Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 28 July 2022

కోయని చేయని కోతలరాయడు - Lalitha

అనగనగా మా ఇంట్లో ఒకరోజు.... ఇంట్లో ఉన్నవాళ్లు ముగ్గురు  - బుజ్జిగాడు, అమ్మ, నాన్నగారు. నాన్నగారు  కిటికీ లోంచి బయటికి చూస్తే అక్కడ అడుగుకి ఎక్కువగా, అడవికి తక్కువగా పెరిగిన గడ్డి కనిపించింది. ఆ గడ్డిని చూడగానే నాన్నగారు బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళి  "మన లాను మో చెయ్యాల్రా నాన్నా!" అన్నారు. "చెయ్యాలంటే చేసెయ్యండి నేనర్స్!" మీరేం చేసినా నేనేమీ అనుకోనన్నట్టున్న సమాధానం. "అలాక్కాదురా నాన్నా! నిన్ను చెయ్యమంటున్నా! ఇప్పుడు చేసేస్తే నీకు వర్కౌట్ కలిసొస్తుంది" నాన్నగారి ఊరింపు. "సరే, నేనర్స్! ఇంటి ముందు నేను చేస్తా... ఇంటి వెనక మీరు చెయ్యండి." అబ్బాయి గారి మొదటి బేరం. "అలగలాగే!" గలగలలాడి సంబరపడి సంద్రమయ్యింది బద్రి తండ్రి-హృదయం. *** *** *** *** *** *** *** *** *** *** తండ్రీతనయులిద్దరూ కూడబలుక్కుని గడ్డి కోద్దామని అనుకున్న రోజుకి వాన కురిసింది. గడ్డికోత వాయిదా పడింది. ఇంటి నట్టింట్లో వానాకాలపు-కబుర్లు నడిచాయి. "నాన్నగాడూ...ఎండ రాగానే లాన్ మో చెయ్యాల్రోయ్! అంతే కాదురోయ్...ఇల్లు వేక్యూం కూడా చెయ్యాలి." రాబోయే కాలంలో కాయబోయే ఎండని తలుచుకుంటూ - గడ్డి కోసేసి, దుమ్ము దులిపేసి - ఇంటా-బయటా ఇల్లు తళతళలాడిపోతున్నట్లు కలలు కనేస్తున్నారు నాన్నగారు. ఆ కలల మైకంలో బద్రి తానుండగానే కొత్త బేరం మొదలవుతుంది. "నేనర్స్! మీరు ఇంటి బయట లాన్ మో చెయ్యండి. నేను ఇంట్లో వేక్యూం చేస్తా." "సర్లే...ఈ సారికి అలాక్కానిద్దాం! మళ్ళీ నువ్వో సగం, నేనో సగం చెయ్యడమెందుకు? ఇంటి ముందూ, వెనకా  లాన్ మో చేసేస్తాలే!" *** *** *** *** *** *** *** *** *** *** ఈ లోగా వాన వెలుస్తుంది. వానవిల్లు మెరుస్తుంది. నిండుగా ఎండొస్తుంది! ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం - మొదలెట్టేటప్పుడు ఆడుతూ-పాడుతూ, చివరికొచ్చేసరికి ఆపసోపాలు పడుతూ నాన్నగారు గడ్డి కోసేస్తారు. Weekend-Siesta ప్రియులు నాన్నగారు ఇంట్లోకి రాగానే బుజ్జిగాడితో చెప్పేస్తారు - "ఇవాళొద్దు  కానీ రేపు వేక్యూం చెయ్! నేనిక భోంచేసి హాయిగా పడుక్కుంటా". "అలాగే నేనర్స్!" యూ డోంటు వర్రీ - జస్టు లీవిట్టుమీ అంటున్నట్టున్న బుజ్జిగాడి హామీ. *** *** *** *** *** *** *** *** *** *** నాన్నగారు ఎదురు చూసిన రేపు రానే వచ్చింది. మధ్యాహ్నం భోంచేస్తున్నప్పుడు నాన్నగారంటారూ... "నాన్నా! వేక్యూం చెయ్యాల్రా!" "అలాగే నేనర్స్! ఆలోచిస్తా (I will think about it)!" కాదనడమన్నమాట నా నోట రాదన్నట్టే అంటాడు బుజ్జిగాడు. మెల్లగా సాయంత్రమయ్యింది. ఇల్లంతా ఎక్కడి దుమ్ము అక్కడే బద్ధకంగా పరుచుకుని పడుకుంది. అక్కడక్కడా కిటికీల్లోంచి జారుతున్న సాయంకాలపు ఏటవాలు వెలుగుల్లో మా ఇంటి ధూళి నక్షత్ర-ధూళిలా మిలమిల్లాడి బడాయి పోతోంది. బుజ్జిగాడు అప్పుడెప్పుడో మొదలెడ్తానని చెప్పిన చేదోడు-వాదోడు కార్యక్రమం ఇప్పుడిప్పుడే మొదలయ్యేలా లేదు. *** *** *** *** *** *** *** *** *** *** చీకటి ముసిరింది. చల్లబడింది. చలచల్లనివేళ - నిమ్మళంగా సన్-రూంలో కూర్చుని -  మెల్లమెల్లగా మోగుతున్న పాటలు వింటూ - వాటితో పాటుగా సనసన్నగా పాడుకుంటున్న  నాన్నగారి పక్కన పిల్లిలా చేరి పాటలు వింటున్నాడు బుజ్జిగాడు. "నాన్నగాడూ! చెప్పిందొక్కటన్నా చేశావా? లాన్ మో నాతోనే చేయించావ్! వేక్యూం సంగతి ఏం చేశావ్?" "అదేంటి నేనర్స్ ! అలా అడుగుతారు?  నేను చేస్తానన్నది చేశాగా!" "అంటే...  ఏం చేశావ్?" " ఆలోచించా !" (I did what I said I would do! కి ఒక్క మాటలో అచ్చతెలుగు మాట అది). ఒక్క నిముషం నిశ్శబ్దం. వాడేమన్నాడో - మేమేం విన్నామో - చెవులకి ఎక్కి , తలకి ఇంకి - ఆకళింపు అవడానికి ఓ రెణ్ణిమిషాలు పట్టింది. అప్పుడు భళ్ళుమన్న మా నవ్వులకి మా ఇంటికప్పు ఉలిక్కిపడి ఒక్కసారి పైకి లేచి కూర్చుంది. *** *** *** *** *** *** *** *** *** ***
Post Date: Thu, 28 Jul 2022 03:55:38 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger