Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 28 December 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౬(706) - Aditya Srirambhatla

( అవధూత సంభాషణ ) 11-99-వ. ఇవ్విధంబున భూమివలన సైరణయు, గంధవహునివలన బంధురంబగు పరోపకారంబును, విష్ణుపదంబువలనఁ గాలసృష్ట గుణసాంగత్యంబు లేమియు, నుదకంబువలన నిత్యశుచిత్వంబును, నసితపథునివలన నిర్మలత్వంబును, నిశాకర ప్రభాకరుల వలన నధికాల్పసమత్వజీవ గ్రహణ మోక్షణంబులును, గపోతంబులవలనఁ గళత్ర పుత్ర స్నేహంబును, నజగరంబువలన స్వేచ్ఛా విహారసమాగతాహారంబును, వననిధివలన నుత్సాహ రోషంబులును, శలభంబువలన శక్త్యనుకూల కర్మాచరణంబును, భృంగంబువలన సారమాత్రగ్రహణ విశేషంబును, స్తంబేరమంబువలనం గాంతావైముఖ్యంబును, సరఘవలన సంగ్రహ గుణంబును, హరిణంబువలనం జింతాపరత్వంబును, జలచరంబువలన జిహ్వాచాపల్యంబును, బింగళవలన యథాలాభసంతుష్టియుఁ, గురరంబువలన మోహపరిత్యాగంబును, డింభకువలన విచారపరిత్యాగంబును, గుమారికవలన సంగత్యాగంబును, శరకారునివలనం దదేకనిష్ఠయు, దందశూకంబువలనం బరగృహవాసంబును, నూర్ణనాభివలన సంసారపరిత్యాగంబును, గణుందురువలన లక్ష్యగత జ్ఞానంబు విడువకుండుటయుననంగల వీని గుణంబు లెఱింగి మఱియుఁ గామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబు లను నరిషడ్వర్గంబుల జయించి, జరామరణవిరహితంబుగా వాయువశంబు సేసి, గాత్రపవిత్రత్వంబుకొఱకు షట్కర్మ నిరతుండయి, పుర నగర గ్రామంబులు పరిత్యజించి పర్వతారణ్యంబుల సంచరించుచు, శరీర ధారణార్థంబు నియతస్వల్పభోజనుండై, ఖేద మోదంబులు సరియకా భావించి లోభమోహంబులు వర్జించి, నిర్జితేంద్రియుం డయి నన్నె కాని యొండెఱుంగక యాత్మ నిష్ఠచేఁ బవిత్రాంతఃకరణుండైన యోగి నాయందు గలయుం గావున. భావము: ఈ విధంగా, 1. భూమివలన సహనము; 2. వాయువువలన పరోపకారము; 3. ఆకాశమువలన కాలముచే సృష్టించబడిన గుణాలతో సాంగత్యం లేకపోవడం; 4 నీటివలన ఎప్పుడు శుచిగా ఉండటం; 5. అగ్నివలన నిర్మలంగా ఉండటం; 6. 7. చంద్ర, సూర్యులవలన సర్వసమత్వము; 8. పావురంవలన భార్యాబిడ్డల యందు స్నేహత్యాగము; 9. కొండచిలువవలన ఇష్టప్రకారం తిరుగుతూ అందిన ఆహారాన్ని మాత్రమే స్వీకరించటం; 10. సముద్రంవలన ఉత్సాహ రోషములు; 11. మిడుతవలన శక్తికి తగిన పనిచేయటము; 12. తుమ్మెదవలన సారమును మాత్రమే గ్రహించటం; 13. ఏనుగువలన స్త్రీ వైముఖ్యము; 14. తేనెటీగవలన సంగ్రహణము; 15. లేడివలన విచారపరత్వమ; 16. తాబేలువలన జిహ్వాచాపల్యము; 17. ముంగిసవలన దొరికిన దానితో తృప్తిపడటం; 18. లకుమికిపిట్టవలన మోహ పరిత్యాగము; 19. బాలునివలన విచార పరిత్యాగము; 20. బాలికవలన సంగ విసర్జనము; 21. బాణాలు చేసేవాని వలన ఏకాగ్రత; 22. పామువలన ఇతరుల ఇండ్ల యందు నివసించటం; 23. సాలెపురుగువలన సంసార బంధాలలో చిక్కుపడక ఉండటము; 24. కందిరీగవలన లక్ష్యజ్ఞానము విడువక ఉండుట; నేర్చుకోవాలి. ఈ గుణాలు గ్రహించుకుని కామం, క్రోధం, లోభం, మోహం, మదం మాత్సర్యం, అనే అరిషడ్వర్గము (ఆరుగురు శత్రువులు) జయించాలి ముసలితనం రాకుండా చావు లేకుండా ప్రాణవాయువును వశం చేసుకోవాలి. శరీరము పవిత్రంగా ఉండడం కోసం యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అను వాటి మీద ఆసక్తి కలగి, పట్టణాలను గ్రామాలను నగరాలను వదలి కొండల యందు అడవులయందు తిరుగుతూ ఉండాలి. దేహం నిలవటానికి సరిపడ కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ ఉండాలి. సంతోషం దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్నీ మోహాన్నీ వదలాలి. ఇంద్రియాలను జయించాలి. నన్నే తప్ప మరొకటి ఎరుగక ఆత్మనిష్ఠతో పవిత్రమైన అంతఃకరణం కలిగి ఉండాలి. అట్టి యోగి నన్ను చేరగలుగుతాడు నా యందే కలుస్తాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=99 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Tue, 27 Dec 2022 15:19:26 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger