Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 12 March 2023

ప్రఖ్యాత రచయిత రస్కిన్ బాండ్ అభిమానుల్ని అక్కడ మాత్రమే ఎందుకు కలుస్తారో తెలుసా..? - Unknown

రస్కిన్ బాండ్ (Ruskin Bond) ఈ పేరు వినని సాహితీప్రియులు ఉండరు. ఆయన స్వతహాగా ఆంగ్లం లో రాసినప్పటికీ ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోకి వారి రచనలు అనువాదాలు జరిగాయి,జరుగుతూనే ఉంటాయి.ఇంగ్లీష్ పాఠ్యగ్రంథం లో ఎక్కడో ఓ చోట బాండ్ ఒక్క కథనో ,వ్యాసమో చదివే ఉంటాము.ఇక CBSE,ICSE సిలబస్ లు చదివి వచ్చిన యువత గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన రాసిన అనేక కథల పుస్తకాల్ని చదువుకుంటూ పోతూనే ఉంటారు.జీవితం లో ఒక భాగమై ఆయన పేరు మీద అనేక గ్రూపులు ఆన్ లైన్ లో నడుపుతుంటారు.ఈ మేగజైన్ కూడ ఉంది. కథ ని ప్రేమించే మనిషికి ఆయన కథ తగిలితే చాలు ఇక అక్కడితో ఆగలేరు. మరి ఇంతా చేసి ఈ రస్కిన్ బాండ్ ఎవరు..?చిన్నపిల్లలు,యువతరం,పెద్దతరం అందరినీ తనదైన ప్రత్యేక కథన కుతూహలం తో అలరించే ఈయన ముస్సోరి అనే పట్టణం లో ,హిమాలయ సానువుల్లో ,ఆ కొండల్లో ఎన్నో దశాబ్దాల నుంచి జీవిస్తూ అక్కడి తన అనుభవాలనే గాక ఇంకా తన జీవితం లోని ఎన్నో అనుభవాలను కథల రూపం లో రాస్తూ ఇప్పటికీ 100 పుస్తకాల కి పైగా వెలువరించాడు. ప్రస్తుతం ఎనభైవ పడి లో ఉన్నాడు. జన్మతహ ఆంగ్లేయ దంపతులకి పుట్టినప్పటికి భారత దేశాన్ని తన ఆవాసం గా చేసుకుని ఇక్కడే ఉండిపోయాడు. తన అసలు పేరు ఓవెన్ రస్కిన్ బాండ్ ,1934 లో హిమాచల్ ప్రదేశ్ లోని కాసులి అనే ఊరి లో జన్మించాడు. ఆయన చిన్నతనం లోనే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి అప్పటి ఒక భారతీయ సంస్థానాధీశుణ్ణి రెండో వివాహం చేసుకోవడం తో, ఎక్కువగా తండ్రి వద్దనే పెరిగాడు. బ్రిటీష్ ఆర్మీ లో పనిచేసే అతను అనేక ప్రాంతాలు తిరిగేవాడు.బాండ్ కూడా తండ్రి తో పాటూ తిరిగాడు. యవ్వనదశ కి ముందే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత తనది ఒకరకమైన అనాధ జీవితమే అయింది.స్నేహితుల సాయం తోనూ,చిన్న చిన్న పనుల తోనూ తనని తాను పోషించుకున్నాడు. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తన బంధువులు ,తెలిసిన వాళ్ళు చాలామంది ఇంగ్లండ్ కి వెళ్ళిపోయారు. అయితే తాను మటుకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. రచయిత గా మాత్రమే జీవించాలని కంకణం కట్టుకున్నా,అది ఇండియా లో చాలా కష్టమని తెలిసింది.ట్యూషన్స్ చెప్పినా,స్వచ్చంద సంస్థ లో పని చేసినా దానికోసమే. మొత్తానికి రమారమి 70 ఏళ్ళపాటు రచనా రంగం లో ఉండి 100 కథల పుస్తకాల్ని ఇప్పటిదాకా రాశాడు. లెక్కలేనన్ని వ్యాసాలు,ఇతర ప్రక్రియలు చేపట్టాడు.మరి ఇన్నేళ్ళ తన జీవితం లో తాను పొందిన తీపి,చేదు అనుభవాలు అన్నిటినీ కలిపి రస్కిన్ బాండ్ తన ఆత్మకథ ని రాసుకున్నాడు దాని పేరు Lone Fox Dancing రెండువందల ఎనభై పేజీలు. స్పీకింగ్ టైగర్స్ వాళ్ళు ప్రచురించారు. ప్రతి ఒక్క రచయిత లేదా రచయిత కాదలుచుకున్న వ్యక్తి తప్పక చదవాలి. ఈ ఆటోబయోగ్రఫీ చదవడం వల్ల మనకి రస్కిన్ బాండ్ యొక్క జీవిత గాథ తెలియడమే కాదు. దానితో బాటు అనేక విషయాలు తెలుస్తాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వం లో పనిచేయడానికి వచ్చిన అనేక రకాల మనుషుల మంచీ చెడు తెలుస్తాయి.వాళ్ళ వ్యామోహాలు,ఉద్యోగధర్మం గా వాళ్ళు చేసిన పనులు, వాటి పర్యవసానాలు తెలుస్తాయి. అంతేకాకుండా స్థానిక ప్రజలతో వాళ్ళ అనుబంధాలు తెలుస్తాయి.ముఖ్యం గా సింలా,డెహ్రాడూన్,జాం నగర్,లక్నో వంటి ప్రాంతాల్లో నాటి నేటివ్ బ్రిటిషర్స్ ఎలా జీవించేవారు,రోజువారి జీవితం లోని పదనిసలు ఇప్పుడు చదువుతుంటే ఆసక్తి గా అనిపిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలామంది బ్రిటిషర్లు ఇక్కడ ఉండడం లో  ఇన్సెక్యూరిటీ ఫీలయ్యి ఇంగ్లండ్ కి వెళ్ళిపోయారని రస్కిన్ బాండ్ చెబుతాడు. తాను నాలుగు ఏళ్ళు లండన్ వెళ్ళి కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించి తనకి ఇండియా నే బాగుందనిపించి మళ్ళీ వెనక్కి వస్తాడు. దానికి కారణం చెబుతూ హిమాలయ సానువుల్లోని ఆ గుట్టల్లోనూ,చెట్ల లోనూ,ఉండి ఉండి అవి నాలో ఓ భాగమయిపోయాయి.ఆ తర్వాత ఢిల్లీ లోనూ ,బొంబాయి లోనూ ఉండాల్సివచ్చినా అది తనవల్లగాదని ముస్సోరి లోనే స్థిరపడ్డాడు.అక్కడ నుంచే తన రచనా యాత్రని సాగించాడు.అప్పటికి ఆ ఊరు చాలా చిన్నది. తన మొట్టమొదటి నవల The Room on the  Roof ఇలస్ట్రేటడ్ వీక్లీ ఆఫ్ ఇండియా లో సీరియలైజ్ అయినప్పుడు ఆనందం తో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. దాన్ని ఎవరికైనా చూపించి శభాష్ అనిపించుకోవాలన్నా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆ చుట్టూతా ఎవరూ ఉండరు. ఢిల్లీ లో ఉన్న కుష్వంత్ సింగ్ తనని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు ఒకసారి,తన రచనల్ని బాగా ప్రోత్సహించేవాడని రస్కిన్ బాండ్ రాసుకున్నాడు.మెల్లిగా స్వదేశీ,విదేశీ ఇంగ్లీష్ పత్రికల్లో రాయడం మొదలుపెట్టి తనకంటూ ఓ స్థాయి ని సంపాదించుకుంటాడు.ఆ తర్వాత ఇంప్రింట్ అనే పత్రిక కి సహసంపాదకునిగా ఆర్.వి.పండిట్ కోరిక మీద పనిచేశాడు.ఎమర్జెన్సీ టైం లో ఆ పండిట్ మీద అప్పటి ప్రభుత్వానికి ఉన్న కోపం వల్ల ఓ చిన్న కేసు లో ఇరుక్కుంటాడు.అయితే ఈజీగానే దానిలోనుంచి బయటబడి తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగించాడు. ఇప్పుడు మాదిరిగా అప్పట్లో రచయితలకి పబ్లిసిటీ లేదని,తాను ఓసారి బిబిసి లో ప్రొగ్రాం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గ్రాహం గ్రీన్ తన పక్కనే కూర్చున్నా తాను గుర్తించలేదని ,ఆ తర్వాత ఎవరో తనకి చెప్పడం తో ఖంగుతిన్నానని అంటాడు. అయితే ఎర్నెస్ట్ హెమింగ్వెయ్ లాంటి వాళ్ళు వేరు.పబ్లిసిటీ కోసం ఏవో చేస్తుండేవారని అంటాడు. ఇలా ఎన్నో విషయాల్ని తనకి తారసపడిన సంఘటనల్ని అక్షరబద్ధం చేశాడు. 50 ఫోటోలు ఈ పుస్తకం లో ఉన్నాయి.అవి అన్నీ ఎన్నో నాటి సంగతులని వివరిస్తాయి. ముస్సోరి లో ఉండే రస్కిన్ బాండ్ ని కలవడానికి ఎంతోమంది అభిమానులు వస్తుంటారు. అక్కడ ఉండే కేంబ్రిడ్జ్ బుక్ హౌస్ అనే పుస్తకాల షాప్ లో వాళ్ళందర్నీ ప్రతి శుక్రవారం కలుస్తుంటాడు. ఇంట్లో మాత్రం ఎవరినీ కలవడాయన.దానికీ కొన్ని కారణాలు ఉన్నాయి. బెంగాల్ నుంచి ఓ రచయిత్రి చాన్నాళ్ళ క్రితం ఈయన ఇంటికి వచ్చి తప్పనిసరిగా తన పుస్తకానికి ముందుమాట రాయవలసిందే అని కూర్చుందట. నేను కొద్దిగా పనిలో ఉన్నా ,స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళమంటే నానాయాగీ చేసిందట. సరె...ఎవరి అనుభవాలు వాళ్ళవి. మన ఆర్.కె.నారాయణ్ గారు జీవించి ఉన్న రోజుల్లో అభిమానుల్ని ఇంట్లో కాకుండా బయటనే ఎక్కువ కలిసేవారని చదివాను. అనేక అనుభవాల సమాహారంగా ఉన్న ఈ ఆటోబయోగ్రఫీ ప్రస్తుతం అమెజాన్ లో లభ్యమవుతోంది. ----- మూర్తి కెవివిఎస్
Post Date: Sun, 12 Mar 2023 13:46:57 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger