని తెలుగు లో వ్రాయడానికి నన్నూ ఎంపిక చేసి ఆ బాధ్యతలని అప్పగించారు. వారు ఎంతో కష్టపడి, ఎన్నెన్నో గంటల కొద్దీ పరిశోధనలు, చర్చలు చేసి మొత్త్తానికి ఏప్రిల్ 1976 నాటికి 'తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్' అనే పేరిట ఒక లాభాపేక్ష సంస్థ ఏర్పాటు అయింది. ఆ రాజ్యాంగం ప్రకారం సభ్యులు కనీసం ఇద్దరు మహిళలు ఉన్న ఏడుగురు వ్యక్తులని సమాన స్థాయి కార్యనిర్వాహక వర్గ సభ్యులు గా ఎన్నుకుంటారు. ఆ ఏడుగురూ తమలో ఒకరిని సమన్వయ కర్త (Coordinator), సహ సమన్వయ కర్త (Co-Coordinator) గానూ నియమించి తమ విధులు తామే నిరర్ణయించుకుంటారు. అధ్యక్ష పదవి కాని, మరేవిధమైన టైటిల్ ఉన్న పదవులు, వాటి కోసం సార్వత్రక ఎన్నికలూ ఉండవు. ఆ విధంగా రాజకీయాల బారి నుంచి తప్పించుకో వచ్చును అని వారి ఆశ, ఆలోచన. టెక్సస్ రాష్త్రం లో ఈ సమితి ని రిజిస్టర్ చెయ్యడానికి ఇంగ్లీషు లో వ్రాసిన మా రాజ్యంగం, విధి విధానాలని నేను తెలుగు లో అనువాదం చేసి, ఆ రెండిటినీ అధికారిక పత్రాలుగా అందరికీ ఇచ్చి సంతకాలు పెట్టించాం. ఇంచు మించు ఆ పాతిక మంది ఇళ్లకీ నేను వెళ్ళి, రాజ్యాంగం లో అన్ని అంశాలూ వివరించి, అందరి ప్రశ్నలకీ సమాధానాలు చెప్పి, ఒప్పించి అప్పుడు సంతకాలు పెట్టించడం అనుకున్నంత సులభం కాదు. పైగా నాకొచ్చిన డ్రైవింగ్ అంతంత మాత్రమే. ఇక ఈ రాజ్యంగాన్ని అందరూ ఆమోదించాక హ్యూస్టన్ లో మంతనాలు మొదలయ్యాయి. హ్యూస్టన్ నగర పెద్దలు అయిన నారాయణ రావు, గారు, పి.ఎన్. రావు గారు, గంగాధరం గార్లలో ఎవరో ఒకరు సమన్వయ కర్త గా ఉంటే సమంజసంగా ఉంటుంది అని నేనూ, అనిల్ కుమారూ, వసంత, మల్లిక్ ..ఇలా మాలో మేము అనుకున్నాం కానీ కోనేరు తాతయ్య గారు సమన్వయ కర్తగా ఉండాలని తుమ్మల కుటుంబ రావు గారు పట్టు పట్టి ప్రచారం చేశారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ….హ్యూస్టన్ లో సాంస్కృతిక సమితి మొదలు పెట్టగానే వర్గాధిపత్యం కూడా అంతర్లీనంగా ప్రవహించింది అని చెప్పుకోవచ్చును. ఆది లోనే హంస పాదు ఎందుకూ, మొదటి సారే ఎన్నికలు ఎందుకూ, సామరస్యంగా, ఏకగ్రీవంగా కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకుందాం అందరం అనుకున్నాం. ఆ విధం గా తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్ కి మొట్టమొదటి కార్యనిర్వాహక సంఘానికి కోనేరు తాతయ్య గారు సమన్వయ కర్త గానూ, నేను సహ సమన్వయ కర్త గానూ ఎంపిక అయ్యాం. ఇతర సభ్యులు పి.ఎన్. రావు గారు, తుమ్మల కుంటుంబ రావు, తమ్మారెడ్డి చంద్ర శేఖర్, పోతు రాజేశ్వరి, వసంత లక్ష్మి పుచ్చా, ఇదంతా జరగడానికి మరొక మూడు, నాలుగు నెలలు పట్టింది. అనగా, సుమారు ఏడాది పాటు మంతనాల తర్వాత 1976 అక్టోబర్, నవంబర్ సమయానికి హ్యూస్టన్ లో తెలుగు సాంస్కృతిక సమితి అధికారికంగా ఏర్పాటు అయింది. అంతకు ముందే…అంటే రత్నపాప హ్యూస్టన్ రాగానే ఇక్కడ ఒక డాన్స్ స్కూల్ స్థాపించి భారతీయులకీ, అమెరికిన్లకీ కూచిపూడి, భరత నాట్యం నేర్పించడానికి సమాలోచనలు మొదలుపెట్టింది. 1975 అక్టోబర్ లో విజయ దశమి నాడు "Anjali Center for Performing Arts" అనే పేరిట రత్నపాప తన డాన్స్ స్కూల్ ప్రారంభించి చరిత్ర సృష్టించింది. నా మీద అభిమానం తో ఆ సంస్థకి తొలి డైరెక్టర్లు ముగ్గురి లో నన్ను కూడా చేర్చుకుని నాకు ఎంతో గౌరవం చేశారు పాప, అనిల్. ఆ రోజుల్లో అనిల్ నడిపే 'మహారాజా' రెస్టారెంట్ లో ఒకరిద్దరు విద్యార్ధినులతో అంజలి సెంటర్ ప్రారంభ అయింది. ఆ ఇద్దరిలో ఒకమ్మాయి దేవరకొండ హనుమంత రావు & లక్ష్మి గార్ల పెద్ద కూతురు విజయ. సుమారు 50 ఏళ్ళ ప్రస్థానం లో రత్నపాప కొన్ని వేల మందికి కూచిపూడి, భరత నాట్యాలలో అత్యున్నత స్థాయి సుశిక్షణ ఇచ్చి, వారి అరంగేట్రాలు చేయించి, తన కొరియాగ్రఫీ ద్వారా వందలాది నూతన దృశ్యకావ్యాలకి రూప కల్పన చేసి, ఇటు అమెరికాలో టెక్సస్ రాష్త్రం, అమెరికా ప్రభుత్వాల నుంచి అటు భారత దేశ కేంద్ర సంగీత నాటక ఎకాడెమీ వారి అత్యున్నత పురస్కారాల దాకా వేల కొద్దీ ప్రతిష్టాత్మకమైన గుర్తింపులు పొంది, అర్ధాంతరంగా భర్త అనిల్ నీ, కుమారుడు కేదార్ నీ పోగొట్టుకున్నా చెక్కు చెదరకుండా కళా సేవకి అంకితం అయిన రత్న పాప నాకు ఎంతో ఆప్తురాలు. పాప, అనిల్, అనేక మంది అన్ని భాషల వారూ కలిసి ఎన్నెన్నో నాటకాలు, situation comedies, జానపద, తదితర నృత్య కార్యక్రమాలు మొదలైనవి కలిసి, మెలిసి ఏళ్ళ తరబడి నిర్వహించాం. కళాకారులుగా ఎంతో ఆనందాన్ని పంచిపెట్టి మేము అపారమైన ఆత్మ సంతృప్తిని పొందాం. అప్పుడప్పుడు ఇబ్బందులూ ఎదుర్కొన్నాం. ఆ విధంగా 1975 విజయ దశమి నాడు రత్న పాప స్థాపించిన "అంజలి సెంటర్", 1976 ఏప్రిల్ ప్రాంతాలలో అమెరికాలో బహుశా 5వ తెలుగు సంస్థ గా ప్రారంభం అయిన "తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్, టెక్సస్" చరిత్ర సృష్టించాయి. ఆ రెండింటి లోనూ నా పాత్ర ఉండడం నా అదృష్టమే1. ఒక కళాకారుడిగా, సాంస్కృతిక రంగం లో సమాజానికి కాస్తో, కూస్తో సేవ చేసే అవకాశం లభించిన వాడిగా అమెరికాలో నా పబ్లిక్ జీవితం ఆ విధంగా ప్రారంభం అయింది. 1976 లోనే జరిగి, నా జీవితాన్నే మార్చేసిన కొన్ని కీలక సంఘటనల గురించి…మరొక సారి….. *
Post Date: Thu, 01 Jun 2023 12:24:45 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 01 Jun 2023 12:24:45 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment