Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 17 April 2023

ౘందమామ! నీ మీద నిందాయె! - Lalitha

ఎప్పటికప్పుడు నాకు నచ్చినట్టుగా ఓ రోజు నడిస్తే ఆ రోజుకి నా నక్షత్రాల నడకలేవో సరిగ్గా కుదిరాయని మురిసిపోతూ వుంటాను. అల్లాగే... ఒక్కోసారి చాలా అరుదుగా - తలలో ఏవేవో తలపులు నడుస్తూ - అన్నది వింటున్న చెవికి, విన్నదానికి బదులిస్తూ అంటున్న నోటికి పొంతన కుదరనప్పుడు నా గతి తప్పిన మతికి అప్పటి స్థితికి - పరిస్థితికి మతి-గతికి మామైన ౘందమామ మీద నిందేహేస్తూ వుంటా! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఫాల్గుణ పౌర్ణమి (2023, మార్చ్ నెల 8వ తేదీ) నాడు ౘందమామ మీద నింద వేసే సందర్భమొకటి కుదిరింది. ఆ కబుర్లు చెప్పబోయే ముందు ౘందమామని పిలిచి పలకరించి - పలకరింపుతో ఆగక - పాటంతా మామతో మాటలు చెప్పుకునే - పాటలు కొన్ని తలుచుకుంటున్నా. తలుచుకుంటున్న పాటలతో ఓ చిన్న ఆట ఆడదామనుకుంటున్నా! ఈ పాటల్ని గుర్తు పట్టి ఏ సిన్మాలో ఎవరు పాడారో చెప్పి పెట్టగలరా? పదారు కళల ఱేడు చందురుడి మీది పాటలు ఓ పదహారు పట్టుకొచ్చా  - మొత్తం 16 మార్కులకి ఈనాటి పాటల పరీక్షాపత్రం. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** 1. ఓ ౘందమామ! అందాల భామ... ఎందున్నదో తెల్పుమా! *** *** *** 2. రావోయి ౘందమామా! మా వింత గాథ వినుమా! *** *** *** 3. మామా! ౘందమామా! వినరావా నా కథా! *** *** *** 4. ఓ జాబిలీ! వెన్నెలా ఆకాశం ... వున్నదే నీ కోసం! *** *** *** 5. ౘల్లని రాజా! ఓ ౘందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ ౘందమామా! నా ౘందమామా! *** *** *** 6. ఓ నెలరాజా! వెన్నెల రాజా! నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేనోయ్! మా వెన్ను తట్టి పిలిచింది నీవేనోయ్! *** *** *** 7. ఓ చంద్రమా! ఒక నాటి ప్రియతమా! ఈ పేద కలువ నీకు గురుతేనా... చెప్పుమా! *** *** *** 8. ౘందమామ రావే! జాబిల్లి రావే! కొండెక్కి రావే! గోగుపూలు తేవె! వెండి గిన్నెలో వేడి బువ్వ తేవె! పైడి గిన్నెలో పాలబువ్వ తేవె! అందాల పాపకు అందించి పోవే! *** *** *** 9. నెలరాజా! ఇటు చూడరా! ఉలుకేలరా? కులుకేలరా?  వలరాజా! తగువేళరా? తగువేలరా? రవితేజా! *** *** *** 10.. పండగంటి ఎన్నెలంతా... చందరయ్యా! దండగై పోయింది... చందరయ్యా! *** *** *** 11. చక్కనయ్యా ... ౘందమామా! ఎక్కడున్నావూ? నీవు లేక - దిక్కు లేని చుక్కలయ్యామూ! *** *** *** 12. మల్లెపందిరి నీడ లోన - జాబిల్లీ! మంచమేసి వుంచినాను - జాబిల్లీ! *** *** *** 13. ఒకసారి ఆగుమా! ఓ ౘందమామా! మనసార నా మాట ఆలించి పొమ్మా! *** *** *** 14. తెలిసిందిలే! తెలిసిందిలే! నెలరాజ! నీ రూపు తెలిసిందిలే! *** *** *** 15. రా... వెన్నెల దొరా! కన్నియను చేరా! *** *** *** 16. అందౘందాల సొగసరి వాడు... విందు భోంచేయ వస్తాడు నేడు... ౘందమామా! ఒహో ౘందమామా! *** *** *** 1. పై పాటలు పట్టుకున్న వారికి ౘందమామ అందేసినట్టే ... పాటలు పట్టుకోవడంలో వారి చేయి అందె వేసినట్టే... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇవాళ  నే చెప్పబోయే జరిగిన కథ అర్థం కావాలంటే మీక్కొన్ని  కబుర్లు - ఇంకొన్ని కాకరకాయలూ,  ఇన్ని కారణాలూ - మరికొన్ని సమీకరణాలూ చెప్పాలి. ఈ కారణాలూ, సమీకరణాలూ సరిగ్గా చదివి ఆకళింపు చేసుకోకపోతే ఆ కిందనున్న రెండు లైన్ల ఏడుమూళ్లుఇరవైయొక్కచుక్కల కింద వున్న కబుర్లేవీ మీకర్థమే కావంటే కావు. ఆనక నన్ననుకుని లాభమేమీ ఉండదు - మీకో అరగంట సమయం వృధా అవడం తప్ప. అందుకే ఈ కిందున్న చిన్నా పెద్దా వాక్యాలు అన్నీ కలిపితే ఓ ప్పది కన్నా వుండవు. వాటిని చదివి ఆవలించేయకండి... ఆకళించుకోండి, ప్లీజ్! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** అనగనగా నేను. అంతకన్నా అనగనగా ... నాకో సంగాతి అపర్ణ. అపర్ణాపతి కిషోర్. అపర్ణకో సోదరి ఆర్‌తి. (తన పేరు ఆరతి - కానీ మా పలుకుల బడి పలుకుబడిలో "ఆర్‌తి" అయింది - "ఆర్తి" కాదు - "ఆ...ర్...తి"...) సంవత్సరాలని ఓ పక్కకి పెట్టి నెలలూ, తారీఖులూ మాత్రమే లెక్కకి తీసుకుంటే... ఆర్‌తి పుట్టినరోజు = నా పెళ్ళిరోజు = మార్చ్ 11.  ఈ ఏడాదికి అది శనివారం నాడు వచ్చింది. తిథులూ, నక్షత్రాలే లెక్కనుకుంటే, ఆర్‌తి పుట్టినరోజు = ఫాల్గుణ పౌర్ణమి = ఈ ఏడాదికి అది వచ్చిన తేదీ = మార్చ్ 8, బుధవారం. అపర్ణ నేను మొట్టమొదటిసారిగా మాట్లాడుకుని నువ్వూ-నేనూ ఎప్పటికీ ఫ్రెండ్స్ అని ఒకరికొకరు చెప్పుకున్న రోజు = ఆగష్టు  8. అదెప్పుడో ఇంకో ఐదు నెల్ల తర్వాత. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** కథాకాలం: బుధవారం, 8 వ తారీఖు, మార్చ్ నెల, 2023 వ సంవత్సరం. అప్పటికి ఒక నెల ముందు నించీ   - వారానికోసారి మాట్లాడుకుంటున్నప్పుడల్లా - అపర్ణ " నీ వెడ్డింగ్ యానివర్సరీ మార్చ్ 11 కదా? ఆర్‌తీ బర్త్‌డే కూడా అప్పుడే!" అంటూ వుంది. ఆ వెంటనే నేనేమో "భలే కదా! అంటే ఈ వీకెండ్ నీకు ఫోన్ చేసినప్పుడు ఆర్‌తీ నీతోనే వుంటుందన్నమాట.   తప్పకుండా తనకి విషెస్ చెప్పాలి నేను" బదులంటూ వుంటున్నాను. ఏదో ఓ పూట -  మేమేం మాట్లాడుకున్నా - ఎక్కడో ఒక చోట - ఒకరితో ఒకరం - ఈ రెండు అనడాలు-వినడాలు వుంటూ వుండేవి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఆ అనడాలు అంటుండగా - వినడాలు వింటుండగా రోజులు, వారాలు నడుస్తూ వుండగా... ఓ రోజు సరిగ్గా పొద్దున్న పదిన్నరకి... అప్పుడే ఒక ఆఫీసు కాల్ ముగిసి ఇంకోటి మొదలవడానికి ఇంకో అరగంట వుంది. సరే! ఒక్కాఫీ తాగుదామని పాలుపంచదారసహితబ్రూపానపాకం చేస్తూ వున్నాను. ఆ పానపాకంతో పాటు పరధ్యానం కూడా నడుస్తూ వుంది ముందు జరగబోయే కాన్ఫరెన్స్ కాల్ గురించి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇంతలో సెల్ఫ్-ఫోను సెల్ఫోను మోగలేక వూగింది - దాన్నోరు నొక్కి మ్యూట్‌లో వుంచినందువల్ల. మూగగా ఊగుతున్న ఫోన్ తెర మీద "అపర్ణే" అన్న పేరు కనిపించింది. "ఇదేంటబ్బా! ఇవాళ వీకెండు కాదే... ఈ టైంలో చేస్తోంది!?" అనుకుంటూనే ఫోన్ తీసి "హలో" అనగానే అవతలి నుంచి చాలా ఉత్సాహంగా అపర్ణ గొంతు వినిపించింది. "హాప్పీ ఏనివర్సరీ, లలితా" అంటూ... అది వింటూనే ...తలలో ఒక చిన్న బల్బు వెలిగి ఆరిపోయింది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** "ఏం ఏనివర్సరీ అబ్బా ఈ రోజూ?" అనుకుంటూ కంటికెదురుగా వున్న ఆఫీసు లాప్‌టాప్‌లో తేదీ చూసిన నాకు 03.08.2023 అని కనిపించింది. ఆరిన బల్బు ఒక్కసారిగా ధగధగలాడింది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** "ఓహ్! ఇవాళ ఎయిత్ కదా! అద్దీ సంగతీ..." అని ఆలోచనల్లోనే సాగతీసుకుంటూ నేను కూడా అంతే ఉత్సాహంగా "థాంక్స్ అపర్ణా! నీక్కూడా హాప్పీ ఏనివర్సరీ!" అనేశా. వెంటనే ఫోన్ తీగకి అవతల్నుంచి "హాఁ ! నాక్కూడా హాప్పీ ఏనివర్సరీ చెప్తున్నావా? భలే! సరే ... సరే...  నాక్కూడా హాపీనే" అని అరసున్నా-సహిత హాఁ-కారంతో amusing గా నవ్వేసింది అపర్ణ. నవ్వి అంతటితో ఆగిందా ...?! "ఇదిగో ఆర్‌తి కూడా వుంది ఇక్కడే... బర్త్‌డే విషెస్ చెప్పు " అంది. వెంటనే నా బుద్ధి నాలుక్కరుచుకుంది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** "అర్రే ! ఆర్‌తీ పుట్టినరోజు ఈ వీకెండు అనుకున్నానేంటి ఇవాళైతే ?!" అనుకుంటూ "హాపీ బర్త్‌డే, ఆరతీ!" అన్నా. నేనలా అంటుండగానే ఆర్‌తి కూడా "హాపీ ఏనివర్సరీ, లలితా" అంటోంది. ఇంతలో తన పక్కనుంచి అపర్ణ "ఇదిగో కిషోర్ కూడా నీకు విషెస్ చెప్తున్నారు" అంది. "హాపీ ఏనివెర్సరీ, లలితా! టు బద్రి ఆల్సో" అని కిషోర్ గొంతు వినిపించింది. మళ్ళీ నా తలలో బల్బు మినుకుమినుకుమనడం మొదలయింది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** "ఇదేంటి మా ఫ్రెండ్‌షిప్ ఏనివర్సరీకి బద్రికి ఎందుకు విషెస్ చెప్తున్నారు కిషోర్?" అని ఒక్కసారి అయోమయంగా ఆరిపోయి "ఓహ్...అంటే అపర్ణ, నేను ఏం సెలబ్రేట్ చేసుకున్నా కిషోరూ, బద్రీలకి కూడా అందులో పాలు వుంటుంది కదూ..." అని మళ్ళీ చమక్కుమని వెలిగింది నా తల్లో బల్బు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నేను మాటలు కొనసాగిస్తూ అడిగా "ఏంటీ! అంతా హడావిడిగా వుంది...ఏం చేస్తున్నారు మీరంతా?" అని. దానికి బదులుగా అపర్ణ "ఇవాళ హోలీ కదా! ఆర్‌తీది స్టార్ బర్త్‌డే - అందుకే ౘందమామని చూస్తూ దోసె తింటూ కబుర్లు చెప్పుకుంటున్నాము" అంది. ఇంతలో ఆరతీ అందుకుని "నువ్వేం చేస్తున్నావు లలితా నీ వెడ్డింగ్ ఏనివర్సరీకి?" అంది. "నాది మార్చ్ లెవెంత్ కదా ఆర్‌తీ! ఆ రోజు ఏం చెయ్యాలో ఇంకా ఆలోచించుకోలేదు" అన్నా. "అదేంటి? నీ ఏనివర్సరీ ఇవాళ కాదా? మరి అక్క నీకు విషెస్ చెప్తోందేంటి?" అనాశ్చర్యపోయేసింది ఆరతీ. "ఇవాళ ఎయిత్ కదా - మేము ఫ్రెండ్స్ అయిన రోజు కదా...." అంటుండగా నాకు తట్టింది ఇది మార్చ్ ఎయిత్ కానీ ఆగస్టు ఎయిత్ కాదని. ఓ...అందుకా "నీక్కూడా హాపీ ఏనివర్సరీ" అనగానే ఒక్ఖ నిముషం అపర్ణ అంతగా అక్కజపడిందీ అని అప్పుడర్థమయ్యింది నాకు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** అలా ఆర్‌తీ, నేనూ మా మా ఆలోచనల్లో వుంటుండగా అపర్ణ ఆర్‌తి చేతి లోంచి ఫోన్ తీసుకుని "అసలేమైందో తెలుసా లలితా! మనం ఎప్పట్నుంచో ఆర్‌తీ బర్త్‌డే, నీ వెడ్డింగ్ ఏనివర్సరీ ఒకే రోజు అని తలుచుకుంటూ వున్నాం కదా! ఇవాళ హోలీ రోజు ఆర్‌తీ స్టార్ బర్త్‌డే. దాంతో కన్ఫ్యూజ్  అయి నీ వెడ్డింగ్ ఏనివర్సరీ అనుకుని నీకు ఫోన్ చేశాను. అందుకే కిషోర్ కూడా నీకూ, బద్రీకి విషెస్ చెప్పారు" అంది. నాకిక పకపకలాగలేదు. "ఓహ్హొహ్హొహ్హో! అపర్ణా... నువ్వు నాకెందుకు ఇవాళ ఏనివర్సరీ విషెస్ చెప్తున్నావా అనుకుంటూ డేట్ చూస్తే 03.08.2023 అని కనిపించింది. ఎనిమిది అన్న ఒక్క అంకె మాత్రం తలలోకెక్కింది. వెంటనే మన ఫ్రెండ్స్-డే అని నీక్కూడా హపీ ఏనివర్సరీ చెప్పాను. నువ్వేమో నీకు నేనెందుకు చెప్తున్నానా అని తికమకపడి, మంచితనంతో మొహమాటపడి 'నాకూ చెప్తున్నావా...సర్సరే' అనేశావు" అని ఇంకా పకపకలాడా... నాతో పాటే పకపకలాడుతూ అపర్ణ... "ఇవన్నీ ఆర్‌తీ స్టార్-బర్త్‌డే వల్ల వచ్చిన తిప్పలూ" అని ఇంకా ఏదో చెప్పబోయింది. నేను తనని ఆపి సరి చేశా " కాదు... కాదు...  ఇవాళ పున్నమి కదా... అమాసకీ పున్నానికీ ఇలా అవుతుందని వినడమే కానీ నిజంగా ఇప్పుడు జరగడం చూస్తున్నా" అంటూ. అలా అంటున్నానో లేదో... అవతల నుంచి ఆర్‌తీ నవ్వులు, దాంతో పాటే "లలితా! ఇక్కడ ఆర్‌తీ ుర్చీ మీంచి కింద పడి మరీ నవ్వుతోంది నువ్వు ౘందమామ మీద వేసిన నింద వినీ..." అంటూ మిగిలిన మాటలన్నిటినీ మింగేసిన అపర్ణ నవ్వులూ వినిపించాయి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** పున్నమి పుట్టినరోజాయె పదకొండు ఎనిమిదాయె మార్చ్ ఆగష్టాయె ఏనివర్సరీ అదేదో ఆయె అది ఇదాయె ఇది అదాయె అదీ...  ఇదీ...  ఏదో ఆయె ౘందమామ! నీ మీద నిందాయె! మతి గతి మకతికలాయె మకతికలైన తికమకలో పకపకలు మా పాలాయె మా తికమకలకి వూత నీవని ౘందమామ! నింద నీ పాలాయె! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ***
Post Date: Mon, 17 Apr 2023 02:09:21 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger