Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 1 July 2023

కుదిరిన సంధి - ఏ.వి.రమణరాజు

కుదిరిన సంధి సాహితీమిత్రులారా! కుదిరిన సంధి(సరదాగా చేసిన ఓ చిన్న ప్రయత్నం) ఆస్వాదించండి- అతి+అంత, అత్యంత సుందరమైన రాజ్యం "యణా దేశం"!  మహా+ఉన్నతమైన, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆ దేశపు మహారాజు "గుణ సంధుడు". దేశ+ఔన్నత్యం, దేశౌన్నత్యమే , ఏక +ఏక, ఏకైక లక్ష్యంగా తన రాజ్యాన్ని "వృద్ధి" చేశాడు అతడు. అటువంటి ఉన్నత సంస్కారం "కలవారి" ఇంట పుట్టినది, సౌందర్యంతో పాటు చక్కని గుణగణాలు "కలది" ఆ దేశపు యువరాణి "బహువ్రీహి" ! తన చుట్టూ "ఒకటి" కాదు, "రెండు" కాదు....అసంఖ్యాకమైన మిత్రులను ఏర్పరుచుకుని "ద్విగు మహారాజు" , పక్కనే ఉన్న "గసడదవా దేశాన్ని" రాజ్యము+చేయు, రాజ్యముసేయు చుండెను. ఆ దేశపు యువరాజు, అత్యంత పరాక్రమశాలి, చక్కటి శరీర+ఆకృతి, శరీరాకృతి కలిగి ఉండిన, సుందర+అతిసుందరుడు, సుందరాతిసుందరుడు అయిన  "సవర్ణ దీర్ఘ సుందరుడు", యణా దేశపు యువరాణి బహువ్రీహిని ప్రేమించాడు. ఓ విహార యాత్రలో సవర్ణ దీర్ఘ సుందరుడిని చూసి, తాను కూడా అతడిని మోహించింది, బహువ్రీహి! అదే విషయాన్ని మొదట+మొదట, మొట్టమొదట తన తల్లి అయిన "ఆమ్రేడిత" తో చెప్పింది. తండ్రి గుణ సంధుడు కూడా సంతోషంగా ఇందుకు ఒప్పుకుని, వారిరువురికీ వివాహం చెయ్యడానికి నిశ్చయించుకుని, అదే విషయాన్ని ద్విగు మహారాజుకి వర్తమానం పంపాడు. ద్విగు మహారాజు కూడా ఆనందంగా ఇందుకు ఒప్పుకున్నాడు. వారిద్దరి వివాహం ఖరారైన నేపథ్యంలో , బహువ్రీహి ప్రధాన  చెలికత్తె అయిన "ఉత్పలమాల" "భరనభభరవ... భళి భళి" అంటూ ఉత్సాహంతో ఎగిరి గంతేసింది. "తాన తానన తాన తానన తాన తానన తాన తా" అంటూ "రస(జజ)భరితంగా" యువరాణి గుణ గణాలను గానం చేసింది...."మత్తకోకిల" ! ఇదిలా ఉండగా.... వజ్రము+గనులు, వజ్రపుగనులు, మిక్కుటంగా కలిగి, ప్రపంచము+అంగడి, ప్రపంచపు అంగడిలో వ్యాపార లావాదేవీలను జరుపుతూ, మిక్కిలి సంపన్న దేశంగా వెలుగొందుతోంది "పుంప్వా దేశం". ఈ పై వివాహ విషయాన్ని వార్తాహరుల ద్వారా తెలుసుకుని గట్టిగా నిడు+ఊర్పు, నిట్టూర్చాడు ఆ దేశపు చక్రవర్తి, " ద్విరుక్త టకారుడు" ! ఇది ససేమిరా తనకు నచ్చలేదు. బహువ్రీహి పై తనకు ఎప్పటి నుండో మోజు ఉంది. సమయం కోసం వేచి చూస్తున్న ద్విరుక్త టకారునికి, ఇదే సరైన సమయం అని తోచి...అహంకార గర్వంతో, బహు వ్రీహి ని తనకు ఇచ్చి వివాహం చెయ్యమని, లేని పక్షాన "ద్వంద్వ"యుధ్ధానికి సిధ్ధం కమ్మని....తన వద్ద పనిచేసే అన్న-తమ్ముడు, అన్నదమ్ములు అయిన జయవిజయులను రాయబారానికి యణా దేశానికి పంపాడు. తాను ఒక్కడినే ద్విరుక్త టకారుని ఓడించడం కష్టమని, ద్వంద్వ యుద్దము లో ఓడిపోవడం ఖాయమని తలంచి యణా దేశపు రాజు గుణ సంధుడు, ద్విగు మహారాజు తో సమావేశం అయి పరిష్కారాన్ని కోరాడు. అందుకు ద్విగు మహారాజు ఒప్పుకుని, ఉత్తరాదిన ఉన్న తన మిత్రదేశాల రాజుల సహాయం కూడా కోర దలచి, అందరూ కలసి యుధ్దం చేస్తే ద్విరుక్త టకారుడిని జయించడం అంత కష్టమైన విషయం కాదని ఎంచి, ఉత్తర భారతానికి ప్రయాణం కట్టాడు ద్విగు మహారాజు. అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ, దారిలో వృద్ధురాలు,  పేద+ఆలు, పేదరాలు అయిన "రుగాగమ" ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమెకు అభయమొసగి, తిరిగి ప్రయాణం కొనసాగించి ఉత్తర భారతం చేరుకున్నాడు ద్విగు మహారాజు. "ఆ - ఈ - ఏ" అంటూ తన రాజ్యం లోనికి స్వాగతం పలికాడు "త్రిక సంధుడు" . విషయం విని తన మద్దతు ప్రకటించాడు. ఆ+కన్య, అక్కన్య వివాహం తమ చేతుల మీదుగా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు. సంధి కై ప్రయత్నించుదుము, సంధి కుదరని యెడల మనమెటుల ఊరడిల్లి+ ఉండు, ఊరడిల్లియుండగలము, కలసి పోరాడుదాం అంటూ "యడాగముడు" కూడా బదులిచ్చాడు. జగత్+నాటక, జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్ముని అండ మనకి ఉండగా, ద్విరుక్త టకారుడిని దండించి తీరుదాం అని, పక్క దేశపు మహారాణి అయిన "అనునాసిక" తన మద్దతు తెల్పింది. నా అంతః+ఆత్మ, అంతరాత్మ కూడా అదే చెబుతోంది అంటూ "విసర్గ" దేశపు పట్టపురాణి బదులు పలికింది. "అత్వ", "ఇత్వ", "ఉత్వ", "శ్చుత్వ", "జశ్త్వ" దేశాల రాజులు కూడా వంత పాడారు. అందరి మద్దతు కూడగట్టుకున్న ద్విగు మహారాజు మరియు గుణ సంధులు,  ద్విరుక్త టకారుడు భయము+పడె, భయపడేలా, నివ్వెరము+పాటు, నివ్వెరపాటు కి లోనయ్యేలా "పడ్వాదు"లను రాయబారానికి పంపి, ముందుగా సంధి ప్రయత్నం చేశారు. విషయాన్ని గ్రహించిన ద్విరుక్త టకారుడు.... అన్ని దేశాల రాజులు కలసి తనపై యుధ్దం ప్రకటిస్తే, తనకు ముప్పు తప్పదని తెలుసుకున్నాడు. అంత బలగం ముందు తానొక చిరు+ఎలుక, చిట్టెలుక అని తెలుసుకుని, తాను ప్రతిపాదించిన విషయాన్ని వెనక్కి తీసుకుని,  సంధి కి ఒప్పుకున్నాడు! అంతే కాదు తన వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది అని గ్రహించి, తనకున్న వజ్రపు గనులలో కొన్నిటిని సవర్ణ దీర్ఘ సంధుడు-బహువ్రీహిల  పేరిట రాసిచ్చి, దగ్గరుండి వారిద్దరి వివాహాన్ని కూడా జరిపించాడు. అందరూ ఎంతో సంతోషించి, గట్టిగా చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేశారు!! ఒరేయ్.... ! లే....ఏవిటా చప్పట్లు, నువ్వూనూ. తెలుగు పరీక్ష అనేసరికి ఎక్కడలేని కలవరింతలు, పలవరింతలూను. ముందుగానే కొంచెం చదువుకుని ఉండొచ్చుగా! తెల్లారి అయిదు కావస్తోంది...లే...లేచి కూచుని చదువుకో, తొమ్మిదింటికి పరీక్ష కి వెళ్ళాలి....! తల్లి కేకతో, ఆమె అటుగా వెళ్లిన తరువాత సందు చూసుకుని సంధులు పక్కన పెట్టి, తయారై పరీక్షల సందడి లో మునిగిపోయాడు తొమ్మిదో తరగతి చదువుతున్న సందేశ్! ఇది వైద్యంవారి వాట్సప్ నుండి -
Post Date: Sat, 01 Jul 2023 13:06:24 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger