ఆ సాయంత్రమే, ఆ వెళ్లే దార్లోనే, మరో పని చూసుకోవలసి వచ్చింది. అందువల్ల నేను అక్కడికి వెళ్ళడం కొంచెం ఆలస్యం అయింది. అప్పటికి రావలసిన వాళ్ళందరూ వచ్చేసారు. చర్చ మొదలయి చాలాసేపే అయిందని వాతావరణంలో ఉన్న బిగింపువల్ల తెలుస్తోంది. నేను దాన్ని సడలనివ్వకుండా మౌనంగా వెళ్ళి ఓ పక్కగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. సత్యజిత్ అనే ఆయన మాటాడుతున్నాడు. "మీరంతా ఎంతగా వద్దంటున్నా అది ఇంకా బలంగా పాతుకుపోతోంది. పెళ్ళి అన్న కేంద్రం దగ్గరే సమాజానికి ఆడంబరాన్ని, అట్టహాసాన్ని, ఎంతో కొంత ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోడానికి తగిన అవకాశం ఉంది. అంచేత వ్యక్తులు సరే, ఈ సమాజం ఎప్పటికీ వివాహాన్ని ఆదరించక మానదు" – ఇంకా ఏదేదో చెప్తున్నాడు ఆయన. మిగిలిన మాటల మీదకి దృష్టి పోలేదు నాకు. ఇవాళ చర్చ ఇలా దీనిమీద నడుస్తోందన్నమాట అనుకున్నాను. ఇవాళంతా ఇక్కడ నేను మౌనంగా ప్రేక్షకుడి మాదిరిగానే ఉండాలని ఉంది. అదే మంచిది కూడా. ఎందుకంటే ఇదేదో నావేపే దూసుకొచ్చే ఉప్పెనలా.. అలా అనడం ఎందుకు మలయపవనం లా.. అందాం. అలా ఉండేలా ఉంది. ఇంకా ఆయన ఇలా అంటున్నాడు "ఒకసారి ఒక సాహిత్యసభలో మాట్లాడుతూ నేను వివాహం తాలూకు దుర్మార్గం గురించి చెప్తే మీటింగ్ అయ్యాక ఒక పెద్దమనిషి నా దగ్గరికి వచ్చి ఎంతగానో బాధపడ్డాడు. 'మీరు చెప్పిన అవలక్షణాలన్నీ వివాహంలో లేకపోలేదు కానీ, మనిషి నాగరికతలో భాగమైన దాన్ని సమూలంగా పోవాలని ఎలా కోరుకుంటాం. లోపాలు పోగొట్టుకోవాలిగానీ' అన్నాడు. "లోపాలు పోవాలంటే ముందు మనం, అంటే మగవాళ్ళం మారాలి కదండీ. ఎక్కడ మారుతున్నాం" అని నేనన్నాను. ఆయన ఏమీ మాట్లాడలేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నేనూ చాలా ఆలోచించాను. – మరీ మనం ఎందుకు మారలేకపోతున్నాం "మనం అంటే కొంత ఆడవాళ్లు కూడా అనుకోండి " అని అన్నాడు ఆయన. సత్యజిత్ బాగా చదువుకున్నవాడు. వృత్తిరీత్యా వైద్యుడైనా సాహిత్యవేత్తగా కూడా ప్రసిద్ధుడు. మంచి వక్త. ఆలోచనాపరుడు కూడా. థింకర్ అనొచ్చు. 'అంటే ఆడవాళ్ళు ఏమీ మారక్కరలేదా! వారి బాధ్యత ఏమీ లేదా' కావాలనే అడిగినట్టున్నాడు ప్రభు, ఆయన చివరి మాట పట్టించుకోకుండా. ప్రభు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఈమధ్యనే సాఫ్ట్ వేర్ లో ఉద్యోగబాధ్యత తలకెత్తుకున్నాడు. కొత్త ప్రపంచం చూస్తున్న యువకుడు. అదొక ప్రశ్నా! అన్నట్టు చూసేరు అందరూ అతనివైపు. "నాకు తెలుసు మీరలా చూస్తారని. కానీ సమాజం ముందుకు వెళ్ళడంలో చాలా మార్పులకి, కుదుపులకీ కూడా లోనవుతోంది. మేం యువకులం లేదా యువత బాగా దగ్గరగా చూస్తున్నాం.'' అప్పటిదాకా కుతూహలంగా వింటున్న జానకీ మేడం నవ్వుతూ ఇలా అంది. "ప్రభూ – ఆడవాళ్లు మారాలంటున్నావా! లేక ఎక్కువ మారేరంటున్నావా". "అదేమో నాకు తెలియదు కానీ నేను చిన్నప్పటినుంచీ ఇంట్లో చూస్తున్న మా అమ్మలాగ, అక్కలాగ ఉండటం లేదు". ఇంతలో లోపలనుంచి ఒక పెద్ద ప్లేటు నిండా సమోసాలతో రవీంద్ర, మరో ప్లేటులో ఏదో స్వీటూ పట్టుకుని సుమిత్రా బయటికి వచ్చారు. మధ్యలో ఉన్న పొడుగాటి టీపాయ్ మీద సమోసాల ప్లేటు పెట్టగానే అందరూ తలోటీ తీసుకుని ఊదుకుంటూ తినడం మొదలుపెట్టారు. ఎవరోగానీ మిర్చి బజ్జీ లేదా అన్నారు. "రవి ఉదయం బంగాళాదుంప కూర చేశాడు. చాలా రుచిగా కుదిరింది. ఈ సాయంత్రం సమోసాల కోసమే. రేపు నాకు క్లాస్ ఉంది దానికి తయారయ్యే అవసరం ఉంది. కొత్త పాఠం. అందుకని మొత్తం తనే చేశాడు. మిర్చీ బజ్జీ నా పేటెంట్ రైట్ కదా మరి. మళ్లీసారికి వాయిదా వేసాను," సుమిత్ర సంజాయిషీలా కాదుగానీ సమాధానంలా చెప్పింది. రవి మళ్ళీ లోపలికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసులు, జగ్గూ తెచ్చాడు. సుమిత్ర "సారీ నేను చదువుకోవాలి" అని లోపలికి వెళ్ళిపోయింది. సమోసా తింటూ ప్రభు అన్నాడు. ''చూసారా మేడం. వచ్చి ఈ మాట మనకి చెప్పి మరీ లోపలికి వెళ్ళింది. అదే నా ఫ్రెండ్ వైఫ్ ఉంది. పెళ్ళయి మూడేళ్ళయింది. మేం ఎవ్వరం వెళ్ళినా మాతో కలవదు. 'నా ప్రైవసీ నాది' అంటూ లోపల లాప్ టాప్ లో సినిమా చూసుకుంటూ ఉంటుంది. వీడే అన్ని పనులూ చేసుకుంటాడు" చెప్తుంటే స్వరంలో కోపమే కాకుండా ఆక్రోశం. ''అవును. ఎవరి ప్రైవసీ వాళ్ళకి అవసరమే కాదు, ముఖ్యం కూడా కదా!'' అంటూ లోపలికి వెళ్ళిన సుమిత్ర మళ్ళీ వెనక్కి వచ్చింది. "ప్రైవసీలకీ సంస్కారాలకీ మధ్య, సన్నటి కనీకనపడని గీతలుంటాయి. అవి తెలుసుకోవడం చాలా కష్టం. అవి వాళ్ళకి తెలిసేలోపు సంబంధాల్లో పగుళ్ళు మొదలయి నెమ్మదిగా పెద్దవయిపోతాయి." అప్పటిదాకా కుదురుగా కూర్చున్న స్వామినాథన్ అన్నాడు. స్వామి రచయిత. పత్రికా విలేకరి కూడా. అందుకనే ఇంతసేపూ గుంభనంగా కూర్చున్నాడు. "ఆ గీతలు తెలిసేలా వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత ఎవరిది?" "ప్రభూ!! ఇవాళ్టి సమాజంలో ఎవరి బాధ్యత వారిదే. ఎందుకంటే విపణి సంస్కృతి పొగ మాదిరి చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మన దేశం లాంటి చోట రకరకాల స్థాయిలలో బతికే కోట్లాది ప్రజలున్నారు. కానీ ఈ వ్యాపార సంస్కృతి ఆ అందరి పట్లా ఒకేలా వుంది. వీడు ధనికుడు వీడు పేద అనే బేధ భావమేమీ దానికి లేదు కబళించడానికి. ఎవరు నిలబడిన నేల మీంచి ఎవరికి వారే భూమి బద్దలవుతుందేమో? కూరుకుపోకుండా నిలబడగల మార్గమేదీ? అని ఆలోచించుకోవాలి. కొంతకాలానికి కాకపోయినా మరికొంత కాలానికేనా ఆధారం దొరక్కపోదు. అప్పుడు గీతలు వాటంతట అవే కనిపిస్తాయి.'' స్వామిగారు వివరించారు. స్మిత ఇందాకటి నుంచి అంతా వింటోంది. రెండు సమోసాలు తింది. వేడి వేడిగా నిజంగా చాలా బావున్నాయి. లోపలి నుంచీ టీ ఇంకా రాలేదు. బహుశా రవే వెళ్ళి తేవాలి. సుమిత్ర ప్రశ్న వేసేసి లోపలికి వెళ్ళిపోయింది. స్మిత పూర్తి పేరు మందస్మిత. మొదట్లో ఎవరో అడిగితే చెప్పింది. మా అమ్మ లలితా అష్టోత్తరం చదువుతుంది. అందులోంచి ఏరి ఈ పేరు పెట్టింది అని. అర్ధం తెలుసా అంటే 'ఆఁ తెలుసు. మా అమ్మే చెప్పింది. కానీ నాకు అతకలేదు' అని భళ్ళుమని నవ్వింది. అయిదారేళ్ళుగా, తరచుగా జరిగే ఈ చిన్న సమావేశాలకి వస్తుంటుంది. సాహిత్యం అంటే వల్లమాలిన ఇష్టం వల్ల. తను చదివిన పుస్తకాలలోంచి వచ్చిన తీవ్రస్వరం ఆమె మాటలలో ఉండేది. ఇంతమంది మధ్య చిన్నదయినా బెరుకూ భయం లేకుండా సమానస్థాయిలో మాటాడేది. ఈ మధ్య మాటలు తగ్గేయి. ఎక్కువసేపు వినడంలోకి వచ్చింది. మంచిదో చెడ్దదో కాని కాస్త మార్పు నిజంగానే. ఇవన్నీ తనే చెప్పింది. నవంబర్ నెల ఆఖరవుతోంది. చివరి ఆదివారం. సాయంత్రం దాటిపోయి చీకటి మా చుట్టూ పలచని తెర కట్టింది. గాలి లోంచి కిందటేడాది విడిచి వెళ్ళిన పాత చుట్టం సరికొత్తగా వచ్చి ఒంటిని నింపాదిగా తాకుతోంది. హాయినిచ్చే చలి ఇది. ఇదీ టీ తాగే సమయం. సత్యజిత్ ఆగలేక అడిగేసాడు "రవీ ఇంకా టీలు రాలేదు". "వాటికేమైనా కాళ్ళున్నాయా రావడానికి" అంది నవ్వుతూ స్మిత. "రెక్కలుంటే బావుండుననుకుంటున్నాను" ప్రభు జోక్. "చూసారా అందరం రవిగారే లోపలకి వెళ్ళి తేవాలని ఎదురుచూస్తున్నాం కానీ మనం కూడా ఆ పనికి కదలొచ్చని అనుకోవడం లేదు." అంటూ జానకీ మేడం లేవబోయింది. "ఉండండి మేడం నేను తెస్తాను" అని ప్రభు లేచాడు. రవి, ప్రభు కలిసి తెచ్చిన టీలు తాగుతుండగా సత్యజిత్ తన పేషెంట్ ఒకరి తాలూకు డైవోర్స్ ఉదంతం చెప్తూ వచ్చాడు. అందరూ దృష్టి టీ తాగడం మీదే పెట్టి విన్నారు. చివరకు యువత తొందరపాటు గురించి, స్వేచ్ఛ అనుకునే స్వార్ధం గురించీ, దురాశల గురించి తలొక మాట చెప్పడం మొదలుపెట్టారు. టీ కప్పులన్నీ టీపాయ్ మీద ట్రేలోకి చేరలేదు. కొన్ని ఎవరి కుర్చీ కాళ్ళ దగ్గర వాళ్ళవి ఉండిపోయాయి. మళ్ళీ వాటిని లోపల పెట్టుకునే పని రవిలాంటి గృహస్తుడి ఇంట్లో అయితే రవిది కూడా. కాకపోతే కేవలం సుమిత్రదే. అందరి విమర్శలూ వింటున్న స్మిత లేచి నవ్వుతూ తాగిన కప్పులన్నీ ట్రేలోకి ఎక్కించి లోపలికి పెట్టడానికి వెళ్ళబోతూ "మీ కామెంట్స్ కి సమాధానంగా నేనో కథ చెప్తాను ఇవి లోపల పెట్టి వచ్చి" అంది. రవి "అలా ఉంచమ్మా నేను తీస్తాను" అంటున్నా పట్టించుకోకుండా. ఈ చిన్న సమూహంలో వయోభేదం లేదు. అందరూ మాట్లాడవచ్చు. అందరి అభిప్రాయాలకీ విభేదాలున్నా విలువ ఉంటుంది. కాస్త నిశ్శబ్దం. నిశ్శబ్దం కుదురుగా ఉండక దూరంనుంచి గాలితోపాటు ఏదో పూల సువాసనను మోసుకొచ్చింది. ఆ సువాసన ఏదో ఇందాకటినుంచీ వస్తూనే వుంది కానీ, మాటల శబ్దాల మాటున దాక్కుని ఉండిపోయింది. సువాసన నాసికకే కాక వంటికి కూడా తగులుతుందనిపిస్తుంది. ఈ పూలు నవంబర్ నెల పూలు. అంచేత వీటి వాసన చిరుచలితో కలిసి ఒళ్ళంతా అలుముకున్నట్టుంటుంది. వేసవి పూల స్పర్శ వేరు. అవీ రాత్రి పూలే గానీ, వాటిది సేదతీర్పు. ఇలాంటివన్నీ వీళ్ళ సహవాసం వల్ల తెలిసాయి నాకు. స్మిత మరో జగ్గుడు మంచినీళ్ళు పట్టుకునొచ్చి బల్లమీద పెట్టింది. తన కుర్చీ మరి కాస్త ముందుకి లాక్కుని కాళ్ళు పైకి పెట్టుకుని కుర్చీలో ముడుచుకుని కూర్చుంది. వేసుకున్న పేంటూ టాప్ ల మీదకి చున్నీ లేకపోవడంతో చెవులకి తగులుతున్న చిరుచలిని అయిష్టంగానే ఆస్వాదిస్తూ చెప్పడం మొదలుపెట్టింది. "నా పెళ్ళయి మూడేళ్ళయిందని మీకందరికీ తెలుసు కదా. మీరందరూ వచ్చారు కూడా. మీరంతా కలిసి పెళ్ళి కానుకగా ఇచ్చిన గిజుభాయి సమగ్ర సాహిత్యం పుస్తకాల సెట్ పదిలంగా నా పుస్తకాల అలమరలోనే ఉంది". "ఇంకా చదవలేదన్నమాట" ప్రభు ఉడికించాడు. ''ఇక చదువుతాను గబగబా చదివేసి పక్కన పెట్టేసే జాతి కావుగా అవి. ఇదిగో ఇలా అడ్డమొస్తే నే చెప్పాలనుకున్నది పక్కకి పోతుంది" అని ప్రభు వేపు చూస్తూ నోటి మీద చూపుడు వేలు ఉంచి సంజ్ఞ చేసింది. "నువు ఆగబ్బాయి" అని స్వామిగారు ప్రభుని కసిరేడు. "నా పెళ్ళయిన మరుసటి ఏడూ మరో ఏడూ గడిచినా కూడా శ్రీ రమణ గారు బంగారు మురుగు కథలో చెప్పినట్టు కాపరం పాకాన పడలేదు. సరి కదా ఊపిరి ఆడనట్టు అయింది. ఉద్యోగమూ ఇల్లూ వదిలి ఎక్కడికేనా పారిపోదామా అనిపించింది. ఇల్లు వదిలినా పరవాలేదు కానీ ఉద్యోగం వదిలేస్తే ఎలా. దాని వల్లనే కదా చాలావాటిని లెక్కచేయనిది. మా మేనత్త కూతురు పూర్ణ చిన్నప్పటినుంచి నాకు మంచి నేస్తురాలు. దానికి చెప్పుకున్నాను అంతా. నా పరిస్థితి చూసి, 'మా అమ్మమ్మగారి ఊరు పోయివద్దాం రా ఓ వారంలో నీ మనసు కుదుటపడొచ్చు' అంది. ప్రభు మళ్ళీ ఏదో మాట్లాడబోయాడు. జానకి మేడమ్ గమనించి కళ్ళతో ఆపింది. స్మిత ఊరుకోలేదు "వారం రోజుల్లో కుదుటపడిపోతుందా అని కదూ నీ అనుమానం ప్రభూ. పడుతుందో లేదో గానీ ముందు మార్పు ఉంటుంది కదా!" అమ్మమ్మగారి ఊరు గోదావరి జిల్లాలో మారుమూల పల్లె. విమానమూ, రైలూ, బస్సూ, ఆటో అన్నీ ఎక్కి మారుకుంటూ వెళ్లాం – నిజంగా ఆ వారం రోజులూ అన్నీ మర్చిపోయాము. ఇద్దరం బంధువులతో కలిసి గడిపాం. వచ్చేసే ముందురోజు అది జరగకపోతే ఆ ప్రయాణం మంచి జ్ఞాపకంగా మిగిలి వుండేది కానీ 'అది జరగడం వల్ల' జీవితాన్ని వెలిగించే మంచి అనుభవమయింది. అందరికీ కుతూహలం మొదలయింది. వెనక్కి వాలి కూచున్న రవి కాస్త ముందుకు వంగేడు. పూర్ణా వాళ్ళ అమ్మమ్మకి బాగా సన్నిహితమైన రాజుల కుటుంబంలో ఒకటి పక్కవీధిలో వుంది. బాగా చితికిపోయిన పేదదైన కుటుంబం. అక్కడికి వెళ్ళి చూసిరండి అని అత్తయ్య చెప్పి పంపింది ముందే, మరీ మరీ. మర్నాడు ఇద్దరం వాళ్ళింటికి వెళ్ళాం. మట్టి అరుగు, పాతకాలపు తాటాకు ఇల్లు. ఆ ఇల్లు కట్టి తొంభయి ఏళ్ళయిందట. ఆశ్చర్యం. మట్టి ఇల్లయినా గట్టిగానే వుంది. ప్రతి ఏడూ దాని గట్టిదనం కాపాడుకుంటూ రావడం తెలుస్తూనే వుంది. ప్రతి ఏడూ అరుగులు మట్టితో మెత్తి గట్టి చేస్తారుట. నాలుగేళ్ళకొకసారి పాత ఆకు తీసేసి కొత్త ఆకు వేస్తారుట. అంటే ఎనభయి ఏళ్ళుగా ఇంటిని కాపాడుకుంటున్నారని అర్ధమయింది మాకు. సందేహమేముంది ఇదంతా ఇంటి ఆడవాళ్ళ కష్టఫలితమే. ఇప్పుడు మనమరాలే ఆ ఇంటి గృహిణి. అంటే మేనకోడలినే చేసుకున్నాడన్నమాట రాజుగారు. నాగమణి మా అత్తకూతురు వయసుదే. వీళ్ళు ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా కుటుంబాల మధ్య ఉన్న చనువువల్ల స్నేహం అయింది. బాల్య స్నేహమనే చెప్పొచ్చు. మా పూర్ణ, నాకంటే అయిదారేళ్ళు పెద్దది. ఇప్పుడు నాగమణి కూడా అదే వయసు. కానీ మనిషి వయసుకి మించి ఎదిగినట్టనిపించింది." "వివరాలు కాస్త తగ్గించి చెప్పొచ్చేమో" అసహనంగా అన్నాడు ప్రభు. "లేదు, నేను చెప్పబోయే కథకి ఇవన్నీ చాలా అవసరం. అందుకే వినక తప్పదు" అంది స్మిత. ఇంటిముందు వాకిట్లో అలికి, ముగ్గులతో ఉన్న చిన్న అరుగుని చూసి నేను ముచ్చటపడి అడిగినపుడు పూర్ణ ఏదో చెప్పబోయింది. అది చెప్పేలోపే నాగమణి అందుకుంది. "దీన్ని పెళ్ళి అరుగు అంటాం. ఎనభయి ఏళ్ళుగా వాకిట్లో ఇలాగే ఉంది. ఇలాగే అంటే ఇలాగే కాదు. వానాకాలం వానకి తడిసి తడిసి మట్టి కరిగిపోయి కేవలం దిబ్బలా మిగులుతుంది. మళ్ళీ సంక్రాంతి రోజులనాటికి మట్టితో మెత్తి అలికి నున్నగా చేసి చుక్కలతో ముగ్గులతో కొత్తగా చేస్తాం. వానాకాలం దాకా అలాగే ఉంటుంది. ఇక్కడ కూచుని పిల్లలకి అన్నాలు పెట్టుకుంటాం. వేసవి కాలం పప్పులు ఉప్పులూ అన్నీ ఇక్కడే ఎండబెట్టుకుంటాం. మేమంతా చిన్నప్పుడు ఇక్కడే అన్నాలు తిన్నాం. ఇది మా కుటుంబాల్లో వీధి గుమ్మంలో ప్రతి ఇంటికీ ఉండి తీరుతుంది" అంది. మా అమ్మమ్మ పెళ్ళి దగ్గర్నుంచి ఈ అరుగు మీద చాలా పెళ్ళిళ్ళు జరిగాయి. నా పెళ్ళి కూడా అని చెప్తోంటే నాకెందుకో హాస్యాస్పదంగా అనిపించింది. ఈ పెళ్ళిళ్ళ వల్ల ఇంటి ఆడవాళ్ళు ఏం సుఖపడి ఉంటారు – ఈ అరుగును మాత్రం ఇంత పదిలంగా రక్షించుకుంటూ వస్తున్నారు అనుకున్నాను. ఇంచుమించు అన్నాను కూడా. అప్పుడు తనే అంది, "మేం ఎప్పుడూ అలా అనుకోలేదు. మా మేనత్త భర్తా, అత్తమామల బాధ పడలేక ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇక్కడికే వచ్చేసింది. ఆవిడ జీవితం చివరకి ఇక్కడే ముగిసింది. ఇక్కడ జరిగిన అన్ని పెళ్ళిళ్ళూ బాగా ఉన్నాయని కాదు – అంది చాలా మామూలుగా. మా అమ్మమ్మ పోయేదాకా ఇంటి పెత్తనమంతా ఆవిడదే. ఆవిడ చెప్పినట్టే వినాలి అందరూ. ఐతే మా బంధువులందరి ఇళ్ళలోనూ ఇలా ఉండేది కాదులేండి అంటూనే రెండు గాజుప్లేట్ల నిండా అరిసెలూ, పాకుండలూ, జంతికలూ తెచ్చి పెట్టింది. పెరటివేపు వాకిట్లో పొయ్యిా దాని మీద మరుగుతున్న పప్పుచారూ, వంటా అంతా చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉంది కానీ పని తల్చుకుంటే భయమేసింది. ఆ మాటే అంటే నవ్వింది – అలవాటైపోయింది అంటూ. నాకు ఇంటికొచ్చాకా, తిరిగి మా మహానగరంలో ప్రవేశించాక కూడా ఆ పెళ్ళి అరుగూ దాన్ని ఇన్ని పదుల ఏళ్ళుగా వాళ్ళు కాపాడుకుంటూ రావడం ఎంతో వెనుకబాటుతనంగా అనిపించింది. మళ్లీ సెకెండ్ రౌండ్ టీ సెర్మనీ ఏమీ లేదా అంటూ మధ్యలో ఆపేడు లాయర్ గారు. అందరూ కథ మధ్యలో ఉన్నారు. ఎవరికీ లేవాలని లేనట్టుంది. ఇక నేనే చొరవ చేసి లేచాను. ఓపెన్ కిచెన్. వరండాకి ఆనుకునే ఉండటం వల్ల స్మిత మాటలు లోపలకీ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అసలు కథ చెప్తాను అంది. టీ లు రానీ అన్నారెవరో. "అయిదు నిముషాల్లో వస్తాయి మీరు కానివ్వండి" అన్నాను లోపలనుంచి. "ఎక్కువ చదివిన మీదట నాకు పెళ్ళి మీద నమ్మకం పోయింది. లివింగ్ రిలేషన్ గురించి వింటూ ఉన్నాను. దాని పట్ల కొంత కుతూహలం – ఇలా ఉండగా మంచి సంబంధం వచ్చిందని అమ్మానాన్నా బతిమాలి, అలిగి ఎలాగో ఒప్పించి పెళ్ళి చేసేసారు. నెల్లాళ్ళు ఇక్కడా అక్కడా తిరిగాం, దాన్ని అందరూ హనీమూన్ అన్నారు. మేమూ అలాగే భ్రమించాం. డబ్బులు బాగా ఖర్చయ్యాయి. ఇక తిరిగింది చాలని పెద్దవాళ్ళు కాపురం పెట్టించారు. మా అమ్మనాన్నలకి నేను ఒక్క పిల్లని. తనూ అంతే, ఒక్క పిల్లాడు. అమ్మ నాకు ముద్దు చేసి పని నేర్పలేదు. తనకి వాళ్ళవాళ్ళు మగాడని నేర్పలేదు. ఏదైతేనేం ఇద్దరు బద్ధకస్తులు, బడుద్ధాయిలు, అహంభావులు. ఒక రెండు పడకగదులూ ప్లస్ వంటింటి ఫ్లాట్ ని గృహంగా మార్చడంలో శతథా, సహస్రధా విఫలం అయ్యారు. ఇంట్లో వంట అన్నది ఎవరు చెయ్యాలి అన్నదాని మీద గొడవలకి ఎన్నో గిన్నెలు సొట్టలకి నోచుకుని పనికి రాకుండా పోయాయి. నేను ఇద్దరమూ కలిసి చెయ్యాలన్నాను. తనకి రాకపోవడమే కాక అది తన పని కాదన్నాడు. ఆ మాట నన్ను రెచ్చగొట్టింది. పనిమనిషి ఉండేది కానీ చాలాసార్లు మానేసేది. ఆ రోజుల్లో వంటిల్లూ, ఇల్లూ డస్ట్ బిన్ లా ఉండేవి. నాకు హాస్టల్ లోనూ, తనకి పీజీలలోనూ ఇదే అలవాటు కాబట్టి పట్టించుకునేవాళ్ళం కాదు. కానీ పెద్దవాళ్ళ నుంచి రోజూ లేదా రోజుకి రెండు మూడు సార్లు వచ్చే ఫోన్ కాల్స్ మా మధ్య నిప్పును ముట్టించేవి.రాజేసేవి కూడా. ఇంట్లో వండుకోమని, బయటివి తినొద్దని, ఇలాంటివే చెప్పలేనివి మరికొన్ని." ఆపింది స్మిత. (చెప్పలేనివి అంటుందెందుకు చెప్పొచ్చుగా అని మనసులో అనుకుంటూ) నేను టీలు ట్రేలో పట్టికెళ్ళి అందరికీ అందిస్తూ తనకి కూడా ఇస్తే థాంక్స్ చెప్పి, నావేపు చూసి నవ్వింది అదోలా. నేను నా కప్పు తీసుకుని వెళ్ళి యధావిధిగా నా కుర్చీలో కూచున్నాను అదే మౌనం పొడిగిస్తూ. టీ ఒక గుక్క తాగి, "మా అమ్మ ఉద్యోగం చేసేది. కానీ ఆవిడ జీతం కూడా నాన్న తీసేసుకుని ఆయనే ఖర్చు పెట్టేవాడు. ఆ విషయంలో ఆమె ఏళ్ళ తరబడి పోరాడి నెగ్గలేకపోయింది. అందుకని ముందునుంచీ చెప్పి పెట్టింది 'నీ జీతం నువు దాచుకో. ఇల్లు అతన్నే నడపమను' అంటూ రోజూ పోరుతూ, ఆరాలు తీస్తూ ఉండేది. నేను అలాగే చేసాను. నేనేమో ఇంటి పని చెయ్యను. జీతం ఇవ్వను. వాళ్ళింట్లో ఆ గొడవ లేదు. ఇల్లు గడపడం మగవాడి బాధ్యత అని వాళ్ళ నాన్న భావించేవాడు. కానీ ఆడవాళ్ళు ఇంటిపని చేసి తీరాలి. తను ఆ ఇంట్లో పెరిగాడు. నేను ఇలాంటి ఇంట్లో పెరిగాను. ఇక రోజూ గొడవలకి ఏం తక్కువ ఉంటుంది!! కొన్ని రోజులకి కొంత చదువుకున్నవాళ్ళం కనుక గొడవలు అమ్మానాన్నల వల్ల వస్తున్నాయని వాళ్ళ ప్రసక్తి లేకుండా ఉండడం మొదలుపెట్టాం. కొన్ని రోజులు ఆగినా మళ్ళీ కొత్త కారణాలు మొదలయ్యాయి. ఒకరు మంచినీళ్ళడిగితే రెండోవాళ్లు లేచి తెచ్చి ఇచ్చే సహకార బుద్దిని కూడా కోల్పోయాం. కొంత ఇగో, కొంత పట్టుదల. ఎక్కువశాతం చిన్నప్పటి నుంచీ పెంచి పోషించిన బద్ధకం. తెల్లవారి లేవాలంటే భయం, గొడవలు. చేతిలో ఉన్నవి విసిరేసుకోవడాలూ. లేదా మాటాడుకోవడం మానెయ్యడాలూ. పగలు గడిచి రాత్రి ఇంటికి రావాలంటే నిస్పృహ. అలాంటి రోజుల్లోనే నాగమణిని చూసాను. గొడవలు పెద్దవాళ్ళని చేరాయి. సయోధ్య వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళు ఎలాగోలా కలపాలని చూసారు. కానీ కలిపే మార్గం వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఎన్ని గొడవలు పడ్డా వాళ్ళు విడిపోవాలనుకోవడం దాకా రాలేదు. మేం వచ్చాం. అదీ తేడా. నాగమణీ వాళ్ళ ఊరు నించి వచ్చేటప్పుడు పూర్ణ అంది 'వీళ్ళు ఎక్కడా ఏమీ చదువుకోకపోయినా, ఈ మారుమూల ఊరు దాటి ఎక్కడికీ వెళ్ళకపోయినా ఇంత శాంతంగా బతకడం ఎలా నేర్చుకున్నారు' – అని. అందరూ కాదేమో, ఈ నాగమణి ప్రత్యేకం. అన్నాను నేను. పూర్ణ భర్తతో కుదరక, ఆరేళ్ళ సంసార జీవనం తర్వాత విడాకులు తీసుకుంది. ముంబయ్ లో ఎమ్.ఎన్.సి.లో పెద్దదే ఉద్యోగం. మరో పెళ్ళి వేపు చూడలేదు. ఓ పాపని పెంచుకుంటోంది. శాంతంగా బతకడం కోసం ఇదంతా. ఐనా ఇంకా కష్టపడుతోనే ఉందేమో! నిత్యమూ వీళ్ళ అహాలు తృప్తి పరుస్తూ ఎంతకాలం కలిసి ఉంటాం – వదిలెయ్ అని నాకు సలహా కూడా చెప్పింది. తిరిగి వచ్చాక మరోసారి ఆలోచించుకోవాలనిపించింది. ఇద్దరమూ ప్రొఫెషనల్ కౌన్సిలింగ్స్ తీసుకున్నాం. అంతకన్నా మాకే మా సమస్యలు మరింత తార్కికంగా ఆలోచించే అవకాశాన్ని కాలం ఇచ్చింది. "హు. చివరికి ఏమయింది" అన్నాడు సాఫ్ట్ వేర్ వీరుడు. "నే చెప్పలేదూ అమ్మాయిలు బాగా మారిపోయారని" అంటూ. "ఆగు ప్రభూ! ఆ మార్పేదో చెప్దామనే మొదలుపెట్టాను. నాగమణి నన్ను క్రమంగా ఆలోచింపజేస్తూ వచ్చింది. ఎందుకంటే ఆమె ఆ మట్టి ఇంటి చాకిరీ కింద నలిగిపోయి, చేతులకి అరిగిపోయిన గాజులతో ఉందని నేనూ పూర్ణా జాలిపడ్డాం కాని, ఆ తర్వాత మేం చూసిన, విన్న సంగతులు నన్ను ఆలోచనలో పడేసాయి. అయిదారేళ్ళుగా ఆ ఊర్లో ఒక పిచ్చివాడు తిరుగుతున్నాడట. ఎక్కడనుంచి వచ్చాడో తెలియదు. వాడికి రోజూ రెండు పూటలా తమతోపాటే అన్నం పెడుతుందట. పది రోజులకొకసారి వాళ్ళ రాజుగారి సహాయంతో స్నానం చేయిస్తుంది. వాడు ఎక్కడినుంచి వచ్చాడో తెలియదు. మేమున్న ఆ రోజు కూడా వచ్చాడు. భోజనం వేళకి వచ్చి అరుస్తుంటే చెప్పొద్దూ మేం ఇద్దరం భయపడ్డాం. ఆమె నవ్వుకుంటూ వెళ్ళి అన్నం పెట్టి వచ్చింది. ఎనభయి ఏళ్ళ వారసత్వాన్ని నిలబెట్టాలని కాక ఆమె ఒక సరదాతో, ఒక ఇష్టంతో, శ్రద్ధతో ఆ పేద ఇంటిని గృహంగా మార్చుకుంటూ దినం వెంట దినం గడుపుతోందని ఆలోచించే కొద్దీ అర్ధమవడం మొదలుపెట్టింది. ఆమె మీద ఎవరి వత్తిడి ఉన్నా అలా చెయ్యలేదని నెమ్మదిగా అర్ధమయింది. ఆమె వాళ్ల అమ్మమ్మ లాగ కర్ర పెత్తనం చెయ్యలేదు. అమ్మలాగ అణిగిమణిగీ ఉండలేదు అనుకుంటా బహుశా. మధ్యేమార్గం ఏదో తెలుసుకుందన్నమాట. ఒక రాత్రి ఇలాంటి మెలకువ కలిగాక ఆ మర్నాడు నేను ఫ్లాట్ ని ఇంటిగా మార్చే ప్రయత్నంలో కాస్త బద్ధకాన్ని వదిలించుకుని ఇంటిని కాస్త పొందికగా సద్దేను. ఆ మర్నాడు పనిమనిషి రానిరోజు. కానీ నేను లేచేసరికి వంట గది సింక్ లో గిన్నెలు తోమి గట్టు మీద బోర్లించి వున్నాయి. మాకిద్దరికీ అర్ధమయింది.. ఇద్దరమూ మారడానికి సిద్ధంగా ఉన్నామని. కానీ ఇగోలు. అవి నెమ్మదిగా కరగడానికి మరి కొంత కాలం పట్టింది. మేం ఎవరిమాటా వినలేదు. కాస్త ఓపిగ్గా మా మనసు చెప్పే మాట మేమే విన్నాం. "హమ్మయ్య, అయితే సుఖాంతం" అంటూ రవి వెనక్కి వాలాడు. "విడిపోయి ఎవరిదారిన వారు ఉంటే దు:ఖాంతమా! అదేమీ కాదు. వీళ్ళిద్దరికీ అలా కుదిరింది. అందరికీ అలా కుదరాలని లేదు." స్వామినాథ్ ఆలోచిస్తూ అన్నారు. నిజమే. ఈ గొడవలకి మా పెంపకాలు సరిగా లేకపోవడం కొంత కారణం. మా స్నేహితులు, సమాజం ఇదంతా కూడా ఇందులో భాగమే. కానీ మాకిద్దరికీ డబ్బు మీద కన్నా గాడ్జెట్స్ మీద కన్నా, ఎక్కువ ఇష్టం ఒకరి పట్ల ఒకరికి వుంది. అదే మమ్మల్ని ఆలోచించుకునేలా చేసింది. ఇంకా చెప్పాలంటే అదీ మా కుటుంబాల నుంచే వచ్చింది. మా పెద్దవాళ్ళకి ఉన్న అర్ధం లేని బంధుప్రీతి. మనుషులంటే ఉండే ఇష్టం, ఆ ప్రభావం కూడా మా మీద ఉందన్నమాట" ఆగింది. సత్యజిత్ అంటున్నాడు. "నేను వందల కేసులు చూసాను. ఇంత క్లారిటీ లేదు ఎవరికీ. ఎంతకీ డబ్బూ, ఇగోల గోలే. ఇష్టం ఉన్నా అదీ ఒక వేపే. పరస్పరం ఇష్టం వున్నా, గమనించుకునే స్పష్టత లేకుండా చేసే అహంకారాలు. ఎనీ హౌ, అమ్మాయ్ కంగ్రాట్స్" అన్నాడు. "పిల్లల్ని ఎలా పెంచాలని కానీ, ఆడవాళ్ళని ఎలా చూసుకోవాలని కానీ ఎవరూ శిక్షణ ఇవ్వరు. చలంలాంటివాళ్ళు అందుకోసం పుస్తకాలు రాసినా, వాటి జోలికెవరూ వెళ్ళరు. సమాజం ముందుకి వెడుతోందని మభ్యపెట్టుకుంటాం మనకి మనం. అమ్మాయ్ మీరిద్దరూ ఖాళీ సమయాల్లో కౌన్సిలింగ్ లు మొదలుపెట్టండి బాధ్యతగా "- అన్నాడు స్వామి. "మేం ఆ ఆలోచనలోనే ఉన్నాం" అంది స్మిత. "ఆమూల ఇంతసేపూ మౌనంగా కూచున్న కామేశ్వర్ కి కూడా మనం కంగ్రాట్స్ చెప్పాలి" అంది జానకీ మేడమ్. అందరూ నావేపు చూశారు. ఇక్కడ రచయిత నాకు, అంటే కామేశ్వర్ కి మాటలు రాయలేదు. నేను కాక తను మాటాడటమే బావుంటుందని కాబోలు. అవును – ఇదంతా ఆమె వేపు నించి రావడమే నాకూ బావుంటుంది. అందుకే నేను మౌనంగా. ఐతే నా మౌనం పూర్ణాంగీకారమే. నేను చిరునవ్వు నవ్వేను. నిజమే. మా మధ్య కొంత సయోధ్య కుదిరిన తర్వాత స్మిత ను అడిగేను, నాగమణిని చూపించమని. మళ్లీ ఇద్దరం ఆ ఊరు వెళ్లేం. ఈసారి వర్షాల్లో. పెళ్లి అరుగు వానలకి నాని అరిగిపోయి ఉంది. సంక్రాంతికి మళ్లీ అలుకులతో ముగ్గులతో ముస్తాబు చేసే నాగమణి నిజంగానే ఆ ఇంటి దివ్వెలా తోచింది నాకు. స్మితను వెలిగించిన దివ్వె. రాజుగారిని కూడా చూసేను ఈయన నాకేమి నేర్పుతాడా అని. ఆమె తృప్తి వెనుక ఆయన నాకు చెప్పలేనిది ఏదో తెలిసినట్టనిపించింది. ఆయన ఆమె నీడలా ఉన్నాడు. ఆ మాటంటే ఆరోజు స్మిత చిరునవ్వు నవ్వింది.మమ్మల్ని కలపడానికి వాళ్లే కాక ఇలాంటి సాహిత్యం చదువుకున్న పెద్దల సమూహం ఇచ్చిన జ్ఞానం కూడా తక్కువదేమీ కాదు. ఇప్పుడు నా మందస్మిత నావేపు చూసి – మళ్ళీ అదే నవ్వు. ఎప్పుడూ గలగలా నవ్వే ఈమె మందస్మితం మరీ మోహనంగా ఉంటుంది. ఫ్రభు మా ఇద్దరినీ మార్చి మార్చి అనుమానంగా చూస్తున్నాడు. నిజమే, ఇదంతా నమ్మడం కష్టమే. నిజం చాలాసార్లు నమ్మశక్యం కాదు. *
Post Date: Fri, 31 Mar 2023 23:48:08 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 31 Mar 2023 23:48:08 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment