Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 16 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౯(719) - Aditya Srirambhatla

( అవధూత సంభాషణ ) 11-113-వ. అనుటయు హరి యుద్ధవునకుం జెప్పె; "నట్లు మత్ప్రేరితంబులై మహదాది గుణంబులు గూడి యండం బై యుద్భవించె; నా యండంబువలన నేనుద్భవించితి; నంత నా నాభివివరంబున బ్రహ్మ యుదయించె; సాగరారణ్య నదీ నద సంఘంబులు మొదలుగాఁ గల జగన్నిర్మాణంబు లతనివలనం గల్పించితి; నంత శతానందునకు శతాబ్దంబులు పరిపూర్ణం బైన ధాత్రి గంధంబునందడంగు; నా గంధం బుదకంబునం గలయు; నా యుదకంబు రసంబున లీనంబగు; నా రసంబు తేజోరూపంబగు; నా తేజంబు రూపంబున సంక్రమించు; నా రూపంబు వాయువందుం గలయు; వాయువు స్పర్శగుణసంగ్రాహ్యం బైన స్పర్శగుణం బాకాశంబున లయంబగు; నా యాకాశంబు శబ్దతన్మాత్రచే గ్రసియింపఁబడిన నింద్రియంబులు మనోవైకారిక గుణంబులం గూడి యీశ్వరునిం బొంది, యీశ్వరరూపంబు దాల్చు; నేను రజస్సత్త్వతమోగుణ సమేతుండనై త్రిమూర్తులు వహించి, జగదుత్పత్తి స్థితి లయ కారణుండనై వర్తిల్లుదుఁ; గావున నీ రహస్యంబు నీకు నుపదేశించితిఁ, బరమపావనుండవుఁ బరమభక్తి యుక్తుండవుఁ గ"మ్మని చెప్పె; నంత. భావము: అనగా శ్రీహరి ఉద్ధవుడితో ఇలా అన్నాడు. "ఆవిధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక అండంగా ఏర్పడ్డాయి; ఆ అండం నుంచి నేను పుట్టాను; అంతట నా నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచ మంతా అతని చేత నేనే నిర్మింప చేసాను. ఆ బ్రహ్మదేవుడికి నూరేండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది; గంధం నీటిలో కలుస్తుంది; ఆ నీరు రసములో లీనమవుతుంది; ఆ రసం తేజస్సు రూపాన్ని ధరిస్తుంది; ఆ తేజస్సు రూపము నందు సంక్రమిస్తుంది; ఆ రూపం వాయువులో కలుస్తుంది; ఆ వాయువు స్పర్శగా మారుతుంది; ఆ స్పర్శగుణం ఆకాశంలో లయమవుతుంది; ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే లోగొనబడుతుంది; ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వర రూపాన్ని ధరిస్తాయి. భగవంతుడనైన నేను రజస్సు సత్త్వము తమస్సు అనే మూడు గుణాలతోకూడి మూడుమూర్తులు ధరించి సృష్టి పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికి కారణుడై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. కాబట్టి, పరమ పావనుడవు పరమ భక్తియుక్తుడవు కావలసింది." ఇలా చెప్పిన కృష్ణుని పలుకులు విని ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=113 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Mon, 16 Jan 2023 15:12:29 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger