Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 25 August 2022

ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు? - sarma

ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలెందుకిచ్చాడు? ఆంధ్ర మహాభారతం కవిత్రయ ప్రణీతం సభాపర్వం,ద్వితీయాశ్వాసం 172 నుండి 264  వరకు  స్వేఛ్ఛానువాదం ధర్మరాజు, శకునిల మధ్య జూదం మొదలైంది. ధర్మరాజు పావులు ముట్టుకోకనే,సంపదలు,రాజ్యమూ ఓడిపోయాడు, ఆ తరవాత తనను పందెంలో ఒడ్డి ఓడిపోయాడు, తమ్ములతో సహా!అప్పుడు శకుని నువ్వు ఇంకా ఆడచ్చు, ద్రౌపదిని పందెంగా పెట్టచ్చు అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని పందెంఒడ్డి ఓడిపోయాడు. ఆ తరవాత దుర్యోధనుడు విదురుని పిలిచి ద్రౌపదిని సభకు తీసుకురమ్మన్నాడు. నీకు ఉచితానుచితాలు తెలియటం లేదు, ఎవరికి ఏ పని చెప్పచ్చో చెప్పకూడదో తెలియకవున్నావని అనడం తో ద్రౌపదిని సభకు తీసుకురమ్మని ప్రాతికామికి చెప్పేడు. ప్రాతికామి ద్రౌపది దగ్గరకుపోయి సభలో జరిగినది చెప్పి, ఆమెను సభకు రమ్మన్నాడు. విన్న ద్రౌపది,తన్నోడి నన్నోడెనా? నన్నో డి  తన్నోడెనా? ధర్మరాజునే కనుక్కురమ్మంది. అదేమాట సభలో చెప్పాడు ప్రాతికామి. అనుమానం సభలోనె తీరుస్తారు తీసుకురమ్మని చెప్పాడు, దుర్యోధనుడు. ఆమాటే వెళ్ళి ద్రౌపదికి చెప్పాడు, ప్రాతికామి.  ద్రౌపది ప్రాతికామి వెనక బయలుదేరి సభలో కురువృద్ధుల చెంతకు చేరింది.  ప్రాతికామి భీమునికి భయపడుతున్నాడు, నీవుపోయి  ద్రౌపదిని సభకు, తీసుకురమ్మని దుశ్శాసనునికి చెప్పాడు, దుర్యోధనుడు . దుశ్శాసనుడు తనకోసం బయలుదేరుతున్న సంగతి తెలుసుకున్న ద్రౌపది సభలో ఉన్న గాంధారి దగ్గరకు పరుగెత్తింది.ఎక్కడిదాకా పరుగెట్టిపోతావు?  నిన్ను పట్టకమాననని,  దుశ్శాసనుడు అటువస్తుంటే పట్టపురాణి గాంధారి దగ్గరకి పరుగుపెట్టింది. దుశ్శాసనుడు గాంధారి దగ్గరున్న ద్రౌపదిని పట్టబోతుంటే నన్ను ముట్టకు,రజస్వలను, ఏకవస్త్రను అని చెప్పింది. దుశ్శాసనుడు పట్టపురాణి సమక్షంలో నీవు ఏకవస్త్రవైనా, వివస్త్రవైనా సభకు తీసుకెళతానని, ద్రౌపదిని కొప్పుపట్టి సభలోకి ఈడ్చుకొచ్చాడు, అప్పుడు కృష్ణుని తలచింది,ద్రౌపది. అంతట వికర్ణుడు ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పాలి అన్నాడు. ఎవరూ బదులు చెప్పలేదు.ఐతే నేను ధర్మ నిర్ణయం చెబుతున్నా! ఆమె అధర్మ విజిత,అంతేకాదు ఏకవస్త్రను సభకు ఈడ్చుకురావడం అన్యాయం అన్నాడు. దానికి కర్ణుడు కుర్రవాడివి, కురు వృ ద్ధు లు, గురువులు ఉన్నచోట ఇలా పలకడం కూడదు. ఒక స్త్రీకి ఒకడు భర్త,ఈమెకు అనేకులు భర్తలు, ఈమెను బంధకి అంటారు, అందుచేత ఈమె ఏకవస్త్రగా గాని,వివస్త్రగాగాని సభకు తీసుకురావచ్చు,ధర్మం తప్పదు, అన్నాడు.కర్ణుని మాటపై దుర్యోధనుడు, పాండవుల,ద్రౌపది వస్త్రాలు ఊడతీయమన్నాడు. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రం లాగుతుంటే అది అశేషమై వస్త్రాలు గుట్టగా పడ్డాయి,కాని ద్రౌపది ఒంటిపై బట్ట తొలగలేదు. అది చూచి దుశ్శాసనుడు సిగ్గుపడ్డాడు. ఇది చూచి భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి రక్తం తాగుతానని శపధం చేశాడు. సభలోనివారంతా ధృతరాష్ట్రుని కౌరవులను నిందించారు, ముసలిరాజులంతా పట్టించుకోలేదనీ తిట్టారు. అప్పుడు విదురుడు కలగేసుకుని సభకి ఇలాచెప్పాడు.వికర్ణుడు ధర్మబుద్ధితో చెప్పేడు. సభలో ధర్మసందేహం తీర్చకపోతే అబద్ధం ఆడిన ఫలితం పొందుతారు, అందుచే ధర్మం చెప్పి తీరాలన్నాడు. అప్పుడు ద్రౌపది పాండవుల పత్నిని, గోవిందుని చెల్లిని,నేడు వీనిచే సభామధ్యంలో, నరపతులు, కురువృద్ధులు,గురువృద్ధులు ఉండగా,  నన్నిలా చేయడం తగునా, నా మాటలకెవరూ సమాధానం చెప్పరే!  నే దాసినా? నే దాసినా? అని అరిచింది.దానికి భీష్ముడు అమ్మా! నీ ప్రశ్న ధర్మ సూక్ష్మం, ధర్మరాజే సమధానం చెప్పగలడు, వీరి చర్యలఫలితం తొందరలోనే వీళ్ళు అనుభవిస్తారన్నాడు. ఆ తదుపరి కర్ణుడు జూదంలో నిన్ను పణంగా పెట్టి ఓడిపోని ఒక్కణ్ణి కట్టుకో, పనికిరానివాళ్ళు ఎంతమంది ఉన్నా మేలులేదు, అని ఎకసక్కెమాడేడు.అంతట దుర్యోధనుడు తొడ చూపాడు.రవిలిపోయిన మనసుతో భీముడు తొడలు విరిచి చంపుతానని ప్రతిన చేశాడు. ఇది విన్న భీష్మ ద్రోణులు, కోపానికి ఇది తగు సమయం కాదన్నారు.అంతా ఎరిగిన గాంధారి విదురుని తీసుకుని ధృతరాష్ట్రుని దగ్గరకిపోయి, సభలో జరిగినదంతా భర్తకు తెలిపింది, దుర్నిమిత్తాలు కనపడుతున్నాయని కూడా చెప్పింది. విన్న ధృతరాష్రుడు దుర్యోధనుని పిలిపించి పాండవులభార్య గౌరవనీయురాలిపట్ల తప్పు మాటలు మాట్లాడం తగదు, చిన్నప్పటినుంచి నీ దుష్ట స్వభావం మాన్చుకోలేదు, నీ మూలంగా పాండవులకు దుఃఖం కలిగిందని, వారిపట్ల దురాగ్రహం పనికిరాదు, అని తిట్టాడు. అందరికి మంచి చేయాలని తలచి ద్రౌపదిని పిలిపించి 'నా కోడళ్ళంద'రిలోనూ ఎన్నదగినదానివి, అయోనిజవు, నీకు వరమివ్వాలనుకుంటున్నాను, కోరుకోమన్నాడు. దానికి ద్రౌపది ధర్మరాజును దాస్య విముక్తుని చేయమని, కారణం చెప్పింది,ధర్మరాజు తనయుడు దాసపుత్రుడనే పేరు లేకుందుకే అని చెప్పింది. మరో వరం కోరమన్నాడు. మిగిలిన పాండవులను అస్త్ర శస్త్రాలతో దాస్య విముక్తి చేయమంది. తధాస్తు అంటూ, మరో వరం కోరుకోమన్నాడు. నేను క్షత్రియ కాంతను, నేను రెండు వరాలు కోరడానికే అర్హురాలను, అని మూడో వరం సున్నితంగా తిరస్కరించింది. . ధృతరాష్రుడు ఆమెను మెచ్చి పాండవులను పిలిపించాడు.  ధర్మరాజా!  నీ సర్వసంపదలతో, నీ స్వరాజ్యాన్ని ఎప్పటిలా ఏలుకో,   ఇంద్రప్రస్థం పోయి సుఖంగా ఉండమన్నాడు. ద్రౌపది వరాలు కోరలేదు, ఆమెను పిలిపించి ధృతరాష్ట్రుడు వరాలెందుకిచ్చాడు? మెదడుకి పదును పెట్టండి...
Post Date: Thu, 25 Aug 2022 03:09:51 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger