Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 16 September 2022

పిల్లి మెళ్ళో గంట కట్టాలె - sarma

పిల్లి మెళ్ళో గంట కట్టాలె బహు కుటుంబీకుడైన ఒకరి ఇల్లు. ఆ ఇంట్లో ధాన్యం,బియ్యం దాచుకునే ఒక గది, పశువులకి అవసరమైన చిట్టూ,తవుడూ దాచుకునే మరోగది, చల్లగది,వంటగది, భోజనాలశాల,సరుకులు దాచుకునేగది, అదే కొట్టుగది  , ఆహారపదార్ధాలు దాచుకునేగది, పడకగదులు, ఇలా చాలా గదులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ ఇంట్లో పందికొక్కులు, ఎలకలున్నాయి. పందికొక్కులు, ఎలకలు అన్నిటిని తిన్నంత తిని, మిగిలినది పాడు చేస్తున్నాయని,కొంప తవ్విపోస్తున్నాయని,  యజమాని సాయంత్రానికి అన్ని గదుల తలుపులు మూయిస్తూ వచ్చాడు, కాని ఎలకలు మాత్రం చూరుల వెంబడి కదులుతూ,తలుపులు చిల్లుపెట్టి, ఒక గదినుంచి మరోగదికి నేలలో పందికొక్కులు  బొరియలుచేసి యధేచ్చగా అన్నిటిని పాడు చేస్తూనే ఉన్నాయి. పడకగదులుల్లో కూడా ఎలకలు బీభత్సం సృష్టిస్తున్నాయి.  యజమాని బాధపడుతూనే ఉన్నాడు.  ఆ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉంది. కాని తలుపులు మూసి ఉండటంతో ఎలుకలు చిక్కడం కష్టమయింది,పిల్లికి.  యజమాని, కుటుంబ సభ్యులు విసిగిపోయారు, రాత్రులు తలుపులు మూయడం మానేశారు, దాంతో పిల్లికి వీలు చిక్కి దొరికిన పందికొక్కును, ఎలుకను దొరికినట్టు స్వాహా చేస్తూ వచ్చింది. చూసిన యజమానికి చేసిన పని బాగున్నట్టనిపించింది. ఎలుకలకి కొంత స్వేఛ్ఛ తగ్గింది, దీనితో ఎలుకలన్నీ కటకట పడ్డాయి. ముసలి ఎలుకలు, ముసలి పందికొక్కు అధ్యక్షతన  ఒక సభ చేయాలని, పిల్లి నుంచి ఎలుకలకు కలిగే నష్టాన్ని లేకుండా చేసుకోవాలని  తీర్మానించుకున్నాయి. ఆ సభకు ముసలి పందికొక్కును అధ్యక్షునిగా చేసుకుని సభ తీర్చి ఏమి చేయాలనేది ఆలోచించాలని, అనుకున్నాయి. నేడు,రేపు అంటూనే సభ వాయిదా పడుతూ వచ్చింది. చివరికో రోజు సభ తీరాయి. ముసలిపందికొక్కు అధ్యక్షతన. అధ్యక్షులవారు స్వాగతోపన్యాసం ఇస్తూ జరుగుతున్నది చాలా అన్యాయం, దీన్ని ఎదుర్కోవలసిందే! అని శలవిచ్చి,పందికొక్కులు త్యాగాలు చేసినవని, అన్యాయాలను ఎదుర్కొని పోరాడినవని, మాది త్యాగధనుల వంశమని పొగుడుకుని, మిగతావారికి సావకాశం ఇచ్చారు.  యువ ఎలుకలు,  ఆవేశంగా ఉపన్యాసాలిచ్చాయి. యువ ఎలుకలు పందికొక్కులే త్యాగధనులు కాదు, మా వంశాలలలోనూ త్యాగధనులున్నారు, పోరాడుతూ ప్రాణాలూ పోగొట్టుకున్నవారున్నారు, ఇలా విడతీసి మాట్లాడటం అధ్యక్షులవారికి తగనిపని అన్నాయి. దానికి పందికొక్కులు ఉన్నమాట చెప్పేరు అధ్యక్షులవారు,వారి వంశం త్యాగధనుల వంశం అని వంత పాడేయి. దీనికి ఎలుకలు కినిశాయి. మమ్మల్ని కించపరచడానికే సభ చేసినట్టుందని పందికొక్కులు బయటకి పోతామని బెదిరించాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక సమస్య చర్చించాలిగాని ఇలా పక్కదోవ పట్టించకండని సుతి మెత్తగా అందరిని మందలిస్తే ఆవేశాలు చల్లారాయి. పిల్లిని కట్టడి చేయాలి, మన వంశాలు నాశనం కాకుండా చూడాలని ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ లోగా పిల్లి సడి పసికట్టిందో ఎలక, పక్కదానిని హెచ్చరించింది, అది మరోదాన్ని హెచ్చరించడంతో ఎలకలన్నీ సభ వదలి పారిపోయాయి. మళ్ళీ సభ చేయాలని అనుకున్నాయి. ఆవేశంగా ఉపన్యాసాలివ్వడం కాదు ఏమి చేయాలన్నిది సూచనలు చేయాలని అనుకున్నాయి. వాయిదా పడుతూ పడుతూ సభ జరిగింది మరోరోజు. ముసలి పందికొక్కును అధ్యక్షత వహించమన్నాయి, ఎలుకలు, దానికి ము.ప నాకా వయసు చెల్లింది, నా స్థానంలో నా వంశం వారిని అధ్యక్షులుగా చేసుకుని సభ చేయమని సలహా చెప్పింది. దానికి కొన్ని ఎలుకలు వ్యతిరేకించాయి, మరికొన్ని మద్దతు పలికాయి. ఇంతలో ఒక ముసలి ఎలుక ఇదంతా వ్యర్థం, అది పిల్లి, దొరికితే నోట కరుచుకుపోతుంది, సభ చాలించి ప్రాణ రక్షణ చూసుకోండని, సలహా ఇచ్చింది. దానికో పందికొక్కు,ఇది పిల్లి పక్షం మాటాడుతోంది, పిల్లి దీనికేమైనా ఎర చూపిందేమో అన్నాయి పందికొక్కులు. దానికి ఎలకలు ఉన్నమాట చెప్పినదానికి అంత ఉలుకెందుకని నిలదీశాయి. ముసలి ఎలక మాటాడుతూ అది పిల్లి, ఎవరినైనా నోట కరుచుకుపోతుంది, ఉన్నమాట చెప్పి చెడ్డయ్యాను,   నాకెందుకొచ్చిన గోలంటూ, సభ వదలిపోయింది.   ఒక యువ ఎలుక పిల్లి చప్పుడు చేయక వచ్చి మనమీద దాడి చేస్తోంది కనక, పిల్లి వస్తున్నట్టు తెలియాలంటే మెడలో గంట కడితే సరికదా అని సలహా ఇచ్చింది. దీనికి సభలో వారంతా భేష్! భేషని చంకలు గుద్దుకున్నారు. ఇంతలో పిల్లి వస్తున్న సడి వినపడింది, ఎలకలు,పందికొక్కులు పరిగెట్టేయి. ( సశేషం )
Post Date: Fri, 16 Sep 2022 12:26:49 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger