Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 15 June 2023

మాదిగ రాజయ్య - రాజు దుర్గాని

ఆ యళ్ళ ఆదివారం. సండే బుక్కల ఏదో కథ చదువుతుంది నా చెల్లె. మధ్యల నేనేదో పని చెబితే 'డిస్టబ్ చేయకు' అని నా మీద సర్రున లేశి పుస్తకంల మునిగిపోయింది. ఇగ నేను క్రికెట్ ఆడనీకె పోయిన. 'అన్నా! రాజన్న ఎంత చదివిండు? ఆ బుక్కుల అన్న పేరుంది' అడిగింది పొద్దూకె నేను ఇంటికి రాంగనే. 'ఏడ, ఏడ' అని నేనూ తొందరపడిన. అసలే మా రాజన్నాయే. మస్తు సదివిండు అని తెల్సుగాని, ఎంత సదివిండో తెల్వదు. ఆ కథ చివర్లో రచయిత పేరు 'మాదిగ రాజయ్య'. మా రాజన్నది. కథ పేరు 'జరీనా'. ఏడుపొచ్చింది నాకు కథ చదువుతుంటే. పొద్దుగాళ్ళ మా చెల్లె చదువుతుందన్న కథే ఇది. మా రాజన్న రాసింది. ప్రేమకథ. ఒక మాదిగ-ముస్లిం జీవిత కథ. మస్తు గంభీరంగుంటడు మా రాజన్న. అందరితోని నోరార మాట్లాడుతడు. ఆయన లోపల ఇంత బాధున్నదా అనుకున్న. నేను ఇంటర్‌ల ఉండంగ పెద్ద పంచాయతీ చేశిండు రాజన్న. మా ఊర్ల పీర్లు మాదిగిండ్లళ్ళకు రావు. ఊరు మొత్తం తిరుగుతయి కాని మా ఇండ్లళ్ళకు రావు. పెద్ద పెద్దోళ్ళంత ఏందేందో అంటున్నరు రాజన్నని, మాదిగోళ్ళు కూడా. కొంతమంది పోరగాళ్ళు తప్ప. 'ఈ మత విష సంస్కృతి మనల్ని ఊరి బయటకు విసిరేసింది. అట్లాంటి మనల్ని గుండెకు హత్తుకుంది ఈ ముస్లిం సూఫీలు. ఈ దర్గా, పీర్ల పండగ, మనం ఇయాల మొక్కుతున్న ఆశన్న, ఊశన్న(హసన్, హుస్సేన్) ఈళ్ళంత సమానత్వం కోసం ప్రాణాలే విడిచారు. మనుషులంతా ఒకటే అని చాటారు' రాజన్న మాట్లాడే మాటలన్నీ అర్థం అయితలేవు గాని 'అందరం సమానమే' అనే సంగతి అందరికీ గుర్తుజేస్తుండు. అయినా మాదిగిండ్లళ్ళకు పీర్లు రానివ్వరాయె. ఈసారి పండగనుంచయినా ఈ అంటరానితనం పోయి సమానత్వాన్ని తీసుకురావాలని కొట్లాడుతుండు రాజన్న. 'చదువుకున్ననంత మాత్రాన, మాదిగోని కులం మారుతదా?' అంటుండు మా ఊరి సర్పంచ్ గ్రామపంచాయతిల. 'ఈ హైందవ సంస్కృతిలో అంటరానివారిగా, సమాజానికి దూరంగా బ్రతకలేక చాలామంది మాదిగలు ముస్లింలు, క్రిష్టియన్లుగా మారారు.' పొద్దుగల్ల రాజన్న అన్న మాటల గురించే ఆలోచిస్తున్న నేను. 'నిజమే, పీర్లపండగొచ్చిందంటె ఆ లెక్క అలాగుంటది. పీర్లపండగ మాదిగ-ముస్లిం కుటుంబాలకు సంబంధించి ఒక సాంస్కృతిక పయనం. పండగ మొదలయ్యేదే మాదిగ డప్పుతోని. అసొయ్‌దుల్లా ఆటలు, పీర్లు బాయిల పడతయనంగ ముందుగాళ్ళ రాత్రి హుషారూ. అదో గొప్ప తరీఖ. మాదిగిండ్లళ్ళ శానామంది అనుకుంటరు 'బోనాలు మా అమ్మలక్కల పండగ, పీర్లేమో మా పండగని. కాదా మరి! పీర్లకొట్టం కాడ సగంమంది మా వాళ్ళే. అసొయ్‌దుల్ల ఆడే మొగోళ్ళంతా మాదిగోళ్ళే. ఊర్ల పెద్దభాగమోళ్ళంగా మరి' అనుకున్న. 'పీర్లు నిలబెట్టిన దగ్గర్నుంచి మాదిగోడు, వాని డప్పు పీరెంబడే ఉంటడాయె. అలాంటిది మాదిగోని ఇంటికి పీర్లను రానివ్వరెందుకు?' అని ప్రశ్నించిండు రాజన్న పెద్దోళ్ళందరిని. 'దర్గాలకు పోవుడు, తుర్కదేవుళ్ళ పేర్లు పెట్టుకొనుడు, పెద్దకూర తినుడు ఇవ్వన్ని మాదిగోళ్ళ ఇండ్లళ్ళ శానా చూస్తం, మాదిగ-ముస్లింల మధ్య దూరం పెంచనివ్వొద్దు' అన్నడు రాజన్న. ఇవన్ని రాసిండు 'జరీనా' కథల. కథ చదువుతుంటె అప్పట్ల జరిగినవన్ని గుర్తొస్తున్నయ్ నాకు. జరీనా అని ఒక అక్క ఉండె. తనే ఈ కథ. ఎంత మంచిదో, పీర్ల పండగప్పుడయితె నేనడిగిన్నన్ని సార్లు షర్బత్ పోసేది. మలీదా ఇచ్చేది. ఇంక ఆళ్ళ హోటళ్ళయితె మనకు ఉద్దెర కూడా. అక్క, రాజన్న ప్రేమించికున్నరంట. మా రాజన్నను ఇష్టపడనోళ్ళు చాలా తక్కువమందే మా ఊళ్ళో. ఆయళ్ళ మస్తు గాలిదుమారంతోని వానొస్తుంది. ఆ గాలి దుమారానికి జరీనా అక్కవాళ్ళ గుడిసె హోటెల్ పైకప్పు కొంచెం లేసిపోయింది. మధ్యానమవుడుతోటి ఎవరూ లేరు. వచ్చిన గిరాకి కొనుక్కొని పోతున్నరుగాని, ఆడ ఎవరూ కూసోలే. అక్క వాళ్ళమ్మ తినడానికి ఇంటికి పోయింది. వాన జోరుగైతుంది. హోటళ్లున్న ముసలోళ్లంతా  పక్కనే ఉన్న బస్టాండ్‌లోకి పోయిండ్రు. వర్షంలో ఒక్కతే తడుస్తుంది జరీనా అక్క. ఊకూకె బయటికొచ్చి ఆళ్ళ అమ్మకోసం చూస్తూ ఉంది ఇంకెప్పుడొస్తదా అని. ఏడ్వలేక తన పేదరికానికి కాస్త నవ్వు ముఖం చూపెడుతూ జరీనా నెలవంకలాగ కొంచెమే నవ్వుతూ ఉంది. పేపర్ చదవడానికొస్తున్న మాదిగ రాజయ్య ఇదంతా గమనిస్తున్నడు. ఆ వర్షానికి అప్పటికే చేసిపెట్టిన సౌద తడుస్తుంది. ఇవేం పట్టించుకుంటలేదు జరీనా. వాళ్ళ అమ్మ వచ్చే సందులోకి చూస్తూ ఉంది. "వర్షంలో ఎందుకు తడుస్తున్నావ్? ఈ సౌద మీద నీళ్ళు పడ్తున్నయ్. తీసి లోపల పెట్టొచ్చుగా! మీ అమ్మ వస్తదేమో గానీ" అన్నడు రాజయ్య. కనుగుడ్లు అంతకంత పెద్దవి చేస్తూ అమ్మనే చూస్తుంది గాని ఏం సమాధానం ఇవ్వలేదు జరీనా. "నువ్వేం అనుకోనంటే నేను హెల్ప్ చేస్తా కానీ, మల్ల మాదిగోడు ముట్టుకుని మైలపడ్డవి ఎవరూ కొనరేమో?" "మేము చేసినవి కొంటున్నరుగా మరి! మేమూ మాదిగోళ్ళమే, థాంక్స్" అని సమాధానం ఇచ్చింది. 'ఏం మాట్లాడింది జరీనా? వాళ్ళూ మాదిగోళ్ళేనా?' గొప్పగా అనిపించింది రాజయ్యకి. ఉప్పొంగి పోయిండు. జరీనా మాట్లాడింది నిస్సహాయతతో కాని అది తప్పు కాదు. అది తత్వం. సూఫీతత్వం. మాదిగత్వం. మానవత్వం. పొద్దుగల్ల 8కి కాలేజికి పోయి ఒంటిగంటకల్ల ఇంటికాడ ఉంటది జరీనా. ఇబ్రహీంపట్నంల ఒకటే గవర్నమెంటు కాలేజీ ఉండుడుతోటి పొద్దున డిగ్రీ, మధ్యాహ్నం నుండి ఇంటర్ క్లాసులు నడుపుతున్నరు. ఇగ మధ్యాహ్నం నుండి హోటళ్ళనే ఉంటది. అట్ల పరిచయమయ్యిండ్రు ఇద్దరు. స్కైబాబా రాసిన పుస్తకాలు ఇచ్చెటోడు రాజయ్య జరీనాకి. ఆ కథల వెనుకటి నిజజీవితాలను గురించి మాట్లాడుకునేటోళ్ళు. ఇద్దరి మధ్యనా మాటలు ఎక్కువైనయి. దాదాపు ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి 'అధూరే' జీవితాల కొనసాగింపుపై. ఒక రోజు జరీనా చాలాసేపు మాట్లాడింది. "అసలు పీర్ల పండగంటేనే మాదిగా-ముస్లింలు ఉంటరు. అసొంటిది మీ ఇండ్లళ్ళకు పీర్లెందుకుపోవు? ఒకసారి మాట్లాడరాదు నీ మాటవింటరుగా" అంది. "మేము ఆలోచించడం మానేశాము, మాకంటూ అభిరుచులు కూడా ఉండవు. ఈ మగ ఆధిపత్య ప్రపంచంలో మరీ క్రుంగిపోయాము. మీకు అమ్మగా, అక్కచెల్లెళ్ళుగా గొప్పగానే ఉంటాము కాని ఒక ఆడదానిగా మాత్రం బానిసలుగానే ఉంచుకుంటున్నారు. ఇంక మా బురఖా చాటు కష్టాలయితె మరీను. మమ్మల్ని మేముగా ఈ సమాజానికి ముఖాల్ని కూడా చూయించుకోలేకపోతున్నాం" అంటూ ఆవేదన పడింది జరీనా. ఆయళ్ళ పీర్ల పండగ పంచాయితి నాడు లొల్లి పెద్దగయితందుకు కారణం జరీనా అక్కోల్ల పెద్దనాన్న కొడుకులే. మాదిగ రాజయ్య, జరీనా అక్క మాట్లాడుకోవడం వాళ్ళకిష్టం లేదు. 'Islam and Annihilation of Caste in India' అనే టాపిక్ మీద డిల్లీల ఏదో పెద్ద యునివర్సిటీల Ph.D చేస్తుండె రాజయ్య. నేనియ్యళ్ళ చదువుకుంటున్నంటె దానికి కారణంమా రాజన్ననే. ఇంటర్ అయిపోంగనే ఎండకాలంల పనికి పొయిన, ఇగ చదువు గురించి పట్టిచ్చుకోలేదు. మా అయ్య కూడా నా సదువు జోలి ఎత్తలే. అట్లనే ఒక యేడు గడిపిన. విషయం అన్నకు తెలిసి APRDC  ఫాం తెచ్చి నాతోని నింపమని చెప్పి మా అయ్యకిచ్చిండు. ఇగ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీల జాయిన్ చెయించింది కూడా ఆయనే. నేనే కాదు, మా ఊర్ల పిళ్ళలందరు చదువుకోవడానికి కుడా కారణం రాజన్ననే. డిగ్రీల ఉండంగ సమ్మర్ హాలీడేస్‌ల ఇంటికొచ్చిన. మా ఊర్ల అప్పుడప్పుడే మా మాదిగవాడల పిల్లలు చదువుకుంటున్నరు. అందరు హాస్టళ్ళల్లనే ఉంటరు. సెలవులుండటంతోటి దోస్తులందరు వస్తరని, జరీనా అక్కోళ్ల హోటల్ కాడికి పోతె కలుస్తరని పొద్దుగల్లనే లేచి పోయిన. మా స్వామి, గిరి, లింగం అందరం కలుసుకున్నం. చాయలు తీసుకుని పక్కన నిలబడి తాగుతున్నం. హాస్టల్ల పొద్దుగల్ల పొద్దుగల్లనే టిఫిన్ చేసుడు అలవాటుండుడుతోటి పూరీలు తింటే బాగుండు అనిపించింది. దానికితోడు జరీనా అక్క పూరీలు మస్తుగ చేస్తది. నలుగురం దోస్తులమున్నం తింటె బాగనే ఉండు కాని పైసలు లేవాయె! ఉద్దెరతీసుకుందామంటె అక్క కూడా లేదు. వస్తదేమో అనుకుంటూ గంటసేపు ఆడనే ఉన్నం. ప్చ్! ఇంకా రాలేదు. చాయ్ తాగుతందుకు వస్తున్న మా ఊరి పెద్దోళ్ళందరు 'ఎట్లున్నరు? మంచిగ సదువుకుంటున్నరా?' అని మమ్మల్ని అడుగుతుంటె పల్లెటూరి మట్టిసువాసన, అప్పుడే అటు నుంచి అత్తరు కొట్టుకుని పోతున్న తుర్కాయన దగ్గర వచ్చే వాసన లాగ కమ్మగా ఉంది. పది అయితుంది. అక్క ఇంకా రాలేదని మనసులో అనుకుని "తిని మళ్ళ కలుసుకుందాం రా" అని మా దోస్తులమందరం అనుకున్నం. ఇంటికొచ్చినంక కూడా అక్క గురించే ఆలోచిస్తున్నా. ఎంత ముద్దుగా ఉండేది. బంతిపువ్వంత గుండ్రంగా ముఖం, సన్నగ నెలవంకలాగనే నవ్వేది. ఎంత బాగా మాట్లాడేది. బాగా చదువుకొమ్మని, చదువుకుంటేనే మన బ్రతుకులు మారుతయని చెప్పేది. "ప్రపంచ మేధావి అంబేడ్కర్ మనవాడే. ఆయన చదువుకుని తన మూలాలని మర్చిపోకుండ మన జాతికి ఎంతో సేవ చేసాడు. మీరు కూడా బాగా చదువుకుని ఆయన అడుగుజాడళ్ళో నడవాలని, అప్పుడే మన జీవితాల్లో మార్పును తెచ్చేది" అని చెప్పేది. ఎంతో గొప్పగా అనిపించేది తను మాట్లాడుతుంటె. మరి ఏది జరీనా? ఇంకా రాకపాయె హోటెల్‌కి? "అమ్మా! జరీనా అక్క కనిపిస్తలేదేమే?" అనడిగిన మా అమ్మని. "ఇంకెక్కడిది రా మూన్నెళ్ళాయె కాల్సుకుని సచ్చిపోయి" కళ్ళు తుడుసుకుంటూ చెప్పింది మా అమ్మ. నా గుండెళ్ళో బాంబు పేలింది. జరీనా అక్క వరసకి మరదలు అయితది మా అమ్మకి. చాలా పరాశికాలు ఆడేటోళ్ళు ఇద్దరు. మా ఇంటికొచ్చి చాలాసేపు కూర్చుని పోయేది. ఎందుకో తెల్వకుంటనే నా కళ్ళళ్ళో కూడా నీళ్ళు తిరిగినయి. మా పెద్ద చెల్లె పెళ్ళయిపొయేటప్పుడు కూడా నేను ఏడ్వలె. "నాకిష్టమొచ్చినోడ్ని, నాకు విలువనిచ్చెటోడ్ని, నను బాగా చూసుకునెటోడినే పెళ్ళి చేస్కుంటా" అని చెప్పింది వాళ్ళ అమ్మతో.  "నీకిష్టమొచ్చినోడంటె ఆ మాదిగోడే కదా?" అన్నడు జరీనా వాళ్ళ పెద్దనాన్న కొడుకు జాఫర్. "ఔను, రాజయ్యనే పెళ్ళి చేసుకుంటా" అని మొహం మీదే చెప్పేసింది ఇంటోళ్ళతోటి. జరీనాను రోజు కొట్టేటోళ్ళు, హోటెల్‌కి పంపుడు ఆపేశిండ్రు. అప్పుడు రాజయ్య డిల్లీల ఉండె. "ఆగిపోయిన నా ఆలోచనలను ముందుకు కదిపావు. నా కనులకి కలల్ని చూపించావు. నా హృదయానికి ప్రేమను పరిచయం చేశావు. నా గొంతుకు మాటలు నేర్పించావు. సలాం మిత్రమా! నీకు వేలవేల సలాంలు. మనం కలిసి ఉండటం లేదా నేను లేకపోవడం. నువు నేర్పించిన నా సొంత ఆలోచనలతో తీసుకుంటున్న నిర్ణయమిది. గర్వించు మిత్రమా! ఒక ముస్లిం యువతి స్వంత నిర్ణయం తీసుకుందని. ఇలాంటి నిర్ణయమని కొట్టిపారేయకు. నా ఆలోచనలకు, నిర్ణయాలకు విలువనిచ్చే రోజు మరెంతో దూరంలో లేదు" అని ఉంది తను రాజయ్యకు చివరగా రాసిన లెటర్లో. చనిపోయిన జరీనా మాదిగ రాజయ్య రూపంలో బ్రతుకుతూ, బ్రతికున్న రాజయ్య చనిపోయిన జరీనా లోకంలో విహరిస్తూ, ఒంటరిగా.. కాదు కాదు ఏకాంతంగా. మాదిగ డప్పుల సప్పుడు పీర్లకొట్టం కాడ వినిపించినయి. ఇయ్యాళ్ళ నుంచే పండగ స్టార్టు. ఈసారయిన పీర్లు మాదిగ ఆడకట్టుకు వస్తయేమో అని మంచిగ తయ్యారయ్యి, నిండుబిందెలతో తయ్యారుగున్నరు మా మాదిగింటి అమ్మలక్కలు. ఆశన్న, ఊశన్నలొస్తె వాళ్ళ కాళ్ళు కడిగి జరీనా మనసు శాంతిని కోరుకోవాలని. అంబేడ్కర్ ఆలోచనలే నన్ను నడిపిస్తున్నాయి! నమస్తే రాజూ! మీ గురించి చెప్పండి. మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లి. నేను పుట్టి, పెరిగింది అక్కడే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేశాను. ప్రస్తుతం యక్షి అనే ఎన్జీవోలో 'భారత రాజ్యాంగ విలువలు' అనే‌ అంశంపై ఫెలోషిప్ చేస్తున్నాను. అప్పుడప్పుడూ యూట్యూబ్ ఛానెళ్లకు Freelance Writerగా పని చేస్తుంటాను. కథలు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నేను పెరిగిన గ్రామీణ వాతావరణం, నా సామాజిక నేపథ్యం, నేను చదివిన సాంఘిక సంక్షేమ హాస్టళ్లు.. ఇవన్నీ కలిసి నా మీద ప్రభావం చూపించాయి. కథలు రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. నేను చిన్ననాటి నుంచి ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాణ్ని‌. ఆ సమయంలో చేతికి దొరికిన ప్రతి పుస్తకం చదివేవాణ్ని. ఆ తర్వాత చిన్న చిన్న కవితలు రాయడం మొదలైంది. తొలి నాలుగు లైన్ల కవిత మా చెల్లెలి గురించి రాశాను. ఆ తర్వాత 2010లో 'జరీనా' అనే కథ రాశాను. ఒక ముస్లిం అమ్మాయి రెబ‌ల్‌గా మారి తన పెళ్లి విషయంలో తనే నిర్ణయం తీసుకుంటే జరిగేదేమిటో ఆ కథలో రాశాను. అయితే దాన్ని ఎక్కడా ప్రచురించలేదు. ఆ తర్వాత 2013లో కాశ్మీరీ ముస్లింల బాధలు, అక్కడి యువత ఇబ్బందుల గురించి 'సెంట్రల్ యూనివర్సిటీ ఆత్మకథ' అనే కథ రాశాను. అది 'మాతృక' మాసపత్రికలో ప్రచురితమైంది. ఇప్పటికి 12 కథలు రాస్తే, అందులో నాలుగు ప్రచురితమయ్యాయి. మీ ప్రతి కథలోనూ ఏదో ఒక సామాజిక సమస్య కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి? నేను 15 ఏళ్ల నుంచి అంబేడ్కరైట్ మూమెంట్‌లో ఉన్నాను. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి రాజ్యాంగ ఫలాలు అందించడం ఆ మూమెంట్ ప్రధాన ఉద్దేశం. ఆ నేపథ్యంలోంచి వచ్చిన నేను రకరకాల సమస్యల్ని కథలుగా రాస్తున్నాను. ఒక ముస్లిం అమ్మాయి ఇతర మతస్తుడిని, అందులోనూ దళితుణ్ని పెళ్ది చేసుకోవాలని అనుకుంటే ఎదురయ్యే పరిణామాలు 'జరీనా' కథలో రాశాను. దళితులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం గురించి 'పెద్ద మేతరి' కథలో రాశాను. 'ఇన్తెజార్‌మీ' కథలోనూ ముస్లిం దళిత వర్గాల మధ్య పెనవేసుకున్న జీవితాన్ని చూపించాను. ఇంకా ఎలాంటి కథలు రాయాలని ఉంది? మరిన్ని సామాజిక అంశాలపైన కథలు రాయాలని ఉంది. ఇప్పటి వరకు రాసిన కథలతో ఒక పుస్తకం తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను. *
Post Date: Wed, 14 Jun 2023 21:23:11 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger