Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 23 May 2023

మన వాస్తవికతలోంచే మనదైన స్థానికత! - శ్రీధర్ వెల్దండి

స్థానికత గురించి నిర్దిష్టమైన ఆలోచనలు అందించిన కథకుల్లో, విమర్శకుల్లో కేతు విశ్వనాథ రెడ్డి అగ్రశ్రేణిలో వుంటారు. ఈ ఇంటర్వ్యూ సారంగ కోసం శ్రీధర్ వెల్డండి చాలా కాలం కిందట చేశారు. సా హిత్యంలో ఇప్పుడు కథా యుగం నడుస్తోందనే వాదనను మీరెలా సమర్ధిస్తారు? సాహిత్యంలో యుగ విభజన వ్యక్తుల పరంగా గానీ, ప్రక్రియల పరంగా గానీ  నాకిష్టం లేని మాట. మీ ప్రశ్నలోని అంతరార్థాన్ని బట్టి చూస్తే కవిత్వం కంటే కథా రచనకు ఆదరణ ఎక్కువైనదనుకోవాలి. లేదా కథా రచన పట్ల, కథా పఠనం పట్ల ఆసక్తి పెరిగిందనుకోవాలి. దీనికి కారణం వచన వ్యాప్తి. కవిత్వంలో ఇమడ్చలేని ప్రజల ఆకాంక్షలను, మానవ సంబంధాలను, అనుభవాలను స్వీయానుభావాన్నుంచి, పరిశీలన నుంచి, జ్ఞానం నుంచి చిత్రించాలనే కథా రచయితల ఆర్తి. వచన వ్యాప్తి అంటున్నామంటే మనం మాట్లాడుకునేది వచనం. బోధనలో వచనం. ప్రసార సాధనాల్లో ఎక్కువగా అందిస్తున్నది వచనం. నిర్ణీత ప్రయోజనాల కోసం మనం వాడేది వచనం. ఇంత వచన వ్యాప్తి వున్నప్పుడు సృజనాత్మక రచయితలు కూడా తమ అభివ్యక్తికి వచనాన్ని ఒక వాహికగా ఎంచుకోవడంలో ఆచ్చర్యం లేదు. అట్లని కవిత్వం వెనకబడినట్లు నా ఉద్దేశం కాదు. కవిత్వ సంకలనాలు చాలా వస్తున్నాయి. కవిత్వ వస్తువు మీద, రూపం మీద శ్రద్ధ వున్న మంచి కవులు మనకు లేకపోలేదు. ఐతే కొత్త కొత్త సామాజిక వర్గాల నుంచి, ప్రాంతాల నుంచి, ఉప ప్రాంతాల నుంచి చదువుకున్న వారి సంఖ్య పెరిగింది. వారిలో కొందరు సృజనాత్మక కల్పనా సాహిత్యం మీదా, ముఖ్యంగా కథల మీద మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. సాధారణంగా ఏ వాదమైనా లేక ఉద్యమమైనా మొదట కవిత్వంలో విస్తరించి ఆ తరువాత ఇతర ప్రక్రియల్లోకి వ్యాపించే ఒక భూస్వామిక    లక్షణం తెలుగు సాహిత్యంలో ఉంది.  ఈ కోణంలో ప్రాంతీయ  అస్తిత్వ కథలు వస్తున్న విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది భూస్వామిక లక్షణం కాదు. కాక పోతే కవిత్వానికి ఉన్నంత చరిత్ర కవిత్వేతర ప్రక్రియలకు లేదు. ఉద్యమాలకు కవులు తక్షణం స్పందిస్తారు. వారి గాఢమైన ఆవేశ బలం కావచ్చు. కవిత్వ నిర్మాణానికి అవసరమయ్యే స్పందనల చిత్రణ శబ్ద చిత్రాల రూపంలోనో, భావ చిత్రాల రూపంలోనో, భావ శబలత రూపంలోనో అది వ్యక్తం అవుతుంది. ఇతర వచన ప్రక్రియలకు ఇది కొంత ఆలస్యంగా విస్తరిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వ కథల విషయంలో కూడా ఇది వాస్తవం. దీనికి కారణం ఈ అస్తిత్వ కథ లాంటివి తక్షణ స్పందనకు వీలైన నిర్మాణాలు కాదు. ప్రాదేశిక నిర్దిష్టతతో తెలుగు కథను ఎట్లా చూడాలి? తెలుగు సాహిత్యకారులు, విమర్శకులు సాధారణంగా మూడు మాటలు వాడుతుంటారు. అవి స్థానీయత, ప్రాదేశికత, ప్రాంతీయత. స్థానీయత కంటే ప్రాదేశికతకు, ప్రాంతీయతకు మరింత విశాలమైన నేపథ్యం వుంటుంది. ప్రాదేశికత, నిర్దిష్టత అంటున్నప్పుడు ప్రధానమైన ఆరేడు లక్షణాలని మనం దృష్టిలో ఉంచుకొవాలి. 1. ప్రదేశం/ప్రాంతం, భౌతిక జీవితం . అంటే భౌగోళిక స్థితిగతులు, పర్యావరణం, జలవనరులు, అటవీ సంపద, వృక్ష సంపద, ఖనిజ, ఇంధన సంపద, నేల తీరులు, వర్షపాతం, పంటలు, కరువు కాటకాలు, వరదలు వీటి మధ్య ప్రాంతీయ, ఉప ప్రాంతీయ భేదాలు . 2. సామాజిక శ్రేణులు, (మతం, కులం, ఉపకులాలు, తెగలు)సామాజిక విభజన, సామాజిక వైరుధ్యాలు, అసమానతలు, ఆదిపత్య వర్గాల వైఖరులు, ప్రతిఘటనలు, ఉద్యమాలు. 3. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలు. చలనం, అభివృద్ధి, స్వభావం, పరిశ్రమలు, వ్యవసాయం, వృత్తుల సంక్షోభం, చరిత్ర, ఇటీవలి సామాజిక పరిణామాలు. 4. భాష, అధికార భాష, భాషా భేదాలు, మాండలికాలు, ఉపమాండలికాలు, ఆదివాసి భాషలు, అన్యభాషా వ్యవహర్తలు. 5. మహిళా సమస్యలు. 6. సాంస్కృతిక పరమైన అంశాలు, తిండి తిప్పలు, వేష ధారణ, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, పండగలు, కళా సాహిత్య రూపాలు. 7. ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి ప్రవాసం వెళ్ళిన వారి అస్తిత్వ సమస్యలు. ఈ అంశాలు ప్రాదేశిక నిర్దిష్టతను ఎత్తి చూపుతాయి. ఈ దృష్టితో తెలుగు కథల్లో ఏ మేరకు ఆ ప్రతిఫలనం జరిగిందో మనం పరిశీలించవచ్చు. ప్రాంతీయ అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి? ప్రాంతీయ  స్పృహతో కథలు వెలువడడం ముందడుగా? వెనుకడుగా ? అస్తిత్వం అనే మాటను మనస్తత్వ శాస్త్రజ్ఞులు, సామాజిక శాస్త్రజ్ఞులు , తత్వశాస్త్రజ్ఞులు  నిర్వచిస్తున్న క్రమంలో అస్తిత్వం వ్యక్తి జీవ లక్షణం, జన్యు లక్షణం, జన్యుప్రేరితం, గాయపడిన వ్యక్తి స్వభావం, సామాజిక ప్రాంతీయ సాలిడారిటికి సంకేతం అని కూడా భావిస్తున్నారు. అస్తిత్వం అనే మాటకు ఉనికి, గుర్తింపు అనే అర్థాలున్నాయి. "ఐడెంటిటి" అనే  ఇంగ్లీష్ మాటకు సమానార్థకంగా అస్తిత్వం అనే మాటను విరివిగా ఉపయోగి స్తున్నారు. ఉదాహరణకు దళిత అస్తిత్వం, మైనారిటీ అస్తిత్వం, మహిళల అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం. ఒక భౌగోళిక ప్రాంతం లేదా ఉప ప్రాంతంలోని లేదా భాషా ప్రాంతంలోని ప్రత్యేక లక్షణాలను, భావాలను, విశ్వాసాలను ప్రతిఫలించే నిర్దిష్ట లక్షణాలను ప్రాంతీయ అస్తిత్వంగా స్థూలంగా నిర్వచించవచ్చు. ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో వెలువడుతోన్న కథలు వెనుకడుగు మాత్రం కాదు. అవి  సమాజ అవగాహనకు మునుపటికంటే ఎక్కువగా తోడ్పడుతున్నాయి. ఒక ప్రాంతం ప్రత్యేక లక్షణాలను ఆ ప్రాంతంలోని వివిధ సామాజిక సముదాయాల అవగాహనను పెంచుతుండడం చూస్తూనేవున్నాం. ఉదాహరణకు తెలుగు ప్రాంతంలోని ఆదివాసీల జీవన సమస్యలు, జీవన వాస్తవికత కథల్లో విరివిగా వెలువడడం ఈ రెండు మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. అలాగే ముస్లిం జీవితాలైనా, దళిత జీవితాలైనా, మహిళల జీవితాలైనా మైనారిటీల జీవితాలైనా.  ఇది మన సమాజ అవగాహనను తప్పక పెంచేదే కదా. అంతేగాక సమాజంలో సమానత్వాన్ని/సమభావాన్ని, సౌభ్రాతృత్వానికి  ఈ కథల్లోని  సంవేదనలు, స్పందనలు. తోడ్పడుతాయి. ఇది మనిషి చేసుకున్న మానవ సంస్కార పరిణామంలో ఒక దశ. ఒక చిన్న ముందడుగు.. ప్రాంతీయ అస్తిత్వానికి ఎందుకింత గుర్తింపు లభిస్తోంది? ఇది అస్తిత్వ చలనాల దశ. తెలుగు మాట్లాడే ప్రాంతంలోని ప్రజా సముదాయాల జీవ లక్షణాలను భావాలను ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవి అనుకున్న సామాన్య లక్షణాలను ఒక్కోసారి నిర్దిష్ట లక్షణాలకు కూడా (స్థానీయ  లక్షణాలు ) రచయితలు స్పందిస్తున్న దశ ఇది. పాఠకులు కానీ, విమర్శకులు కానీ వీటిని గురించి ఆలోచించాల్సిన దశ కూడా ఇదే. ప్రాంతీయ అస్తిత్వ కథ వెనుక జాతీయ అంతర్జాతీయ కారణాలు లేదా ప్రభావాలు ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అస్తిత్వ సమస్యలున్నాయి. అమెరికా లో నల్ల జాతి ప్రజలది అస్తిత్వ సమస్య. బంగ్లాదేశ్ ఏర్పడడానికి భాష ఒక అస్తిత్వంగా ఏ రకంగా పని చేసిందో మనకు తెలుసు. లాటిన్ అమెరికన్,ఆఫ్రికా దేశాల్లోని అస్తిత్వ సమస్యలతో కూడా మన కథా రచయితలకు కొంత మందికైనా అంతో ఇంతో అవగాహన లేకపోలేదు. ఇవి పరోక్ష కారణాలు, ప్రభావాలు ఏవైనా మన రచయితలూ మన వాస్తవికత నుండే కథలను రాస్తున్నారు. రాయలసీమలో కవిత్వం కంటే కథే బలంగా వస్తోంది దీనికి ప్రాదేశికతే కారణమా? ప్రాదేశికత కారణం కాదు. అక్కడి జీవితంలో సామాజిక, రాజకీయ ఉద్యమాలు ఒక రకంగా చాలా చాలా తక్కువే. దీనికి తోడు అక్కడ పద్య ప్రియత్వం ఎక్కువ. అంతకు మించి ఆధునిక వచన కవిత్వానికి అవసరమైన వస్తు రూపాలు చాలా తక్కువ మందికే అబ్బాయి. కవిత్వ విషయంలో సంప్రదాయ విచ్చిత్తి జరగవలసినంత జరగలేదు. ప్రాంతీయ అస్తిత్వం అనేది కథా శిల్పానికి ఏమైనా మెరుగులు పెట్టిందా? ఏ కథకైనా వస్తువెంత ముఖ్యమో, శిల్పమూ  అంతే. ప్రాంతీయ అస్తిత్వం అంటున్నప్పుడు మనం అందులో భాష ఉందనే విషయం మరువరాదు. ఈ భాషా శైలుల విషయంలో రచయిత వాడే కథన శైలి,పాత్రల భాషా శైలుల విషయంలో ప్రాంతీయ  అస్తిత్వాన్ని చిత్రిస్తున్న కథకులు మరింత విశాలం చేశారు.తర్వాత  చాలా కొద్ది మందే కావచ్చు మానసిక ఘర్షణను, మానవ చలనాలను చిత్రించడంలో శ్రద్ధ చూపారు. కవిత్వంలో ఆధునికానంతరవాదం వస్తున్నప్పుడు ఆ ప్రభావం కథా సాహిత్యం మీద ఏ మేరకుంది? కవిత్వంలో ఆధునికానంతరవాద పరిశీలన అఫ్సర్ "ఆధునికత- అత్యాదునికత" ( 1992) వ్యాసాలలోనూ, దానికి తిరుపతిరావు ముందు మాటలోనూ  వారు చేసినట్లు గుర్తు. నిజానికి ఈ వాదానికి సంబంధించిన జ్ఞానాన్ని, సిద్ధాంతాన్ని, మూలగ్రంథాల అనువాదాలు గానీ, స్వంత రచనలు గా గానీ వచ్చిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. కన్నడ విమర్శకులు దీన్ని నవ్యోత్తర వాదం అంటున్నారు. ఇటీవలే అస్తిత్వాలను, అస్తిత్వ చరిత్రను చిత్రించే కథలను ఆధునికానంతర ధోరణి కింద చూస్తున్నారు. నేను కూడా మొన్న మొన్నటి దాకా దళితులు, మైనారిటీలు, బహుజనులు, మహిళలు వీరి శకలీకరణ జీవితాల్ని చిత్రించే కథలు ఆధునికానంతరవాదానికి చెందినవనే అనుకున్నాను. ఇది ఒక రకంగా సిద్ధాంత దృష్టి కాదు. రాజకీయ దృష్టి. ఆధునికానంతరవాదం అంతః సారాన్ని సర్వ విషయ సాపేక్షతను అంతరంగ చలానాలను చిత్రించడానికి ప్రయత్నించిన   వి. చంద్రశేఖర్ రావు, అఫ్సర్,  మధురాంతకం నరేంద్ర లాంటి రచయితలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇటీవలే ఆధునికానంతరవాదం కంటే భిన్నమైన ఆధునికత, ఆధునీకరణ సాక్ష్యంగా నిలిచే అనుక్షణిక నవీన మోహిని ద్రవాధునికత  (లిక్విడ్ మోడ్రనిజం)-పోలిష్ సామాజిక తత్వవేత్త బౌమన్ ను  పాపినేని శివశంకర్ పరిచయం చేశాడు. చలనం, అస్థిరత లక్ష్యంగా సాగే ఈ ద్రవాధునికత కథా రచనలో ఆధునికోత్తరవాదం లాగే అనే ఒక ఆకర్షణీయమైన గుర్తుగానే మిగులుతుందేమో చూడాలి. వీటి విషయంలో చాలా మందితో పాటు నాదీ పరిమితమైన జ్ఞానమే. ఇది విశాలం చేయడానికి ఆధునికానంతరవాదాన్ని ప్రతిఫలించే కథలను ఒక సంకలనంగా తీసుకురావాల్సిన అవసరమెంతైనా ఉంది. అస్తిత్వ వాదాన్ని తెలుగులో సమూహాల గుర్తింపు వాదంగా వాడుతున్నాం. ఎగ్జిస్టెన్షియలిజం కు సమానంగా వాడుతున్నాం. జీన్ పాల్ సార్త్రే, మార్షల్ ప్రౌస్ట్ వంటి వారు ప్రతిపాదించిన అస్తిత్వ వాదంలో కీలకాంశం మనిషికి ఇచ్చా శక్తి ఉంది. తానూ చేసే పనులకు తానే బాధ్యుడు. ఐతే- అర్థం పర్థం లేని ప్రపంచంలో. ఏమైనా ఈ రకమైన అస్తిత్వవాదానికి ఆధునికానంతరవాదం ఏ  అంశాల్లో విభేదించిందో తెలిస్తే మనకు మంచిది. తెలుగులో సాహిత్య పరిభాష అభివృద్ధికి ఈ ప్రయత్నాలు మరింత దోహదం చేస్తాయి. మిగిలిన భారతీయ భాషల కథలతో పోల్చినపుడు తెలుగు కథా స్థానం ఎక్కడుంది? దీన్ని ఎట్లా చూడాలి?ఆధునిక భారతీయ భాషల కథల్ని మనం ఆంగ్లం ద్వారానో, తెలుగు ద్వారానో చదువుకుంటున్నాం. కానీ పరిశీలించడానికి తగినంత విస్తారంగా ఈ కథా సాహిత్య సామగ్రి లోటు ఉండనే ఉంది. నేను పరిశీలించినంత వరకు తెలుగు కథ  మెచ్చుకోదగిన స్థాయిలోనే ఉంది- అన్ని మంచివనుకునే ముగ్ధత్వం వదిలిపెడితె. ఏది ఏమైనా తెలుగు కథలు విరివిగా ఇంగ్లీష్ లోకి ఇతర ప్రాంతీయ భాషల్లోకి వెళ్తే ఆ సాహిత్యకారులు ఏమనుకుంటారో కూడా మనం పట్టించుకోవాల్సి ఉంది. *
Post Date: Tue, 23 May 2023 11:57:34 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger