సత్యంబ్రూయాత్ సత్యంబ్రూయాత్ ప్రియంబ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం నిజంచెప్పు(అబద్దం చెప్పకు) సత్యాన్ని ప్రియంగా చెప్పు( అంటే ప్రియమైన సత్యమేచెప్పు). అప్రియ సత్యం చెప్పద్దూ! ఇది సనాతనంగా చెబుతూ వస్తున్నమాట.సత్యం చెప్పడం అన్నివేళలా కుదురుతుందా? రామాయణంలో మారీచుడిలా చెబుతాడు సులభా పురుషా రాజన్ సతతః ప్రియవాదినః అప్రియస్య చ పథ్యస్య వక్తా శోతాచ దుర్లభః రాజా! అందరూ ప్రియంగా మాటాడేవాళ్ళే దొరుకుతారెప్పుడూ!అప్రియమైన సత్యం చెప్పేవాడు దొరకడు,ఒకవేళ ఎవరైనా సత్యం చెబితే వినేవాడు లేడనే సత్యం చెప్పి ప్రాణాలమీదకి తెచ్చుకున్నాడు. కాలం గడిచింది. సత్యాన్ని ప్రియంగా ఎలా చెప్పచ్చో భారతం ఒక కత చెబుతుంది. ఒక ముని తపస్సు చేసుకుంటూండగా, ఒక వేటగాడు ఒక లేడిని తరుముకొచ్చాడు. అది ఆశ్రమంలో దూరింది, రక్షణకి. వేటగాడు వెనకవచ్చి మునిని అడిగాడు, లేడి ఇటొచ్చింది ఎటుపోయిందో చూశారా? అని. దానికి ముని సందిగ్ధంలో పడ్డాడు. నిజమే చెప్పాలి. చెబితే వేటగాడు లోపలికిపోయి లేడిని చంపుతాడు. ఇది హత్యకితోడ్పడటం,జీవహింస. ఇదీ పాపమే! వేటగాడికి వేట అన్నది జీవనోపాధి. వేటాడద్దని చెప్పడమూ కూడదు. దానితో ముని చూసేది చెప్పలేదు, చెప్పేది చూడలేదని సత్యం చెప్పి తప్పించుకున్నాడు. ఇది ఎల్లవేళలా సాధ్యమా? ఇక భాగవతానికొస్తే ప్రహ్లాదుడు తండ్రితో "మదయుతాసురభావంబు మానవయ్య! అయ్య! నీమ్రోల మేలాడరయ్య జనులు" మదయుతమైన అసురభావం వదిలెయ్యి! నీ ముందు నిజం చెప్పరయ్యా! (ఎందుకు నిజం చెప్పరు, నీవు అసురభావంతో ఉన్నావని. భయం,చంపే స్తా వ ని). నిజం చెప్పేడు. నిజం చెప్పి బాధలనుభవించేడు. నేటికాలానికొస్తే రాజకీయులు తాము చెప్పేదంతా సత్యమే అని నమ్మమంటారు. వారికి నిజం చెప్పినా వినరు,వినలేరు, అదంతే! సత్యాసత్యాలని తేల్చుకోవలసినది మనమే!! కాని వీరికో చిన్న భయం మాత్రం ఉంది, మళ్ళీ ఎన్నికల్లో ఎన్నుకోరేమోనని. ఇక రాజకీయపార్టీలకి అంటకాగే కొందరుంటారు, వీరిలో పాత్రికేయులు మొదలు అనేక రకాల వృత్తుల్లోవారు, మేధావులమనిపించుకునే చదువుకున్నవారు, ఉంటారు. రాజకీయులకి ''ఒపీనియన్ మేకర్స్'' అనే మేధావుల తోడుంటుంది. వీరికి రాజకీయులకు ఘనిష్ట సంబంధాలుంటాయి, అవి ఆర్ధికము,హార్ధికము కూడా!!వీరు రాజకీయులు చెప్పేదంతా సత్యమని ప్రచారం చేస్తారు. వీరు చెప్పే సత్యాలు,అర్ధ సత్యాలు, అసత్యాలని మనం నమ్మాలంటారు. నువ్వు నమ్మకపోతే చవటవని తేల్చేస్తారు. నువ్వు నమ్మకపోతే నాకొచ్చిన నష్టం లేదంటారు. నాలుగే ఉపాయాలు చెప్పేరు, పాతకాలంలో కాని రాజకీయాల్లో ఐదో ఉపాయం కూడా అవసరమేనని చాణుక్యుని మాట. ఇది కూడా వీరిమీద పనిచెయ్యదు. కారణం, వీరికి రాజకీయులతో ఉన్న ఆర్ధికసంబంధం. ఒకసారి ఈ ఆర్ధిక సంబంధం తెగితే ఆపై జరిగేది వేరే చెప్పాలా? రాజకీయుల్ని మోస్తారు, అప్పటిదాకా. అది వారికి జీవిక కదా!! నిజానికి వీరు "మోర్ ఫైత్ఫుల్ దేన్ ది కింగ్" అందుచేత వీరు నిజాని చూడలేరు, వినలేరు కూడా!! వీరినిలా అనుకోవచ్చు. కో అంధో? యో అకార్యరతః కో బధిరో? యో హితాని నశృణోతి కో మూకో? యః కాలే ప్రియాణి వక్తుం నజానాతి. ఎవరు గుడ్డివారు? చేయకూడని పని చేసేవారు;ఎవరు చెవిటివారు? హితవచనాలను పెడచెవిని పెట్టేవారు; ఎవరు మూగవారు? బాధల్లో ఉన్నవారితో స్వాంత వచనాలు పలుకడం తెలియనివారు.. వీరు సత్యాన్ని చూడలేరు, వినలేరు. అందుచేత వీరి జోలికి పోవడమే పొరబాటు. నేటి రోజుల్లో సత్యం చెబుతున్నామనుకునేవారు తాము నమ్మినదే సత్యమని,తాము అనుకున్నదే నిజమని అనుకుంటే....తెలిసి తెలిసి ముళ్ళపందినైనా కౌగలించుకుంటాను ,బురదపంది తో నైనా సావాసం చేస్తాను, గొంగళిపురుగునైనా ముద్దెట్టుకుంటానంటే చేయగలది లేదు. ఇక నేటి భార్యాభర్తల దగ్గర కొస్తే ఆమె ఒకరోజో కూరవండింది, అది తింటూ భర్త 'కూర అద్భుతం' అని పొగిడాడు, నిజం చెబుతూ! భార్య మొహం చింకి చేటంతయింది.మరో సారి కూరేసింది, కూడా. ఇలా పొగిడాడు కదా అని అదే కూర వారంలో మళ్ళీ చేసింది. ఈ సారి భర్త మాటాడలేదు. దాంతో భార్య అడిగిందిలా. 'కూరెలా ఉంది చెప్పలేదే', అని! దానికి భర్త 'నీమొహంలా ఉంద'న్నాడు. 'నా మోహానికేం చంద్రుడులా వెలిగిపోతుంటేనూ! అది చూసికదా నా వెనకబడి కట్టుకున్నారూ', అని గునిసింది. భర్త నిజం చెప్పేడా అబద్ధం చెప్పేడా రాజా అడిగాడు భేతాళుడు.
Post Date: Thu, 19 Jan 2023 03:31:25 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 19 Jan 2023 03:31:25 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment