Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 3 July 2023

ఉత్తమమంటే ఇంత ఉత్తుత్తితమమా? - Lalitha

చాలా రోజులకి ఇలా కుదిరింది... ఇలా అంటే ఎలా...ఎలాగెలా? ఓ బద్దకపు అరుదైన పొద్దు ఓ గోరువెచ్చటి అంబళ్ల పొద్దు బంగరపుటెండ ఇంటి ముంగిట సింగారపు ముగ్గులద్దిన పొద్దు నాకున్న అగవు తీరిన ఓ పొద్దు నాతో నాకే తగవు లేని ఓ పట్టు నాతో నేను మాత్రమే వున్నా నాకు నేనే తెచ్చి పెట్టుకున్న బుద్ది నాకు నేనే చెప్పి పెట్టుకున్న సుద్ది నాకు నేను మటుకే అనుకున్నా అటు నేనే - ఇటు నేనే ఎటెటు చూసినా అటు చేసీ ఇటు చేసీ ఎవరూ లేని ఒంటిపాటున అంతటా నేనే! అంతా నేనే! అంతట నేనే! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** చాలా రోజుల తర్వాత నాతో నేను మాట్లాడుకునే వీలు చిక్కింది. వేళ కుదిరింది. Mood కుదిరింది. ఇలా కబుర్లు రాసుకునే అదను చిక్కింది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఈ మధ్య విన్న పాటల్లో  తమిళ సినీకవి వైరముత్తు రాసిన ఒక వాక్యం నాకు భలే ఇష్టం - "వానమ్ ఎనక్కొరు బోదిమరం " సిద్ధార్థుడి లాంటి మహనీయుడికి బోధివృక్షం కింద కూర్చున్న  పళాన జ్ఞానోదయం సిద్ధించిందట. అందుకే బుద్ధుడయ్యాడట. నేనేమో మహా మామూలు మనిషిని. నాకు మామూలాతి మామూలు జ్ఞానం కలగాలన్నా ఓ చిన్న బోధిచెట్టేం సరిపోతుందీ? ఆకాశమే పూనుకుని బోధి చెట్టయితేనే నాకు ఎప్పటికప్పుడు ఎంతో కొంత తెలివిడి అలవడుతూ వుంటూ వుంటుంది. అందుకే నా కోసమే రాసినట్టున్న ఆ తమిళ పాట అంత నచ్చేసింది నాకు. అందుకే - ఎప్పటికప్పుడు కొత్తదేదో తెల్సినప్పుడల్లా నేనెప్పుడో రాసుకున్న మాటలు కొన్ని గుర్తు చేసుకుంటూ వుంటాను. . As I learn more I learn more that There is more to learn *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇంతకీ - నేను చెప్పాలనుకున్నదేదో చెప్పడం ఎలా   మొదలెట్టాలా అని ఆలోచిస్తున్నా. చెప్పాలనుకున్న ఊసేదో ఉబుసుపోకకే అయినా దానికో మొదలూ, మొదలంటూ పెట్టాక దానిదే ఐన ఓ తుదీ వుంటాయి కదా! ముందుగా ఇదెక్కడ మొదలైందో చెప్తా. దాదాపు ఏడాదింపావు క్రితం సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టా కదా! అప్పుడు నాకు తెలియడం మొదలైంది. ఏంటీ? పలుకు నచ్చిన భాష ఏదైనా సరే అంతో ఇంతో నేర్చేసుకుందామని సరదా పడిపోయే నాకు నాదైన తెలుగే సరిగ్గా రాదని. తప్పనిసరి చదువుగా చదవడం తప్ప ఎప్పుడైనా తెలుగుని భాషగా ఇష్టంగా నేర్చుకుంటే కదా అసలు రావడానికి!? ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు వాచకాల్లో చెప్పిన చదువు, చుక్క గుర్తు పెట్టిన పద్యాలకు ప్రతిపదార్థాలు బట్టీ పట్టడం తాప తప్ప పట్టుబట్టి తెలుగు వ్యాకరణం ఎప్పుడూ  నేర్చుకున్న గుర్తు లేదు. ఈ కొత్తగా సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పట్నుంచీ ఏం జరుగుతోందంటే ఎప్పుడో చదువుకున్న తెలుగు వ్యాకరణం  ఏదో పూర్వజన్మ జ్ఞాపకంలా గుర్తు రావడం మొదలు పెట్టింది. సంస్కృత శబ్దాలూ - వాటి లింగ వచన విభక్తులు, ప్రత్యయాలు , ధాతువులూ - వాటి లకారాలు, అవ్యయాలూ , సంధులూ , సమాసాలూ - ఒక్కొక్కటీ నేర్చుకుంటూ వుంటున్నప్పుడు సమాంతరంగా తెలుగు నామవాచకాలూ, క్రియాపదాలూ వగైరాలు గుర్తు రావడమూ,  వాటితో సంస్కృతాన్ని పోల్చుకోవడమూ, సంస్కృతంతో పాటు తెలుగు కూడా కొత్తగా నేర్చుకుంటున్నాననుకోవడమూ - మొత్తానికి నా భాషోత్సవం మహా ఉత్సాహంగా గడుస్తోంది, నడుస్తోంది. కానీ ఆ గడవడమూ, నడవడమూ అలా అతి మామూలుగా జరిగిపోతే మజా ఏముందీ? ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు - అంతకు ముందు తెలిసినదేదో విషయాన్ని గుర్తు చేసుకోవడాలూ, దానితో పోల్చి చూసుకోవడాలూ, అలానే వుందీ అని అనుకోవడాలతో పాటు అనుమానాలూ వస్తాయి మరి! "స్పర్ధయా వర్ధతే విద్యా" అని అప్పుడెప్పుడో ఎవరన్నారో కానీ నేను మాత్రం నా మాటల్లో "శంకయా వర్ధతే విద్యా" అంటాను. అంటే "పోటీ వుంటేనే చదువు రాణిస్తుంది" అన్నది పెద్దలు తెలియజెప్పిన మాటైతే "సందేహాలొచ్చి తీర్చుకుంటూ వుంటేనే చదువు రాణిస్తుంది" అన్నది నాకు నేను తెలుసుకున్న మాట. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** హమ్మయ్య! ఇప్పుడు అసలు విషయానికొస్తా! సంస్కృతంలో - ధాతువుల్లో లకారాలు - అంటే క్రియా పదాల్లో భూతభవిష్యద్వర్తమానకాలాలు నేర్చుకుంటున్నప్పుడు - అందులోనూ ఒక్కొక్క  క్రియాపదానికీ ఒక్కొక్క కాలంలో ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రూపాలు  నేర్చుకుంటున్నప్పుడు "అహ"మెప్పుడూ ఆఖర్నే వస్తుంది అన్న అచ్చుపాటు నాకు అచ్చెరపాటు కలిగించింది. అలా ఎందుకబ్బా అని ఆలోచించా. అసలే "అహం (నేను)"  అనుకోవడం లోనే అహరహమూ వున్నట్టున్న అహమిక తోస్తోందేమో - అలాంటి "అహం" - పైగా "ఉత్తమ పురుష" అని అనిపించుకున్న "అహం" ఆఖర్న రావడమేంటి? ఇదీ నా అహమనుమానం - అసలనుమానం కూడాను. ఆ సందేహం రావడంతో అంతకు ముందు నేర్చుకున్న  కొన్ని సంగతులు కూడా గుర్తొచ్చాయి. ఇంగ్లీషులో వున్న persoనే సంస్కృతం లోనూ, తెలుగు లోనూ వున్న "పురుష" అన్నది ఆ గుర్తొచ్చిన సంగతుల్లో మొట్టమొదటిది. మిగిలిన విషయాలు ఈ కింద కొన్ని ఉదాహరణలతో.... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నేను మీతో - మనిద్దరితో వున్న ఇంకొకరిని - మనిద్దరితో కలిపి "తను, మీరు, నేను సినిమా చూస్తున్నాం " అని అన్నాననుకోండి. ఇందులో  "నేను" ఇంగ్లీషులో First Person "I" . ఇదే "నేను" భారతీయ భాషలకు జనని సంస్కృతంలో, అక్కడి నుంచి అంది పుచ్చుకున్న నా మాతృభాష తెలుగులో "ఉత్తమ పురుష". నే చెప్తున్న కబుర్లు ఎదురుగా వుండి వింటున్నది "మీరు". ఆ "మీరు" ఇంగ్లీషులో Second Person "You" . అదే  "మీరు" సంస్కృతంలో, తెలుగులో "మధ్యమ పురుష". ఈ "నేను", ఆ "మీరు" కాని "తను" ఎవరో తనే  ఇంగ్లీషులో Third Person "He / She". నేను పైన చెప్పిన ఉదాహరణని ఇంగ్లీషులో రాస్తే "He, you and I  are watching the movie " అవుతుంది. అదే సంస్కృతంలో అయితే "सः त्वम् अहं च चलन चित्रं पश्यामः| " అవుతుంది. ఇంగ్లీషులో "I" - First Person. తెలుగులో "నేను" ఉత్తమ పురుష". సంస్కృతంలో "अहम्" - ఉత్తమ పురుష. కానీ పైన రాసిన ఉదాహరణల్లో -  I, నేను,  अहं  - ఎప్పుడూ ఆఖర్నే వస్తున్నాయి. మాట వరసకి మాత్త్రం   ఫస్ట్ పర్సనూ, ఉత్తమ పురుషే కానీ - అసలు వరసకి మాత్రం - లాస్ట్ పర్సనూ, ఉత్తుత్తి పురుషే అనిపించించట్లేదూ? English Grammar లో  కానీ, తెలుగు వ్యాకరణంలో కానీ - I , నేను - చివర వస్తాయని ఒక rule లా చెప్పడం తప్ప - దాన్ని సమర్థించే కారణం ఎక్కడా దొరకలేదు నాకు. [అన్నట్టు ఇక్కడ ఒక మంచి విషయం చెప్పాలి. నాకు తెలియని ఈ "నేను" గురించి వెతుకుంటుంటే కేతన రాసిన "ఆంధ్ర భాషాభూషణము" అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని గురించి పరిచయం చేస్తూ  "ఈమాట" లో అయినవోలు ఉషాదేవిగారు రాసిన ఒక వ్యాసపరంపర నాకు దొరికిన తెలుగు-పెన్నిధి.] ఇలాక్కాదని సంస్కృత నిఘంటువుల్లో వెతుక్కుంటే "ఉత్తమ" అంటే "గొప్ప" అనే కాక "చివరి" అనే అర్థం కూడా ఉందని తెలిసింది. అప్పటికి అర్థమయింది - వున్న ఇద్దరిలోనో, ముగ్గురి లోనో - చివరిలో ప్రస్తావిస్తాం కాబట్టే "అహమ్" అనే నేను "ఉత్తమ పురుష" అయిందీ అని. అలాగే - ఎందరిలో వున్నా అందరి తర్వాతే తన గురించి ఆలోచించుకోవడం లోనే మన్నన ఉంటుందనే  - ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఉత్తమమైన విషయం కూడా ఇంకోసారి గుర్తు చేసుకున్నట్టయింది. అందుకే ఇక్కడే రాసుకుంటున్నా " నేను చివర్న ఉంటేనే ఉత్తమం - అలా వుండడం  కానే కాదు ఉత్తుత్తితమం". నేను నేర్చుకున్న "నేను చివర్న ఉంటేనే ఉత్తమం " అనే విషయాన్నే ఈ కింది యూ ట్యూబ్ వీడియోలో నిత్యానంద మిశ్రా అనే ఆయన చెప్పడం - ఆ వీడియో అనుకోకుండా నాకు దొరకడం మహా ఉత్తమమైన విషయం:  https://www.youtube.com/watch?v=JY0Wvo7oDOA
Post Date: Mon, 03 Jul 2023 06:39:37 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger