Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 3 April 2023

ఒక ధీశాలి రవణమ్మ కథ ‘పులస’ - ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

పు లస చాలా విలువైన చేప. ఆ విలువ- ఏటికి ఎదురీదే శ్రమ వల్ల దానికి వచ్చింది. జుత్తాడ రవణమ్మ కూడా విలువైన శ్రమజీవి. గట్టి మనిషి. పట్టువిడవని స్త్రీ. ఆడదాని ఆత్మగౌరవం భూమితో ముడిపడివుందనే సులువు ఎరిగిన మహిళ. అందుకే ఆ భూమి కోసం పోరాడుతోంది. రవణమ్మ జీవనపోరాటాన్ని చిత్రించిన కథ కత్తి పద్మ రాసిన 'పులస'. వైజాగ్‌ వేణు తిరుపతికి వచ్చినపుడు 'చీకటి పువ్వు' కథల పుస్తకం ఇచ్చేదాకా కత్తి పద్మ కథలేవీ నేను చదవలేదు. ఎందుకు చదవలేదో తెలీదు. ఆ వెలితిని మాత్రం విశాఖపట్నం మిత్రసాహితి ప్రచురించిన ఈ పుస్తకం గుచ్చి చెప్పింది. ఈపుస్తకంలో కత్తి పద్మ రాసిన 19 కథలున్నాయి. ఇవన్నీ 2015 తర్వాత రాసినవే. నలబై ఏళ్లకు పైగా ప్రజాఉద్యమాల్లో ఉన్న కత్తి పద్మ, తన 55వ ఏట కథనరంగ ప్రవేశం చేశారు. ఆమె ఉద్యమ జీవితపు అనుభవాల సారం ఈ కథల్లో  గాఢంగా కనిపిస్తుంది. అయితే, అయిదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్న విప్లవ కథ  పడికట్టుమాటల ముద్రలేవీ ఈ పోరాట కథల్లో కనిపించవు. నిజానికి ఉద్యమాల్లో భాగమైనవాళ్లకి ఇదొక పెను సవాలు. బహుశా కత్తి పద్మ లోపల్లోపలెక్కడో నానీ నానీ పెనుగులాడి కథలుగా ఇవి బయటకు వచ్చి ఉండాలి. పాత్రకి ప్రాణం పోసి పాఠకుల ముందు నిలబెట్టే కథల కోసం చాలా కాలంగా తపిస్తున్న నాలాంటి వాళ్లు, గుండె తడి చేసుకోగల కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. 'ఎర్రెమ్మ-గొర్రెమ్మ', 'చీకటి పువ్వు', 'రవికెల గుడ్డ', 'ఎర్ర ముక్కుపుడక' .. ఇలా చాలా కథలనే పరామర్శించాలని ఉన్నా 'కథాసమయం' లో నేనే పెట్టుకున్న పరిమితికి లోబడి ' పులస' కథను పరిచయం చేస్తాను. రవణమ్మది గోవాడ. ముగ్గురు అన్నదమ్ముల ఉమ్మడి కుటుంబంలో నడిపాయనకు పుట్టిన బిడ్డ. చేసుకోడానికి తగినంత భూమి ఉన్న కుటుంబం. చిన్నప్పటి నుంచీ పొలం పనంటే రవణమ్మకి ఇష్టం. పొద్దున సద్దెన్నం తినేసి పొలానికి వెళ్లిపోతే తిరిగి ఇల్లు చేరేది పొద్దు గూకే వేళకే. రెక్కలు ముక్కలు చేసుకోవడంలోనే ఆమెకు ఆనందం. పెద్దమనిషైన మూడో నెలలోనే రవణమ్మకి పెళ్లి చేశారు. పదెకరాల భూమి ఉన్న కుటుంబంలోకి వెళ్తున్నాననే సంబరం ఆమెది.  అయితే అత్తారింటికి వచ్చాక భూమి వాసన తగలక ఆమె తల్లడిల్లిపోయింది. రవణమ్మ మొగుడు జుత్తాడ ఎర్రినాయుడుకి భూమిని చేరదీయడమూ తెలీదు. పెళ్లాన్ని చేరదీయడమూ తెలీదు. పొద్దు పైకెక్కాక గానీ పడక దిగడు. వేడి వేడి అన్నం తిని వాళ్లతో వీళ్లతో కబుర్లాడి బుద్దిపుట్టినపుడు పొలానికి వెళ్లేవాడు. 'గట్టుమీద గెడ కర్రనాగ నిలబడి ములుగర్ర గెడ్డం కిందెట్టుకొని సేలో దిట్టిబొమ్మనాగ నిలబడి ఏయ్‌, ఓయ్‌.. అని పెద్దరికం' చేసేవాడు. రాత్రి భజన గుడికాడ సద్దుమణిగాకనే ఇంటికొచ్చేవాడు. పెళ్లాంతో ఒక్క మాటా మాట్లాడేవాడు కాదు. రాత్రెప్పుడో  గదిలోకి వచ్చి పనైపోయాక బయటకు వెళ్లిపోయి, ఇంటి ముందు చెట్టు కింద అమ్మ పక్కనే ఇంకో మంచం మీద వాలిపోయేవాడు. 'పుస్తె కట్టినోడికి వొంగక తీరదని ఆ నాలుగు నిమిసాలు కల్లుమూసుకోనుండి'పోయేది రవణమ్మ. చేతినిండా భూమి ఉన్నా అడుగుపెట్టడానికి లేదు. ఒక్కసారి చూసి వస్తానని ఆశపడి అడిగినా అత్త, వద్దని తెగేసింది. 'ఇంటికాడ కూకోని తిని ఉండనేప్పోతన్నావా?' అని మొగుడు ఎగతాళి చేశాడు. భూమితో రుణం తీరిపోతోందనే భయం వేసింది ఆమెకి.  దిగులు పడిపొయ్యింది రమణమ్మ. ఆమె దిగుళ్లు, భయాలతో సంబంధం లేకుండానే, మూడోనెలలోనే కడుపొచ్చింది. పుట్టింటికి చేరి ఆడబిడ్డను కనింది. ఆ సమయంలోనే ఆస్తులు పంచుకున్నారు పుట్టింటివారు. రవణమ్మ తోడబుట్టినోడికీ భూమి పంచారు. పెదబాబు, చినబాబు కొడుకులకీ భూముల్లో వాటా దక్కింది. చినబాబు కూతురికీ, రవణమ్మకీ మాత్రమే చిల్లగింజంత నేల కూడా పంచలేదు. రవణమ్మకి మనసు చివుక్కుమనింది. గుండెల్లో ఎక్కడో దేవింది. వాటాలు పంచుతున్న పెద్దమనుషుల పంచాయతీ దగ్గరకు మూడునెల్ల బిడ్డను చంకనేసుకుని వెళ్లింది. 'ఏరా, మమ్మల్ని మీరు కన్నేదా? మావు మీకు పుట్టనేదా? మీరు సత్తే మీదబడి ఏడిసీ కూతుల్లకి అన్నాయం సెయ్యడానికి మీకు మనసెలగ ఒప్పిందిరా, మావేటి కుక్కలవా? నక్కలవా? మాకు బూవి వద్దని మీరు నిర్నయించడానికి' అని కడుపు చించుకుంది. 'మీలు ఒకిలింటికి ఎలిపోయినోల్లు. మీకెలాగ బూవిత్తావు?' అని అన్నలు లాపాయింటు తీస్తే, గట్టిగానే సమాధానం చెప్పింది. న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తానని బెదిరించింది. ఇంటి పరువూ, ఊరి పరువూ కోర్టుకెక్కడం ఎందుకని రవణమ్మకీ, సినబాబు కూతురికీ చెరో ఎకరా ఎనబై సెంట్లు భూమి పంచారు. రవణమ్మకి జుత్తాడ పొలాలను ఆనుకుని ఉండే భూమి దక్కింది. భూమిని గెలుచుకున్న విజయగర్వంతో వీర వనిత రవణమ్మ మూడునెలల బిడ్డతో, భూమి పత్రాలతో అత్తారింటికి తిరిగి వచ్చింది. పొద్దున్నుంచి రాత్రి దాకా ఇంటి గదుల్లో మగ్గిపోయే రవణమ్మకు విముక్తి లభించింది. అత్త చేతుల్లో బిడ్డను పెట్టేసి పొద్దున్నే గంజి తాగి చేలోకి బయలుదేరింది. పగలూ, రాత్రీ తేడాలేదు. భూమితోనే కాపురం చేసేది. ఆ సంతోషపు కాలంలోనే కొడుకూ, ఇంకో కూతురూ పుట్టారు. ఆమె కష్టపడే తీరు చూసి మొగుడు కూడా తన పదెకరాల భారం పెళ్లాం మీదనే పడేశాడు. 'కానోడితో కాపురం అంటే సేదుగానీ బూవితల్లికి సేవసెయ్యమంతే ఎయ్యెకరాలకైనా నాను సెయ్యగల్దును' అనుకుని గెలాయించింది. 12 ఎకరాల పొలానికి నాయకురాలిగా మారింది రవణమ్మ. అత్త చచ్చిపోయాక రవణమ్మ మరింత నిగ్గుతేలింది. 'ఆడదాన్నీ బూవినీ ఏంచేసుకోవాలో తెలీని' మొగుణ్ణి ఖాతరు చేసేది కాదు. చేల్లోనే పని. వరి పండించింది. చెరుకు వేసింది. కూరగాయలు, దుంపలు, అరటి..బంతి పూలతో ఆమె పొలం 'సీతాకోకసిలకల తోట'లాగా కళకళలాడేది.  సేద్యం చేసే- ఆడపిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసింది. పది ఫెయిలైన కొడుకు ఊళ్లో చెడుతిరుగుళ్లకి మరిగాడు. పొలం దిక్కు కూడా వచ్చేవాడు కాదు. తండ్రి మాత్రం  అడిగినదానికన్నా ఎక్కువిచ్చి మగపిలగాడినే ముద్దు చేసేవాడు. ఊరిమీద పడి తిరిగే కొడుక్కి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈలోగా ఎర్రినాయుడు మంచానపడ్డాడు. అమ్మ పొలంలో ఉంటే, డబ్బులకోసం జబ్బుతోవున్న తండ్రిని తన్నేవాడు కొడుకు. పరువు పోతుందని ఆ సంగతి పెళ్లాం దగ్గర దాచేవాడు మొగుడు. నిలదీస్తే తల్లిమీదా చేయి చేసుకునేవాడు. కొడుకుతో మాట్లాడడమే మానేసింది రవణమ్మ. ఎర్రినాయుడుకి అక్క వరసయ్యే ఒకామె తెచ్చిన సంబంధం కుదిరింది. తల్లిగా ఆమెకు పీటలమీద కూర్చుని చేయక తప్పలేదు.  కొడుకు కొరివి అయితే వచ్చిన కోడలు కొయ్య. ఇల్లు నరకమైపోయింది. చేలోనే గుడిసె వేసుకుని భూమమ్మ తోడుగా ఉండిపోయింది రవణమ్మ. మొగుడికి నిండా బాగాలేదని కబురొస్తే వెళ్లి అన్నీ చేసింది. ఆమెను ఎక్కువ రోజులు కష్టపెట్టకుండానే ఎర్రినాయుడు వెళ్లిపోయాడు.  దినం నాడు చావుభోజనం తినేసి చేలోకి వెళ్లిపోయింది కష్టజీవి రవణమ్మ. అమ్మ చచ్చిందా, బతికుందా అని ఒక్కనాడూ పట్టించుకోని కొడుకు, నెల తర్వాత చేలోకి వచ్చాడు కాయితాలతో. 'నాన్న నాకీ బూవి రాస్సాడు. నువ్వు ఖాళీ చేస్సి ఎలిపోవాల' అని హుకుం జారీ చేశారు. బతుకంతా ఆ భూమితోనే పెనవేసుకున్న ఆమెకు కడుపు రగిలిపోయింది. 'ఏ బాబురా నీకు బూవి రాస్సినోడు?' అని అడిగిన తల్లిని 'నీకెందరు మొగుల్లున్నారే లంజా' అంటూ కాల్తో ఇష్టం వచ్చినట్టు కొట్టాడు కొడుకు. గుడిసె పీకేశాడు. చిన్న కూతురు అమ్మను ఆసుపత్రిలో చేర్చింది. ఆమె ఎడమ మక్కె విరిగిపోయింది. లేచి నిలబడడానికి ఆరునెలలు పట్టింది. లేచాక భూమికి దూరంగా ఉండలేకపోయింది రవణమ్మ. తనకు తండ్రి నుంచి సంక్రమించిన భూమి కూడా కొడుకు అధీనంలోకి వెళ్లిపోయింది. ఆ ఎకరా ఎనబై సెంట్లు అడగడానికి వచ్చిన అత్తని కోడలు బూతులు తిట్టింది. అత్తా తగ్గలేదు. కొడుక్కి తెలిసన పరిష్కారం తల్లిని కొట్టడం ఒక్కటే. ఈసారి చెయ్యి విరిగిపోయింది. అయినా భూమిని వదులుకోవడానికి రవణమ్మ సిద్ధంగా లేదు. పెద్దల పంచాయతీ పెట్టించింది. చచ్చిపోవడానికి నాలుగు రోజుల ముందే కొడుకు పేరన తండ్రి భూమి రాశాడంటూ పెద్దలు చేతులెత్తేశారు. 'సవ్వడానికి ఆరునెల్ల ముందు నుంచే ఆడు మంచానికి అంటుకుపోతే నాల్రోజుల ముందు బూవెలగా రాసేత్తాడు బాబూ?' అనడిగింది. ఆడదానికి సమాధానం చెప్పే పెద్దమనుషులు ఆ ఊళ్లోనే కాదు ఏ ఊళ్లోనూ ఉండరు. తనకూ, భూమికీ కూడా తీరని ద్రోహం జరిగిందని రవణమ్మకి తెలుస్తూనే ఉంది. జీవితం ఆమెకు పోరాటమే నేర్పింది. పోరాడాలనే నిర్ణయించుకుంది రవణమ్మ. తెల్లవారాక ఇద్దరు కూతుళ్లనూ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు తీసుకువెళ్లింది. తండ్రి నుంచి వారసత్వంగా తనకు వచ్చిన భూమిని ఆ ఇద్దరి పేరా సమంగా రాసేసింది. అక్కడి నుంచీ ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లింది. దొంగ రిజిస్ట్రేషనతో భూమి కొట్టేసిన కొడుకు మీద ఫిర్యాదు చేసింది. తన కూతుళ్ల పేర పాసుబుక్కులు జారీ చేయమంటూ అర్జీ పెట్టుకుంది. ఇక అప్పటి నుంచీ ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉంది  ముసలి రవణమ్మ. ఆఫీసుల్లో ఆడదాని మాటకేం విలువ? మందితో వచ్చి ఎమ్మార్వోతో మంతనాలాడిన కొడుకు పేర పాసుబుక్‌ ఇచ్చేశారు. లబలబలాడుతూ ఆర్డీవోని కలిసింది తల్లి. ఎట్లా ఇస్తారని నిలేసింది. ఏదో పొరపాటు జరిగిందనీ, కూతుళ్ల పేరుతోనే పాస్‌ బుక్‌లు జారీ చేస్తారనీ ఆర్డీవో చెప్పాడు. ఆ మేరకు ఎమ్మార్వోకి కాయితం కూడా రాసిచ్చాడు. 'అమ్మదీనమ్మ తెల్లారబోతికి వచ్చి పడిపోయిందీ ముసిల్ది' అన్న వెటకారపు ఛీత్కారాలను ఎదుర్కొంటూనే తలుపు తెరిచేసరికి ఎమ్మార్వో ఆఫీసులో ప్రత్యక్షమవుతోంది రవణమ్మ. పాస్‌బుక్‌లు కూతుళ్ల పేర ఇచ్చేస్తానన్న ఎమ్మార్వో వాయిదాలేసి తిప్పుతూనే ఉంది. మూడువేలు లంచం తీసుకున్న ఆర్‌.ఐ. తేల్చకుండా టలాయిస్తూనే ఉన్నాడు. అయినా పట్టువిడవడం లేదు ముసలి రవణమ్మ. అలుపూ సొలుపూ ఎరగకుండా ఎండనక వాననక చలికి వెరవక తిరుగుతూనే ఉంది. ఆ వరండాల్లోనే నడుం వాలుస్తుంది. ఎందుకు? ఏమిటీ పట్టుదల? ఆ కొడుకు సైతం ఆమె కడుపున మోసి కన్న బిడ్డే కదా? అదే అడిగింది ఎమ్మార్వో ఆఫీసులో స్వీపర్‌గా పనిచేసే వీరమ్మ 'నువ్వెన్నాల్లు బతుకుతావు? నీకెందుకు?'  అని. ఇదీ రవణమ్మ సమాధానం..' సచ్చీదాకా బూవి కావాలి. ఆడదానికి బూవి ఉండాల, నేప్పోతే దానికి బతుకే నేదు. మొగోడికి నేపోయినా పర్నేదు. ఆడదానికి బూవుండాల'. అవును శ్రమచేసే ఆడవాళ్లకు భూమితో ఉన్న అనుబంధం అంత గట్టిది. పైకి సెంటిమెంట్‌లా కనిపించే రవణమ్మ మాటల వెనుక ఆర్ధిక స్వావలంబన అనే సూత్రం ఇమిడి ఉంది. 'పులస' కథలో కత్తి పద్మ విప్పకుండా చెప్పిన రహస్యం ఇదే. తండ్రి, అన్నదమ్ములు, భర్త, కొడుకులు.. బంధాలు మారుతాయి గానీ స్త్రీని చూసే దృష్టిలో మార్పు ఉండదని ఈ కథ అంతస్సూత్రంగా అర్ధం అవుతుంది. ఆ సత్యాన్ని బడి చదువు ఎరుగని రవణమ్మతో ఇలా చెప్పిస్తుంది రచయిత. 'నాడెవయిన మొగుడూ  నేక, తిరవైన కొడుకులూ నేక ఆడదేటయిపోద్దమ్మా. అనాద పచ్చి ఆడది. ఆ ఆడదానికి ఆదారం ఉండాల. అది బూవే కావాల. బూవున్న ఆడదాని జోలికి మొగుడూ రానేడు, కొడుకూ రానేడు'. విశాలమైన జీవితాన్ని చదువుకున్న జ్ఞానం రవణమ్మది. పొలమే ఆమె బడి. కుటుంబ సంబంధాలను లోతుగా అర్ధం చేసుకున్న అనుభవశాలి. ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలు పెట్టాక రాజ్య వ్యవస్థ కూడా సులువుగానే ఆమెకు అర్థం అయిపోయింది. 'ఎందుకీ తిరుగుళ్లు? నీ కొడుకు ఎంతో కొంత ఇత్తాడు, తీసుకుని కూతుల్ల దగ్గరుండిపోవచ్చు గదా. నన్ను మాటాడమంతావా?' అన్న మహిళా ఎమ్మార్వో మాటల వెనుక ఉన్నదేమిటో ఆమె తేలిగ్గానే గ్రహించింది. 'రామారావు చీయెమ్ముగున్నపుడు ఆడోలికి బూమిమీద సకం వాటా ఇచ్చీడానికి సట్టం తెచ్చినాడుకదా? నీకు తెల్దా?' అని ఎమ్మార్వో నోరు మూయించింది. 'ఆడదానికి బూవెందుకుండాలో సదువుకున్న ఆ కిలాడీకి తెల్దు. నాకు తెలుసు' అని ప్రకటించిన ధీశాలిగా రవణమ్మను పాఠకుల ముందు నిలువెత్తు ఆత్మవిశ్వాసంగా మలిచి నిలబెట్టారు కత్తి పద్మ 'పులస' కథలో. ఉత్తరాంధ్ర మాటల్ని గుదిగుచ్చి తెలుగు కథ మెడలో వేసిన ఆధునిక కథకురాలు కత్తి పద్మ. రావిశాస్ర్తిని పదే పదే గుర్తుకు తెస్తారు. అమాయకంగానే చట్టం, రాజ్యం గుట్టు విప్పే మాటలు విసురుతాయి పద్మ పాత్రలు కూడా.  రవణమ్మ కూతుళ్ల పేరుతో రిజిస్టరు చేసిన భూమికి, దీనితో సంబంధం లేకుండా రెవిన్యూ వాళ్లు కొడుక్కి పాస్‌బుక్‌ ఇచ్చారు. 'రిజిస్ట్రాపీసు గవరమెంటోడిదే, ఎమ్మారావాపీసూ గవరమెంటోడిదే…ఇదేటిది..నాకేటి బోదపడ్నేదు' అని సమన్వయం లేని ప్రభుత్వ అంగాలని ప్రశ్నిస్తుంది. ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు ఉందనే మాట రవణమ్మలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. సాధించగలననే నమ్మకాన్ని పెంచింది. 'ఈ ఎమ్మారావు కాపోతే కలెట్రొచ్చైనా నా బూవి నాకిత్తాడు. నేప్పోతే చీయమ్మొచ్చిత్తాడు' అని దృఢంగా చెబుతుంది. రవణమ్మ నమ్మకం వెనుక ఆమె శ్రమ ఉంది. మట్టితో పెనవేసుకున్న ఆమె  అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎటువంటిదో రచయిత కథలో అద్భుతంగా రవణమ్మతోనే చెప్పిస్తారు ఇలా.. 'సేనంటే ఏటి? బూవితో సేయితం సెయ్యాల. ఆయమ్మని ముద్దాడాల. ఒడుపుగా ఆయమ్మ సేతిలో సెయ్యెయ్యాల. అన్నింటికన్నా ముక్కెం మన సెమట సుక్కల్తో ఆ తల్లి సానవాడాల. మన సేతిబువ్వ తినాల. వప్పుడే ఆతల్లి మురిసి ముక్కలై మన దోసిట్లో గింజలు ముత్తాల్లాగా రాలుత్తాది' అందుకేం చేయాలని చెబుతుందో చూడండి.. 'ఆతల్లి దీవించాలంతే.. మన తనువు ఆయమ్మ ముందొంగాల'. భూమికి మనిషి దాసోహం కావాలని చెబుతుంది. ఇంకా చూడండి.. చేలో కాలు పెట్టేపుడు ఎంత జాగ్రత్తగా, ఎంత భద్రంగా  తాను ఉండేదో చెబుతుంది ఈ భూమిపుత్రిక. ఆ సమయంలో 'బిడ్డకాలిని ముద్దాడే తల్లినాగా బూవి నాకు ఆనీది' అని కవిత్వం చెబుతుంది రవణమ్మ. ఎంత సౌందర్యం! కన్న కొడుకుతోనూ, తండ్రితోనూ కొట్లాడిన కఠినాత్మురాలుగా కనిపించే రవణమ్మలోని ఈ సున్నితత్వాన్ని పటంగట్టి చూపించారు కత్తి పద్మ ఈ మాటల్లో. ఆమె కాఠిన్యం – ఆమెను లక్ష్య పెట్టని, ఆమెను గౌరవించని ప్రపంచంతోనే. ఆమెను ప్రేమగా అక్కున చేర్చుకునే సేదదీర్చే ప్రపంచానికి ఆమె తన మనశ్శరీరాలను అంకితం చేస్తుంది. అది భూమి అయినా, మనిషి అయినా. అది రవణమ్మ అయినా, ఏ స్త్రీ అయినా! తడిగల్ల కథకు కాలం చెల్లలేదని నమ్మకం కలిగించిన కత్తి పద్మకు మప్పిదాలు. *
Post Date: Sun, 02 Apr 2023 20:40:01 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger