Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 1 July 2023

కనురెప్పల రెపరెపల వెనుక .. - కృష్ణుడు

నా కనురెప్పలు కొట్టుకోకుండా ఉంటే ఎంత బాగుండు నిన్ను నిరంతరం చూసే వాడినే కదా,, వేయి కన్నులున్న ఇంద్రుడినైతే ఇంకా ఎంతా బాగుండు నీ అందాన్ని తనివితీరా ఆస్వాదించేవాడిని కదా.. అంటాడు రామరాజభూషణుడు. ఎంత అందమైన ఆలోచన. ప్రేమించిన వారు  నిరంతరం కళ్లలో కళ్లుపెట్టుకుని ఒకర్నొకరు చూసుకుంటూ క్షణాలు యుగాలుగా గడిపేస్తారని ఎక్కడో చదివాను. అదే భావనను గిరికా, వసురాజుల ప్రణయంలో వర్ణిస్తాడు. రామరాజభూషణుడిని చదవకపోతే తెలుగు సాహిత్యంలో ఒక అద్భుత కవిత్వాన్ని మనం కోల్పోయినట్లే. శ్రీశ్రీ వసుచరిత్రను కొనలేక ప్రతి రోజూ ఒక పుస్తకాలషాపుకు వెళ్లి అక్కడే చదువుకునేవాడట. చివరకు ఆ పుస్తకాల యజమాని శ్రీశ్రీకి ఆ పుస్తకాన్ని బహూకరించాడట! మెల్లగా వీచే పిల్లగాలికి మామిడి చెట్ల చిగురుటాకులు కదులుత్తుండగా, తీయ తేనియల్లాంటి మామిడి పళ్ల రసాన్ని ఆస్వాదించి పాడే చిలుకల గురించి, గోరింటలు పూచిన, పొగడలు మొగ్గలు వేసిన, కోయిలలు అవ్యక్త మధురంగా గానం చేస్తున్న మధుమాస వనాల గురించీ రామరాజ భూషణుడు ఎన్నో పద్యాలు రాసి ఉండవచ్చు కాని  నా దృష్టిలో 'జననాథోత్తముడింతిజూడ ననిమేషత్వంబుం గాంక్షించె' అన్న పద్యం అద్భుతంగా అనిపిస్తుంది. కనురెప్పలు కొట్టుకోనే క్షణాన్ని కూడా ఓపలేని ఆ సౌందర్యాస్వాదన ఎంత గొప్పది! 'వాన చినుకులు కనురెప్పల మీద కొంతసేపు నిలిచి, ఆపైన ఆమె పెదాల మీదకి జారి పడ్డాయి.ఆ తర్వాత ఎర్రటి మోవిపై మజిలీ చేశాయి' అని రాసింది ఎవరో కాదు. కాళిదాసు కుమార సంభవాన్ని అనుసృజించిన నన్నెచోడుడు. ప్రబంధ కవిత్వంలోనూ, ప్రాచీన కవిత్వంలోనూ కవిత్వం సౌందర్యంలోనూ,సౌందర్యం కవిత్వంలోనూ  ఏది ఆకాశమో, ఏది నీలి మేఘమో తెలియనంతగా కలిసిపోయాయి. కనురెప్పలకు కవిత్వంలో ఆ గొప్పతనాన్ని ఎందరు ఎంత గొప్పగా ఆపాదించారు! కనురెప్పల వెనుక నుంచి ఏమి నీవు చెప్పావో (పల్కోంకే పీఛే సే క్యా తుమ్ నే కహ్ డాలా) అని రాశాడు మజ్రూన్ సుల్తాన్ పురి. మనసే విరిగిపోయినప్పుడు (జబ్ దిల్ హీ టూట్ గయా) అంటూ సైగల్ గానంలో అమరుడైన కవి మజ్రూన్ నిరంతరం ప్రేమలో తచ్చాడాడు. నీ కనురెప్పల మడతల్లో నక్షత్రాల వలె ఏమి దాచుకున్నావు (తుమ్హారీ పల్కోం కీ చిల్మనోం మే , యే క్యా ఛుపా హై సితారే జైసా) అని రాసి నిధా ఫజ్లీ ఆకాశం నీలి కనురెప్పల మధ్య ఇంకా గాలిబ్ తో కలిసి  తచ్చాడుతున్నాడు.. కనురెప్ప పాడిందీ కనుసైగ పాటా అని సినారే  ఎవరి స్ఫూర్తితో రాశాడో కాని.. అలిశెట్టి కనురెప్పల చప్పుడుకు ఒక అర్థాన్ని కల్పించాడు. ఘనీభవించిన నిశ్శబ్దంలో నైనా కనురెప్పలు తెరుచుకునే చప్పుడు వినకుంటే ఎలా? అని ప్రశ్నించిన అలిశెట్టీ నీకు జోహార్లు. ఆమె తనను చూసి దించుకుంటున్న కనురెప్పలపై నడుస్తోంది అని నేను సాయిబాబా సహచరి వసంతను చూసినప్పుడు రాశాను ' ఆకాశం కోల్పోయిన పక్షి ' లో.. కనురెప్పలపై జైలు నిదుర కాస్తుంది అని రాసిన  కవి మిత్రుడు  శ్రీరామ్ పుప్పాల చరిత్రను స్తంభింపచేసే ఒక దుస్సహ జీవితాన్ని వర్ణిస్తే మొత్తం ఆకాశపు చీకటిని కనురెప్పలపై సహించాలి. అన్నాడు వారణాసి నుంచి దేశాన్నిచూస్తున్న హిందీ కవి నరేష్ సక్సేనా కనురెప్ప వాల్చని జాగ్రతలో సాయుధమై అని ఎప్పుడో రాశాడు ఒక విప్లవ కవి. వారెప్పుడూ రెప్పవాల్చని కాపలాలో నిమగ్నమై ఉంటారు.  ఆ కాపలాల మధ్యనే ఎన్నో కనురెప్పలు శాశ్వతంగా మూసుకుంటాయి. ఆకులు తమ కనురెప్పలనుంచి కన్నీళ్లు నిరంతరం కారుస్తూనే ఉంటాయి. కనురెప్పకు దాని తుఫానులున్నాయి అన్నాడు ఫ్రాంక్ ఓ హరా కన్ను తెరిస్తే జననం. కన్ను మూస్తే మరణం. రెప్పపాటే కదా జీవితం అన్నాడు ఒక మినీకవి. కాని ఆ జనన మరణాల వెనుక ఎంత చరిత్ర, ఎంత జీవితం. మూసుకున్నకనురెప్పల మధ్య ఎంత చరిత్ర సమాధి అయిందో..ఎన్ని బాల్యాలు, అనుభవాలు కరిగిపోయాయో.. ఒక్కసారి పుటల మధ్య కనురెప్పలు కొట్టుకుంటే ఎన్ని అక్షరాలు  మనసులో ఇంకిపోతాయో.. రాత్రి మూసుకున్న కనురెప్పల వెనుక కలలు గత స్మృతుల్ని స్మరిస్తుంటాయి. కాని శవం  మూసుకున్న కనురెప్పలు ఎప్పటికీ తెరుచుకోవు. అవి అమ్మవే కావచ్చు, నాన్నవే కావచ్చు. బంధువువైనా కావచ్చు. స్నేహితుడివే అయినా కావచ్చు. చాలా సార్లు తెరుచుకున్న నిర్జీవుల కనులపై రెప్పల్ని మూసివేస్తుంటే చూసి కుమిలిపోయాను. అమరుల కనురెప్పలు మూసుకున్నప్పుడు దహించుకుపోయాను. కనురెప్పలు తెరిచి  వెలుగు చూడలేనప్పుడు, సౌందర్యాన్ని ఆస్వాదించలేనప్పుడు, ప్రేమను, స్నేహాన్నీ ప్రసరించలేనప్పుడు, ఇతరుల కళ్లలో వెలుగు నింపలేనప్పుడు ఆ కనురెప్పలు మూసుకున్నా, తెరుచుకున్నా ఒకటే కదా! *
Post Date: Sat, 01 Jul 2023 14:10:34 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger