అప్రస్తుత ప్రసంగి ప్రశ్నలు - కొంటె సమాధానాలు సాహితీమిత్రులారా! అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి అవధాని అంత కంటే కొంటెగా సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను . ప్రశ్న :- అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో ? జవాబు :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం . ప్రశ్న :- భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది? జవాబు :- పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం . ప్రశ్న :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి ? జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో... కమ్ కదా . ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదూ ? జవాబు:- భర్త చనిపోతూ 'నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు. ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది. జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...' ప్రశ్న :- ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకు రమ్మన్నారు జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు ప్రశ్న :- పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి ? జవాబు :- అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం . ప్రశ్న :- అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు? జవాబు :- దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను . ప్రశ్న :- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి ? జవాబు :- ప్రశ్న వేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి . ప్రశ్న :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు జవాబు :- రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి . ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు? జవాబు :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం . ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా ? జవాబు :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి. ప్రశ్న :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు జవాబు :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను. ప్రశ్న :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు . ప్రశ్న :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట నిజమా? జవాబు :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది . ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా ? జవాబు :-పావు 'రమ్' ఎవరికి ఇష్టం వుండదు . ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా ? జవాబు :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా' త్రాగుతాను . ప్రశ్న :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి? జవాబు :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి . ప్రశ్న :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా ? జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద. ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి? జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి . ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు ? జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా . ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు? జవాబు:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!' ప్రశ్న:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు? జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను. ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు? జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి. మీదే పురుషులు ఆధారపడుతారు గనుక . ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని భయపడేవాడు ప్రేమికుడ ... మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా? జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే ' కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయి పేరు . ప్రశ్న:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరి గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి? జవాబు: - 'ఆపిక' వెంటనే అవధాని సమాధానం సంస్థానాలు సాహిత్యం ముఖపుస్తకం నుండి-
Post Date: Sat, 25 Mar 2023 13:41:17 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Sat, 25 Mar 2023 13:41:17 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment