Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 25 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౮(638) - Aditya Srirambhatla

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 10.2-1323-వ. అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునఁ బూజ్యం బగు రాజ్యంబు సేయుచుఁ బురందరవిభవంబున నిరవొంది కనక మణిమయ విమాన, మండప, గోపుర, ప్రాసాద, సౌధ, చంద్రశాలాంగణాది వివిధ భవనంబు లందును రంగదుత్తుంగతరంగ డోలావిలోల కలహంస, చక్రవాక, కారండవ, సారస, క్రౌంచముఖ జలొవిహంగ విలసదుచ్చలిత గరు దనిల దరదమల కమల, కుముద, కహ్లార సందోహ నిష్యంద మకరందరసపాన మదవదిందిందిరకుల కల గాయక ఝంకార నినదంబులును, నిరంతర వసంతసమయ సముచిత పల్లవిత, కోరకిత బాలరసాలజాల లాలిత కిసలయ విసర ఖాదన జాత కుతూహలాయమాన కషాయకంఠ కలకంఠ కలరవ మృదంగ ఘోషంబులును, నిశిత నిజచంచూపుట నిర్దళిత సకలజన నయనానంద సుందరనందిత మాకంద పరిపక్వ ఫలరంధ్ర విగళిత మధుర రసాస్వాదనముదిత రాజకీర శారికా నికర మృదు మధురవచన రచనావశకృత్యంబులును నమరఁ, బురపురంధ్రీజన పీన పయోధర మండల విలిప్త లలిత కుంకుమ పంక సంకుల సౌగంధ్యానుబంధ బంధురగంధానుమోదితుండును, జందనాచల సానుదేశసంజాత మంజుల మాధవీలతానికుంజ మంజుల కింజల్క రంజిత నివాస విసర విహరమాణ శబరికా కబరికా పరిపూర్ణ సురభి కుసుమమాలికా పరిమళ వహుండును, గళిందకన్యకా కల్లోల సందోహ పరిస్పంద కందళిత మందగమనుండును నగు మందానిల విదూషకునిచేఁ బోషితాభ్యాసిత లాలిత లగు నేలాలతా వితాన నటుల నటనంబుల విరాజితంబులగు కాసారతీర భాసురోద్యానంబులందును, జారు ఘనసార పటీర బాలరసాల సాల నీప తాపింఛ జంబూ జంబీర నింబ కదంబప్రముఖ ముఖ్య శాఖి శాఖాకీర్ణ శీతలచ్ఛాయా విరచిత విమల చంద్రకాంతోపల వేదికాస్థలంబులందును, నుదంచిత పింఛవిభాసిత బాలనీలకంఠ కేకార వాకులీకృత కృతక మహీధరంబు లందును, లలితమణి వాలుకానేక పులినతలంబు లందును, గప్పురంపుం దిప్పలను, గురువేరు చప్పరంబులను, విరచిత దారు యంత్ర నిబద్ధ కలశ నిర్యత్పయో ధారాశీకర పరంపరా సంపాదిత నిరంతర హేమంత సమయ ప్రదేశంబులందును, నిందిరారమణుండు షోడశ సహస్ర వధూయుక్తుండై యందఱ కన్ని రూపులై లలితసౌదామినీలతా సమేత నీలనీరదంబుల విడంబించుచుఁ గరేణుకాకలిత దిగ్గజంబు నోజ రాజిల్లుచు, సలిలకేళీవిహారంబులు మొదలుగా ననేక లీలా వినోదంబులు సలుపుచు, నంతఃపురంబునఁ గొలువున్న యవసరంబున వివిధ వేణువీణాది వాద్యవినోదంబులను, మంజుల గానంబులను, గవి గాయక సూత వంది మాగధజన సంకీర్తనంబులను, నటనటీజన నాట్యంబులను, విదూషక పరిహాసోక్తులను సరససల్లాప మృదుమధుర భాషణంబులను బ్రొద్దుపుచ్చుచు నానందరసాబ్ధి నోలలాడు చుండె; నంత. భావము: అలా శ్రీకృష్ణుడు దేవేంద్రవైభవంతో సగౌరవంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ద్వారకానగరంలో చాలా కాలం ఉన్నాడు. ఆ నగరంలో రత్నాలు పొదిగిన బంగారు మయమైన విమానాలు, మండపాలు, గోపురాలు, ప్రాసాదాలు, డాబాలు, సౌధాలు, రాజభవనాలు ముంగిళ్ళు ఉన్నాయి. అక్కడి సరోవరాలలో ఉత్తుంగ తరంగాలలో ఊయలలూగే కలహంసలు, కారండాలు, చక్రవాకాలు, బెగ్గురులు, క్రౌంచాలు మున్నగు నీటి పక్షులు విహరిస్తున్నాయి. తెల్ల తామరలు, తెల్ల కలువలు, ఎఱ్ఱ కలువలు యందు స్రవిస్తున్న మకరందాన్ని త్రాగి మత్తిల్లిన తుమ్మెదల ఝంకార గానాలు మారుమోగుతున్నాయి. ఎడతెగని వసంత ఋతువు విరాజిల్లుతున్నట్లు సదా చిగురించి, మొగ్గలు తొడిగిన లేత మామిడి పల్లవాలను తిని కుతూహలంతో వగరెక్కిన గొంతులతో కూసే కోయిలల కమ్మని కూజితాలు వినిపిస్తున్నాయి. అందరూ ఇష్టపడె సుందరమైన తియ్య మామిడిపళ్ళ రసాన్ని త్రాగి ఆనందంతో పలికే చిలుకల గోరువంకల తియ్యని పలుకులు వీనుల విందుచేస్తున్నాయి. మెత్తని పలుకులతో అలరించే అప్సరసల బలిష్ఠమైన స్తనములపై పూయబడిన కుంకుమాది సుగంధ ద్రవ్యాల సువాసనలు మనోఙ్ఞంగా వస్తున్నాయి. మలయ పర్వత సానువుల్లో సంచరించే శంబర స్త్రీల కొప్పులలోని పూలమాలలు సురభి పరిమళాలుతో కూడిన మందమారుతాలు వీస్తున్నాయి. ఏలకి ఆది లతలు మనోహరంగా పోషింపబడుతున్నాయి. సరస్సు తీర ప్రాంతాలు, ఉద్యానవనాలు యందు విదూషకుల, నాట్యకత్తెల ఆటపాటలుతో మనోఙ్ఞంగా ఉన్నాయి. కర్పూరము, చందనము, లేత మామిడి, మద్ది, నీప, చీకటి మాను, నేరేడు, నిమ్మ, వేప, కడిమి మున్నగు అందమైన చెట్ల నీడలలో చంద్రకాంత శిలా వేదికలు మీద పింఛాలు ఎత్తి నెమళ్ళు నాట్యాలు చేస్తున్నాయి. కృత్రిమ కొండలు, ఇసుక తిన్నెలు వద్ద వేసిన వట్టివేళ్ళ పందిరులు అలరిస్తున్నాయి. నీళ్ళుతోడే కొయ్య యంత్రాలకు కట్టిన కుండల నుండి జలజల మంటూ నీళ్ళు జాలువారుతున్నాయి. అట్టి దివ్యశోభాన్వితమైన ద్వారకలో, నిరంతరం హేమంతమే అనిపించే ప్రదేశాలలో శ్రీకృష్ణుడు తన పదహారువేలనూరు మంది మానినీమణులతో కలగలిసి అందరికి అన్ని రూపుల వాడు అయి, మెరుపు తీగల నడుమ నీలిమేఘంలా మెరుస్తున్నాడు. ఆడ ఏనుగులతో విహరించే దిగ్గజమును పోలి జలక్రీడాది అనేక క్రీడలతో విహరిస్తున్నాడు. మురళి, వీణ మున్నగు రక రకాల వాయిద్య వినోదాలతో అంతఃపురంలో కొలువుతీరి మంజుల గానాలు ఆస్వాదిస్తున్నాడు. కవి, గాయక, సూత, వంది, మాగధాదుల స్తోత్రాలకు పరవశాలు పొందుతున్నాడు. నటనటీజనుల నాట్యాలతో, విదూషకుల సరస పరిహాస పలుకులు, మృదు మధురోక్తులతో పొద్దుపుచ్చుతూ ద్వారకలో ఆనందంగా ఉన్నాడు. అప్పుడు... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1323 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sun, 25 Sep 2022 15:41:23 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger