Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 17 November 2022

చస్తే చాలా ఖర్చు బతికుంటే పట్టేడు మెతుకులే ఖర్చు ! - sarma

చస్తే చాలా ఖర్చు బతికుంటే   పట్టెడు  మెతుకులే  ఖర్చు   ! జాతస్య మరణం ధృవం. పుట్టినవారు గిట్టకతప్పదు,  చావుకూడా ఎప్పుడు,ఎక్కడ,ఎలా అన్నది కూడా తెలీదు.   చావు కూడా చాలా ఖర్చు తో కూడుకున్నదైపోయింది." చస్తే చాలా ఖర్చు బతికుంటే  పట్టెడు  మెతుకులే  ఖర్చు    "  అన్నమాట పెద్దలనుండి ఎక్కువగా వినపడేది. కలిగినవారింట చావు కూడా ఉత్సవమే! స్వతంత్రదేశంలో చావుకూడా పెళ్ళిలాటిదే బ్రదర్ అని ఒక సినీకవిగారిమాట. పదిమందితో చావూ పెళ్ళిలాటిదే అనే మాటా వినపడుతో ఉంటుంది మా పల్లెలలో. సామాన్యుల ఇళ్ళలోనే ఇబ్బందులన్నీ. స్వంత ఇల్లుంటే  కొంత మేలు.  !!అద్దె ఇంట ఉన్నవారైతే అదో నరకం.  నేటిరోజుల్లో అద్దె ఇళ్ళు వేరుగా లేనట్టే! అన్నీ అపార్ట్మెంటులే!! ఇక్కడే చిక్కులన్నీ! అపార్ట్మెంట్లో శవాన్ని ఉంచడానికి లేదని చెప్పేవారే ఎక్కువ. కామన్ ప్లేస్ లో కూడా ఉంచడానికి ఇష్టపడిని గేటెడ్ కమ్యూనిటీ లెన్నో! హాస్పిటల్ లో పోతే అప్పటికే తడిపిమోపెడు ఖర్చయి ఉంటుంది. మార్చురీలో శవాన్ని ఉంచడానికి, దాన్ని బయటికి తెచ్చుకోడానికి పడేవన్ని చెప్పుకోలేని తిప్పలు.  మార్చురీలు లేనిచోట ఐస్ బాక్సుల్లో ఉంచడం కూడా ఖర్చుతో కూడిన పనే. ఇక పుట్టెడు పుల్ల లెక్క. దీని ఖరీదూ పెరిగిపోయింది. కొందరు ధర్మాత్ములు పుల్ల ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లూ ఉన్నాయి అక్కడక్కడ, పల్లెలలో. పట్నవాసాల్లో అన్నీ ఇబ్బందులే. శవాన్ని శ్మశానానికి తరలించడం కూడా ఖర్చుతో కూడినదైపోయింది. కొన్ని చోట్ల ధర్మ సంస్థలు,ధర్మాత్ములు ఉచిత వాహనాలు ఏర్పాటు చేసినవీ ఉన్నాయి.  లేనిచోట  అంతా ఖర్చే! ఇటువంటి పరిస్థితులలో తల్లి,తండ్రి ఎవ రి దైనా పార్ధివదేహాన్ని పంచభూతాలలో కలిపైడానికి అయ్యే ఖర్చు తక్కువలో తక్కువ పాతికవేలంటే నమ్మగలరా? పెళ్ళి కెళ్ళి తినో, తినకో, ఎంతో కొంత సొమ్ము ఇచ్చి వస్తున్నాం, చదివింపులని. మరి, చావులో సామాన్యుడు పడే బాధని ఇబ్బందిని మనమెవరం గుర్తించటం లేదు, సాయమూ చెయ్యటం లేదు. మనలో మార్పురావాలి, తప్పదు. ఆలోచించండి. ఈ కింది మెసేజ్ నాకు వాట్సాప్ లో ఒక మిత్రుని దగ్గరనుంచి వచ్చింది, అది అతని ఆలోచనే, నా కు  నచ్చింది, మీరేమంటారు? Courtesy:Whats app పన్నెండో తారీకున ఇంతదాకా రాశాను, నడకనుంచి తిరిగొచ్చిన తరవాత ప్రచురిద్దామనుకున్నా, కాని అనుకోని దుర్ఘటన జరగడంతో వెనకబెట్టేను. మర్నాడు మరణించిన వాకర్ కుటుంబానికి సహాయం చెద్దామని పెద్దలు నిర్ణయించడం, దానికోసం మా వాట్స్ ఆప్ గ్రూపులో మెసేజి ఇవ్వడం, వెంట వెంటనే సహాయాలు ప్రకటించడం,  ఆ సొమ్మును నేడు మా ఎమ్.ఎల్.ఎగారి చేతులమీదుగా ఒకలక్ష అరవైవేలు  చనిపోయినవాకర్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగిపోయాయి. ఇలా మన కుటుంబాలలో, గేటెడ్ కమ్యూనిటీలలో ఇతరత్రా కూడా చేసుకుని మనం సహాయ సహకారాలందిస్తూ బలపడాలి తప్ప, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోకుమా!
Post Date: Thu, 17 Nov 2022 03:34:26 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger