బమ్మెరపోతన భాగవతం- అలంకార సౌందర్యం శ్లేషాలంకారం సాహిమిత్రులారా! కేవలం ప్రకృతాలకుకానీ,కేవలం అప్రకృతాలకుకానీ శబ్దమాత్ర సామ్యం ఉంటే శ్లేష అంటారు. పోతన భాగవతంలో శ్లేష అద్భుతమైన రూపాలలో దర్శన మిస్తోంది. సంస్కృతంలోని కాదంబరీ గద్యలోని శ్లేషను పోలిన గద్యను బమ్మెరవారు నైమిశారణ్య వర్ణనసందర్భాన హృద్యంగా రచించినారు. నైమిశారణ్యవర్ణనము వ.మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథ మహితంబై. అర్థం: 1.మధువనే రాక్షసుడిని చంపిన విష్ణువు యొక్క మందిరంలా మాధవి(లక్ష్మితో)మన్మథునితో ఉంది నైమిశం. 2.మాధవి అంటే గురివిందచెట్టు,మన్మథ అంటే వెలగ చెట్టు-ఈ చెట్లుకలిగి ఉంది నైమిశం. వ.బ్రహ్మగేహంబునుంబోలె శారదాన్వితంబై అర్థ: 1.బ్రహ్మదేవుని సత్యలోకంలా సరస్వతిదేవితో కూడు కున్న దై. 2.శారదాన్వితంబై, శారదా=ఏడాకుల అరటిచెట్టు,పచ్చపెసర. వ.నీలగళసభా నికేతనంబునుంబోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై అర్థం: 1.నల్లని కంఠంగల మహేశ్వరుని సభామండపంవలె వహ్ని=అగ్ని,వరుణ=వరుణుడు,సమీర=వాయువు,చంద్ర= చంద్రుడు,రుద్ర=ఏకాదశరుద్రులు,హైమవతీ=పార్వతి,కుబేర=కుబేరుడు,వృషభ=నంది,గాలవ=గాలవుడు,శాండిల్య=శాండిల్యుడు,పాశుపత=పాశుపతదీక్షపొందినవారు,జడ=జడలు పెంచినవారి, పటల=గుంపులతో, మండితంబై=ప్రకా శించినదై. 2.వహ్ని=చిత్రమూలం,వరుణ=ఉలిమిరిచెట్టు,సమీరణ=మరువం,చంద్ర=పెద్ద ఏలకి,రుద్ర=రుద్రాక్ష,హైమవతి=తెల్లవస(కరకచెట్టు),కుబేర=నందివృక్ష,వృషభ=అడ్డసర,గాలవ=లొద్దుగచెట్టు,శాండిల్య=మారేడుచెట్టు,పాశుపత=శ్రీవల్లి,జటి=జడలతీగెల,పటల=సమూహంతో,మండితంబు ప్రకాశిస్తోంది. వ.బలభేది భవనంబునుంబోలె నైరావతామృత రంభాగణికాభి రామంబై అర్థం: బలభేదివనంబునుంబోలె- దేవేంద్రుని సౌధంవలె 1.ఐరావత=ఐరావతమనే ఏనుగుతో, అమృత=సుధతో, రంభా=రంభ మొదలయిన,గణిక=(దేవ) వేశ్యలతో, అభిరా మంబై=మనోహరమై. 2.ఐరావత=నారింజ,అమృత=ఉసిరిక,రంభ=అరటి,గణిక=అడవిమొల్ల,మొదలైనవాటితో మనోహరమై. వ. మురాసుర నిలయంబునుంబోలె నున్మత్త రాక్షసవంశ సంకులంబై అర్థం: 1.మురాసురు డనే రాక్షసంని నివాసంవలె-- ఉన్మత్త=బాగామదించిన,రాక్షస=రక్కసుల,వంశ=కులంతో,సంకులంబై=కూడినదై. 2.ఉన్మత్త=ఉమ్మెత్త,రాక్షస=నల్లకచోర,వంశ=వెదురు మొదలైనవాటితో కూడినదై. వ.ధనదాగారంబునుంబోలె శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై అర్థం: 1.ధనదాగారంబునుంబోలె=కుబేరుని నిలయంలా-- శంఖ,పద్మ,కుంద,ముకుందమొదలయిన నవనిధులతో మనోహరమై, 2.శంఖ=బోరపుష్పి,పద్మ=తామర,కుంద=మొల్ల,ముకుంద=కుందురుష్కమనే గంధపుచెట్లతో సుందరంగా ఉన్నదై. వ.రఘురామ యుద్ధంబునుంబోలె నిరంతర శరానల శిఖా బహుళంబై అర్థం: 1.రామచంద్రుని యుద్ధంలా-- శర=బాణాలయొక్క,అనలశిఖా=అగ్నిజ్వాలలతో,బహుళంబై 2.శర=రెల్లు,అనలశిఖా=శక్రపుష్పిఅనేవాటితోనిండినదై. వ.పరశురాము భండనంబునుంబోలె నర్జనోద్భేదంబై అర్థం:భార్గవరాముని యుద్ధభూమిలా- 1.అర్జునోద్భేదనంబై=కార్తవీర్యార్జునుని చీల్చినదై, 2.కార్తవీర్యార్జునోద్భేదనంబై=భూమిని చీల్చుకుంటూవచ్చే పొదలు కలదై. వ.దానవ సంగ్రామంబునుంబోలె నరిష్ట జంబ నికుంభ శక్తి యక్తంబై. అర్థం: రాక్షసయుద్ధంలా- 1.అరిష్ట=అరిష్టుని,జంభ=జంభుని,నికుంభ=నికుంభుని, శక్తియుక్తంబై=శక్తులతో కూడుకున్నదై. 2.అరిష్ట=వేము,కుంకుడు,జంభ=నిమ్మ,నికుంభ=దంతిట్టు శక్తులతో. వ.కౌరవ సంగరంబునుంబోలె ద్రో ణార్జునకాంచనస్యందన కదంబ సమేతంబై అర్థం: కౌరవ(కురుక్షేత్ర) యుద్ధంలా- 1ద్రోణ,అర్జున,కాంచనరథాల సమూహంతో కూడినదై. 2.ద్రోణ=తుమ్మిచెట్టు,అర్జున=ఏఱుమద్దిచెట్టు,కాంచన=సంపెంగ,స్యందన=తినాసవృక్ష,కదంబ=కడిమిచెట్టు మొదలైన వాటితో కూడుకున్నదై. వ.కర్ణు కలహంబునుంబోలె మహోన్నత శల్య సహకా రంబై అర్థం: కర్ణుని కయ్యంలా- 1.గొప్పవాడైన శల్యుని సహకారం కలిగినదై. 2.మహోన్నతశల్య=పెద్దమంగచెట్లూ,సహకారంబై=తియ్య మామిడిచెట్లూ కలదై. వ.సముద్ర సేతుబంధనంబునుంబోలె నల నీల పన సా ద్యద్రి ప్రదీపోతంబై అర్థం:రామసేతువులా- 1.నలుడు,నీలుడు,పనసుడు మొదలైనవారుతెచ్చిన కొండ లచే ప్రకాశించేది. 2.నల=వట్టివేరు,నీల=నీలిచెట్టు,పనస=పనసచెట్టు,కొండలు మొదలైనవి ప్రకాశిస్తున్నదై. వ.భర్గు భజనంబునుంబోలె నానాశోక లేఖా ఫలితంబై అర్థం: 1.ఈశ్వరునిగురించి చేసే భజనలా- అశోక=నాశన(దుఃఖ)రహితమైన,నానా= అనేక,లేఖాఫలితంబై=అక్షర ఫలాలు కలదై. 2.నానా అశోక.... =అనేక ఫలాలుగల అశోక వృక్షాల వరుసలు కలదై. వ.మరుని కోదండంబునుంబోలె బున్నాగ శిలీముఖ భూషితంబై అర్థం: 1.మన్మథుని విల్లువలె పున్నాగ పుష్పబాణాలు కలదై 2.చెఱకు,తుమ్మెదలతో ఉన్నదై. భాగవతంలో శ్లేషాలంకారయుక్తమైన పద్యాలుకూడా పోతనగారు అక్కడక్కడా మెరుపులా హృద్యంగా దర్శింప జేసినారు.మచ్చునకు- సీ. పున్నాగ!కానవే- పున్నాగ వందితు, తిలకంబ!కానవే- తిలక నిటలు, ఘనసార!కానవే-ఘనసార శోభితు, బంధూక!కానవే-బంధు మిత్రు, మన్మథ!కానవే-మన్మథాకారుని, వంశంబ!కానవే-వంశధరుని, చందన!కానవే-చందన శీతలు, కుందంబ!కానవే-కుంద రదను, తే. ఇంద్రభూజమ!కానవే-ఇంద్ర విభవు, కువలవృక్షమ!కానవే-కువల యేశు, ప్రియక పాదప!కానవే-ప్రియ విహారు, అనుచు కృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు. -౧౦పూ,౧౦౦౯ గోపకాంతలు వనంలో శ్రీకృష్ణుని వెదకుతూ ఆయా వృక్షా లను కృష్ణసంబంధితమైన పదాలతో సంబోధిస్తారు. ఇదీ ఈ పద్యంలోని హృద్యమైన చమత్కార శ్లేష. పున్నాగశబ్దానికి పున్నాగవృక్షమనీ,పురుష పుంగవుడనీ వేరు వేరు అర్థాలు ఉన్నాయి.అలాగే తిలక , ఘనసార , బం ధూక , మన్మథ , వంశ , చందన , కుంద , ఇంద్ర , కువల , ప్రియక అనే పదాలు ఆయా వృక్షాలకుగల పేర్లు. వరుసగా ఫాలతిలకం,పరాక్రమం,సద్బంధుడు,మన్మథాకారత్వం,వేణువు,గంధం, మొగ్గలవంటి దంతసౌందర్యం,ఇంద్రవైభవం,ధరాధి నాథత్వం, ప్రియవిహారం-అనే విశేషణాలు వాటికిగల రెండవ అర్థాలు. ఈ శ్లేష చేత శ్రీకృష్ణుని రూపగుణ లావణ్య విశేషాలను వర్ణిస్తూ ఆయా వృక్షాలను కృష్ణునికోసం ఆరా తీశారు గోప కాంతలు.ఇది గోపికలకు వృక్షాలతోగల సాహచర్యంతోపాటు, వారికి శ్రీకృష్ణునిపైగల ప్రేమనూ సువ్యక్తం చేస్తోంది. ఇదొక మధురానుభూతిని కలిగించే అందమైన శ్లేష. ఈ శ్లేషలో పోతన్నగారి ఈ పద్యకృతిలో హృద్యచమత్కృతి కన్పిస్తాయి. వైద్యంవారి సౌజన్యంతో....
Post Date: Fri, 13 Jan 2023 08:52:30 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 13 Jan 2023 08:52:30 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment