Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 1 May 2023

గీతం...సంగీతం...సతతహరితం - 16 - బంగరు సంజె పొద్దుల్లో ఓ పాట విన్నా... "పొన్ మాలైప్ పొళుదు" - Lalitha

జిలుగుల ముగ్గులేసే మలిసంజ వెలుగులు కిలకిలమని పాటలాడే పులుగు ఎలుగులు బిరబిరమని నేల చేరే కడలి పొర్లింతలు కలకలమని నింగికెగసే పిల్లల కేరింతలు వీటన్నిటికీ తోడుగా... "హే...ఓ....మ్మ్...లల్లల్లా" మంటూ పాటే ప్రాణమన్నట్టున్న ప్రాణమే పాటైనట్టున్న "బాల" గంధర్వుడి ప్రాణస్వరం అలలు అలలుగా నీటిపై తేలుతున్నట్టు అల్లరల్లరిగా గాలిలో తూలుతున్నట్టు పువ్వుల పుప్పొడిని అద్దుకున్నట్టు నవ్వులో ముంచి తీసినట్టు తళుక్కుమన్న తమిళ తేనె పదాలు కూనిరాగాలు... హాయిగానాలు... ఇలాతలంపై ఈ పాటని ఇంకెవరు పాడినా ఇలా - తళుకు మలాము - రాసినట్టుండదండీ... అలాగని నే రాసిస్తానండీ! ఒట్టండీ! ఒప్పుకోవాలండీ! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇల కోడి కూతతో తెల్లవారి మెలకువలైనది మొదలు ఇలకోడి సద్దుతో సద్దుమణిగి కలలూరు వేళల వరకు... చెప్పాలంటే - నాకది మామూలే! తలచిన తలపుకి నవ్వొస్తే ఆ నవ్వుకి ఇంకో నవ్వు కలుపుకోవడానికో - ఏదో గుర్తొచ్చి ఎదలో ఎక్కడో ఏదో గుచ్చిన కంటి తడుపుకి తుడుపుగానో - ఓ పాటని తోడు తెచ్చుకోవడం... ఆ పాటలో నవ్వు పెంచుకోవడం... ఆ పాటతో నొవ్వు తుంచుకోవడం... చెప్పానుగా... నాకిది మామూలే! ఏ నాటికీ - పాటకది పరిపాటే! ఒక్కోసారి - ఒక పాట - పాతనేస్తమల్లే చేరి - వాడుకగా - అందేస్తుంది. అంది - అప్పటికి మురిపించి - మళ్ళొస్తానని - మనసు మఱగున - ఒదుగుతుంది. ఇంకో మాటు - ఒక పాట - అనుకోని అతిథిలా వచ్చి - వేడుకగా - అలరిస్తుంది. అలరించి - ఎప్పటికీ మరవకని - నను వీడనని - మదిని నెయ్యమై - ఒద్దికౌతుంది. ఏనాటికైనా ... పాటకిది పరిపాటే! *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** సరిగ్గా నెల క్రితం - పైన నే చెప్పినట్టు - అచ్చు అలానే - అనుకోని అతిథిలా - నాకో పాట దొరికింది. అదెలాగో - అదేం పాటో - ఆ పాట ఊసులే ఈనాటి నా కబుర్లు. ఇళయరాజా పాటలు ఇప్పటివి కాదు కానీ 80 లు - 90 ల నుంచి వెతుక్కుని వినడం - ఆ nostalgia తో ఒకప్పుడు వుండొచ్చిన వూళ్ళన్నిటిలో నడిచొచ్చిన దారుల్లో ఆ పాటల్ని విన్న మొట్టమొదటి క్షణాల్ని గుర్తు చేసుకోవడం నాకిష్టమైన వ్యాపకం. ఓ రోజలాగే ఇళయరాజా పాటల్ని వెతుక్కుంటున్న నేను -  యూట్యూబ్లో "SPB | Ilaiyaraja song" అన్న మాటలు చూసి అనుకోకుండా ఓ పాట మీద click చేశాను. ముందు కొన్ని పిట్ట కుహుకుహూలు - వెంటనే ఇళయరాజా గిలిగింతల జంత్ర గతులు - ఆ వెంటనే.... " హే... ఓ.... మ్మ్... లలల్లా... అంటూ సుబ్బయ్య గొంతూ... విన్నాను. అంతే! అప్పట్నుంచీ ఇప్పటి దాకా ఆ పాట ఎన్నిసార్లు  మళ్లీ మళ్లీ విన్నానో లెక్కలేదు. విన్నకొద్దీ చెవులకి చవులూరించే పాట. వినకపోతే "నన్ను వినవా?!" అంటూ వీనుల చేరే పాట. ఇంత ఆరాట పెడుతున్న పాట పుట్టుపూర్వోత్తరాలు ఏంటా అని ఆరా తీస్తే తెలిసింది ఏమిటీ అంటే ఇది వైరముత్తు రాసిన మొట్టమొదటి పాటట. భారతీరాజా తీసిన నిళగళ్   (1980) అనే సినిమా లోది. ఈ పాటలో కనిపించిన S.  రాజశేఖర్‌కి ఇది మొదటి సినిమాలాగా అనిపించింది. ఈ పాటలో సముద్రపుటొడ్డు  దగ్గర మొదలుపెట్టి, సరివి తోటలు దాటి, రోడ్డు మీద చెట్ల దాకా పరిగెడుతూ - మధ్యమధ్యలో డాబా ఎక్కి ఆకాశం కేసి కళ్ళు తిప్పి చూస్తూ ఈ ఎస్రాజశేఖరుడు చేసిన అభినయం రొంబ నల్లా ఇరుక్కు! పాడింది ఎస్పీబీ , పాడించింది ఇళయరాజా కాకపొతే ఈ పాట గురించి ఈ నాటి ఈ రాతే లేదు కాబట్టి వాళ్ళ గురించి ముందే చెప్పేశా కదా! పైన చెప్పిన పెద్ద వాళ్లందరికీ పేరుపేరునా దండాలెట్టుకుంటూ ఇహిప్పుడు అసలు పాట గురించి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఈ పాట వినగానే - ఇందులో చప్పున అర్థమైన ఒక వాక్యం "వానమ్ ఎనక్కొందు బోధి మరమ్". ఇంతకు ముందు విన్న కొన్ని తమిళ పాటల వల్ల నాకు "వానమ్*** " అంటే ఆకాశం అని తెలుసు. కన్నడ "మర" పరిచయం వుండడం వల్ల  "మరమ్" అంటే తరువు అనిన్నీ తెలుసు. "ఎనక్కు", "ఒందు"  - అంతమంది తమిళ నన్బర్గళ్ ఉన్న నాకు ఈ మాటలు తెలీవంటే ఎల్లాగూ?! మొత్తానికి " "వానమ్ ఎనక్కొందు బోధి మరమ్" అనగా "ఆకాశం నాకొక బోధి తరువు" అన్న తాత్పర్యం బోధపడింది. (*** ఇంతకు ముందు రాసిన ఓ వానవిల్లు పాట కబుర్లు : మనసే జతగా పాడిందిలే - 22 - కవలపాటలు - తమిళ వానవిల్లిన్ తుణ్డొండ్రు మణ్ణిల్ వంధు - తెలుగు పిల్ల ఒళ్ళు విల్లైనది ... ) *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఆ ఒక్క వాక్యం అర్థం కాగానే నాకమాంతం ఆ పాట మీద అభిమానం అంతై ఇంతై ఎంతెంతో ఐపోయింది. దాంతో పాటలో మాటమాటనీ పలకడమెలాగో నేర్చుకుని - మాటమాటకీ తెలుగు పలుకేదో రాసుకుందామనుకున్నా. ఇదిగో - ఇప్పుడదే చేస్తున్నా! ముందుగా పాట చూస్తూ   వినడానికి వీలుగా యూట్యూబ్ లింక్ ఇస్తున్నా:   https://www.youtube.com/watch?v=Ux0LERGc1cc ఆ తర్వాత ఆ కింద పాటలో మాటలు - మాటమాటకీ తెలుగు మాటలు కూడా రాసుకున్నా. అన్నట్టు ఇక్కడో మాట చెప్పాలి. ఈ పాటలో పల్లవీ, మొదటి చరణం అర్థమయ్యాయి - నాకు చాలా నచ్చాయి. రెండో చరణంలో మాటలు తమిళంలో వినడానికి చాలా బావున్నాయి కానీ వాటి అర్థం పూర్తిగా తెలియాలంటే "నిళగళ్"సినిమా అయినా చూడాలి లేకపోతే తమిళ పాటలు బాగా వినే స్నేహితులని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ఈ కబుర్లు update చేసుకోవాలి. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** హే... ఓ.... మ్మ్... లలల్లా... పొన్ మాలైప్ పొళుదు - బంగరు సంజె పొద్దు ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు - ఇది ఒక ...బంగరు సంజె పొద్దు వానమగళ్ - నానగిరాళ్ - నింగికన్నె సిగ్గుపడుతోంది వేరు ఉడయ్ - పూనగిరాళ్ - వేరే (రంగు) వలువ కట్టుకుంటోంది ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు మ్మ్...  హే... ఆ.... ఓ ... మ్ మ్ మ్మూ ... ఆయిరమ్ నిఱంగళ్ - జాలమిడుమ్ రాతిరి - వాసలిల్  - కోలమిడుమ్ ఆయిరమ్ నిఱంగళ్ - జాలమిడుమ్ - వేల రంగులు మాయ చేస్తాయి రాతిరి - వాసలిల్  - కోలమిడుమ్ - రాత్రి వాకిట ముగ్గులేస్తాయి వానమ్ ఇరవుక్కుప్  పాలమిడుమ్ - నింగి రాత్రికి వంతెన వేస్తోంది పాడుమ్ పరవైగళ్ తాళమిడుమ్ - పాడే పక్షులు తాళమేస్తున్నాయి పూ మరంగళ్ - సామరంగళ్ - వీసాదో?! - పూల తరువులు చామరలు వీచవో? ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు వానమగళ్ - నానగిరాళ్ వేరు ఉడయ్ - పూనగిరాళ్ ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు వానమ్ - ఎనక్కొరు బోధి మరమ్ నాళుమ్ - ఎనక్కదు - సెయ్‌ది తరుమ్ వానమ్ - ఎనక్కొరు బోధి మరమ్ - నింగి నాకొక బోధి తరువు నాళుమ్ - ఎనక్కదు - సెయ్‌ది తరుమ్ - రేపు నాకది సుద్ది (కబురు) తెస్తుంది ఒరు నాళ్ ఉలగం నీది పెరుమ్ - ఒక నాటికి లోకం న్యాయం పొందు తిరునాళ్ నిగళుమ్ తేది వరుమ్ - మంచి జరిగే రోజు వచ్చు కేళ్విగళాల్ వేళ్విగళై నాన్ సెయ్‌వెన్ - అడుగుటతో నా విన్నపం నేను చేస్తాను ఇదు ఒరు ... పొన్ మాలైప్ పొళుదు వానమగళ్ - నానగిరాళ్ వేరు ఉడయ్ - పూనగిరాళ్ ఇదు ఒరు... పొన్ మాలైప్ పొళుదు ఆ... హే... ఓ... లలల్లా... మ్మ్...  హే... ఆ.... ఓ ... మ్ మ్ మ్మూ ... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** మళ్ళీ అదే చెప్తున్నా... చెప్పకుండా వుండలేకపోతున్నా... ఇలాతలంపై ఈ పాటని ఇంకెవరు పాడినా ఇలా - తళుకు మలాము - రాసినట్టుండదండీ... అలాగని నే రాసిస్తానండీ! ఒట్టండీ! ఒప్పుకోవాలండీ! ఆయ్! అంతేనండి మరీ! ~ పాటల భైరవి
Post Date: Mon, 01 May 2023 02:32:57 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger