Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 1 May 2023

ప్రతి నిశ్శబ్దం వెనుక.. - కృష్ణుడు

న డుస్తుంటే ఎవరో వెంటాడుతున్నట్లు అనిపిస్తోంది. నడక ఆపి వెనుతిరిగి చూస్తే ఎవరూ లేరు. ఒక ఊపిరి పీలుస్తున్న శబ్దమేదో వినిపిస్తోందేమోనని నిదానంగా నడిచాను.గాలికూడా శబ్దం చేయకుండా వెళ్లిపోతోంది. చెట్ల ఆకులు మౌనంగా తలలూపుతున్నాయి. పూలు విషాదంగా గమనిస్తున్నాయి. పక్షులు ధ్వనులు చేయకుండా  ఎగిరిపోతున్నాయి. ఎదుట పడ్డ మనిషి ముఖంలో ఏ భావమూ లేదు. ఎవరు నన్ను వెంటాడుతున్నారు? ఉన్నట్లుండి ఒక ఆలోచన. నన్ను వెంటాడుతున్నది నిశ్శబ్దమా? అవును పలకరింపులు లేకుండా ఎన్ని రోజులైంది.. నా పాదాల చప్పుడు కూడా విని చాలా కాలమైంది. అసలు గొంతు లోంచి ధ్వని అనేది ఒకటొస్తుందని నాకు తెలుసా? పెదాలు ఎందుకు మాట్లాడేందుకు సహకరించడం లేదు? కనీసం ఎవరూ నవ్వుతున్న చప్పుడు కూడా వినపడడం లేదు.  మౌనంగా తినడం, మౌనంగా నిద్రపోవడం, మౌనంగా చదువుకోవడం, మౌనంగా రాసుకోవడం అలవాటైపోయిందా? "ధ్వని లేని చోట నిశ్శబ్దం. చల్లటి సమాధిలో..లోలోతైన సముద్రంలో, విశాలమైన జీవితంలోని ఎడారిలో అంతా నిశ్శబ్దం. ప్రగాఢమైన నిద్రలో, మాట్లాడుకోని మేఘాల నీడల్లో,ఆకుపచ్చటి శిథిలాల్లో, ఒంటరి గోడల్లో నిశ్శబ్దం" అని  నిశ్శబ్దం  పరీవ్యాప్తమైన దృశ్యాల్నిథామస్ హుడ్ ఏనాడో చిత్రించాడు. మన చుట్టూ ఉన్నవి సమాధులు, సముద్రాలు, ఎడారులా?ఆకుపచ్చని శిథిలాలు,ఒంటరి గోడలా? ఆలోచనలను ఆపుకుని,మనసును నిర్మలంగా,సౌమ్యంగా,నిశ్చలంగా మార్చుకుని,బాహ్య శబ్దాలను విస్మరించి, ఏ ధ్వనీలేని ధ్యానంలో మునిగిపోయినప్పుడే అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుందని భగవద్గీత చెబుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితే పరీవ్యాప్తమవుతోందా? "గుండెచప్పుడూ వినపడడంలేదు, పాదాల చప్పుడూ సరేసరి.సంచలనాలూ లేవు, ఆనందాలూ లేవు, హడావిడీలేదు, వేడి ఊపిరీ లేదు. ఈ నిశ్శబ్దంలో ఆకు కూడా కదలడంలేదు,కన్నీళ్లూ లేవు.  ఆ యాత్రికుడు ఎంత ఒంటరి? ఉరుమైనా ఉరుముతుందా? మెరుపైనా మెరుస్తుందా?" అని మఖ్దూం మొహియుద్దీన్ ఏనాడో కవితలో రాసిన విషాద ఆశావహ గీతం ఇప్పటికీ సమకాలీనమా? రాత్రి నిశ్శబ్దం లో మునిగింది. రహదారులు ఒంటరిగా దిగాలుగా చూస్తున్నాయి. వెన్నెల దీనంగా పలకరిస్తోంది. చెట్లు చీకట్లలో మునిగిపోయాయి. కాని ఎవరో ఈ పరిస్థితికి ఆనందిస్తున్నట్లున్నారు. ఉదయం కూడా అంతా నిశ్శబ్దంగా ఉంటే ఎంతో బాగుండు? అని. మనుషులు నిశ్శబ్దంగా నమాజ్ చేసుకుంటున్నారు. ఉదయమే లేచి యోగాలో మునిగిపోయి ప్రాణాయామం చేస్తున్నారు. నీళ్లలో ముక్కులు మూసుకుని  మునిగి లేచి లెంపలు వేసుకుంటున్నారు. సాయంత్రం గుడి మెట్లపై కూర్చుని పచ్చి కొబ్బరి ముక్కలతో పుణ్యాన్ని కొరుక్కుతింటున్నారు. ఒక చల్లటి మల్లెపూల పరిమళం మనసును ప్రశాంతం చేస్తోంది. ప్రపంచం ఇంత ఆనందంగా, మౌనంగా ఉంటే ఎంత బాగుండు అని ఎవరో సంతోషిస్తున్నట్లున్నారు. ఎవరి మనసూ దహించడం లేదా? ఎవరి కడుపూ కాలడం లేదా? ఎవరి గుండె మండుతున్నట్లనిపించడం లేదా? ఎవరి కళ్లూ విస్ఫులింగాలను వెదజల్లడం లేదా? జైళ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయా? మందిరాల ముందు, రోడ్ల మధ్యా ఆకలి కేకలు వినపడడం లేదా? ఎవరూ నినాదాలు చేయడం లేదా? ఎవరూ ప్రశ్నించడం లేదా? మరి ఎందుకీ నీరవ నిశ్శబ్దం? "అవి ధరాగర్భమున మానవాస్తికా పరంపరలు సుప్త నిశ్శబ్ద సంపుటములు. అటనొకే దీర్ఘయామిని! ఆ నిశా శ్మశాన శయ్యకు ప్రాతః ప్రసక్తిలేదు. ఆయగమ్య తమో రహస్యాంగణాన తాండవించును మృత్యు శైతల్యమొకటె!" అన్న శ్రీశ్రీ అనుభవించిన మృత్యుశైతల్యం దేశమంతటా చుట్టుకుంటోందా? నా గదిలోపల చీకటిలో, చీకటి లోపల నా గదిలో అన్న శ్రీశ్రీ గది దేశాన్ని ప్రతిఫలింపచేస్తోందా? చట్టసభలు సమావేశాలవుతూనే ఉన్నాయి. ప్రశ్నలు లేకుండానే ప్రశ్నోత్తరాల సమయం సాగుతూనే ఉన్నది. శూన్యకాలంలో చర్చించేది శూన్యం. మౌనంగా కూర్చున్న గాంధీ విగ్రహం ముందు నిన్నటి ప్లకార్డులు గాలికి కొట్టుకుపోతున్నాయి. గాంధీ ఒడిలో రాలిపడుతున్న ఆకులు మౌనంగా తమను ఎప్పుడు ఊడ్చి ధగ్ధం చేస్తారో అని ఎదురు చూస్తున్నాయి. "ఎవ్వరోహో, ఈ నిశీథి నెగసి, నీడవోలె నిలిచి పిలుతురెవరో, మూగకనులు మోయలేని చూపులతో ఎవరోహో..ఎవరోహో..".అని కృష్ణ శాస్త్రి దేనికోసం ఎలుగెత్తి ఆర్తనాదం చేశారు? "ఇది నితాంత తమఃక్రాంతమిది దరిద్రమీ నిశాంతమ్ము శూన్యమ్ము" అని ఆయన ఎందుకు విలపించారు? అందరూ మౌనంగా దేశాధినేత  మనసులోని మాటను ఏ విధంగా పంచుకోనున్నారో  వినేందుకు చెవులు నిక్కబొడుచుకుని కూర్చున్నారు. ప్రవచనాలకూ, భజనలకూ, చిడతలకూ అలవాటు పడ్డ దేశంలో కోట్లాది మంది మౌనం కొందరి భీభత్స నృత్యానికి  అర్ధాంగీకారం. చప్పట్ల ధ్వనులు తప్ప మరేదీ వినదలచుకోకపోవడమే సుపరిపాలనకు చిహ్నం. "నేను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు స్వరాలు నాలో ప్రవహిస్తాయి. నేను మౌనంగా ఉన్నా మాట్లాడుతున్నాను. నేను ప్రశాంతంగా ఉన్నా సంచలిస్తున్నాను" అని భవానీ ప్రసాద్ మిశ్రా మాదిరి ఎందరు కవులు అంటున్నారు? "ఇప్పుడక్కడ గాలుల్లో పూలమధువులు లేవు, పిల్లలనేత్రాల్లో నవ్వులు లేవు, ఇప్పుడక్కడ సదా ఆకులు రాలుతున్న చప్పుడు, చెవుల్ని కాల్చే ఎండ. పొలాల్లో ప్రేతాకారాలు, పసి శవాలు, పైని గద్దలు.ఎండిన డొక్కలు, చిక్కిన పశువులు, కూలిన ఇళ్ళు.ఇప్పుడు వినిపిస్తున్నవి గంగాలమ్మ పాటలు కావు ఎక్కుపెట్టిన ప్రశ్నలు.ఇప్పుడు కనిపిస్తున్నవి రంగుల జాతరలు కావు, అడవుల్ని దువ్వుతున్న కాకీ దుస్తులు. వృద్ధురాలయిన ఆ స్త్రీ మాత్రం సహనంగా, మౌనంగా పొలంలో కలుపు తీస్తోంది" అని వృద్దురాలి మౌనంలో వర్డ్స్ వర్త్ 'సాలిటరీ రీపర్' ను చూసిన వాడ్రేవు పినవీరభద్రుడా! ధన్యవాదాలు. "రేపు సూర్యోదయం అయినప్పుడు, వార్తాపత్రికలో ప్రతి అక్షరంలో శవ శాంతి తచ్చాడుతుంది. కొన్ని తెల్లటి శాంతి కపోతాలు నగరమంతటా అందంగా ఎగురుతుంటాయి" అని మరాఠీ కవి చంద్రకాంత్ పాటిల్ రాసినట్లు దేశంలో శవశాంతి తచ్చాడుతోందా? "గదిలో జనం నిశ్శబ్దం కుట్రలా కొనసాగిస్తున్నారు. ఒక్క పదం నిజం చెప్పినా అది పిస్టల్ చప్పుడులా వినిపిస్తుంది.."అని జెస్వాఫ్ మివోజ్ అనే పోలిష్ కవి రాసినట్లు ప్రతి నిశ్శబ్దం వెనుకా ఒక కుట్ర దాగి ఉందా? *
Post Date: Sun, 30 Apr 2023 23:18:44 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger