చూడమని చేతికిస్తే సుక్కురారమని ఇంట్లో పెట్టుకుంది. ఇదో నానుడి, పల్లెలలో చెప్పుకుంటాం.ఓ బుల్లి కత చెప్పుకుందాం. అనగనగా ఒక పల్లె, అందులో ఒక పేదరాలు.జన్మలో బంగారపు ఆభరణం చేయించుకోలేదు. పెళ్ళప్పుడే మొగుడు మావిడాకు మడిచి పుస్తి కట్టేడు. ఆ తరవాత పసుపుకొమ్ము కట్టుకుంది. ఆవిడకో కోరిక, జీవితంలో, ఒక మంచి నగ చేయించుకోవాలని. చాలాకాలం తరవాత ఒక నగ చేయించేడు,పోరగా,పోరగా మొగుడు.ఇరుగు పొరుగులకి చూపించుకుంది. అంతా బాగుంది,బాగుందన్నారు, సంబరపడింది. పక్క వీధిలో ఉన్న దూరపు బంధువు, కలిగినది, ఒంటి నిండా ఆభరణాలతోనే ఉంటుందెప్పుడూ, ఆవిడ ఇంటి కెళ్ళి ఆ నగ చూపించింది, అదేమో సాయంత్రపు వేళ, అందులోనూ శుక్రవారం. ఆవిడ చూసింది. నగ బాగుందంది, బరువు, ఖర్చైన సొమ్ము వివరాలడిగింది, ఇటువంటిది నా దగ్గర లేదనీ చెప్పింది,నీకు అందంబాగా తెలుసని పొగిడింది. పిచ్చి, పేద ఇల్లాలు మొహం చింకి చేటంతయింది. ఇంకేంటి ఈ పేదరాలికి ఏనుగెక్కినంత సంబరమయింది. మా అత్తగారికి చూపిస్తాను, నేనూ చేయించుకుంటానంది. నగ పట్టుకుని లోపలికెళ్ళింది. ఎంతకీ బయటికి రాదు, నగ తెచ్చి ఇవ్వదు. చూసి చూసి పేదరాలు వదినా చీకటడుతోంది, నగ ఇస్తే ఇంటికెళతానూ అని కేకేసింది. చాలా సేపు కేకేసిన తరవాత ఆ ధనికురాలు బయటికొచ్చి. అదేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళిపోయావనుకున్నా, అంది. విస్తుపోయిన పేదరాలు నగ ఇస్తే వెళ్ళిపోతానంది. దానికా ధనికురాలు, ఈ వేళ సుక్కురారం కదా, అందులోనూ సాయంత్రంపడి చిన్న తల్లి ఇంటికొచ్చింది, ఎలా ఇస్తానూ, రేపొచ్చి పట్టుకెళ్ళు, అంది.ఏమనాలో తెలియని పేదరాలు ఏడుపుముఖంతో తిరిగొచ్చింది. మర్నాడు ఉదయమే వెళ్ళింది, బారెడు పొద్దెక్కినా నిద్దరమంచం మీంచి లేవని మహాతల్లి నెమ్మది గ లేచి ఆవలిస్తూ బయటికొచ్చి, రాత్రి మావారికి చూపించా, నాకూ చేయిస్తానన్నారు, నగ కంసాలికి చూపించి, మోడల్ కోసం, ఇస్తాలే అంది నిర్లక్షంగా. ఏమనాలో తెలియని పేద ఇల్లాలు విసవిసలాడుతూ ఇంటికొచ్చింది. విసవిసలాడుతున్న ఇల్లాలిని చూసిన మగడు ఏమైందని అడిగేడు. చెప్పకతప్పలేదామెకు. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది,గుడ్లనీరుగుక్కుకుంటూ.ఆమె బాధ చూచిన భర్త అనునయంగా, పిచ్చిదానా కలిగినవారితో వ్యవహారం ఇలాగే ఉంటుంది. జరిగిందేదో జరిగింది,తరవాతెళ్ళి తెచ్చుకో అని చెప్పడం తో ఊపిరిపీల్చుకుంది. తిడతాడనుకున్న మగడు సౌమ్యంగా మాటాడి అనునయించేటప్పటికి ఏడుపొచ్చి భర్తను చుట్టేసింది. మధ్యాహ్నం వెళ్ళింది. భోజనం చేస్తున్నానని గడపలో నుంచోబెట్టి, నెమ్మదిగా బయటికొచ్చి కంసాలి చూడడం అవలేదట, సాయంత్రంరా అని విసురుగా లోపలికెళ్ళుతూ,నగ తినేస్తామనుకుంటుందో ఏమో! అని గొణుక్కుంటూ లోపలికెళ్ళింది. విన్న పేదరాలు చేయగలది లేక తిరిగొచ్చింది. సాయంత్రం వెళితే నిలబెట్టి, నిలబెట్టి నగపట్టుకొచ్చి చేతికిచ్చింది. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది. మరెప్పుడూ ఇలాటి తప్పు చేయకూడదనుకుంటూ. ఇదీ చూడమని చేతికిస్తే సుక్కురారం కత. జీవితం లో అప్పుడప్పుడు ఇటువంటి అనుభవాలందరికి జరుగుతూనే ఉంటాయి.
Post Date: Tue, 13 Jun 2023 03:35:24 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Tue, 13 Jun 2023 03:35:24 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment