Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 16 July 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౨(592) - Aditya Srirambhatla

( శ్రుతి గీతలు ) 10.2-1230-వ. సత్తైన ప్రకృతివలన నుత్పన్నంబైన యీజగత్తు సత్తు గావలయు; నది యెట్లనినం గనకోత్పన్నంబులైన భూషణంబులు కనకమయంబులయి కానంబడు చందంబున నని సాంఖ్యుండు వలికిన విని యద్వైతవాది యిట్లను; నెయ్యది యుత్పన్నంబు గాదది సత్తును గా; దను వ్యతిరేక వ్యాప్తి నియమంబు నిత్యసత్యంబైన బ్రహ్మంబునందుఁ దర్కహతంబగుం గావునం బ్రపంచంబు మిథ్య యని నిరూపించిననా ప్రపంచంబు బ్రహ్మవిశేషణంబై కార్యకారణావస్థలు గలిగియున్న యంతమాత్రంబున మిథ్యగానేర; దా ప్రపంచంబునకుఁ గార్యకారణావస్థలు నిత్యంబులు గావున నవస్థాద్వయ యుక్తంబయిన ప్రపంచంబు నిత్యంబనిన వెండియు నద్వైతి యిట్లను; బహుగ్రంథ ప్రతిపాదితం బయిన జగన్మిథ్యాత్వంబు లేమి యెట్లనిన నదియునుం గర్మవశులైన జడుల నవిద్యా ప్రతిపాదకం బైన కుతర్క సమేతం బైన భారతి యంధపరంపరా వ్యవహారంబునం జేసి భ్రమియింపఁజేయుఁ; గారణావస్థలయందును బ్రహ్మ విశేషణంబయిన సూక్ష్మరూపంబునం బ్రపంచంబు సత్తై యుండు; సత్యంబు బాధాయోగ్యంబు గావున నీకు శేషంబయి యుండుఁ గావున నీవు దేహగతుండైన దేహియందు నంతర్యామివయ్యుం గర్మఫలంబులం బొరయక కర్మఫలభోక్తయైన జీవునకు సాక్షిభూతంబవై యుందు; వట్టి నిన్ను నజ్ఞులైన మానవులు నిజకంఠ లగ్నంబయిన కంఠికామణి నిత్యసన్నిహితంబై వెలుంగుచుండినను గానకవర్తించు తెఱంగునఁ దమహృదయపద్మమధ్యంబున ననంతతేజోవిరాజమానుండవై ప్రకాశించు నిన్నుం దెలియలేరు; సకల బ్రహ్మాండనాయకుండవైన నీయందు శ్రుతులు ముఖ్య వృత్తిం బ్రవర్తించు"నని శ్రుత్యధిదేవతలు నారాయణు నభినందించిన తెఱంగున సనందనుండు మహర్షుల కెఱింగించిన ప్రకారం బని నారాయణర్షి నారదునకుం జెప్పిన నమ్మహాత్ముండు మజ్జనకుండైన వేదవ్యాసమునీంద్రునకు నుపన్యసించె; నయ్యర్థంబు నతండు నాకుం జెప్పిన విధంబున నీకుం జెప్పితి; నీ యుపాఖ్యానంబు సకల వేదశాస్త్ర పురాణేతిహాససారం; బుపనిషత్తుల్యంబు; దీనిం బఠించువారును వినువారును విగతకల్మషులై యిహపర సౌఖ్యంబుల నొంది వర్తింతు;" రని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుం డిట్లనియె. భావము: సాంఖ్యులు "బంగారంతో చేసిన నగలు సర్వం బంగార మయములే కదా, అలాగే సత్యమైన ప్రకృతి నుండి జనించినది కావున ఈ జగత్తు సత్యమైనదే" అంటారు. అద్వైతవాది "స్వాయంభువమైన సర్వం సత్యం కానేరదు అనే వ్యతిరేక సిద్ధాంతం ప్రకారం, నిత్యసత్యమైన బ్రహ్మము నందు సకల జగత్తు ధర్మహతము అగును కావున ప్రపంచం మిథ్య మాత్రమే" అంటారు. ద్వైతులు "జగత్తు బ్రహ్మవిశేషణం అయి కార్యకారణ అవస్థలు కలిగి ఉన్నంత మాత్రం చేత మిథ్య అనలేము, కార్యకారణావస్థలు అనే అవస్థా ద్వయంతో కూడి ఉన్న లోకం సమస్తం సత్యమైనదే" అంటారు. అద్వైతసిద్ధాంతులు "ఎన్నో గ్రంథాలలో ప్రతిపాదించబడిన "జగన్మిథ్య" అనే సూత్రం తప్పు అని ఎలా అనగలము అంటే. కర్మవశులైన జడస్వభావులు చేసే అవిద్యా ప్రతిపాదికములు అయిన కుతర్కముల వలె గ్రుడ్డి పరంపరాగత వ్యవహారముల వలన భ్రమింప చేస్తున్నాయి. కారణావస్థ అందు బ్రహ్మమునకు విశేషణములై, సూక్ష రూపంలో జగత్తు సత్యమే అయి ఉంటుంది. అసత్తైన కారణంగా పరబ్రహ్మము అయిన నీకు శేషము అయి ఉంటుంది" అంటారు. కావున, సమస్త శరీరధారులలో అంతర్యామివై ఉండే నిన్ను కర్మఫలాలు సోకవు. కర్మఫలభోక్తలు అయిన జీవునకు సాక్షీభూతుడవై ఉంటావు. అజ్ఞానులు తమ కంఠమందు ప్రకాశించే రత్నాన్ని ఎలా తెలియలేరో అలా, తమ హృదయపద్మాల్లో మహాతేజంతో ప్రకాశించే నిన్ను తెలుసుకోలేరు. సకల బ్రహ్మాండానికి నాయకుడవైన నీలో వేదాలు వర్తిస్తుంటాయి. అని వేదాధిదేవతలు నారాయణుని స్తుతించిన ఈ విధం అంతా సనందనుడు మహర్షులకు తెలిపాడు. దానిని నారాయణముని నారదునికి చెప్పాడు. నారదుడు నా తండ్రి అయిన వేదవ్యాసునికి వివరించాడు. ఆ మహానుభావుడు నాకు చెప్పారు. ఆదే విధంగా దానిని నేను సవిస్తరంగా నీకు చెప్పాను. ఈ "శృతిగీతములు" అని ప్రసిద్ధము అయిన నారాయణోపాఖ్యానం సకల వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాల సారం. ఉపనిషత్తులకు సమానం. దీనిని పఠించినా విన్నా పాపాలు నశించిపోతాయి. ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి." అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=83&Padyam=1230 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sat, 16 Jul 2022 16:00:15 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger