Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 4 October 2022

గీతం...సంగీతం...సతతహరితం - 15 - నజర్ న లగ్ జాయే - కిసీ కీ... రాహోం మే - Lalitha

ఏ లోకాలదో ఆ పాట... మబ్బు మెరిసిన ఎలుగు పాటై నీటి దారుల తుళ్లింది మెరుపు కురిసిన వెలుగు పాటై గాలి వాలుల సోలింది థేమ్స్ నది ఒడ్డున ఆ పాట పదము వెంట పదము పరువులెత్తింది గిటార్రాగాల గింగురులెత్తింది పదము మీద పదము కదను తొక్కింది హయలయల హొయలొలికింది విన్నకొద్దీ విడిపోని పరిపాటై మెలఁకువనే  కలలా తోచింది విన్న పాట వీడలేని అలవాటై కలలలోనూ వినిపించింది ఎద మోయలేని హాయిపాటై కలల దాటి రమ్మంటే మది ఓపలేని తీపిపాటై కలవరింతై కమ్ముకుంది *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఆ పాటకి పదం పేర్చింది -  ఆనంద్ బక్షీ. ఆ పాటకి నాదం కూర్చింది - లక్ష్మీకాంత్-ప్యారేలాల్. ఆ పాటని పాడుతున్నట్టనిపించింది - బెంగాలీ బాబు బిశ్వజిత్. ఆ పాటని వింటున్నట్టు కనిపించింది - నేపాలీ లేమ మాలా సిన్హా. ఇన్ని వున్న ఆ పాట వున్న - సినిమా - "నైట్ ఇన్ లండన్". *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఆ పాటని ఎవరు పుట్టించినా, దానినెవరు చూపెట్టినా - ఆ పాటకి ప్రాణం పోసిన గరిమ మాత్రం తనివాఱు మహ-తీరు రాగాల లక్ష్మీకాంత్-ప్యారేలాల్ జోడీదే... ఆ ప్రాణానికి ప్రణవం తెచ్చిన గాత్రం మది సోలు మహ-హాయి గానాల మహ... మహ... మహ... మహ... మహ... మహ... రఫీదే... మహమ్మద్ రఫీదంటే రఫీదే ... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఈ పాట వినడం ఇదేం మొదటిసారి కాదు... అలా అని దీన్ని పదేపదే పాడిందే పాటగా విన్నాననేం లేదు. ఎప్పుడో, ఎక్కడో అనుకోకుండా ఎవరో ఏ రికార్డో పెట్టబట్టి వినడం తప్ప - నాకు నేనుగా వెతుక్కుని వినాలీ అని పట్టుబట్టి విన్న పాట మాత్రం కాదు. కిందటి వారం ఎప్పట్లాగే రఫీ పాటల కోసం యూట్యూబులో వెతుక్కుని - ఒక్కో పాట వింటూ వుంటే - ప్రతీపాట తర్వాత ఈ పాట ఆ పక్కనే కనిపిస్తూ  "నన్ను వినూ!" అంటున్నట్టు  కనిపిస్తూనే వుంది. నేనంతగా పట్టించుకోకుండా వేరేవేవో వింటూనే వున్నాను. ఈ పాటేమో "వినవా?" అని బ్రతిమాలుతున్నట్టొకసారి, "ఓ సారి వింటే నీ చెవులేమైనా అరిగిపోతాయా? " అని దబాయిస్తున్నట్టొకసారి, "వినమని ఎన్ని సార్లడగాలీ, ఓహోహో?!" అని సాధిస్తు న్నట్టొకసారి, "వినమని చెప్తుంటే నీక్కాదూ?" అని చెవి మెలేస్తున్నట్టొకసారి - ఆ కిందున్న సజెషన్సులో పైకి ఎగిరెగిరి కనిపిస్తూనే వుంది. చివరాఖరికి ఓ పాట తర్వాత తోసుకుంటూ ముందుకొచ్చేసి "వినెహే!" అని అదే మొదలైపోయింది. సర్లే! ఒకసారి వినేస్తే దీని గోలేంటో తెలిసిపోతుంది ఇహ దీని జోలికెళ్ళక్కర్లేదు అనుకుని చెవులు ఫోను కప్పగించి - పాటని ఆట్టే పట్టించుకోకుండా బెట్టు పోతూ ఉతికిన బట్టలేవో మడత పెట్టుకుంటున్నాను. పాట మొదలవుతూనే  ఓ గిటారు టింగ్-టింగుమని వినిపించింది. ఆ వెంటనే "ఓ మై లవ్!" అంటూ ఏ గంధర్వ లోకాల్లోంచో పిలుస్తున్నట్టు న్న రఫీ గొంతూ... ఆ వెనకనే ఉరుం-మబ్బేదో కదం తొక్కుతున్నట్టు ఓ బేస్-గిటార్ మోతా... అవి వింటూనే చెవులప్పగించిన ఫోనుకి కళ్ళు కూడా అద్దెకిచ్చా. చూస్తే అక్కడ ఏముందీ? హయలయల హొయలుకి గిటారు మోగిందా? గిటారు గీర-రాగాలకి తురంగాలు తరంగమాడాయా? అంతే! నా చెవులూ, కళ్ళూ కూడబలుక్కున్నట్టు  నా తలకేం చెప్పాయో కానీ నా చేతులు - మడతెడుతున్న బట్టలని కాసేపలా గాలికి రెపరెపలాడుతుండమని చెప్పి - టీవీ రిమోట్ తీసుకుని - చకచకా యూట్యూబులో వెతికి ఆ పాట పెట్టేశాయ్. ఈలోగా నా కాళ్ళేమో సోఫాలో నన్ను కూర్చోబెట్టేశాయ్. అప్పుడు కూర్చుని మొట్టమొదటి సారిగా ఆ పాట చూశా! పూర్తిగా చూశాక - మళ్లింకొక్కసారి చూశా! మళ్ళీ ... మళ్ళీ చూశా ! ఆ హయ-గతికి గిటారు పాడిన స్వర-జతికి - "నజర్ న లగ్ జాయే!" అనుకున్నా! ఎంత అందమైన పాట అది? ఇన్నాళ్లూ నేనెందుకు చూడలేదబ్బా? అనుకున్నా. ఈ పాట నాకు దక్కాలని రాసుండబట్టి ఇవాళ్టికైనా నాకు చిక్కిందనుకున్నా. నన్నలరించిన ఈ పాటలో నాకు కనిపించిన విషయాలూ, నాకనిపించిన విశేషాలతో ఆ పాట కథా-కమామీషూ మీతో ఇలా పంచుకుంటున్నా. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నే చెప్పే కబుర్లు చదివే ముందు మీరూ ఈ పాట చూడాలిగా! ఈ పాటకి యూట్యూబ్ లింక్: https://www.youtube.com/watch?v=Y2QLjRWXdAA పాట చూసొచ్చారా? ఇహిప్పుడు పాటలో తమాషాలేంటో చెప్తాను. మీకవి కనిపించాయో - కనిపించినా అనిపించాయో లేదో చూసుకోండి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఈ పాటలో అసలుకి మూడు చరణాలు ఉన్నట్టున్నాయి. యూట్యూబుకి - ఆకలేసి నీరసమొచ్చి మింగేసిందో - పాడలేక ఆయాసమొచ్చి ఆపేసిందో - కానీ చూసే పాటలో చివరి చరణాలు  రెండే కనిపిస్తాయి. మొదటి చరణం హుళక్కి! కాకపోతే కనిపించే రెండు చరణాలే కాక కనిపించని ఆ మూడో చరణం కూడా నేను రాసి పెట్టాలెండి! (ఇక్కడెందుకో నాకు సాయికుమార్ - పోలీస్ స్టోరీ గుర్తుకొచ్చింది. ఎందుకో చెప్పుకోండి చూద్దాం!) మీకెవరికన్నా ఆ మూడు చరణాలు కంటి నిండుగా కనిపించే పాట మీక్కనిపిస్తే నాకొచ్చి చెప్పండేం! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** లండన్లో థేమ్స్ నది ఒడ్డున సాగే ఈ పాటలో ఎఱుపు రంగు భలేగా మెరుస్తుంది. మొట్టమొదటగా కనిపించే  చిన్న బోటుపై రెపరెపలాడుతున్న తెల్ల క్రాసున్న జండా ఎఱుపు. ఆ బోటు మీద నించున్న గిటార్రాగాల అబ్బాయి వేసుకున్న పొడుగు చేతుల చొక్కా ఎఱుపు ఆ తర్వాత కెమెరా చూపు సోకిన రహదారి మీద వెళుతున్న చిన్న కారు ఎఱుపు, ఆ పక్కనే రయ్యిమన్న ఓ మాదిరి ట్రక్కు ఎఱుపు బ్లూస్ ఎండ్ రాయల్స్ - హార్స్ గార్డ్స్ పెట్టుకున్న ఇనుప కుళ్లాయిల మీద ఊగితూగుతున్న తురాయిలు (plumes) ఎఱుపు "పీ-పీ" మంటూ ఊదుకుంటూ వస్తున్న  గ్రెనడీర్ గార్డుల బ్యాండు వేసుకున్న యూనిఫార్మ్ రంగు ఎఱుపు ఇంకా పాట సాగుతున్నంత సేపూ ఆ వెనకాల రోడ్ల మీద హడావిడిగా సిన్మాలో కనిపించాలన్నట్టు తిరుగుతున్న లండన్ బస్సులు ఎఱుపు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** పైన చెప్పిన ఎఱుపు రంగు చూసింతర్వాత ఈ పాటలో మెరిసినవారు బిశ్వజిత్, మాలా సిన్హా. బిశ్వజిత్తుని చూడగానే బీఎస్సీలో మాథ్స్ ట్యూషన్ చెప్పిన కోటేశ్వర్రావుగారు గుర్తొచ్చారు. ఏ ఆదివారమో టీవీలో ఓ మంచి హిందీ సిన్మా - ఏ షమ్మీ కపూర్ - తీస్రీ మంజిల్ - లాంటిదో వుందని ముందే తెలిసి - ఆ రోజు సెలవివ్వండి సర్ సిన్మా చూస్తాం - అనడిగితే - "చపాతీ మొహాలనేం చూస్తారు, ఎంచక్కా  ట్యూషను కొచ్చి హాయిగా లెక్కలు చేసుకోండి - అని చెప్పేవారు. ఇంకేం చేస్తాం! ఎలాగో మనసు చిక్కబట్టుకుని లెక్కలు చేసుకుంటూ కూర్చుంటే - ఇంతలో పక్కనే సర్ వాళ్ళింట్లోంచి "ఆజా ఆజా మై హూ ప్యార్ తేరా...  అల్లా...అల్లా ...ఇన్‌కార్ తేరా...ఆజా...అహ్హహాజా... " అని పాట వినగానే "ఉండండయ్యా ... నన్ను ఎందుకో పిలుస్తున్నట్టున్నారు" అని కట్టుకున్న తెల్ల గ్లాస్కో లుంగీని కుడిచేతి గుప్పెట్లో కాళ్లకడ్డం పడకుండా గట్టిగా ఒడిసి పట్టుకుని గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయి - ఆ పాటయ్యాక - తీరిగ్గా వచ్చేవారు మా కోటేశ్వర్రావు సర్. ఇదిగో ఇవాళ మళ్ళీ నున్నటి మొహమున్న బిశ్వజిత్తుని చూడగానే ఆ చపాతీరో-మోహపు రోజులు గుర్తుకొచ్చాయి. ఏ పుణ్యలోకాలనో లెక్కలు పాఠాలు చెప్పుకుంటున్నారో - మా ప్రియమైన కోటేశ్వరరావు గారు కూడా గుర్తొచ్చారు. బిశ్వజిత్ పక్కనే వున్న మాలాసిన్హా కూడా బల్-హాయిగా అనిపించిందండోయ్. ఎప్పుడో  పెళ్ళికి ముందు రోజుల్లో డీడీలో తెలుపు-నలుపు హిందీ సినిమాల్లో ఒకట్రెండు సినిమాల్లో చూసినప్పుడు ఇదే మాలాసిన్హా  "నైన్ కియే నీచే నీచే... రహూ తేరే పీఛే పీఛే" అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ, హీరో కాళ్ళావేళ్ళా పడిపోతూ వుండేది. ఈ పాటలో మాత్రం స్టైలిష్షుగా, పాలిష్డుగా బార్బీ బొమ్మలా భలే ఉంది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇహ పోతే - ఈ పాట చూస్తుండగా కనిపించిన లండన్ వీధులు, థేమ్స్ నది, బిగ్గు బెన్నూ దాటి ఓ పడవెక్కి హీరో-హీరోయిన్లు ఇద్దరూ ఓ జలపాతం దగ్గరికి వెళ్తారు. అది చూడగానే ఇదెక్కడి జలపాతమబ్బా అనుకుంటూ గూగుల్లో వెతికా! అప్పుడు తెలిసింది - ఈ పాట లండన్  థేమ్స్ నది నీటి అలల మీదుగా - అలా అలా   గాలిలో తేలి స్విజ్జర్లాండు రైన్ ఫాల్స్ (Rhine Falls) జలపాతంలో చిందులేసిందని. ఈ పాటకి రైన్ జలపాతం పొందిన ఆనందం చూడాలంటే " సామ్‌నే జో ఏక్ తూ న హో...  దిల్ మే  కోఈ ఆర్‌జూ న హో!" అన్న వాక్యాల దగ్గర బిశ్వజిత్, మాలాసిన్హా నించున్న అబ్జర్వేషన్ డెక్ వెనకాల నీటి చిందులు చూడాల్సిందే! (వీడియోలో 3:09 నుంచి 3:25 దాకా). నాకు నచ్చిన పాటని  ఈ కింద రాసి పెట్టుకున్నా. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఓ మై లవ్ ! నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే తూ ఖో న జాయే - ఓ మై లవ్! నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే తూ ఖో న జాయే - ఓ మై లవ్! దేఖ్ కర్ - తేరీ తరఫ్ - బహార్ ఆజ్  హో రహీ హై - బేకరార్ దేఖ్ కర్ - తేరీ తరఫ్ - బహార్ ఆజ్  హో రహీ హై - బేకరార్ ఛూ రహే ఫూల్ హై యూ తుఝే జైసే హో ఇన్హే భీ తుఝ్‌సే ప్యార్ యే హో న జాయే - ఓ మై లవ్! నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే తూ ఖో న జాయే - ఓ మై లవ్! ఏ మేరీ హసీన్ దిల్‌రుబా! మేరే దిల్ మే - ఛుప్‌కే బైఠ్ జా... ఏ మేరీ హసీన్ దిల్‌రుబా! మేరే దిల్ మే - ఛుప్‌కే బైఠ్ జా... తుఝ్‌మే ముఝ్‌మే ఫరక్ నా రహే ఆ... కరీబ్ - ఆ... కరీబ్ - ఆ... తూ ఖో న జాయే - ఓ మై లవ్! నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే తూ ఖో న జాయే - ఓ మై లవ్! సామ్‌నే జో ఏక్ తూ న హో... దిల్ మే  కోఈ ఆర్‌జూ న హో! సామ్‌నే జో ఏక్ తూ న హో... దిల్ మే  కోఈ ఆర్‌జూ న హో! మంజిలే హజార్ హో మగర్ మంజిలోం కీ జుస్తుజూ న హో యే హో న జాయే -  ఓ మై లవ్! ఓ మై లవ్ !  ఓ మై లవ్ ! ఓ మై లవ్ ! ఓ మై లవ్ ! నజర్ న లగ్ జాయే -  కిసీ కీ... రాహోం మే ఛుపా కే రఖ్ లూం - ఆ... తుఝే నిగాహోం మే తూ ఖో న జాయే - ఓ మై లవ్! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నాకైతే పాటలో వినిపించిన గిటార్ సంగీతం ఎంతో నచ్చింది. దానికి జతగా కుదిరిన గుఱ్ఱపు-నడక కూడా - కనిపించింది కొన్ని సెకన్లయినా ఎంతో రాజసంగా వుంది. ఈ పాట ఈ పూటకి దొరికిన పున్నెం. నాకందిన ఈ నిన్నటి పున్నమల మించుని మీకూ పంచుకుంటూ... ~ పాటల భైరవి
Post Date: Mon, 03 Oct 2022 03:03:59 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger